అడవి నుంచి వచ్చి ఎన్నికల్లో తప్పిపోవాలా?!
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:44 AM
‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అని నా చిన్నతనంలో కొన్ని మారుమూల పల్లెల్లో గోడలపై రాతలు కనిపించేవి. విద్యార్థిగా ఉన్నప్పుడు పుస్తకాల్లో కొన్ని పేజీలపైనా ఇలాంటి స్లోగన్స్ చూసేవాళ్ళం.
‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అని నా చిన్నతనంలో కొన్ని మారుమూల పల్లెల్లో గోడలపై రాతలు కనిపించేవి. విద్యార్థిగా ఉన్నప్పుడు పుస్తకాల్లో కొన్ని పేజీలపైనా ఇలాంటి స్లోగన్స్ చూసేవాళ్ళం. మావోయిస్టులు మొన్నటి వరకు చేసి విరమిస్తున్న సాయుధ పోరాటం సరైనదేనా అనే విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అయితే బుల్లెట్ కంటే బ్యాలెట్ నయమన్న వాదనపై మాత్రం తప్పక చర్చ జరగాలి.
ఎమ్మా గిల్డ్‌మన్ అనే ఒక అమెరికన్ అనార్కిస్ట్ ఎన్నికలపై ఆసక్తికరమైన మాట చెప్పారు. ‘ఎన్నికలు ప్రజల జీవితాల్లో మార్పును తెస్తాయన్నది నిజమే అయితే వాటిని చట్టవిరుద్ధమని ఎప్పుడో ప్రకటించేవారు’ అన్నది గిల్డ్‌మన్ అభిప్రాయం. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా భారత ఎన్నికల వ్యవస్థపై నిర్దిష్టమైన అభిప్రాయాలతో ఉండేవారు. ఇండియాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇక్కడ సోషల్ డెమోక్రసీ, ఎకనామిక్ డెమోక్రసీ విజయవంతం అయితే తప్ప పొలిటికల్ డెమోక్రసీ విజయవంతం కాదని అంబేడ్కర్ అభిప్రాయం. ఇండియా లాంటి దేశంలో సోషల్ డెమోక్రసీ విజయవంతం కావడం సాధ్యమేనా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
బయటకు వచ్చిన మావోయిస్టులు వారి భవిష్యత్తు కార్యాచరణపై తమ అభిప్రాయాలను పొడిపొడిగా చెప్తున్నారు. ఇన్ని రోజులు ప్రజల కోసం పని చేశామనీ, ఇకపై కూడా ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజల కోసం పనిచేస్తామనీ అంటున్నారు. బయటి సమాజంలో కూడా చాలామంది మావోయిస్టులు ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావాలని కోరుకుంటున్నారు.
బ్యాలెట్ వ్యవస్థ దారి తప్పిందన్న కారణంతోనే బుల్లెట్ మార్గాన్ని ఎంచుకున్న మావోయిస్టులు మళ్ళీ బ్యాలెట్ బాట పట్టాలని కోరుకోవడం సరైనదేనా? అనే అంశంపై చర్చ జరగాల్సిందే. మావోయిస్టులు సాయుధపోరాట మార్గంలోనే కొనసాగితే అది విజయవంతం అయ్యేదో కాదో తెలియదు. కానీ ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ ముమ్మాటికీ విజయవంతం కాదు. ఇటీవల జరుగుతున్న ఎన్నికల్లో అనేక చిత్ర విచిత్రాలు చూస్తూ ఉన్నాం. ‘‘మా గ్రామంలో ఓటుకు నాలుగు వేలు పంచారు. మాకు రెండు వేలు మాత్రమే ఇస్తున్నారు. మా ఓటుకు విలువ లేదా? మాకు కూడా నాలుగు వేలు ఇవ్వాల్సిందే’’ అనే డిమాండ్‌తో గ్రామ ప్రజలంతా ఏకమై ధర్నా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులు ప్రత్యక్ష ఎన్నికల వ్యవస్థలోకి రావాలని కొందరు కోరుకోవడం బాధాకరం. పార్లమెంటరీ ఎన్నికల్లోకి మావోయిస్టులు రావాలని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారు ఎవరైనా నిజంగా మావోయిస్టులు ఎన్నికల్లోకి వస్తే తమ తమ రాజకీయ పార్టీల విధేయతలను వదిలి అన్నలతో కలిసి నడుస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో పాలిటిక్స్‌లోకి వస్తే మావోయిస్టులకు మరిన్ని గుణపాఠాలు ఎదురవ్వడం తప్ప ఒరిగేదేమీ ఉండదనేది వాస్తవం.
నిజానికి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వస్తామని బయటకు వచ్చిన మావోయిస్టులు స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు. సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టి పక్కకు వస్తున్నామని చెప్తున్నారు. సొంత రాజకీయ విశ్వాసాలపై మాత్రం ఎలాంటి భిన్నాభిప్రాయాలూ వ్యక్తం చేయట్లేదు. ఇంతకాలం తాము నమ్ముకున్న రాజకీయ అవగాహనతోనే ఇకపైన ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నారు.
దశాబ్దాల పాటు ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవిలో ఉండి కొట్లాడిన వాళ్ళకు ప్రజలపై అమితమైన ప్రేమ ఉంటుందని భావించవచ్చు. కాబట్టి ఇన్ని రోజులు అజ్ఞాతంగా ఉంటూ ప్రజల కోసం పనిచేసిన మావోయిస్టులు బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజల గొంతుకగా నిలవాలి. వారు ప్రజల తరఫున ఒక ‘ప్రెజర్ గ్రూప్’గా ఉంటేనే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. మావోయిస్టులు ఒక ప్రజాసంఘంగా మారి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తే బాగుంటుంది. బయటకు వచ్చిన మావోయిస్టులు గానీ, వాళ్ళను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నవాళ్ళు గానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజా ఉద్యమాలు ప్రజలను ఏకం చేస్తాయి. ఎన్నికలు ప్రజలను విడదీస్తాయి. బయటకు వచ్చిన మావోయిస్టులు రాజ్యాంగ పరిధిలో ప్రజల కోసం ప్రజల తరఫున పనిచేయాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించే ఉద్యమంలో వాళ్ళు భాగం కావాలని కోరుకుందాం.
-సిద్ధార్థ (జర్నలిస్ట్)