బెంగాల్‌లో రవి
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:36 AM
మీరు బెంగాల్‌ను ప్రేమిస్తే, బెంగాల్ మిమ్మల్ని ప్రేమిస్తుంది అన్నారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త గవర్నర్ ఆర్.ఎన్.రవితో. ప్రమాణస్వీకారం సందర్భంగా వారిద్దరి మధ్యా పలకరింపులు...
మీరు బెంగాల్‌ను ప్రేమిస్తే, బెంగాల్ మిమ్మల్ని ప్రేమిస్తుంది అన్నారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త గవర్నర్ ఆర్.ఎన్.రవితో. ప్రమాణస్వీకారం సందర్భంగా వారిద్దరి మధ్యా పలకరింపులు, చిరునవ్వులు బాగానే ఉన్నా, అవన్నీ ఉపరితలంలో, కృతకంగా సాగినట్టు చాలామందికి అనిపించింది. బెంగాల్‌లో అందరూ, అన్ని భాషలవారూ కలిసిమెలిసి ఉంటారు, శాంతియుతంగా ఉంటారు అని ఆమె అనడం కూడా, ఎదుటి వ్యక్తి ఆర్.ఎన్. రవి కాబట్టేననీ, రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్‌భవన్ వ్యవహరించకూడదన్న అంతర్లీనమైన సందేశం మమత వ్యాఖ్యల్లో కనిపిస్తోందని విశ్లేషకుల భావన. గతంలో గవర్నర్‌లుగా పనిచేసిన జగ్‌దీప్ ధన్‌ఖడ్, ఆనంద్‌బోస్‌ల హయాంలో రాష్ట్రప్రభుత్వానికీ, రాజ్‌భవన్‌కూ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం కొనసాగిన నేపథ్యంలో, మమత వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఎన్నికల ముంగిట్లో ఉన్న తరుణంలో తమిళనాడునుంచి రవి వచ్చివాలడం మీద మీడియా పలురకాల విశ్లేషణలు చేస్తోంది.
ఆనంద్‌బోస్ స్థానంలో రవిని నియమించబోతున్నట్టు తనకు తెలియదని, రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించలేదని మమత ఓ మాటన్నారు. గవర్నర్‌గా తప్పుకుంటున్న ఆనంద్‌బోస్‌కూ ఆమె ప్రభుత్వానికీ మధ్య వైరం అందరికీ తెలిసిందే. కానీ, బెంగాల్‌లో సాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు నిరసనగా ధర్నాలో కూచున్న ఆమె మధ్యలో వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి మరీ వచ్చారట. ఆయన గురించి కొన్ని మంచిమాటలు సైతం ఆమె అన్నారు. కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి విపక్ష బీజేపీనుంచి ఎవరూ హాజరు కాలేదు కానీ, ఆ తరువాత సువేందు అధికారి వచ్చి రవిని కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని ఆ పార్టీ అంటున్నది కానీ, డీజీపీ మీదా, చీఫ్ సెక్రటరీ మీదా ఫిర్యాదు చేయడానికి ఈ బీజేపీ నేత ఈ సందర్భాన్ని వాడుకున్నారు. రాష్ట్రపతి ముర్ము ప్రొటోకాల్ వివాదాన్ని ఎన్నికలయ్యేంతవరకూ వదిలిపెట్టే ఉద్దేశంలో బీజేపీ లేదని అర్థం. గవర్నర్‌ను కలిసిన తరువాత, సువేందు విలేఖరులతో మాట్లాడుతూ మమత ప్రభుత్వం రాష్ట్రపతిని అగౌరవపరిచి రాష్ట్రం పరువు తీసిందంటూ తీవ్రంగా మండిపడ్డారు.
మరికొందరి బదిలీలు కూడా జరిగినప్పటికీ, ఎన్నికల ముంగిట్లో ఉన్న తమిళనాడు, పశ్చిమబెంగాల్ గవర్నర్ల మార్పుచేర్పుల గురించి మాత్రమే తీవ్ర చర్చ జరుగుతోంది. పదవీకాలం పూర్తికాకుండా సీవీ ఆనంద్‌బోస్‌ను తప్పించి, ఆయన స్థానంలోకి రవిని తీసుకురావడం, మరో పోరాట వీరుడు కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌కు తమిళనాడును అదనపు బాధ్యతగా అప్పగించడం విశేషమైన పరిణామం. స్టాలిన్ ప్రభుత్వంతో రవి ఎంత యుద్ధం చేశారో తెలిసిందే. అనేక బిల్లుల సంగతి ఎటూ తేల్చకుండా అటకమీద ఉంచేయడంతో పలుమార్లు ఆయన సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చవిచూడాల్సివచ్చింది. సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిన రాజ్యపాలకుడు సభనుంచి వాకౌట్ చేయవచ్చునని ఆయనను చూసిన తరువాతే తెలిసిందే. బీజేపీ విధేయతను స్పష్టంగా రుజువుచేసుకున్నారే తప్ప, తటస్థంగా ఉన్నానని అనిపించుకోవడం కోసం ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. కేంద్ర ప్రభుత్వం దూతగా, బలమైన గొంతుగా రాష్ట్రంలో పనిచేయడానికే ఆయన ఇష్టపడ్డారు. ఆనంద్‌బోస్ ఆదిలో కాస్తంత విజృంభించినా, ఆ తరువాత బాగా తగ్గిపోయారని, ఎన్నికలవేళ ఆయన తమకు అంతగా ఉపకరించరని బీజేపీ పెద్దలు భావించినందునే రవిని తీసుకువచ్చారని అంటారు. ఆనంద్‌బోస్‌ను తప్పించగానే మమత సైతం లోక్‌భవన్‌ను ఎన్నికల కార్యాలయంగా మార్చివేయడానికే ఈ మార్పు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇంకా పరిష్కరించవలసిన, చక్కదిద్దవలసిన ఓటర్ల సంఖ్య లక్షల్లో ఉన్నందున, ఏప్రిల్‌లోగా ‘సర్’ సజావుగా పూర్తికావడం అసాధ్యమనీ, న్యాయస్థానాలు అడ్డుపడినపక్షంలో, ఆ పేరిట రాష్ట్రపతిపాలన విధించేందుకు రవిని తెచ్చుకున్నారని తృణమూల్ నేతల వాదన. ఇకపై బెంగాల్ రాజకీయం మరింత భగ్గుమంటుందనీ, ఊహించని దృశ్యాలు అనేకం చూడాల్సివస్తుందని అంతా అనుకోవడంలో తప్పేమీ లేదు. ఇదే పశ్చిమబెంగాల్ నుంచి ఉపరాష్ట్రపతిగా ఎదిగిన జగ్‌దీప్ ధన్‌ఖడ్ దారిలో సాగడానికి రవి రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నించవచ్చు.