అదే చిన్నచూపు..!
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:12 AM
లద్దాఖ్‌లో స్థానిక సంస్థలకు, హిల్ డెవలప్మెంట్ కౌన్సిళ్లకు ఎన్నికల ప్రకటన ఇప్పుడు అక్కడ వేడిరాజేసింది. నవంబర్ 21న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు, డిసెంబర్ 4న హిల్ కౌన్సిల్ ఎన్నికలు జరపబోతున్న తరుణంలో నిరసనలు రేగాయి.
లద్దాఖ్‌లో స్థానిక సంస్థలకు, హిల్ డెవలప్మెంట్ కౌన్సిళ్లకు ఎన్నికల ప్రకటన ఇప్పుడు అక్కడ వేడిరాజేసింది. నవంబర్ 21న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు, డిసెంబర్ 4న హిల్ కౌన్సిల్ ఎన్నికలు జరపబోతున్న తరుణంలో నిరసనలు రేగాయి. నామినేషన్ల గడువు 17న ముగుస్తుంది. డిసెంబరులో తీవ్ర చలి ఉంటున్నప్పుడు ఎన్నికలు నిర్వహించడం ఏమిటని లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యంతరం. వీటిని వాయిదా వేయాలని, రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ అమలుపై కేంద్రం తిరిగి చర్చలు ఆరంభించాలనీ నిరసనలు సాగుతున్నాయి. పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు ముందుగానే గృహనిర్బంధంలోకి నెట్టేశారు. లేహ్, కార్గిల్ పరిధిలో నిరసనలపై కూడా నిషేధం విధించారు. డిసెంబర్లో ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీల కంటే తక్కువకు పడిపోగానే దాదాపు నాలుగోవంతు ప్రజలు ఇతరప్రాంతాలకు వలసపోతారని ఈ సమయంలో ఎన్నికలు జరపడం వెనుక దురుద్దేశాలున్నాయని నిరసనకారుల వాదన. ప్రధానంగా రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ డిమాండ్లను తొక్కిపెట్టడానికే అధికారాల్లేని ఈ కౌన్సిల్ ఎన్నికలను ఇంత హడావుడిగా జరుపుతున్నారని సోనమ్ వాంగ్‌చుక్ విమర్శ.
గతంలో రెండే హిల్ కౌన్సిల్స్ ఉండేవి. 1995లో ఏర్పడిన లెహ్ కౌన్సిల్, 2003లో రూపొందిన కార్గిల్ కౌన్సిల్‌కు ఎన్నికలు జరిగేవి. లెహ్, కార్గిల్ జిల్లాలనుంచి అదనంగా మరికొన్ని జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రజలకు సేవలను మరింత చేరువచేసే పేరిట సృష్టించింది. 2019లో 370వ అధికరణని రద్దుచేసి, రాష్ట్రంగా ఉన్న జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన కేంద్ర ప్రభుత్వం, శాసనసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్‌ను వదిలేసింది. రెండవ అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న లద్దాఖ్‌లో జిల్లాల సంఖ్య పెంచడం అవసరమే. అయితే, జిల్లాల మధ్య విభజన రేఖలు గీయడంలో ముస్లింలను వేరుచేసే ప్రయత్నం జరిగిందన్నది ఓ విమర్శ. లద్దాఖ్ జనాభాలో నలభైఏడుశాతం ముస్లింలు, నలభైశాతం బౌద్ధులు. కార్గిల్‌లో ముస్లిం జనాభా అధికం. ఈ విభజన తరువాత, నలభైఏడుశాతం వారికి రెండు జిల్లాలు, నలభైశాతం ప్రజలకు మిగతా జిల్లాలు దక్కేట్టుగా కేంద్రపాలకులు చక్రం తిప్పారన్నది విమర్శ. లద్దాఖ్‌కు రాష్ట్రప్రతిపత్తి కోసం బౌద్ధులు, ముస్లింలు సంఘటితంగా సాగిస్తున్న పోరాటాన్ని బలహీనపరచే లక్ష్యం కూడా ఇందులో ఇమిడివున్నదని స్థానికుల అనుమానం. కార్గిల్‌ను కుదించి, లద్దాఖ్‌ను పెంచి బౌద్ధులు, ముస్లింల మధ్య దూరాన్ని హెచ్చించి, ఒక సమష్ఠి పోరాటాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్న అనుమానాల నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం ఎనిమిది హిల్‌కౌన్సిల్ ఎన్నికలకు కేంద్రం రంగం సిద్ధంచేసింది.
లద్దాఖ్‌ను శాసనసభతో కూడిన పూర్తిస్థాయి రాష్ట్రంగా మార్చి, ఇక్కడి సంస్కృతి, భూమి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సహజవనరులు ఇత్యాది రక్షణలకోసం ఆరోషెడ్యూల్‌లో చేర్చాలని లద్దాఖ్వాసులు చేస్తున్న సుదీర్ఘకాల ఉద్యమాన్ని చావుదెబ్బతీసేందుకే అత్యధికులు వలస పోయే కాలంలో ఎన్నికలకు సంకల్పించారని లద్దాఖ్ వాసుల విమర్శ. కొత్తగా ఏర్పడినవాటితో కలిపి అన్ని జిల్లాలకు కౌన్సిళ్లు ఏర్పడతాయని, డిసెంబర్లోనే ఎన్నికలు ముగిస్తే మార్చిలోగా బడ్జెట్ రూపొందించుకోవడానికి వాటికి మూడు నెలల సమయం దొరుకుతుందని చీఫ్ సెక్రటరీ అంటున్నారు. అయితే, ఈ ఎన్నికలను జరగనిస్తే ఇక కేంద్రం తమవైపు కన్నెత్తిచూడదని నిరసనకారుల భయం. కేవలం బడ్జెట్ పేరిట అత్యధికశాతం ప్రజలకు ఓటుహక్కు దూరం చేయడం సముచితం కాదు. ఓటర్లకు అనుకూలంగా లేని తేదీలు ఎంపికచేయడంలో ఏ కుట్రలూ లేవని అనుకున్నప్పటికీ, ఎన్నికలు జరిపినప్పటికీ పోలింగ్‌శాతం గణనీయంగా పడిపోతే అవి నిర్వహించి కూడా ప్రయోజనం ఉండదు, వాటికి విలువా గౌరవం మిగలవు.
పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ను గతంలో దేశద్రోహిగా ముద్రవేసి, ఆర్నెల్లపాటు జైల్లోకి నెట్టిన కేంద్రప్రభుత్వం ఆ తరువాత మారుమాట్లాడకుండా ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో పాలకులకు తెలుసు. జమ్మూకశ్మీర్ విభజన కారణంగా అప్పటివరకూ ఉన్న అన్ని రక్షణలు, హోదాలు, ప్రాతినిథ్యాలు కోల్పోయి తీవ్ర అభద్రతలోకి జారుకున్న లద్దాఖీయులను మరింత దూరం చేసుకోవడం మంచిది కాదు. స్థానిక సంస్థల ఎన్నికల బహిష్కరణకు అన్ని సంఘాలు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో వారి భయాలను తొలగించే ప్రయత్నం బలంగా సాగాలి. భవిష్యత్తులో చర్చలు కొనసాగుతాయన్న హామీ వారికి కేంద్ర నుంచి దక్కాలి.