Share News

మనువుపై అంత మనోవ్యథ ఎందుకు?

ABN , Publish Date - Oct 25 , 2026 | 02:27 AM

ఆంధ్రజ్యోతిలో సెప్టెంబర్‌ 27న ‘మనువు... రాజకీయ బలిపశువు’ శీర్షికన ప్రచురించిన దుగ్గరాజు శ్రీనివాసరావు వ్యాసం చదివాక ఈ వ్యాసాన్ని రాస్తున్నాను. మనువు అనేవాడు అసలు ఉన్నాడా? ఉంటే ఏ కాలం...

మనువుపై అంత మనోవ్యథ ఎందుకు?

ఆంధ్రజ్యోతిలో సెప్టెంబర్‌ 27న ‘మనువు... రాజకీయ బలిపశువు’ శీర్షికన ప్రచురించిన దుగ్గరాజు శ్రీనివాసరావు వ్యాసం చదివాక ఈ వ్యాసాన్ని రాస్తున్నాను. మనువు అనేవాడు అసలు ఉన్నాడా? ఉంటే ఏ కాలం వాడు? ఆయన రాజా? మంత్రా? లేక ఋషా? కల్పిత పాత్రా అంటూ వ్యాసకర్త అనుమానాన్ని వ్యక్తపరిచారు. మళ్లీ తానే ఆయన ఉన్నట్టుగా కొన్ని వర్గాలవారు ఆయన్ని తమ వాదంలోకి లాగి బలిపశువును చేస్తున్నారని అంగలార్చారు. వ్యాసకర్త మనువుని అభిమానిస్తున్నాడా? ఆయన్ని వ్యతిరేకించే వారిని అభిశంసిస్తున్నాడా? అనే విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.

ఎక్కడో పశ్చిమాసియా, తూర్పు యూరప్ దేశాల మధ్యలో పుట్టి, బతుకుదెరువు కోసం వచ్చిన వలసవాదులైన ఆర్యులు, అప్పటికే ఎంతో ఉన్నత స్థితిలో ఉండి, సుసంపన్నమైన నాగరికత కలిగిన హరప్ప, మొహంజదారో నగరాల పాలకులను దేహి అని భిక్షమడిగి నివాసాలు ఏర్పర్చుకున్నారు. ఇంత అద్భుతమైన అన్నపూర్ణ లాంటి ప్రాంతాన్ని ఎప్పటికీ వదిలి వెళ్లకూడదని నిశ్చయించుకున్నారు. శాశ్వతంగా తమ అస్తిత్వాన్ని ప్రబలంగా స్థాపించుకునేందుకు ఈ దేశ మూలవాసులను మొదలు తమ ‘కర్మ, ధర్మ, పునర్జన్మ, వర్ణ శ్రమ భావజాల సిద్ధాంతం’తో లోబర్చుకొని మెల్లమెల్లగా వారిని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. వ్యతిరేకించిన కొంతమందిని ప్రత్యక్షంగా, మరి కొంతమందిని పరోక్షంగా హతమార్చారు. ఈ నీచుల వాదమే ఈ మనువు, మనుధర్మ శాస్త్రం.

దుగ్గరాజు లేవనెత్తిన ప్రశ్నలో మనువు ఎక్కడివాడు? ఎప్పటివాడు అన్నదానికి కొంతమంది చరిత్రకారులు వ్యక్తపరిచిన అభిప్రాయం– ఆయన క్రీ.పూ. 2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 1వ శతాబ్దం మధ్యకాలంలో జన్మించి ఉండవచ్చు. ఆ ప్రకారం చూస్తే... ఆయన పుట్టిన కాలంలో బౌద్ధం ఉజ్జ్వలమైన స్థితిలో ఉంది. అప్పటి ఆర్య వర్గాల వారు సృష్టించిన వైదిక ధర్మం తుడిచిపెట్టుకుపోతున్న సందర్భంలో అది సహించలేని బుద్ధుడి వ్యతిరేకులు అదను చూసి రామాయణ, మహాభారత పురాణాలను సృష్టించారు. వీటితో పాటు నారద, పరాశర, యాజ్ఞవల్క్య వంటి అనేక ప్రతీఘాత స్మృతులను సృష్టించి, వాటిని అమలు చేయించిన మాయావాదులే మనువును కూడా సృష్టించారు. ఆ మనువు ఊహా చిత్రాన్ని రాజస్థాన్ హైకోర్టు ప్రాంగణంలో పెట్టించడానికి ప్రయత్నించిన మాయావాదుల సంగతి దుగ్గరాజుకు తెలియనట్టుంది.


బుద్ధుడి కాలంలోనూ, ఆయన ప్రభావంతో రాజ్యాన్ని పరిపాలించిన సామ్రాట్ అశోక చక్రవర్తి కాలంలోనూ ఎక్కడా నిచ్చెన మెట్ల సమాజం ప్రస్తావన గానీ, కుల వివక్ష, అంటరానితనం అంశం గానీ లేదని... మరి అలాంటప్పుడు ఇప్పటి రాజకీయ నాయకులు ఆయన పేరుతో రాజకీయం చేయడం ఏమిటని తన ప్రశ్నగా కాకుండా, ఒక సామాన్యుడికి అనుమానం వచ్చినట్టుగా వ్యాసకర్త అడిగారు. అయితే ఎక్కడో పుట్టి ఈ దేశంలో బతకడానికి వచ్చిన ఆర్య, మనువాదుల మౌఖిక భాష అంటున్న సంస్కృతం, దాని మరో రూపమైన హిందీని... ద్రావిడ మూలాలు కలిగిన దక్షిణ భారతదేశ, ముఖ్యంగా తమిళనాడు ప్రజలు తమ సంస్కృతిని, సంప్రదాయాన్ని నాశనం చేసే ఆయుధమని ఇప్పటికీ ‘హిందీ గో బ్యాక్’ అనే ఉద్యమాన్ని సాగిస్తున్నారంటే... అది ఉత్తరం నుంచి దక్షిణానికి పాకినట్టు కాదా? అలాగే ఈ మనువాద భావజాల వాదులు శారీరక శ్రమ చేయకుండా కేవలం మాటలమ్ముకొని బతికే పరాన్నభుక్కులు. దక్షిణాదినా వారిని అనుసరిస్తున్నందుకే అది అన్ని ప్రాంతాలకూ పాకినట్టుగా అర్థం చేసుకోవాలి.

ఇక మనుధర్మ శాస్త్రాన్ని ఎవరు రాయించారు? ఎందుకు రాయించారు? అలా రాసిన వారికే దానిని అమలు చేసే అధికారం ఎలా వస్తుందన్న ప్రశ్నలను వ్యాసకర్త లేవనెత్తారు. భారత రాజ్యాంగాన్ని రాయడానికి నియమించిన రాజ్యాంగ పరిషత్ కమిటీ... డా. బి.ఆర్.అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రాసి, అప్పటి ప్రభుత్వానికి అందజేస్తే, దానిని పాలక వర్గాలు పాటించి, నడిపించాయి కదా? మరి మనువు తన స్మృతిని దేశమంతటా ఎలా పాకించగలిగాడు అన్న ప్రశ్నను లేవనెత్తడం విడ్డూరంగా లేదా?!

ఎక్కడో యూరప్‌లో పుట్టిన ఆంగ్ల భాష ప్రపంచమంతా ఎలా పాకిందో వ్యాసకర్తకు తెలియదా? పాలకవర్గాలు తలచుకుంటే తాము కోరుకున్న రీతి చట్టాలను (స్మృతులను) రూపకల్పన చేయించి, అమలు చేయించలేరా? ఒకప్పటి మీసా, నాసా, ఇప్పటి ఉపా అర్బన్ నక్సలైట్ల నిర్మూలన వంటి చట్టాల వలే, ఈ మనుధర్మ శాస్త్రాన్ని అప్పటి రాజ్యాలు కాలక్రమంలో అంతటా విస్తరించి తమ ప్రభావాన్ని చూపెడుతూ కనీస మానవ హక్కులను కాలరాశాయి. అందుకే బుద్ధుడు, బసవేశ్వరుడు, పూలే, పెరియార్, నారాయణగురు, అంబేడ్కర్, కాన్షీరాం వంటి వారు పోరాడారు. ఈ మధ్య పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా అలాంటిదే. ఈ విషయాలను వ్యాసకర్త పరిగణనలోకి తీసుకుంటే బాగుండేది.


దుగ్గరాజు వ్యాసాన్ని చదివిన వారికి మనువు ఉన్నాడో లేడో అనే డోలాయమాన స్థితి కలిగితే... శ్రీరాముడు, శ్రీకృష్ణుడి అస్తిత్వం ఏమవుతుందో? అలాగే బుద్ధుడి ప్రభావం చేత నాటి పురాతన వైదిక, మధ్యలో మారిన హైందవ, ఇప్పటి హిందూమతం అస్తిత్వం ఎలా ఉండేదో వ్యాసకర్త చెప్పి ఉంటే బాగుండేది. అప్పటి పాలకులైనా, ఇప్పటి పాలకులైనా (నయా సనాతన ధర్మకర్తలు) తమ రాజ్యాధికారాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నవారే. ఈ విషయాన్ని బుద్ధి జీవులందరూ గుర్తించి, జెన్‌జీలుగా అవతరిస్తూ జిల్ల పురుగులై దేశంలోనూ, ప్రపంచమంతా వ్యాపిస్తున్నారనే విషయాన్ని దుగ్గరాజు వంటి వ్యక్తులు గమనించవలసిన అవసరం ఎంతో ఉంది.

గంగాధరి మాస్టార్జీ

ఈ వార్తలూ చదవండి

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..

గ్రీకు రెస్టారెంట్‌లో తొలి పరిచయం.. రాజీవ్‌ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..

Updated Date - Oct 25 , 2026 | 02:28 AM