మూగవోయిన ‘భారతీయ వాణి’
ABN , Publish Date - Jan 28 , 2026 | 06:50 PM
ఒకప్పుడు మన ‘ఆకాశవాణి’ వార్తలను భారతీయులే అంతగా విశ్వసించేవారు కాదు. తాజా, నిష్పాక్షిక వార్తలకు బీబీసీపైనే ఆధారపడేవారు. నిష్పాక్షిక వార్తలు, పదునైన విశ్లేషణలతో గ్రామీణ రైతాంగం మొదలు దౌత్యవేత్తల వరకు తనకొక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మార్క్ టలీ మృతితో ఒక దిగ్గజ పాత్రికేయుడు చరిత్ర పుటల్లోకి జారిపోయారు.
నిత్య నూతన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మన ధరిత్రిని ఒక కుగ్రామంగా మార్చివేసింది. సువిశాల ప్రపంచంలో ఎల్లెడలా ఉన్న సంఖ్యానేక ప్రవాస భారతీయులు తమ మాతృభూమి సమాచారాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోగలుగుతున్నారు. సంభవిస్తోన్న సంఘటనలు, పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాల కోసం కేవలం ఒక్క సమాచార వ్యవస్థపైనే ఆధారపడకుండా వివిధ సమాచార వ్యవస్థలు, వార్తా వనరులను సమర్థంగా వినియోగించుకుంటున్నారు. ఒకప్పుడు మన ‘ఆకాశవాణి’ వార్తలను భారతీయులే అంతగా విశ్వసించేవారు కాదు. తాజా, నిష్పాక్షిక వార్తలకు బీబీసీపైనే ఆధారపడేవారు (తన మాతృమూర్తి ఇందిరాగాంధీ హత్యోదంతాన్ని బీబీసీలో విన్న తరువాత మాత్రమే రాజీవ్‌గాంధీ విశ్వసించారు). భారత్‌లోనే కాకుండా, విదేశాలలో ఉన్న భారతీయులే కాకుండా, మన ఇరుగు పొరుగు దేశాల ప్రజలు సైతం బీబీసీ హిందీ వార్తలకు నిత్యం నిరీక్షించేవారు.
ప్రపంచవ్యాప్తంగా అద్వితీయ విశ్వసనీయత పొందిన మీడియా సంస్థ బీబీసీ. భారత్‌లో ఆ ప్రతిష్ఠాత్మక సంస్థ ప్రతినిధి మార్క్ టలీ. ఆయన భారతీయ దృక్కోణంలో వార్తా సేకరణ, వార్తా విశ్లేషణ చేసేవారు. ఈ విశిష్ట పాత్రికేయం కారణంగా భారతీయులు, మన ఇరుగు పొరుగు దేశాల ప్రజలు బీబీసీని విశేషంగా విశ్వసించారు. ఈ దేశాలలో అసంఖ్యాక ప్రజానీకానికి మార్క్ టలీ అనేది పరిచయం అవసరం లేని పేరుగా సువిఖ్యాతమయింది. నిష్పాక్షిక వార్తలు, పదునైన విశ్లేషణలతో గ్రామీణ రైతాంగం మొదలు దౌత్యవేత్తల వరకు తనకొక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రసార ప్రముఖుడు మార్క్ టలీ. ఆయన మృతితో ఒక దిగ్గజ పాత్రికేయుడు చరిత్ర పుటల్లోకి జారిపోయాడు.
సమయ వ్యత్యాసం కారణాన, భారతదేశ కాలమానంలో సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రసారమయ్యే బీబీసీ వార్తలు వినేందుకు గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయులు తమ ఓవర్ టైంను సైతం వదులుకునేవారు అంటే నమ్మవలసిన నిజం. విశ్వసనీయ సమకాలీన రాజకీయ, సామాజిక విశ్లేషకుడుగా జనకోటి హృదయాలను గెలుచుకున్న మార్క్ టలీ బీబీసీ ‘వాయిస్ ఆఫ్ ఇండియా’గా ప్రఖ్యాతుడయిన పాత్రికేయుడు.
మార్క్ టలీ జన్మతః బ్రిటిష్ జాతీయుడు. అయినా భారతావని గుండె చప్పుడును భారతీయ పాత్రికేయుల కంటే ఎక్కువగా అర్థం చేసుకున్న ‘భారతీయ పౌరుడు’ (‘నేను ఏ రెండు దేశాల –భారత్, బ్రిటన్– కు చెందినవాడినని భావిస్తానో, ఆ రెండు దేశాల పౌరుడిని అయ్యాను’ అని టలీ ఆనందంగా చెప్పేవారు). బీబీసీ నియమాల ప్రకారం ఒక వార్తా కథనం 300 వాక్యాలకు మించకూడదు, అయినా ఆ పరిధిలో కూడా ఆయన సంచలనాత్మక వార్తలతో ప్రభంజనం సృష్టించారు. 1965 భారత్–పాకిస్థాన్ యుద్ధం, 1971లో బంగ్లాదేశ్ విముక్తి సమరం, అత్యవసర పరిస్థితి ప్రకటన, పాకిస్థాన్‌లో జనరల్ జియా సైనిక పాలన, జుల్ఫీకర్ భుట్టో మరణ శిక్ష, బంగ్లాదేశ్ పితామహుడు ముజిబుర్ రహ్మాన్ హత్య, ఇందిర, రాజీవ్‌గాంధీ దురంతాలు, పంజాబ్‌లో ఉగ్రవాదం, ఆపరేషన్ బ్లూ స్టార్, శ్రీలంకలో తమిళుల వేర్పాటువాదం, అఫ్ఘానిస్థాన్‌పై సోవియట్ దురాక్రమణ, ఇస్లామిక్ జిహాద్, భోపాల్ గ్యాస్ లీక్, ఢిల్లీ అల్లర్లు, బాబ్రీ మసీదు ధ్వంసం మొదలైన చరిత్రాత్మక ఘటనల గురించి వార్తలు మరెవ్వరి కంటే కూడా ముందుగా ప్రపంచానికి అందజేసిన విలేఖరి మార్క్ టలీ.
ఫోన్లు కాదు కదా, కనీస రవాణా సదుపాయాలు కూడా లేని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని ఆదివాసులపై పోలీసు కాల్పులు జరిపారు. మృతుల సంఖ్య విషయమై ఆ కాలంలో టలీ లేవనెత్తిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి జాతీయ నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ ఆదిలాబాద్ అడవులకు వెళ్లే ప్రయత్నం చేశారు (ఆదిలాబాద్‌లో రైలు నుంచి దిగిన వెంటనే ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు). తనపై జరుగుతోన్న కుట్రను ‘ఆకాశవాణి’ ద్వారా ప్రజలకు వివరించేందుకు అవకాశం ఇవ్వలేదని 1984లో ఎన్టీఆర్ ఆవేదన చెందగా, నాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై మార్క్ టలీ వెలువరించిన వార్తలు, విశ్లేషణలు జాతీయ స్థాయిలో రాజకీయాలపై ప్రభావం చూపాయి. తన పుస్తకం ‘ఇండియా ఇన్ స్లో మోషన్’లో వారణాసి తివాచీల పరిశ్రమలో బాలకార్మికుల దురవస్థల గురించి ఎంత విమర్శనాత్మకంగా వివరించారో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషినీ అంతే ప్రశసంనీయంగా టలీ వివరించారు.
అరచేతిలో అనంత సమాచారం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరానికి నిన్నటి కాలంలో సమాచార వ్యాప్తిలో రేడియో నిర్వహించిన పాత్ర గురించి తెలియదు. సామాజిక, రాజకీయ చైతన్య స్రవంతిలో బీబీసీ వార్తలు, జనరంజక వినోద ఉల్లాసంలో బినాకా గీత్ మాల, జనరంజని పాటల మాధుర్యం చరిత్రగా మిగిలిపోయాయి. నిత్యం మార్క్ టలీ వార్తలకు చెవులు కోసుకున్నవారు ప్రస్తుతం వయోభారంతో చెవులు వినబడని స్థితికి చేరుకున్నారు. పాత్రికేయ రంగంలో వృత్తి ప్రమాణాలు, నైతిక విలువలు లుప్తమైన ప్రస్తుత కాలంలో మార్క్ టలీని స్మరిస్తూ నివాళులు అర్పించేవారు ఎంతమంది ఉన్నారు?
- మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)