Share News

గాడ్గిల్‌, బెటీల్‌: జ్ఞాన స్రష్టలు, భావిద్రష్టలు

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:55 AM

మతపరమైన లేదా ఆధ్యాత్మిక ఉపదేశాలు కోరుకునేవారికి ఒక గురువు అవసరమవుతాడు. ఆ గురువు బోధిస్తాడు. అంతేకాదు తాను సరైనదని భావించిన ధర్మపథంలో నడవాలని కూడా శిష్యులను ఆదేశిస్తాడు.

గాడ్గిల్‌, బెటీల్‌: జ్ఞాన స్రష్టలు, భావిద్రష్టలు

మతపరమైన లేదా ఆధ్యాత్మిక ఉపదేశాలు కోరుకునేవారికి ఒక గురువు అవసరమవుతాడు. ఆ గురువు బోధిస్తాడు. అంతేకాదు తాను సరైనదని భావించిన ధర్మపథంలో నడవాలని కూడా శిష్యులను ఆదేశిస్తాడు. తన ఉపదేశాలను ప్రశ్నించకుండా అనుసరించాలనేది ఆ ఆధ్యాత్మిక గురువు అభిమతంగా ఉంటుంది. అయితే విద్వజ్ఞులమవ్వాలని అభిలషించేవారు గురువు మార్గదర్శకత్వాన్ని కోరుకోవడం వివేకరాహిత్యమే అవుతుంది. విమర్శనాత్మక విచారణ, మౌలిక పరిశోధనకు నిర్దిష్ట మానసిక స్వాతంత్ర్యం తప్పనిసరి. ఇతరుల ఆలోచనలను, వారెంత గొప్పవారైనప్పటికీ నిరాలోచనగా స్వీకరించకుండా తన సొంత మేధా ఆసక్తులకు దోహదం చేసే లేదా అవరోధమయ్యే సిద్ధాంతాలు, పద్ధతులను అనుసరించాలి లేదా వదిలివేయాలి. విచారకరమైన విషయమేమిటంటే మన దేశంలో ఆధ్యాత్మిక శోధన, విద్వత్‌ అన్వేషణ మధ్య ఉన్న ఈ ప్రధాన వ్యత్యాసం చాలావరకు విస్మరణకు గురవుతోంది. మన విద్యా జగత్తులో భూస్వామ్య మనస్తత్వం పరిపూర్ణంగా విలసిల్లుతోంది. పెత్తందారీ మేధా సంస్కృతి జ్ఞాన సృష్టిని నియంత్రిస్తోంది. వయో ఆధిక్యులు, ఉన్నత హోదాలలో ఉన్నవారు గురువులుగా వ్యవహరిస్తూ శిష్యుల నుంచి మినహాయింపులు లేని విధేయతను, అపరిమిత గౌరవాదరాలను డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఆధిపత్య మేధా సంస్కృతి మన విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలలో సర్వవ్యాపకంగా ఉన్నది. నిచ్చెనమెట్ల సామాజిక వ్యవస్థను మార్క్సిజం వ్యతిరేకిస్తుంది. అయితే కోల్‌కతాలోని మార్క్సిస్టు ప్రొఫెసర్లు తమ జూనియర్‌ సహచరుల పట్ల ఆ సామాజిక అంతరాలను వారణాసిలో హిందూ మితవాద దృక్పథమున్న ఆచార్యుల రీతిలోనే పాటిస్తున్నారు!


ఇటీవల మన మధ్య నుంచి ఇద్దరు జ్ఞానమూర్తుల శాశ్వత నిష్క్రమణ మన మేధాసంస్కృతిపై ఈ నిశిత వ్యాఖ్యలకు నన్ను పురిగొల్పింది. నా యవ్వనంలో నన్ను అమితంగా ప్రభావితం చేసిన ఆ మేధా సమున్నతులలో ఒకరు పర్యావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌, మరొకరు సామాజిక శాస్త్రవేత్త ఆంద్రే బెటీల్‌. గాడ్గిల్‌ గత నెల 7న ఎనభై మూడేళ్ల వయస్సులోను, బెటీల్‌ ఈ నెల 3న తొంభై ఒకటవ ఏట మరణించారు. 1982లో గాడ్గిల్‌ను నేను మొదటిసారి కలుసుకున్నప్పుడు నా వయసు 24 ఏళ్లు కాగా ఆయన 40 వసంతాల యువకుడు. బెటీల్‌తో 1988లో నాకు పరిచయమైనప్పుడు నేను 30వ పడిలోకి ప్రవేశించగా ఆయన తన నడిమి యాభైలలో ఉన్నారు. వయోభేదం ఎంతగా ఉన్నప్పటికీ ఆ ఇరువురితో తొలిసారి సంభాషించిన క్షణానే మా మధ్య స్నేహభావం అంకురించి, కుసుమించి తుదివరకూ దినదినమూ ప్రవర్ధమానమయింది. అప్పుడప్పుడూ మా కుటుంబాల గురించి మాట్లాడుకున్నప్పటికీ ఆ ఇరువురితో నా సంభాషణలు, సమాలోచనలు చాలావరకు సమాజం, రాజకీయాలు, చరిత్ర, పర్యావరణం, భారతదేశం, ప్రపంచం గురించి జరిగేవి. ఇరువురి జీవిత ప్రస్థానాలు భిన్నమైనవి. గాడ్గిల్‌ మరాఠీ భాషీయుడు. పూణేలో పెరిగారు. బెటీల్‌ తండ్రి ఫ్రెంచ్‌ జాతీయుడు, తల్లి బెంగాలీ. చంద్రనాగోర్‌లో పుట్టి పెరిగిన బెటీల్‌ విద్యాభ్యాసం చాలావరకు కలకత్తాలో జరిగింది. విద్యాలయాల్లో ఆంగ్లంలోనూ, ఆటపాటల సందర్భాలలో స్నేహితులతో బెంగాలీలోనూ సంభాషిస్తుండేవారు. బెటీల్‌ తన డాక్టోరల్‌ డిగ్రీ భారత్‌లోనే తీసుకోగా, గాడ్గిల్‌ అమెరికాలో పీహెచ్‌డీ సముపార్జించారు. గాడ్గిల్‌ వృత్తి జీవితం చాలావరకు బెంగళూరులో, బెటీల్‌ బోధన, పరిశోధన వ్యాపకాలు ఢిల్లీలో జరిగాయి. గాడ్గిల్‌, బెటీల్‌ ఎప్పుడూ కలుసుకోలేదు.


అయితే తమ పరస్పర స్నేహితుడు అయిన ఈ వ్యాసకర్త ద్వారా సదా ఒకరి విషయాలు మరొకరు తెలుసుకుంటూ ఉండేవారు. గాడ్గిల్‌, బెటీల్‌ జీవిత ప్రస్థానాలు భిన్నమైనవని అన్నానా? కావచ్చు కానీ ఇరువురి మధ్య ఒక సమున్నత ఏకత్వం ఉన్నది. వారి మేధా జీవితాలను చూడండి. అద్భుతమైన సారూప్యతలు కనిపిస్తాయి. ఇరువురి చింతనా ధోరణి, మేధా జీవితాచరణలలో పది గుణాత్మక విశిష్టతలు ప్రస్ఫుటమవుతాయి. అవి నన్ను ప్రభావితం చేశాయి. మేధా జీవితాలను గౌరవించే వారెవరికైనా అవి స్ఫూర్తిదాయకమైనవే, సందేహం లేదు. వాటిని విపులీకరిస్తాను:


ఒకటి– గాడ్గిల్‌, బెటీల్‌ ఇరువురూ తమ దృక్పథంలో నికార్సయిన ఇంటర్‌–డిసిప్లినరీ విద్వజ్ఞులు (బహుళ విద్యా విభాగాల సిద్ధాంతాలు, పద్ధతులు అంతర్దృష్టులను సమగ్రపరిచి, ఒకే విద్యా విభాగం నుంచి అర్థం చేసుకోలేని సంక్లిష్ట సమస్యలను విశ్లేషించే ప్రాజ్ఞులు). చరిత్రకారులు, ఆర్థికవేత్తలు, న్యాయశాస్త్ర కోవిదులను తన పరిశోధనలలో భాగస్వాములను చేసుకున్న సామాజిక శాస్త్రవేత్త బెటీల్‌. మానవ శాస్త్రవేత్తలు, చరిత్రకారులతో సహకార పరిశోధనలు నిర్వహించిన పర్యావరణవేత్త గాడ్గిల్‌; రెండు– తమ మేధా కృషిలో ఇరువురూ సిద్ధాంతం, అనుభావిక పరిశోధనలను సమన్వయపరిచినవారు. మానవ జాతుల అధ్యయనవేత్తగా శిక్షణ పొందిన బెటీల్‌ తులనాత్మక సామాజిక శాస్త్రవేత్తగా పరిణమించగా, పర్యావరణం పట్ల సైద్ధాంతిక దృక్పథంతో విద్వత్‌ జీవితాన్ని ప్రారంభించిన ప్రాకృతిక ప్రపంచంతో వైవిధ్య మానవ పరస్పర చర్యల ప్రభావాలను పరిశోధించేందుకు విస్తృతంగా క్షేత్ర అధ్యయనాలు నిర్వహించారు గాడ్గిల్‌; మూడు– ఇరువురూ తమ బోధనా విధులను నిబద్ధతతో నిర్వహించినవారు. అంతేకాదు సంస్థా నిర్మాణం పట్ల అంకితభావం చూపినవారు. బెటీల్‌ అధ్యాపక జీవితం ఢిల్లీ విశ్వవిద్యాలయం, ముఖ్యంగా సామాజికశాస్త్ర విభాగంతో పూర్తిగా ముడివడి ఉన్నది. గాడ్గిల్‌కు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, ముఖ్యంగా ఆ ప్రతిష్ఠాత్మక సంస్థలోని సెంటర్‌ ఫర్‌ ఎకోలాజికల్‌ సైన్సెస్‌తో భావోద్వేగ అనుబంధం ఉన్నది; నాలుగు– తమ విద్వత్‌ కృషిని ప్రజలకు వివరించడంలో ఇరువురూ ప్రభావశీల ఫలితాలను సాధించారు.


అయితే తమను తాము కార్యకర్తగా గానీ లేదా క్రియాశీలి–మేధావిగా గానీ ఇరువురూ భావించుకోలేదు. తమ విద్వత్‌ కృషికి సంబంధించిన అంశాలలో మాత్రమే తమ ప్రజా బాధ్యతలను పరిమితం చేశారు; అయిదు– ఇరువురూ తమ కన్న ఊరు, సొంత రాష్ట్రం వెలుపల విద్యాభ్యాసం, పరిశోధనలు చేయడం, వృత్తి జీవితం గడపడం ద్వారా తమ మేధా ప్రపంచాన్ని విశాలం చేసుకున్నారు. పరిపూర్ణమైన విద్వత్‌ కృషి చేశారు. కలకత్తాలో కాకుండా ఢిల్లీలో బెటీల్‌ బోధన, పరిశోధనలు జరిగాయి. గాడ్గిల్‌ వృత్తి జీవితమంతా పూణేలో కాకుండా బెంగళూరులో జరిగింది. సొంత రాష్ట్రాలకే పరిమితమైన విద్వజ్ఞుల కంటే విశాల దృక్పథంతో సమున్నతమైన విద్యా కృషి చేశారు. బెటీల్‌ తన క్షేత్ర పరిశోధనలను తమిళనాడులో నిర్వహించగా, కర్ణాటక, కేరళలో గాడ్గిల్‌ పరిశోధనలు జరిగాయి. అయినప్పటికీ ఇరువురూ తమ సొంత ప్రదేశాలు, వాటి సంస్కృతికి దూరం కాలేదు;


ఆరు– భారత్‌ వెలుపల విశాల ప్రపంచం పట్ల ఇరువురూ విశేష శ్రద్ధాసక్తులు చూపేవారు. అన్ని దేశాల విద్వజ్ఞులతో కలిసి తమ మేధా వ్యాసంగాలను కొనసాగించేవారు తమ మేధా ఆసక్తులలో ఇరువురూ నిక్కమైన భారతీయులు, నిజమైన అంతర్జాతీయవాదులు; ఏడు– తమ మనో వైఖరులు, ఆలోచనా రీతులలో ఎటువంటి సంకుచితత్వం ఏ కోశానా లేకపోయినా ఇరువురూ భారత్‌లోనే నివసిస్తూ, వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూ జాతి మేధా జీవితాన్ని సమున్నతపరిచారు. గాడ్గిల్‌ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో అధ్యాపక ఉద్యోగాన్ని వదులుకుని స్వదేశానికి వచ్చేశారు. కేంబ్రిడ్జ్‌, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలు ఆహ్వానించినప్పటికీ స్వదేశంలోని ఢిల్లీ విశ్వవిద్యాలయానికే అంకితమైన ఆచార్యోత్తముడు బెటీల్‌; ఎనిమిది– ఇరువురూ ఉత్తమ దేశభక్తులు. భారతదేశం పట్ల తమ ప్రేమాభిమానాలను మనసా వాచా కర్మణా వ్యక్తపరిచారు. కులం, వర్గం, జెండర్, మతపరమైన అంతరాలకు అతీతంగా తమ విద్యార్థులు, సహచరులను సమభావంతో సమాదరించారు. తద్వారా భారతీయ మేధా జీవితానికి ఎనలేని తోడ్పాటునందించారు; తొమ్మిది– ఇరువురి దేశభక్తిలోనూ గుడ్డి ఆరాధన లేదు. ఆలోచనారహిత భక్తి లేదు. ‘సహ పౌరులకు, ఇరుగు పొరుగు దేశాల పౌరులకు వ్యతిరేకంగా తమ దేశం, ప్రభుత్వం పాల్పడుతున్న నేరాలు, అమానుషాలకు సిగ్గుపడలేని వ్యక్తులు నిజమైన జాతీయవాదులు కారు’ అన్న ఆంగ్లో– ఐరిష్‌ చరిత్రకారుడు బెనెడిక్ట్‌ అండర్సన్‌ (1936–2015) మాటలతో గాడ్గిల్‌, బెటీల్‌ ఇరువురూ పూర్తిగా ఏకీభవిస్తారు. భారతీయ సమాజంలో విస్తృతంగా ఉన్న అసమానతలకు వారు సిగ్గుపడేవారు, దుఃఖపడేవారు. ఆ అసమానతల అమానుషత్వాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లి వారిలో మానవతా భావాలను ప్రదీప్తపరిచేందుకు ప్రయత్నించేవారు; పది– చాలామంది సహచర ప్రొఫెసర్ల వలే గాడ్గిల్‌, బెటీల్‌ ఎప్పుడూ గురువులుగా వెలుగొందాలని ఆకాంక్షించలేదు.


తమ విద్యారంగాలలో అనుభవజ్ఞులైన వృద్ధ పండితులు స్వీయ సంచిత జ్ఞానాన్ని యువ పరిశోధకులకు సమకూర్చడం ద్వారా జ్ఞానసృష్టికి తోడ్పడుతూ ఆ యువ విద్వజ్ఞుల జిజ్ఞాస, భావసాహస ప్రవృత్తి నుంచి స్ఫూర్తి పొందుతారని గాడ్గిల్‌, బెటీల్‌ విశ్వసించేవారు. రాజకీయ, మేధా సంబంధ వ్యవహారాలలో ఇరువురూ ఉదారవాదులే. ఏ విషయంలోనూ శుష్క వాదనలు చేసేవారు కాదు. విశాల దృక్పథంతో భారతదేశాన్నీ, విశాల ప్రపంచాన్నీ అర్థం చేసుకోవడానికి ప్రాధాన్యమిచ్చేవారు.

గురుకులం, శాఖ, పార్టీ పాఠశాలల్లో కొత్తవారికి బోధిస్తారు, ఉపదేశిస్తారు. ఎలా ఆలోచించాలో, ప్రవర్తించాలో ఆదేశిస్తారు, సిద్ధాంతాలను మనసుకెక్కిస్తారు. అయితే, పాండిత్య పరిశోధన అందుకు భిన్నమైనది. భిన్న వ్యక్తులు, భిన్న విద్యా విభాగాలు, భిన్న సైద్ధాంతిక దృక్పథాలు, పరిశోధనా శైలులు, సామాజిక నేపథ్యాలు, జాతీయ అనుబంధాలు, మరీ ముఖ్యంగా భిన్నతరాల మధ్య పరస్పర అధ్యయనం, సంభాషణలు, సమాలోచనలు, భావాల మార్పిడి ద్వారా విద్వత్‌ వ్యాసంగం వికసిస్తుంది, పరిపూర్ణమవుతుంది. ఈ విశిష్ట మేధా సాధన సత్యాలను నేను గాడ్గిల్‌, బెటీల్‌ నుంచి నేర్చుకున్నాను. ఇటీవలి సంవత్సరాలలో యువ మేధావులు, రచయితలతో తరచూ మాటామంతీ ద్వారా ఆ సత్యాలు నాకు పదే పదే మరింతగా విశదమయ్యాయి. మార్గదర్శకత్వం కోసం వచ్చిన యువ పరిశోధకులు నాకు చాలా మంచి విషయాలు నేర్పారు.

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Feb 21 , 2026 | 12:57 AM