జోడీ కోసం.. వేలసార్లు పాట పాడి...!
ABN , Publish Date - Aug 30 , 2026 | 03:48 AM
ఒకప్పుడు హవాయిలోని కౌయై (Kauaʻi) అడవుల్లో ఒక అందమైన, అరుదైన పక్షి జీవించేది. దాని పేరు కౌయై ఓఓ (Kauaʻi ‘O‘o). నల్లని శరీరం పసుపు రంగు ఈకలతో ప్రత్యేకమైన రూపం దానిది.
ఒకప్పుడు హవాయిలోని కౌయై (Kauaʻi) అడవుల్లో ఒక అందమైన, అరుదైన పక్షి జీవించేది. దాని పేరు కౌయై ఓఓ (Kauaʻi ‘O‘o). నల్లని శరీరం పసుపు రంగు ఈకలతో ప్రత్యేకమైన రూపం దానిది. అంతకంటే ప్రత్యేకమైనది దాని మధురమైన స్వరం. ఒకప్పుడు ఈ పక్షుల పాటలతో కౌయై అడవులు మారుమోగేవి. ఆ పాటలు ఆ అడవికి సహజ సంగీతంలా ఉండేవి. ఇప్పుడు ఆ పక్షి లేదు.. అంతరించిపోయింది. కౌయై ఓఓ పక్షి అంతరించిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనుషుల కార్యకలాపాల వల్ల అడవులకు నష్టం జరిగి దాని సహజ ఆవాసాలు తగ్గిపోయాయి. ఆహారం, గూడు కట్టుకునే ప్రదేశాలు క్రమంగా తగ్గిపోయాయి. రెండో కారణం, మనుషులు హవాయికి తీసుకువచ్చిన ఎలుకలు, పిల్లులు వంటివి ఈ పక్షులను, వాటి గుడ్లను వేటాడాయి. మూడవది హవాయికి పరిచయం లేని దోమలు కొత్తవ్యాధులను వ్యాపింపజేశాయి. ముఖ్యంగా ఏవియన్ మలేరియా వంటివి స్థానిక పక్షుల సంఖ్యను తీవ్రంగా తగ్గించాయి. ఇవేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు అడవులను, ఆహార వనరులను దెబ్బతీశాయి. దీనితో పక్షుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. పక్షులకు వాటి సంఖ్య తగ్గిపోవడంతో జోడీని కనుగొనడం, సంతానం పెంచుకోవడం మరింత కష్టమైంది. చివరికి మిగిలింది... ఒకే ఒక్క పక్షి. 1981లో ఒక మగ కౌయై ఓఓను పరిశోధకులు గుర్తించారు. అలా... ఒకప్పుడు వందలాది పక్షుల పాటలతో నిండిన ఆ అడవిలో, చివరికి ఒక మగ కౌయై ఓఓ మాత్రమే మిగిలింది.
అది తన జోడీని ఆకర్షించేందుకు పాట పాడేది. ఒక్కసారి కాదు.. అనేక వేలసార్లు అడవిలోని చెట్ల మధ్య తన పాటను మళ్లీ మళ్లీ వినిపిస్తూ, మరో పక్షి స్పందన కోసం ఎదురుచూసేది. కానీ, అప్పటికే దాని జాతి అంతరించిపోయింది. ఆ విషయం ఈ ఒంటరి మగ పక్షికి తెలియదు. తన చుట్టూ వందలుగా వినిపించిన తన జాతి స్వరాలు ఇక ఎప్పటికీ వినిపించవని దానికి తెలియదు. తన కోసం ఎదురుచూసే ఆడ పక్షి ఇక ఈ భూమిమీద లేనేలేదని కూడా దానికి తెలియదు. అందుకే అది తనకు తెలిసిన ఒక్క పని నిరంతరం చేస్తూనే ఉండేది... పాడటం. తోడుకోసం... తన జీవిత భాగస్వామి కోసం... తన పాటకు స్పందించే మరో స్వరం కోసం... అలా పాడుతూనే ఉంది. రోజులు గడిచాయి, ఋతువులు మారాయి, ఆ పక్షి మాత్రం, ప్రతి రోజూ తన జాతికి చెందిన మరో పక్షి వస్తుందన్న ఆశతో అలా పాడుతూనే ఉండేది. ఒక పిలుపు... మరో పిలుపు కోసం. సమాధానం రాలేదు. ఎంత గట్టిగా పాడినా... ఎంతసేపు పాడినా... ఎంతకాలం ఎదురు చూసినా... సమాధానం మాత్రం నిశ్శబ్దమే. చివరికి మిగిలింది... తన జాతి అంతరించిపోయిందనే విషయం తెలియక, తన చివరి తోడుకోసం జీవితాంతం పాడిన ఆ ఒంటరి స్వరం మాత్రమే. కొన్ని పాటలకు శ్రోతలు ఉండరు. కొన్ని పిలుపులకు సమాధానాలు ఉండవు. మరి కొన్ని జీవుల కథ నిశ్శబ్దంలోనే ముగుస్తుంది.
1987లో ఆ పక్షి స్వరాన్ని పరిశోధకులు రికార్డు చేశారు. వారు ఆ రికార్డింగ్‌ను అడవిలో ప్లే చేస్తూ తిరిగారు. ఎక్కడైనా మరో కౌయై ఓఓ కనిపిస్తుందేమో, స్పందిస్తుందేమో అని ఆశగా అనేక సంవత్సరాల పాటు వెతికారు. కానీ, వారికి వినిపించిన ఆ పక్షిపాట వారి రికార్డర్‌లోనిదే. అడవి నుంచి మాత్రం సమాధానం రాలేదు. ఈ పిలుపునకు స్పందించే మరో కౌయై ఓఓ ఈ ప్రపంచంలో ఇక లేదన్న వాస్తవం క్రమక్రమంగా పరిశోధకులకు స్పష్టమైంది. ఆ పాటకు సమాధానం ఇక ఎప్పటికీ రాకపోవచ్చని వారికి అర్థమైంది. ఇక చివరకు మిగిలింది నిశ్శబ్దమే. ఒకప్పుడు వందలాది పక్షుల పాటలతో నిండిన ఆ అడవి... ఒకే ఒక్క పక్షి స్వరాన్ని విని... చివరికి మౌనంగా నిలిచిపోయింది. అలా మనిషి చేసిన తప్పుకు మరో జాతి బలి అయిపోంది.
ఈ పక్షి అంతరించిపోవడం వెనుక అడవుల నాశనం, ఆవాసాలు కోల్పోవడం, మనిషి ప్రవేశపెట్టిన జంతువులు, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అనేక కారణాలు ఉన్నాయి. కానీ వీటి వెనుక ఉన్న ఒక పెద్ద సమస్యను కూడా మనం మర్చిపోకూడదు. మనిషి తన అవసరాలకు మించి ప్రకృతిపై చూపిన ఒత్తిడి, జోక్యం. అడవులు మనకు కావాలి, భూమి కావాలి, వనరులు కావాలి. కానీ అదే అడవి జీవనాధారంగా ఉన్న ప్రాణులకు జీవించే హక్కు ఉందని మనం మర్చిపోయాం. ఈ రోజు కౌయై ఓఓ లేదు. దాని పాట ఇక వినిపించదు. మిగిలింది కేవలం పుస్తకాలలో దాని పేరు, పరిశోధనా పత్రాల్లో దాని గురించిన కొన్ని పంక్తులు. రికార్డింగ్‌లో దాని పాట మనిషి చేసిన తప్పులకు ఎన్నటికీ చెరగని గుర్తు. ఒక జాతి నాశనం కావడం అంటే, ప్రకృతి చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని శాశ్వతంగా చెరిపివేయడం. అంతరించిపోవడం ఒక్కసారిగా జరగదు. అడవి కొంచెం కొంచెంగా తరుగుతుంది.. జంతువులు క్రమక్రమంగా తగ్గుతాయి... వాటి గొంతులు ఒక్కొక్కటిగా నిశ్శబ్దమవుతాయి. చివరికి మిగిలేది– ‘ఒకప్పుడు ఇక్కడ ఒక పక్షి ఉండేది...’. ఒక జాతి అంతరించిపోయిన తర్వాత, మన దగ్గర ఎంత డబ్బు ఉండి ఏమి ప్రయోజనం? దాన్ని తిరిగి తీసుకురాలేం. ప్రకృతిని కోల్పోయిన తర్వాత సంపదతో దాన్ని కొనలేం. కౌయై ఓఓ వదిలి వెళ్లిన సందేశం ఒక్కటే– మనిషి దురాశకు హద్దు లేకపోతే.. ఒక రోజు ప్రకృతిలో చివరకు మిగిలేది నిశ్శబ్దమే..!
- డా. ఎం.గోవిందరాజ భాస్కర్
పర్యావరణ ప్రేమికుడు–తిరుపతి