Share News

మమతపై తుది పోరు

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:22 AM

పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వయానా ఈ దేశ హోంమంత్రి చార్జిషీట్‌ విడుదల చేసిన నేపథ్యంలో, అక్కడ రాజకీయం మరింత వేడెక్కడమే కాదు...

మమతపై తుది పోరు

పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వయానా ఈ దేశ హోంమంత్రి చార్జిషీట్‌ విడుదల చేసిన నేపథ్యంలో, అక్కడ రాజకీయం మరింత వేడెక్కడమే కాదు, కొత్తదారుల్లోనూ, అడ్డదారుల్లోనూ సాగిపోతోంది. దేశభద్రత పశ్చిమబెంగాల్‌ ఎన్నికలతో ముడిపడివుందని, అందువల్ల ఓటర్లు ఇదేదో తమ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారంగా భావించి ఓటేయకూడదని అమిత్‌ షా హెచ్చరించారు. మమత పదిహేనేళ్ళ పాలనలో విదేశీ చొరబాట్లకు, దేశసరిహద్దుల్లో అభద్రతకు, బుజ్జగింపు రాజకీయానికీ మారుపేరుగా రాష్ట్రం తయారైందన్నారు ఆయన. తాము అధికారంలో ఉన్న అసోంను చొరబాట్లకు వీల్లేకుండా సీల్‌ చేసేశాం కనుక ఇక బెంగాల్‌ ఒకటే మిగిలిందని, ఇది చొరబాటుదారులకు దారులు తెరిచి, దేశవ్యాప్త అల్లర్లకు కారణమవుతూ దేశాన్ని భయపెడుతోందన్నారు. సరిహద్దులో ఫెన్సింగ్‌ వేస్తామంటే మమత ప్రభుత్వం భూమి ఇవ్వకపోగా, అక్రమచొరబాటుదారులతో ఓటుబ్యాంకును పెంచుకుంటోందట. బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సరిపోయింది కానీ, సాక్షాత్తూ దేశ హోంమంత్రి ఇలా ఒక రాష్ట్ర ప్రభుత్వం కారణంగా యావత్‌ దేశభద్రత ప్రమాదంలో పడిందని ప్రకటించడం చిన్న విషయమేమీ కాదు.


మీరు చెబుతున్నది నిజమే అయితే, హోంమంత్రిగా ఉన్న మీరు ఈ పాటికే రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాల్సింది అని టీఎంసీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. చొరబాట్లను మమత ప్రభుత్వం ప్రోత్సహిస్తుంటే హోంమంత్రి ఎందుకు ఊరుకున్నారు, చొరబాటుదారులను గుర్తించి ఎందుకు వెనక్కుపంపలేదు, ఓటర్ల జాబితాలో ఉన్న విదేశీయుల పేర్లను ఎన్నికల సంఘం ఎందుకు విడుదల చేయలేదు? అని టీఎంసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బెంగాల్‌లో లక్షలాది బంగ్లాదేశీయులు, రొహింగ్యాల పేర్లు దొరికాయని హోంమంత్రి అంటారు, కానీ, ఎన్నికల సంఘం సహా ఏ సంస్థా మాట్లాడదు, మణిపూర్‌లో సామూహిక అత్యాచారాలు జరిగినా, బెంగాల్‌లోనే మహిళలకు భద్రతలేదని హోంమంత్రి మాట్లాడతారు అని టీఎంసీ నేతలు ఎదురుదాడిచేస్తున్నారు. అసోం, గుజరాత్‌ తరహా విద్వేష రాజకీయాలను అమలుచేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని వారి వాదన. ఈ ఎన్నికల్లో తిమ్మినిబమ్మిని చేసైనా బెంగాల్‌ను స్వాధీనం చేసుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది కనుక, తృణమూల్‌ కూడా చరిత్రను, సెంటిమెంటునూ, సంస్కృతినీ ప్రయోగించి ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తోంది. దాదాపు ఐదోవంతు ఆహారఖర్చును చేపలు, మాంసం మీద పెడుతున్న బెంగాలీలను చేప రాజకీయంతో రెచ్చగొడుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపలు తినరు, మాంసం విక్రయాల మీద కూడా పలురకాల ఆంక్షలు, నిషేధాలు ఉన్నాయి, ఆ పార్టీ అధికారంలోకి వస్తే మిమ్ములను గుడ్డు కూడా ముట్టుకోనీయదు అని మమత పార్టీ ఓటర్లను బెదిరిస్తోంది. పొరుగు రాష్ట్రం బిహార్‌లో అక్కడి డబుల్‌ ఇంజన్‌ సర్కారు బహిరంగ స్థలాల్లో, వీధుల్లో చేపల అమ్మకాన్ని నిషేధించడం తృణమూల్‌కు రాజకీయాస్త్రంగా ఉపకరించింది. దీనితో, బెంగాలీల ఆహారపు అలవాట్లకు తాము వ్యతిరేకం కాదనీ, వారిమీద శాకాహారాన్ని రుద్దే దురాలోచన తమకు లేదని హామీ ఇస్తూ బీజేపీ నేతలు చేతుల్లో చేపలు పట్టుకొని మరీ తిరుగుతున్నారట.


బెంగాల్‌లోనే ‘సర్‌’ ఎందుకు వివాదాస్పదమవుతోందని హోంమంత్రి మొన్న ఘాటుగా ప్రశ్నించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను మమత రాజకీయం చేస్తున్నమాట నిజం. అయితే, బెంగాల్‌లో ఈ ప్రక్రియ తీవ్రంగా అప్రదిష్ఠపాలైంది. షహీదుల్లా మున్షీ అన్న పేరు కనబడగానే ఓటరు జాబితానుంచి తీసిపారేసిన ఎన్నికల సంఘం అధికారులు ఆ తరువాత నాలుక కరుచుకొని, ఈ కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి కుటుంబం పేర్లను సప్లమెంటరీ జాబితాలో చేర్చారు. లోక్‌సభ మాజీ ఎంపీ పేరు కూడా తీసివేసి, ఆయన భార్యను మాత్రం ఓటరుగా ఉంచారు. విడతలవారీగా ఎన్నికల సంఘం విడుదల చేస్తున్న తుది సవరణ జాబితాలు ఇప్పటికీ అనేక ప్రశ్నలు మిగులుస్తున్నాయి. అప్పీలు చేసుకొనే అవకాశం ఆన్‌లైన్‌లోనే కనిపిస్తోందనీ, క్షేత్రస్థాయిలో లేదని విమర్శలు వస్తున్నాయి. అంతిమంగా లక్షలాదిమంది అక్కడ తమ ఓటుహక్కుకు దూరమవుతున్నారన్న భయం లేకపోలేదు. పశ్చిమబెంగాల్‌లో ‘సర్‌’ సవ్యంగా సాగడం లేదని ఇటీవలే వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 1న ఏమి చెబుతుందో చూడాలి.

Updated Date - Mar 31 , 2026 | 01:33 AM