Share News

బడబాగ్నిలో ‍బతుకు‘బండ’లు!

ABN , Publish Date - Mar 17 , 2026 | 02:47 AM

భారత గణతంత్ర రాజ్యం ఆవిర్భవించిన అయిదు సంవత్సరాలకు రెండు ఆధునిక ‍ఉపకరణాలు భారతీయ గృహజీవనంలోకి ప్రవేశించాయి. అవి, ఒకటి ప్రెషర్‌ కుక్కర్‌, మరొకటి ‍ఎల్పీజీ సిలిండర్‌. వీటి మూలాలు...

బడబాగ్నిలో ‍బతుకు‘బండ’లు!

భారత గణతంత్ర రాజ్యం ఆవిర్భవించిన అయిదు సంవత్సరాలకు రెండు ఆధునిక ‍ఉపకరణాలు భారతీయ గృహజీవనంలోకి ప్రవేశించాయి. అవి, ఒకటి ప్రెషర్‌ కుక్కర్‌, మరొకటి ‍ఎల్పీజీ సిలిండర్‌. వీటి మూలాలు విదేశాలలో ‍ఉన్నప్పటికీ, ఆధునిక భారతీయ ‍కుటుంబంలో ఒక అనివార్యమైన భాగంగా, ఒక ఆకాంక్షాత్మక జీవన శైలికి ఆలంబనగా ఉన్నాయి. వంటగదిలో ఒకటి ‍లేదా రెండు ప్రెషర్‌ కుక్కర్‌లు, ఎల్పీజీ సిలిండర్లు ఉండడమనేది నేటి భారతీయ కుటుంబ ప్రతిష్ఠ, శ్రేయస్సు, సామాజిక ఆకాంక్షలకు ఒక తార్కాణం. గత శతాబ్ది సినిమాలలో ‍హీరో లేదా హీరోయిన్‌ ‍కుటుంబ పేదరికాన్ని సూచించేందుకు ‍కట్టెల ‍పొయ్యిపై ‍వంట చేస్తూ, ‍చుట్టుముట్టిన ‍పొగతో ఊపిరాడక ‍సతమతమవుతున్న ఒక మహిళను చూపించడం సర్వసాధారణంగా ‍ఉండేది.

ఎల్పీజీ సిలిండర్‌కు ఉన్న రాజకీయ ప్రాధాన్యమూ తక్కువేమీ కాదు. ‍గ్రామీణ ‍ప్రాంతాల పేద కుటుంబాలకు ‍పరిశుభ్రమైన ‍వంట ‍ఇంధనాన్ని సమకూర్చేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన ‍(పీఎంయువై– దీనిని 2016లో ‍ప్రవేశపెట్టారు) ‍ఆ రాజకీయ ప్రాధాన్యానికి అద్దం పడుతుంది. ప్రధానమంత్రి నుంచి ‍అమితానందంతో, ఎనలేని కృతజ్ఞతా భావంతో ఎల్పీజీ సిలిండర్లు అందుకుంటున్న గ్రామీణ మహిళలను చూపిస్తున్న వాణిజ్య ప్రకటనలు ‍బీజేపీ ‍ప్రచార వ్యూహాలలో అగ్రస్థానంలో ఉండటం రెడ్‌ ‍సిలిండర్ల రాజకీయ ప్రాధాన్యాన్ని మరింతగా ‍విశదం చేస్తోంది. అయితే సగటు భారతీయ కుటుంబ ‍శ్రేయస్సుకు ‍దోహదం చేస్తోన్న ఎల్పీజీ ‍సిలిండర్ల సరఫరా ‍ఇప్పుడు ‍ప్రపంచ భౌగోళిక రాజకీయాల సుడిలో చిక్కుకుంది. ‍ఇరాన్‌కు వ్యతిరేకంగా ‍అమెరికా, ఇజ్రాయెల్‌ల యుద్ధం, పర్యవసానంగా హోర్ముజ్‌ ‍జలసంధిలో ‍నౌకల రాకపోకలపై ఇరాన్‌ ‍ఆంక్షలు ‍విధించడంతో, లక్షలాది సామాన్య కుటుంబాల వంటశాలలకూ ఆ యుద్ధతాకిడి చేరింది. ‍భారత్‌కు దిగుమతి అయ్యే ఎల్పీజీలో అత్యధిక ‍భాగం హోర్ముజ్‌ ‍జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ‍ఇరాన్‌ పాలకులు ‍భారత్‌ దిగుమతులకు ప్రత్యేక అనుమతినిచ్చినప్పటికీ సమస్య తీవ్రత సత్వరం తగ్గిపోయేది కాదు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ‍అమెరికా, యూరోపియన్‌ దేశాలలో పెట్రోలియం ఉత్పత్తుల ‍ధరల పెరుగుదల, వినియోగదారుల ఆగ్రహావేశాలకు ‍ప్రపంచ మీడియా తీవ్ర ‍ప్రాధాన్యం ఇస్తోంది. కానీ, అభివృద్ధి చెందుతున్న ‍దేశాలపై, మరీ ముఖ్యంగా ఆ దేశాలలోని పేదల ‍బతుకుదెరువుల పైన ‍పడుతున్న యుద్ధ విషమ ‍ప్రభావాల ‍గురించి ‍పట్టించుకోకపోవడం పూర్తిగా గర్హనీయం.


ఘన ఇంధనాలను– వంటచెరకు ‍వాటికొక ఉదాహరణ– ‍మండించడం వాయు ‍కాలుష్యానికి ‍దారితీస్తుంది, దీని ‍ప్రభావం ‍ప్రజల, ‍ముఖ్యంగా పేదల ఆరోగ్యంపై ‍తీవ్రంగా ఉంటుంది. వంట కార్యకలాపాలలో ఉపయోగించే ‍ఘన ‍ఇంధనాల ‍ప్రభావానికి సంబంధించి ‍నాలుగు పరస్పర ‍ప్రభావమున్న ‍అంశాలు ‍ఉన్నాయి. అవి: వర్గం, కులం, జెండర్‌, గ్రామీణ– పట్టణ ‍అంతరాలు. ‍ఈ ఇంధనాల ‍ఉపయోగం పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆర్థిక స్థితిగతులు ‍కాస్త మెరుగ్గా ఉన్న కుటుంబాలపై ‍కూడా ‍దీని ప్రభావం ఉన్నా, పేదలపై ఉన్నంతగా ఉండదు. ‍ఇందుకొక కారణం ‍జనాభా ‍సాంద్రత. ‍గృహ సముదాయాలు కిక్కిరిసి ఉన్న ప్రాతాలలో ‍పేదలు నివసిస్తుంటారు. ‍వారు ‍ఉండే ‍గృహాలు ‍ఇరుకుగా ఉంటాయి. పొయ్యి ‍నుంచి లేచే పొగ ఇల్లంతా ‍వ్యాపించడం పరిపాటి. నిర్దిష్ట ‍గృహంలోనివారే కాకుండా ‍ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఇతరులు కూడా ఆ కాలుష్యం బారిన పడతారు. ‍

లిక్విడ్‌ పెట్రోలియం ‍గ్యాస్‌ ‍తదితర ‍పరిశుభ్ర ఇంధనాలు అందుబాటులో ఉండడమనేది కులంపై ఆధారపడి ‍ఉన్నదని కూడా ప్రభుత్వ ‍గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండిటిలోనూ ‍ఎల్పీజీని ప్రధాన వంటగ్యాస్‌గా ఉపయోగించుకుంటున్న అగ్రకులాల కుటుంబాల శాతం, షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తరగతులకు చెందిన కుటుంబాల శాతం కంటే మూడు లేదా నాలుగు రెట్లు ‍అధికంగా ‍ఉన్నది. ‍ఆయా వర్గాల నివాసస్థలాలు ‍కూడా ఆ వ్యత్యాసానికి ‍కారణమవుతు న్నాయి. ‍గ్రామీణ ప్రాంతాలలో ‍సామాజికంగా ‍అట్టడుగువర్గాల వారు ‍సాధారణంగా ఊరికి దూరంగా ‍నివాసముంటారు. ‍ఆ ప్రదేశాలకు రవాణా సదుపాయాలు అంతగా ఉండవు. ‍ఎల్పీజీ సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నా, ‍వాటి రవాణాకు పలు సమస్యలు ‍ఎదురవుతున్నాయి. ఈ కారణంగా పట్టణ ప్రాంతాలలోని పేదల కంటే గ్రామీణ ప్రాంతాల పేదలు ఆధునిక ‍ఇంధనాలపై కాకుండా సంప్రదాయ ‍ఇంధనాలపైనే ఆధారపడడం తప్పసనిసరి అవుతోంది. వంటగ్యాస్‌ను నిరుపేదలకూ అందుబాటులోకి తీసుకురావడంలో ‍సరైన గుర్తింపు పొందలేకపోతున్న సంక్లిష్ట సమస్య ఇది. ‍

సంప్రదాయక ‍ఇంధనాల (వంట చెరకు, పిడకలు, పంట అవశేషాలు మొదలైనవి)తో వంట చేసుకునే కుటుంబాలలో పొగ కాలుష్యానికి బాధితులు అవుతున్నది ‍మహిళలు, బాలికలే. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల ‍కుటుంబాలలో ఒకే విధంగా ఉంటోంది. ‍ఆహారాన్ని తయారు చేసే ‍బాధ్యత పూర్తిగా మహిళలది కావడమే ఇందుకు కారణం. కాగా వంటకు ఏ ‍విధమైన ఇంధనాలను ఉపయోగించాలనే నిర్ణయం ‍తీసుకోవడం సాధారణంగా ‍పురుషుల బాధ్యతగా ‍ఉంటోంది. మన ‍సమాజంలో ‍సర్వ సాధారణంగా ఉన్న జెండర్‌ అసమానతల దృష్ట్యా కుటుంబ బడ్జెట్‌లో ‍మహిళా ఆరోగ్యానికి కేటాయింపులకు ‍సరైన ప్రాధాన్యం ‍లభించడం అరుదు. కుమార్తెలు ‍బాల్యం నుంచే ‍ఇంటి పనులు, ముఖ్యంగా ‍వంట పనుల్లో తల్లికి సహాయపడుతుంటారు. ఈ కారణంగా వారు ‍చిన్న వయసు నుంచే ‍వంటగదిలో ‍పొగ ‍కాలుష్యానికి గురవుతారు. వారిలో చాలామంది ‍జీవితాలు ఆ తరువాత కూడా అటువంటి పరిస్థితులలోనే కొనసాగుతాయి.


ఇలా అనారోగ్యం పాలయ్యే ‍అవకాశాలను తగ్గించడంతో పాటు వంటగ్యాస్‌ ‍సౌలభ్యం మహిళలకు మరో శ్రేయోదాయక ప్రయోజనాన్ని కూడా సమకూరుస్తోంది. ‍ఎల్పీజీ అందుబాటులో ఉండడం ‍వల్ల ‍వంటచెరకును సేకరించుకోవల్సిన ప్రయాస ‍లేకుండా పోవడంతో పాటు ‍వంట ‍త్వరితగతిన పూర్తవుతుంది, ఫలితంగా ‍మహిళలకు గణనీయమైన సమయం ఆదా ‍అవుతుంది. దీనివల్ల ‍గృహ సంబంధ ‍బాధ్యతల నిర్వహణలో గొడ్డు చాకిరీ, ‍చిరాకులు ‍తప్పిపోయి గృహిణులకు ఖాళీ ‍సమయం ‍లభ్యమవుతోంది. ఈ ‍తీరిక సమయాన్ని పఠనం, టీవీ వీక్షణం ‍మొదలైన ఉల్లాసాలకు ‍ఉపయోగించుకునే వెసులుబాటు వారికి కలుగుతోంది. ఉల్లాసంగా గడపడం ద్వారా తమ ఆరోగ్య పరిస్థితులను ‍మెరుగుపరుచుకోవడంతో పాటు ‍కుటుంబ పోషణకు అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు కూడా ఆ సమయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు. తత్ఫలితంగా ‍తమకొక ఆర్థిక స్వయం ప్రతిపత్తిని సాధించుకోగలుగుతున్నారు. దమ్మిడీ జీతం, భత్యం లేకుండా ‍అరక్షణం తీరిక లేకుండా పొద్దస్తమానం పనిచేస్తున్నా దొరకని ‍ఆర్థిక స్వాతంత్ర్యం వంటగ్యాస్‌ సదుపాయంతో సమకూరుతున్న సమయ వెసులుబాటుతో ‍లభిస్తుంది. ‍దీంతో ‍తమ జీవనరీతులను స్వయంగా తీర్చిదిద్దుకునే సౌలభ్యం ‍మహిళల ఆత్మగౌరవానికీ ‍విశేషంగా దోహదం చేస్తోంది. మహిళల జీవితాల్లోని ‍ఈ సంతోషకర పరిస్థితులకు ‍గ్యాస్‌ సిలిండర్‌ ‍నిర్ణయాత్మకంగా తోడ్పడుతుందని ఘంటాపథంగా చెప్పవచ్చు.

దేశీయ ఎల్పీజీ అవసరాలను తీర్చుకోవడానికి భారత్‌ పెద్ద ఎత్తున ‍దిగుమతులపై ఆధారపడుతోంది. ‍ప్రస్తుతం ‍పశ్చిమాసియాలో ‍ఉధృతమైన యుద్ధం ‍వల్ల దిగుమతులకు ఏర్పడిన ఆటంకంతో ‍ఎల్పీజీ ‍కొరత మున్నెన్నడూ లేని రీతిలో ఉంది. దేశవ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలపై ఇది ‍ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్‌ కొరతతో ‍రెస్టారెంట్లు, ‍హోటల్స్‌ ‍తమ ‍కార్యకలాపాలను ‍నిలిపివేయడం అనివార్యమైంది. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది ప్రజల జీవనోపాధులను దెబ్బతీస్తోంది. ‍ఇంతకంటే ఆందోళనకరమైన ‍విషయమేమిటంటే వంటగ్యాస్‌ అలభ్యతతో ‍పేదల శ్రేయస్సుకు వాటిల్లుతున్న ‍ముప్పు. ‍వ్యక్తిగత, కుటుంబ ‍సుఖ సంతోషాలకు ‍ప్రతీకగా ఎల్పీజీ సిలిండర్‌కు ‍జనప్రియ సంస్కృతి ‍మంగళహారతులు ‍పట్టడం సత్యదూరమేమీ కాదు. సంప్రదాయ కట్టెల ‍పొయ్యి నుంచి ‍ఎల్పీజీ స్టవ్‌ ప్రకాశవంతమైన నీలి జ్వాలకు మారడం ‍మెరుగైన జీవిత అవకాశాలకు కచ్చితంగా ముందడుగు ‍వేయడమే. ఇది ‍ఈ కాలపు సామాన్యుడి జీవిత చిర, స్థిర సత్యం. ఇప్పుడది ప్రమాదంలో పడటమే విషాదం.

సంజయ్‌ ‍శ్రీవాస్తవ

ప్రాచ్య, ఆఫ్రికన్‌ అధ్యయనాల సంస్థ–లండన్‌

(ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌)

ఇవి కూడా చదవండి..

ఆటో డ్రైవర్ అని తేలిగ్గా చూడకండి.. ఇతడు ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..

మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో జింక ఎక్కడ దాక్కుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 17 , 2026 | 02:47 AM