Share News

మహాసంద్రం

ABN , Publish Date - Mar 16 , 2026 | 01:47 AM

ఉదయాన్ని ముక్కున కరచుకొని సైబీరియన్ పక్షులు కొన్ని సమూహాలు సమూహాలుగా ఇక్కడి పిట్టగూళ్ళలో వాలి తెలియని తపమేదో...

మహాసంద్రం

ఉదయాన్ని ముక్కున కరచుకొని

సైబీరియన్ పక్షులు కొన్ని

సమూహాలు సమూహాలుగా

ఇక్కడి పిట్టగూళ్ళలో వాలి

తెలియని తపమేదో

ఆచరిస్తాయి

సూర్యుడి రాక కంటే ముందే

ఇక్కడ రంగుల హరివిల్లులు

తూర్పు పడమరల మధ్య

లోలకాలై కదులుతుంటాయి

ఈ తీరం ఏ మంత్రశక్తులూ లేని

దేవతలు నడయాడే

మరో ప్రపంచం

కాలధర్మం తెలియని కోకిలలు

కాకిగూళ్ళపై వాలి

రెక్కలు మూసుకుంటాయి

చిగురు మోముల అభిసారికలు

అబద్ధాలను పొట్లం కట్టుకొని

సత్యంతో పాటు

కొన్ని జ్ఞాపకాలను

కొన్ని వెచ్చని అనుభూతులను

ఊహల కొక్కానికి వేలాడదీసిన

కొత్తలోకం వైపు అడుగులేస్తాయి

పల్లె కొలనులో విరిసిన

కలువరేకులు కొన్ని

ఇక్కడి పూటకూళ్ళ ఇండ్లల్ల

గాలిమేడలు కడుతూ

మృగతృష్ణల దిక్కు

పరుగులు పెడతాయి

ఒక కథను వ్యధను

మోసుకొని ఇక్కడ వాలే

ప్రతి వలస పక్షి రెక్కల మీద

నిత్యం ఆకలి శత్రువుతో

యుద్ధం చేస్తున్న జాడలు

మధ్యతరగతి మజ్బూరీలు

కొత్తలు నిండిన కీసలు

ఇనుప గజ్జెల పాదాలు

చేతులకు కాళ్ళను అతికిన

చక్రదేహాలు సమిష్టిగా

ఐదు రూపాయిల

అన్నం డబ్బ కాడ

రెండు పూటల ఆకలై

ఎదురు చూస్తాయి

గాలితెరలపై అలరించాలని

ఊహల్లో తేలే కీచురాళ్ళు

సారథి వాకిలికి

తారల తోరణాలు కడతాయి

కళ్ళను చూసి చదవగలిగితే చాలు

ప్రతి కంటిలో సుడి తిరుగుతున్న నది

రెప్పల తీరం దాటుతూ

ఏదో ఎలిజీని చెబుతుంది

బతుకీడ్చడానికి

ఇక్కడ మనిషి చేసే పోరాటం

సహస్ర బాహువులతో

సహస్ర శీర్షాలతో

విశ్వరూపం ప్రదర్శిస్తుంది

సాఫ్ట్‌వేర్ పరుగులు

వేడివేడి దోసెల పెంకలు

నోరూరించే పండ్ల రసాలు

ప్రాణాలు లేచివచ్చే

పది రూపాయిల ఇరాని ఛాయ్‌లు

పదికి ఐదు పానీపూరీలు

ఫిలింనగర్ పిలుపుల

పుష్పక విమానాలు

తెగిన చెప్పులతో కరచాలనం చేసి

జీవితాన్ని కుట్టుకునే

చెట్టుకింది అభాగ్యుడు

చేతులు చాచే మూడుకాళ్ళ

సంధ్యారాగాలు

వందకి ఐదుకిలోల

ఉల్లిగడ్డల బండ్లు

అఫిడవిట్ల అడ్వకేట్‌లు

అదునుకై ఎదురు చూసే

కన్యాశుల్కం గిరీశాలు...

నిమిషానికోసారి

రెప్పవాల్చే రుద్రనేత్రం

నలువైపులా మోహరించిన

చతురంగ బలాలు

అర్ధరథులు అతిరథులు

మహారథులతో చౌరస్తా

ఓ నిత్య రణక్షేత్రం...

ఒకటా.. రెండా...

ఎగసిపడే సమస్త

చైతన్య వీచికలను

గర్భీకరించుకున్న

తల్లిఒడి...

వేనవేల బతుకు ప్రవాహాలకు

ఊపిరిపోసే

మహాసంద్రమే...

మైత్రీవనం...

(అమీర్ పేట్ మైత్రీవనం చౌరస్తా కాడ కనిపించే మనుషుల కోసం)

అంకం మనోహర్

94925 03339

Updated Date - Mar 16 , 2026 | 01:47 AM