Share News

చైనా సైన్యంతో వైరం, మార్కెట్‌కు దాసోహం!

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:23 AM

మన విదేశాంగ, వాణిజ్య వ్యవహారాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్సాయ్ చిన్‌లో 38వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా అరవైయేళ్ళుగా ఆక్రమించుకుని కూర్చుంది.

చైనా సైన్యంతో వైరం, మార్కెట్‌కు దాసోహం!

న విదేశాంగ, వాణిజ్య వ్యవహారాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్సాయ్ చిన్‌లో 38వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా అరవైయేళ్ళుగా ఆక్రమించుకుని కూర్చుంది. దాదాపు 80వేల చదరపు కిలోమీటర్లున్న అరుణాచల్‌ ప్రదేశ్ తనదే అంటోంది. దానిని దక్షిణ టిబెట్ అని వాదిస్తోంది. మరోవైపు భారత మార్కెట్లలో చైనా వస్తువులు కొండలకొద్దీ వచ్చిపడుతున్నాయి.

1980ల చివరినాటి, 1990 ఆరంభంనాటి సంక్షోభం నుండి దేశాన్ని బయటపడేయడానికి పి.వి.నరసింహారావు – మన్మోహన్‌సింగ్ ద్వయం సరళీకృత ఆర్థిక విధానాలతోపాటూ ‘‘తూర్పుకు చూడండి’’ (లుక్ ఈస్ట్) అనే ఒక కొత్త ప్రాపంచిక దృక్పథాన్ని ముందుకు తెచ్చారు. ‘లుక్ ఈస్ట్’ అనేది కేవలం విదేశాంగ విధాన నినాదం కాదు. రష్యా, అమెరికాల మధ్య కోల్డ్‌ వార్‌ ముగిసి ప్రపంచం పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియలో ఉన్నప్పుడు భారతదేశం తన అస్తిత్వాన్ని చాటుకునే ప్రయత్నం ఇది. ఆసియా ఖండంలో భారత నాగరికత, సాంస్కృతిక, భౌగోళిక, రాజకీయార్థిక వ్యూహాల దిశను నిర్దేశించే పిలుపు ఇది. ప్రధానంగా తూర్పు–ఆగ్నేయాసియా దేశాలతో ప్రగాఢమైన అనుబంధాన్ని ఏర్పరచుకుని భారతదేశం ప్రపంచ పటం మీద ఒక ప్రధాన శక్తిగా ఎదగాలనే వ్యూహం ఈ పిలుపులో ఉంది.

19వ శతాబ్దంలో ఐరోపా, 20వ శతాబ్దంలో అమెరికా ప్రపంచ చోదకశక్తులుగా కొనసాగాయి. 21వ శతాబ్దంలో తూర్పు ఆసియా ప్రపంచ చోదక శక్తిగా మారగలదని అప్పట్లో ఒక ఊహాగానం రేగింది. ఇండియాతో పాటు సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, జపాన్, చైనాలు అనూహ్యంగా శక్తిని పుంజుకుంటాయని అంచనాలు వేశారు.


నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ‘లుక్ ఈస్ట్’ను ‘యాక్ట్ ఈస్ట్’గా ప్రకటించి క్రియాశీలంగా మార్చేందుకు పూనుకున్నారు. ఇది కొన్ని ఫలితాలను ఇచ్చింది కూడా. దక్షిణాసియా దేశాల సంఘం (ASEAN)లో ఇండియా ప్రాధాన్యత పెరిగింది. జపాన్ ఇండియాకు మద్దతుగా నిలిచింది. ఆస్ట్రేలియా ఇండియాను కీలకమైన భాగస్వామి అనుకుంది. అమెరికా అయితే చైనాను ఆసియా ఖండాన్ని దాటి విస్తరించకుండా నిలువరించాలంటే ఇండియాతో స్నేహం వ్యూహాత్మక అవసరం అని భావించింది. ఇంతటి అనుకూల వాతావరణాన్ని ఇండియా పూర్తిగా వాడుకునేలోపు కొన్ని అనూహ్య పరిణామాలు జరిగాయి.

తూర్పు యూరోప్‌, సోవియట్ రష్యాలు బలహీనపడిన తరువాత చైనా సోషలిస్టు మార్గం నుండి పెట్టుబడిదారీ విధానం వైపునకు మారింది. చైనాను పెట్టుబడిదారీ దేశం అనడం కొందరికి ఇష్టం లేకపోవచ్చు. అలాంటివాళ్ళు చైనాది ఉత్పత్తిలో సోషలిస్టు విధానం, మార్కెటింగులో పెట్టుబడీదారీ విధానం అనుకోవచ్చు. అలా పదేళ్ళు పుంజుకుని, 2001 చివర్లో ప్రపంచ వాణిజ్య సంస్థలో 143వ దేశంగా చేరిన తరువాత చైనా ప్రపంచ మార్కెట్‌లో విజృంభించింది.


టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇ–కామర్స్,. ఇతర ఉత్పత్తిరంగాల్లో చైనా ఎవరికీ అందనంత దూరం వెళ్ళిపోయింది. ఉత్పత్తి ఎక్కువయితే వస్తువుల ధరలు పడిపోతాయని అందరికీ తెలుసు. ధరల్ని తగ్గించడమే మార్కెటింగ్ ఆయుధంగా చైనా మార్చుకుంది. విపరీతంగా ఉత్పత్తిచేసి సరుకుల్ని తక్కువ ధరకు ప్రపంచ మార్కెట్లో విసిరేయడం దాని విధానం. ‘‘ధర కారుచౌక. వాడండి. ఆస్వాదించండి. పాడైపోతే పడేయండి’’ అనే చైనా మార్కెటింగ్ విధానం ప్రపంచ కన్స్యూమర్స్‌ను తెగ ఆకర్షించింది. ఆ దేశం తన అధిక జనాభాను సరుకుల ఉత్పత్తికి వాడుకుని సద్వినియోగం చేసుకుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, చౌక విద్యుత్, భారీ పోర్టులు, నైపుణ్య శిక్షణ, ఎగుమతి ఆధారిత పారిశ్రామిక విధానం అమలు చేసింది. ఫలితంగా ఒక వస్తువు ఉత్పత్తికి కావలసిన వందల భాగాలు, విభాగాలు కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే తయారయ్యే వ్యవస్థల్ని ఏర్పాటుచేశారు. దీనినే Supply Chain Ecosystem అంటున్నారు. అలా చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారిపోయింది. ఇప్పుడు జనాభాలో మన దేశం చైనాను అధిగమించిందిగానీ, వస్తు ఉత్పత్తిలో చైనాతో పోలిస్తే చాలా వెనుకబడివున్నాం. ఏ దేశంలోనూ లేనంత యువతరం వున్నా వాళ్ళను పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో ఉపయోగించుకోలేకపోతున్నాం. మన దేశంలో రాజకీయ పార్టీల గెలుపు వ్యూహాలు యువతరాన్ని ఉత్పత్తికి దూరం చేస్తున్నాయి. మన రాజకీయాలు మత రాజకీయాలుగా మారిపోతున్నాయనే ఆందోళన తరచూ వినిపిస్తున్నది. ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే మత చీలికల్ని కొనసాగించక తప్పని పరిస్థితి. దానికోసం ఉత్సవాలు, ఊరేగింపులు, యాత్రలు, జాతరలు వంటివి ఏవో ఒకటి నిరంతరం జరుపుతూ యువతరాన్ని ఉత్సాహపరుస్తున్నారు మన నాయకులు. ఒకవైపు, రాజకీయరంగం తీరిక లేకుండా కార్యక్రమాలు జరుపుతుంటే, మరోవైపు, మన ఫ్యాక్టరీ గొట్టాల నుండి పొగ రావడంలేదు. స్వంత ఉత్పత్తి పెద్దగా లేకపోవడంతో మన ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరుగుతున్నాయి. ఫలితంగా రూపాయి విలువ పతనం అవుతోంది. నిరుద్యోగమూ పెరుగుతోంది. సమీప భవిష్యత్తులో చైనా జీడీపీ అమెరికాను అధిగమించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చైనా సరుకులకు బ్రాండ్ కూడా అక్కర లేదు. ‘చైనా సరుకు – ధర తక్కువ’ అదే దాని మార్కెటింగ్ క్యాప్షన్.


2020 జూన్ నెలలో గాల్వాన్ లోయ వద్ద చైనా మన సరిహద్దుల్ని దాటే ప్రయత్నాలు చేయడంతో రెండు దేశాల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘అత్మనిర్భర్’ తత్త్వం ముందుకు వచ్చింది. ‘చైనా సరుకుల్ని బహిష్కరించండి’ అంటూ నినాదాలు చెలరేగాయి. ఇది కొంచెం అతిశయించి రోడ్ల పక్కన నూడుల్స్ అమ్ముకునే తోపుడు బండ్ల మీద కూడ దేశభక్తులు దాడులు చేశారు. టిక్ టాక్ వంటి చైనా యాప్స్‌ను రద్దు చేశారు. ఓ రెండు మూడేళ్ళ తరువాత అందరూ అన్నీ మరచిపోయారు. ఇప్పుడూ మన దేశంలోని మొబైల్ ఫోన్స్, ఫర్నిచర్, అపెరల్స్, (దుస్తులు–బూట్లు) టాయ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ పార్ట్స్ మార్కెట్లన్నీ చైనా సరుకులతో కిటకిటలాడిపోతున్నాయి.

ఆహారధాన్యాలు, హార్టికల్చర్ (కూరగాయల) ఉత్పత్తిలో ఇండియా ముందుంది అనే అభిప్రాయం వుంది. ఆ రంగంలోనూ చైనా ఉత్పత్తులు ప్రవేశించేస్తున్నాయి. చివరకు రైతు బజార్లలోనూ వెల్లుల్లిపాయలేగాక ఉల్లిపాయలు కూడా చైనావి అమ్ముతున్నారు. ఇంకా ఆశ్చర్యకర పరిణామం ఏమిటంటే ఇండియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) పెట్టడానికి కొన్ని షరతులతో చైనాకు అనుమతి ఇచ్చారు.


‘లుక్ ఈస్ట్’, ‘యాక్ట్ ఈస్ట్’ విధానం భారత్‌ను ఆసియాతో అనుసంధానించాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. జపాన్, ఆస్ట్రేలియా, ఆసియా దేశాలతో ఇండియా సంబంధాలు బలపడ్డాయి. కానీ ఆర్థికంగా చైనా మరింత వేగంగా ముందుకెళ్లింది. ఆసియా సరఫరా గొలుసుల్లో చైనా కేంద్రంగా మారగా భారత్ ఇంకా ప్రవేశ దశలోనే ఉంది. ‘లుక్ ఈస్ట్’, ‘యాక్ట్ ఈస్ట్’ విధానం చైనాకు ఆర్థికంగా బలపడడానికి దోహదపడింది. మన రాజకీయ విధానాలు మనల్ని ఆర్థిక రంగంలో వెనక్కి లాగాయి.

సరిహద్దుల్లో చైనాను ప్రత్యర్థిగా పరిగణిస్తూనే, మార్కెట్లలో చైనా ఉత్పత్తులపై ఆధారపడే వైరుధ్య స్థితిలో భారత్ ఉంది. ఈ వైరుధ్యాన్ని అధిగమించాలంటే నినాదాలకన్నా ఉత్పత్తి, నైపుణ్యం, పరిశ్రమల నిర్మాణంపైనే దేశం దృష్టి పెట్టాలి. లేకపోతే ‘లుక్ ఈస్ట్’, ‘యాక్ట్ ఈస్ట్’ చరిత్రలో చేతికి అందిన అవకాశాలను కోల్పోయిన విధానాలుగానే మిగిలిపోతాయి. సరిహద్దుల్లో సైనిక శక్తితో చైనాను ఎదుర్కోవడం ఒక విషయం. మార్కెట్‌లో చైనా ఉత్పత్తులతో పోటీపడటం మరో విషయం. మొదటిదానికి సైన్యం అవసరం. రెండోదానికి పరిశ్రమలు అవసరం. నినాదాలు, భావోద్వేగాలు, బహిష్కరణ పిలుపులు కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి. కానీ ఉత్పత్తి, సాంకేతికత, నైపుణ్యం, ఉపాధి– ఇవే ఒక దేశ ఆర్థిక సార్వభౌమాధికారానికి శాశ్వత పునాదులు అవుతాయి.

- డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు

Updated Date - Jun 30 , 2026 | 12:23 AM