కార్మిక పింఛన్ పెంచాలి
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:59 AM
కార్మిక పింఛను పెంపు కోసం వృద్ధ కార్మికులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న పింఛన్‌ను రూ.7,500కు పెంచాలని కోరుతూ ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా..
కార్మిక పింఛను పెంపు కోసం వృద్ధ కార్మికులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న పింఛన్‌ను రూ.7,500కు పెంచాలని కోరుతూ ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా, పలు ప్రసార మాధ్యమాల ద్వారా సమస్యను తెలియజేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు వృద్ధులు ఏ పనీ చేయలేక, చేతిలో తగినంత డబ్బులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. కుటుంబంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు చేతిలో డబ్బు లేకపోతే వారి జీవితం మరింత దుర్భరంగా మారుతుంది. చాలా మంది కార్మిక పింఛనుదారులు నిరుపేదలే. ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయల పింఛనుతో వారు ఎలా జీవించగలరు? వారికి కనీస గౌరవంతో జీవించే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కార్మిక సంఘాలు పింఛను పెంపు కోసం గతంలో న్యాయ పోరాటాలు కూడా చేశాయి. తక్కువ పింఛనుతో వృద్ధులు ఎలా జీవిస్తున్నారో అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు, న్యాయవ్యవస్థ కూడా సానుభూతితో పరిగణనలోకి తీసుకోవాలి. భవిష్యనిధి (ఈపీఎఫ్)లో కార్మికుల సొమ్ము ఉన్న నేపథ్యంలో పింఛను పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి, కార్మిక పింఛనుదారులకు న్యాయం చేయాలి.
– ముద్దంశెట్టి రమణమూర్తి