Share News

అగ్రరాజ్యాన్ని ధిక్కరించిన ‘మక్కా’!

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:17 AM

గల్ఫ్‌లో ఆరు నెలలుగా ఎగిసిపడుతున్న యుద్ధజ్వాలల్లో రిఫైనరీలు, డీశాలినేషన్‌ ప్లాంట్లు తగులబడిపోతున్నాయి. ఒక్క సౌదీ అరేబియానే కాదు, యునైటెడ్‌ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ), ఖతార్‌, కువైట్‌, బహ్రెయిన్‌ తదితర దేశాలన్నింటిలో..

అగ్రరాజ్యాన్ని ధిక్కరించిన ‘మక్కా’!

ల్ఫ్‌లో ఆరు నెలలుగా ఎగిసిపడుతున్న యుద్ధజ్వాలల్లో రిఫైనరీలు, డీశాలినేషన్‌ ప్లాంట్లు తగులబడిపోతున్నాయి. ఒక్క సౌదీ అరేబియానే కాదు, యునైటెడ్‌ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ), ఖతార్‌, కువైట్‌, బహ్రెయిన్‌ తదితర దేశాలన్నింటిలో ఇదే దుస్థితి. ఇంధన, వ్యూహాత్మక మౌలిక వ్యవస్థల విధ్వంసం కారణంగా ఈ దేశాలు ఇప్పటికే 58 బిలియన్‌ డాలర్లు (రూ.5.55 లక్షల కోట్లకు పైగా) నష్టపోయినట్లు అంచనా. పోరు మరింత కాలం కొనసాగితే ఆర్థిక నష్టం 200 బిలియన్‌ డాలర్లు (రూ.19 లక్షల కోట్లు) దాటే ప్రమాదం ఉంది. ఈ దురవస్థ గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. యుద్ధ భారాన్నంతా తామే మోయాల్సి రావడంతో అవి కుతకుతలాడిపోతున్నాయి. ఇరాన్‌తో పాటు, ఆ దేశ ప్రేరేపిత హుతీలు తదితర ఉగ్రవాద వర్గాల నుంచి తమ చమురు క్షేత్రాలపై తీవ్రస్థాయి దాడులు జరుగుతున్నా, అమెరికా అడ్డుకోలేకపోవడం, ఆదుకోలేకపోవడం గల్ఫ్‌ దేశాల్ని కలవరానికి గురిచేస్తోంది. ఇరాన్‌ యుద్ధాన్ని ఎలా ముగించాలో దిక్కుతోచక తలపట్టుకొంటున్న ట్రంప్‌, తమనేదో సంకటం నుంచి బయటపడేస్తారన్న భ్రమల తెరలు తొలిగాయి. సూటిగా చెప్పాలంటే– అమెరికాపై నమ్మకం సడలిపోయింది. అలాగని, అమెరికాతో ఇప్పటికిప్పుడు తెగతెంపుల పరిస్థితి లేకపోయినప్పటికీ, ఆత్మరక్షణకు సొంత కుంపటి తప్పదన్న గల్ఫ్‌ దేశాల నిర్ణయం– దురహంకారి అగ్రరాజ్యంపై ధిక్కార ప్రకటనే!


ముస్లిం ప్రపంచంలో ప్రబల శక్తులుగా ప్రచండ ప్రభావం చూపుతున్న సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్‌ కలిసి మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందం పేరుతో కుదుర్చుకొన్న త్రైపాక్షిక రక్షణ సంధి– పశ్చిమాసియా పరిణామాల దృష్ట్యా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌ విషయంలో తనతో కలిసిరాని మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొరడా ఝుళిపిస్తున్న పర్యవసానంగా ‘నాటో’ మనుగడే ప్రమాదంలో పడిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇస్లామిక్‌ లేదా సున్నీ నాటో రూపేణా కొత్త కూటమి తెరమీదకు రావడాన్ని తేలికగా తీసిపారేయలేం. సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎడ్రోగన్‌, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ ఇటీవల మక్కాలో సంతకం చేసిన ఈ సంధిలో నాటో తరహా ఉమ్మడి రక్షణ నిబంధన ఉండటం గమనార్హం. అంటే– ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశం మీద ఎలాంటి దాడి జరిగినా, మొత్తం మూడు దేశాలపై దాడి జరిగినట్టుగానే పరిగణిస్తారన్నమాట. ఈ సంధి ప్రభావం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా మొత్తం దక్షిణాసియాకూ ప్రసరించే అవకాశం ఎంతైనా ఉంది.

దాడుల సందర్భంలో పరస్పర సైనిక సహాయం అందజేసుకోవాలన్నది ఈ సంధిలో కచ్చితంగా పాటించాల్సిన కీలక నిబంధన. ప్రాంతీయ స్థాయిలో సంక్షోభాలు తలెత్తినప్పుడూ, వాటి మధ్య భద్రత, నిఘాపరమైన సహాయ సహకారాలు తప్పనిసరి. రక్షణోత్పత్తులు, రక్షణ వ్యయం, ఇంధన భద్రత విషయంలోనూ ఉమ్మడి వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అందుకోసం ఒక మార్గదర్శక ప్రణాళికను అవి రూపొందించుకొంటాయి.


గల్ఫ్‌ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా కొన్ని దశాబ్దాలుగా భద్రత కోసం అమెరికా మీద అధికంగా ఆధారపడటం అనివార్యంగా మారింది. కానీ, అమెరికా–ఇరాన్‌ యుద్ధం, గాజా సంక్షోభం దరిమిలా పరిస్థితులు బాగా మారాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ వరుస వెంబడి దాడులు, భారీ స్థాయి విధ్వంసకాండ, చివరకు అంతటి అగ్రరాజ్యమే ఆత్మరక్షణలో పడిన వైనం ఈ దేశాలను పూర్తిస్థాయిలో కదలబార్చింది. పూర్తిగా అమెరికా మీదనే ఆధారపడితే ఏదో ఒక నాటికి పుట్టి మునుగుతుందన్న భయాందోళన– ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించేలా చేసింది. అగ్రరాజ్యం ఎంత అండగా ఉన్నప్పటికీ, ప్రత్యేకించి ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డుల దూకుడు, ప్రాంతీయ స్థాయిలో ప్రాబల్యానికి ఆ షియా దేశం వేస్తున్న ఎత్తులు– సౌదీ అరేబియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పకడ్బందీ రక్షణ ఛత్రం కోసం ప్రయత్నిస్తున్న సౌదీకి, ఇరాన్‌తో భూసరిహద్దులు కలిగివున్న టర్కీ, పాకిస్థాన్‌ సైతం కలిసి రావడంతో తాజా కూటమి ఊపిరి పోసుకుంది.

ఇస్లామిక్‌ నాటో కూటమిగా జట్టు కట్టిన మూడు సున్నీ దేశాల్లో దేని ప్రత్యేకత దానిదే. ఆర్థికంగాను, భౌగోళిక రాజకీయాల్లోనూ కీలకంగా ఉన్న సౌదీ అరేబియా దీనికి ప్రాణాధారం. ఆధునిక సైనిక సాంకేతిక పరిజ్ఞానంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన దేశం టర్కీ. ప్రపంచంలోనే భారీ సైన్యం కలిగివున్న దేశాల్లో పాకిస్థాన్‌ ఒకటి. పైపెచ్చు, అణ్వాయుధం కలిగివున్న ఏకైక ముస్లిం దేశమది. సౌదీతో పాక్‌ ఆర్థిక అనుబంధం సరే, ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఆ దేశానికి టర్కీ భారీయెత్తున సైనిక సహాయ సహకారాలూ అందజేసింది. ఈ సైనిక కూటమిలో తాజాగా ఈజిప్టు కూడా చేరబోతోంది. ఖతార్‌, కువైట్‌, జోర్డాన్‌, అజర్‌బైజాన్‌, సిరియా సైతం క్యూ కట్టాయి. అన్నీ కలిస్తే, అంతా సవ్యంగా సాగితే– భౌగోళిక రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పగల గొప్ప శక్తిగా ఈ కూటమి ఆవిర్భవించే అవకాశాలు లేకపోలేదు. పరస్పర వైరుధ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ, వీటన్నింటినీ కలిపివుంచే దారం, ఆధారం– ఇస్లాం!


షియా ఇరాన్‌ దూకుడుకు ముకుతాడు వెయ్యడమే ప్రధాన లక్ష్యంగా ఈ సున్నీ ఇస్లామిక్‌ కూటమి ఏర్పాటైనట్లు కనిపిస్తున్నా, భారత్‌పై దీని ప్రభావాన్ని తక్కువగా అంచనా వెయ్యలేం. భారత్‌ తన ఇంధన భద్రత కోసం చాలా వరకు పశ్చిమాసియా పైనే ఆధారపడుతోంది. దేశం దాదాపు 90 శాతం ముడి చమురు దిగుమతి చేసుకొంటుంటే– అందులో పశ్చిమాసియా వాటా సగానికి పైనే. పైగా, ఆ దేశాల్లో కోటి మందికి పైగా ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. ప్రవాసీలు ఇక్కడి తమ కుటుంబాలకు పంపే రెమిటెన్స్‌లో 40 శాతం దాకా అక్కడి నుంచే వస్తోంది. ఈ స్థితిగతుల్లో ఇప్పుడు కూటమి కట్టిన దేశాల్లో సౌదీతో భారత్‌కు పెద్దగా సమస్యల్లేకపోయినప్పటికీ, టర్కీ అండతో పాక్‌ మరింత రెచ్చిపోయే ప్రమాదం మాత్రం ఉంది. భారత్‌–పాక్‌ మధ్య మరో యుద్ధం సంభవించిన పక్షంలో రక్షణ సంధిలోని మిగతా రెండు దేశాలు ప్రత్యక్షంగా కలుగజేసుకొంటాయా అన్న దానిమీద స్పష్టత లేకున్నా, ఆర్థిక, సైనిక సాయానికి తలుపులైతే తెరిచే ఉన్నాయి. ఈ దృష్ట్యా, పాక్‌ కట్టడికి కట్టుదిట్టాలతో పాటు పశ్చిమాసియాతో సత్సంబంధాలకు విఘాతం కలుగని రీతిలో దౌత్యనీతిని భారత్‌ అనుసరించాల్సి ఉంటుంది.

- పి. దత్తారాం ఖత్రీ

సీనియర్‌ జర్నలిస్టు

Updated Date - Aug 22 , 2026 | 12:19 AM