మన ప్రయోజనాలే ముఖ్యం
ABN , Publish Date - Oct 24 , 2026 | 02:03 AM
అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో భారత్‌లో పర్యటించారు, విదేశాంగమంత్రి జైశంకర్‌తో వాణిజ్య ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలమీద చర్చలు జరిపారు..
అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో భారత్‌లో పర్యటించారు, విదేశాంగమంత్రి జైశంకర్‌తో వాణిజ్య ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలమీద చర్చలు జరిపారు, ఇక్కడి నిరసనలు, పరిణామాలన్నీ భారత్ అంతర్గత వ్యవహారాలు కనుక వాటిమీద వ్యాఖ్యానించడం, జోక్యం చేసుకోవడం ఉండదని కూడా స్పష్టం చేశారు. ఢిల్లీలో నిరసనలను కట్టడి చేసేపేరిట భారత ప్రభుత్వం నిరసనకారులపై తీవ్రఅణచివేతకు పాల్పడుతోందని, కేంద్ర ప్రభుత్వ చర్యలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల బృందం ఒకటి విమర్శలు చేసిన నేపథ్యంలో, అమెరికాలో రోజూ నిరసనలు జరుగుతూనే ఉంటాయి అంటూ ఒక్కమాటలో రూబియో దానిని అంత తేలికగా తీసిపారేయడం మన పాలకులకు నచ్చివుంటుంది. హక్కులు, స్వేచ్ఛల గురించి ప్రపంచానికి నిత్యం పాఠాలు చెబుతూ, తమకు గిట్టని పాలకుల ఏలుబడిలో ఉన్న దేశాలను చీల్చిచెండాడే అమెరికానుంచి, అదీ విదేశాంగమంత్రి నోటివెంట ఈ వ్యాఖ్యలు వినబడటం మనవారికి పెద్ద ఉపశమనం.
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఎంతోదూరంలో లేదని, 99 శాతం పనిపూర్తయింది కనుక, కొద్దివారాల్లోనే కథ సుఖాంతమవుతుందని అంటూనే, సుంకాలు ఇరుదేశాల ఆర్థిక సంబంధాలమీద ప్రభావం చూపుతున్న విషయాన్ని ఒప్పుకున్నారు ఆయన. కీలకభాగస్వాములను కాపాడుకుంటూ అడుగులు వేస్తున్నామని అన్నప్పటికీ ఒత్తిడి ఉంటుందన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. ఇమ్మిగ్రేషన్ విధానాల్లో భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం జరగలేదనీ, ఇరుదేశాల సన్నిహిత సంబంధాలు, ఇక్కడి ఆర్థికవ్యవస్థ పరిమాణం రీత్యా కొన్ని కేటగిరీల్లో భారత దరఖాస్తు దారులు అధికంగా ఉన్నందున, ఏళ్ళ తరబడి కొనసాగుతున్న అవకతవక విధానాలను తాము ప్రక్షాళించడంతో ఎంతోమంది కొట్టుకుపోవడం సహజమన్నది ఆయన వ్యాఖ్యల్లో భావన.
గత ఏడాదిన్నర కాలంగా చర్చల దశలో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దాదాపు కుదిరిపోయినట్లేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా మొన్ననే అన్నారు. అతి త్వరలో అంటూ అమెరికా నాయకులు వ్యాఖ్యానించడంలో కొత్తేమీ లేదు కానీ, భారత్‌తో తాము కుదర్చుకోబోయే ఈ ఒప్పందం ఇప్పటివరకూ తాము చేసుకున్నవాటికి పూర్తి భిన్నమైనదని ట్రంప్ ఈమారు అనడం విశేషం. తమ విదేశాంగమంత్రి భారత్‌లో పర్యటిస్తున్న తరుణంలో ట్రంప్ నోట ఈ మాట వెలువడింది. గత ఒప్పందాల కన్నా ఇది ఎలా భిన్నంగా ఉండబోతోందో ట్రంప్ చెప్పలేదు కనుక, ఇది మరింత గందరగోళానికి, సందేహాలకు కారణమైంది. ఫిబ్రవరి 6న ఉభయదేశాలు చేసుకున్న అవగాహనకు పరిమితమయ్యే ఈ ఒప్పందం ఉంటుందా, అదేనెలలో అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ సుంకాల విషయంలో తీర్పు వెలువరించిన నేపథ్యంలో, అప్పటి అవగాహనకు భిన్నంగా వాటి శాతం మరింత తగ్గి ఇకపై భారత్‌కు ప్రయోజనం చేకూరుతుందా, అప్పటి ఒత్తిడికి అనుగుణంగా భారత్ ఇచ్చిన రాయితీల్లో ఇప్పుడు మార్పుచేర్పులేమైనా ఉంటాయా? ఇత్యాది ప్రశ్నలు అనేకం ఉన్నాయి. గత ఎనిమిదినెలల కాలంగా ఈ ద్వైపాక్షిక ఒప్పందానికి సంబంధించిన వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి. విభేదాలు ఉన్నందునే ఏ విషయమూ పొక్కడం లేదని ఒకవేళ అనుకున్నా, ఆయా అనుకూల, ప్రతికూల అంశాల గురించి పాలకులు అప్పుడప్పుడూ మాట్లాడుతూంటే అనుమానాలు, దుష్ప్రచారాలకు అవకాశం ఉండదు.
వాణిజ్యంలోనే కాదు, ఏ విషయంలోనూ ట్రంప్ ఏలుబడిలో ఉన్న అమెరికాను విశ్వసించడం కష్టం. రష్యా నుంచి చమురు కొనుగోలుచేస్తున్నందుకు కేవలం భారత్‌మీద అదనంగా, అన్యాయంగా పాతికశాతం సుంకం విధించిన ట్రంప్, ఇప్పుడు తానే రష్యాతో భారీ డీజిల్ దిగుమతి ఒప్పందం కుదుర్చుకున్నారు. మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఉభయసభల్లోనూ ఉన్న ఆ కాస్త మెజారిటీ కూలిపోతుందన్న సంకేతాల నేపథ్యంలో, ఇంధనధరలను చల్లార్చడం ఆయనకు ముఖ్యం. తన విజయంకోసం అమెరికా పరువుప్రతిష్ఠలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారాయన. రష్యా చమురు తానే చేతికి అంటించుకున్నారు కనుక, లిండ్సే గ్రాహమ్ చట్టం అమలును కూడా ఓ అరవైరోజులపాటు వాయిదావేశారు. రష్యా చమురును అధికంగా దిగుమతి చేసుకొనే చైనా, భారత్ తదితర దేశాలపై నూరుశాతం సుంకాలను విధించే ఈ ప్రణాళికను ఈ రెండునెలలూ సమీక్షించిన తరువాత వాటిని తిరిగి విధించవచ్చునని వాషింగ్టన్లో రూబియో వ్యాఖ్యానించారు. భారత్ పర్యటనలో సుంకాల విషయంలో రూబియో అంతగట్టిగా హామీ ఇవ్వకపోవడానికి ఇదీ కారణం కావచ్చు. భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని బలంగా కోరుకుంటున్న అమెరికా, తన భాగస్వామి ఇంధన భద్రత విషయంలో నిలకడగా నిలవడం ముఖ్యం.