Share News

వైజ్ఞానిక జగత్తులో మహామానవి

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:23 AM

గ్రాము బంగారం 18 రూపాయలుగా ఉన్న 1903లో గ్రాము రేడియం లక్షా యాభై వేల డాలర్లు. అలాంటి రేడియంను కనుగొన్నందుకు 1903లో నోబెల్ బహుమతి అందుకున్నారు మేరీ క్యూరి.

వైజ్ఞానిక జగత్తులో మహామానవి

గ్రాము బంగారం 18 రూపాయలుగా ఉన్న 1903లో గ్రాము రేడియం లక్షా యాభై వేల డాలర్లు. అలాంటి రేడియంను కనుగొన్నందుకు 1903లో నోబెల్ బహుమతి అందుకున్నారు మేరీ క్యూరి. దానికి పేటెంట్ రిజిస్టర్ చేసుకోమని శ్రేయోభిలాషులు సలహా ఇస్తే ‘‘రేడియం కరుణ సాధనం.. అది మానవాళి అంతటికీ చెందుతుంది’’ అని ప్రకటించిన మహామానవి ఆమె. అప్పుడామె పేటెంట్ తీసుకొని ఉంటే సంపద విషయంలో నేడు బిల్‌గేట్స్, వారన్ బఫెట్, ఫోర్డ్, అంబానీ, అదానీలు ఆమె వారసుల ముందు అంగుష్ఠమాత్రులు అయ్యేవారు. గత శతాబ్ద కాలంలో క్యాన్సర్ వ్యాధి బారి నుంచి ఉపశమనం పొంది తమ జీవితకాలాల్ని పొడిగించుకున్న కోట్లాది మానవులు ఆమెకు ఋణపడ్డారు.

మనిషి తెలివితేటల్ని (ఐ.క్యూ.) కొలిచేందుకు పరీక్ష ఉంటుంది. ఇది 100 కంటే ఎక్కువ ఉంటే ఆ వ్యక్తిని మేధావిగా భావిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఐ.క్యూ 120. అలాంటిది మేరీ క్యూరి ఐ.క్యూ 200. ఇంత ఐ.క్యూ ఉన్నవాళ్లు ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ లేరు. అంతేకాదు నోబెల్‌ బహుమతి పొందిన తొలి మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరి. 1903లో భౌతికశాస్త్రంలోనూ, 1912లో రసాయనశాస్త్రంలోనూ నోబెల్ పొందారు. రెండు నోబెల్స్ పొందిన ఏకైక స్త్రీ మాత్రమే కాదు, రెండు వేర్వేరు శాస్త్రాల్లో నోబెల్ పొందిన ఏకైక వైజ్ఞానికురాలు కూడా.


పోలెండ్‌లోని వార్సా నగరంలో 1867 నవంబర్ 7న వ్లాదిస్లోవ్‌ స్కాడావస్కి, బ్రానిస్లోవా దంపతులకు మేరీ జన్మించారు. ఆమె అసలు పేరు మేర్సా స్కాడావస్కా. ముద్దుపేరు మాన్యా. తండ్రి, తాతలు ఉపాధ్యాయులు. కొన్నాళ్లకు తల్లి క్షయవ్యాధికి గురై చనిపోయింది. అప్పట్లో పోలిష్‌ విశ్వవిద్యాలయంలో మహిళలకు ప్రవేశం లేదు. మేరీ అక్క పారిస్ వెళ్లి వైద్య విద్యలో చేరగా, మాన్యా అనేక పనులు చేస్తూ కష్టపడ్డారు. చివరకు 1891లో ఆమె కూడా పారిస్ చేరి, ఫ్రెంచి భాషా సౌలభ్యం కోసం తన పేరును మేరీగా మార్చుకొని పారిస్ విశ్వవిద్యాలయంలో చేరారు. 1893లో భౌతికశాస్త్రం, 1894లో గణితశాస్త్రంలోనూ పట్టభద్రురాలయ్యారు. పరిశోధనల క్రమంలో పియరీ క్యూరీతో పరిచయమై అది ప్రేమగా మారి 1895లో పెళ్లికి దారితీసింది.

భర్త పియరీ కూడా నోబెల్ బహుమతి పొందారు. వారి పెద్ద కూతురు ఇరిన్, ఆమె భర్త జోలియట్‌లకు 1935లో నోబెల్ బహుమతి లభించింది. మేరీ క్యూరి మరో కూతురు ఈవ్ భర్తకు 1965లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. మేరీ మనుమరాలు హెలెన్ లాంగ్‌విన్‌ పారిస్ విశ్వవిద్యాలయంలో అణు భౌతికశాస్త్రంలో ప్రొఫెసర్. మనుమడు ఇయర్ జోలియట్ ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త. ఇంతమంది శాస్త్రవేత్తలు ఒకే కుటుంబంలో ఉండటం అద్వితీయం. అపూర్వం. రేడియోస్కోపీ (రేడియో ధార్మిక దర్శిని) అనే కొత్త పదాన్ని మేరీ సృష్టించారు. అలాగే రేడియో ధార్మికత అనే పదాన్ని తొలిసారి ఆమే ఉపయోగించారు. ఆమె కనుగొన్న రేడియం... కేన్సర్ నయం చేయటానికి ఉపయోగించవచ్చని తర్వాత తెలిసింది. ఈ రేడియం థెరపీని కొన్ని దేశాల్లో క్యూరీ థెరపీ అని పిలుస్తారు.


మేరీ లింగ వివక్షకు కూడా లోనయ్యారు. పియరీ తానే ఇవన్నీ కనుగొని భార్య పేరు పెట్టాడని ప్రచారం జరిగింది. ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కి జరిగిన ఎన్నికల్లో ఇంతటి విద్వత్ కల్గిన విదుషీమణి కేవలం స్త్రీ అన్న కారణంతో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. రెండు శాస్త్రాలలో పోస్టుగ్రాడ్యుయేట్ అయినా... వార్సా, క్రాకో విశ్వవిద్యాలయాలు ఆమెకు పరిశోధన అవకాశాన్ని తిరస్కరించాయి. పారిస్ విశ్వవిద్యాలయంలో చేరే నాటికి అక్కడ 1,825 మంది విద్యార్థుల్లో 23 మంది మాత్రమే స్త్రీలు. అందులోనూ భౌతికశాస్త్రంలో మేరీ ఒక్కరే. ఆమె క్రిస్టియన్ కాదని యూదు జాతి స్త్రీ అని, ఫ్రెంచి దేశీయురాలు కాదని పత్రికలు సైతం ప్రచారం చేయటం విడ్డూరం. నిజానికి ఆమెకు మెట్టినిల్లు అయిన ఫ్రాన్స్‌కు ఆమె కారణంగా చాలా గౌరవం దక్కింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆమె కనుగొన్న ఎక్స్ కిరణాలు వెదజల్లే రేడియో ధార్మిక మూలకాలతో గాయపడ్డ సైనికుల శరీరంలో బుల్లెట్లు ఎక్కడున్నాయో తెలుసుకొని యుద్ధంలో ఫ్రాన్సుకు సేవ చేశారు.

యూరప్‌లో విజ్ఞానశాస్త్రాలలో డాక్టరేట్ పొందిన తొలి స్త్రీ కూడా ఈమె. పారిస్ విశ్వవిద్యాలయంలో తొలి మహిళా ఆచార్యురాలు కూడా మేరీనే. ‘రేడియాలజీ ఇన్ వార్‌’ అనే గ్రంథంలో పియరీ క్యూరీ జీవిత చరిత్రను ఆమె రాశారు. షికాగో విశ్వవిద్యాలయం ఆమెకు డాక్టరేట్ ప్రధానం చేసింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు వారెన్ హార్డింగ్‌ ఆమెకు ఒక గ్రాము రేడియంను బహూకరించారు. ఆమె మొత్తం 483 పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఆమె 19 డిగ్రీలు, 19 బంగారు పతకాలు పొందారు.

పరిశోధనల కారణంగా ఆమెకు టింటినిటస్ అనే వ్యాధి సోకింది. కళ్లకి నాలుగుసార్లు ఆపరేషన్ జరిగింది. లుకీమియా వచ్చింది. రేడియో ధార్మికత సోకటం వల్ల ఎముక మజ్జ దెబ్బతింది. చివరకు 1934 జూలై 4న క్యూరీ మరణించారు. ఆ మహాతల్లి తన జీవితాన్ని మానవాళి అభ్యున్నతి కోసమే సమర్పించి, పురుషుల కంటే స్త్రీలు అన్నింటా మిన్న అని ప్రపంచానికి చాటి చెప్పారు.

- సృజన చెరుకూరి

(నేడు మేరీ క్యూరీ జయంతి)

Updated Date - Nov 07 , 2026 | 01:25 AM