Share News

ఉపాధి కూలీలకు ‘ఫొటో’ల చిక్కులు!

ABN , Publish Date - Mar 07 , 2026 | 01:04 AM

కేంద్ర ప్రభుత్వం 2023 జనవరి 1 నుంచి ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కింద పనిచేసే కూలీలకు ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్’ (NMMS) యాప్ ద్వారా హాజరును తప్పనిసరి చేసింది.

ఉపాధి కూలీలకు ‘ఫొటో’ల చిక్కులు!

కేంద్ర ప్రభుత్వం 2023 జనవరి 1 నుంచి ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కింద పనిచేసే కూలీలకు ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్’ (NMMS) యాప్ ద్వారా హాజరును తప్పనిసరి చేసింది. నాటి నుంచీ ఈ విధానం వల్ల కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు పూటలా ఫొటోలు అప్‌లోడ్‌ చేయాల్సి వస్తోంది. ‘పని ప్రారంభంలో ఒకసారి, పని ముగిశాక రెండోసారి జియోట్యాగ్డ్, టైమ్‌స్టాంప్డ్ ఫొటోలను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి’ అని కేంద్రం నిబంధనలు పెట్టింది. ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్స్‌ సరిగ్గా ఉండవు. సర్వర్లు మొరాయిస్తాయి. దీంతో ఉపాధి హామీ సిబ్బంది, కూలీలకు ఈ ఫొటో అప్‌లోడింగ్‌ ప్రక్రియతో తిప్పలు తప్పడం లేదు. ఇలాంటి సాంకేతిక కారణాల వల్ల కేవలం ఒక పూట మాత్రమే ఫొటో అప్‌లోడ్ అయితే, ఆ రోజుకు ఉపాధి కూలీలు తమ సగం వేతనం కోల్పోవాల్సిందే! రెండు పూటలా అప్‌లోడ్‌ కాకపోతే ఆ రోజు వేతనాన్ని వారు కోల్పోయినట్లే.


గత ఏడాది జూలైలో కేంద్రం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, అప్‌లోడ్ చేసిన ప్రతి ఫొటోనూ గ్రామ పంచాయతీ స్థాయిలో 100 శాతం పరిశీలన చేయాల్సిందే. కూలీల హాజరును పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం ఈ డిజిటల్ విధానాన్ని తెచ్చినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల పేద కూలీలు తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. దీంతో ఈ ఉపాధి చట్టంలో కేంద్రం తీసుకొచ్చిన మార్పులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే, కేంద్రం ప్రకటించిన కనీస వేతనాల కంటే ఇంకా తక్కువ వేతనాలే ఉపాధి కూలీకు అందుతున్నాయి. వీరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ మోడ్‌లో ఫొటోలు తీసి, సిగ్నల్ ఉన్న చోట అప్‌లోడ్ చేసే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలి. వీలైతే, ఇలా రెండు సార్లు ఫొటోలు తీసే కార్యక్రమాన్ని తక్షణమే రద్దు చేయాలని, కనీస వేతనాలు పక్కాగా అమలు చేయాలని ఉపాధి హామీ కూలీలు ప్రభుత్వాలను కోరుతున్నారు.

– వూకె రామకృష్ణ దొర

Updated Date - Mar 07 , 2026 | 01:08 AM