Share News

విద్యారంగ వైతాళికుడు

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:18 AM

తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా వనపర్తి సంస్థానంలో స్వాతంత్ర్యానికి ముందు, అనంతరం కూడా విద్యావ్యాప్తికి ఎంతగానో కృషి చేసిన విద్యావేత్త కోటంరాజు వెంకటేశ్వరరావు.

విద్యారంగ వైతాళికుడు

తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా వనపర్తి సంస్థానంలో స్వాతంత్ర్యానికి ముందు, అనంతరం కూడా విద్యావ్యాప్తికి ఎంతగానో కృషి చేసిన విద్యావేత్త కోటంరాజు వెంకటేశ్వరరావు. 1907 నవంబర్ 24న గుంటూరు జిల్లా ఇంకొల్లు గ్రామంలో ఆయన జన్మించారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి ‘బ్యాచిలర్ ఆఫ్ టీచర్’ విద్యను పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. 1940 లలో హైదరాబాద్‌లోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా, హెడ్మాస్టర్‌గా పనిచేశారు.

వెంకటేశ్వరరావులోని జాతీయభావాల గురించి తెలుసుకున్న రాజా రామేశ్వరరావు ఆయన్ను తాము స్థాపించిన వనపర్తి హైస్కూల్ హెడ్మాస్టర్‌గా నియమించారు. ఇది వనపర్తి సంస్థానంలో విద్యారంగాన్ని మలుపు తిప్పిన సందర్భమే కాక, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జాతీయోద్యమాన్ని కూడా ఎంతగానో ప్రభావితం చేసింది.

1946లో వనపర్తి హైస్కూల్లో వెంకటేశ్వరరావు హెడ్మాస్టర్‌గా చేరిన వెంటనే అక్కడి పరిస్థితులన్నిటినీ మార్చేశారు. ఆయన రాగానే తెలుగు భాషలో విద్యాబోధన మొదలైంది. పాఠశాలలో వందేమాతరాన్ని ప్రార్థనా గీతంగా పాటించడం మొదలుపెట్టారు. ఇది నచ్చని అన్యమత విద్యార్థులు కొందరు ఆ గీతాన్ని ఆలపించడానికి ఇష్టపడలేదు. వెంకటేశ్వరరావు పాడి తీరాల్సిందే అనడంతో ఆయనకు వ్యతిరేకంగా ‘హమ్ వెంకటేశ్వరరావు సే నారాజ్ హై’ అంటూ విద్యార్థులు నినాదాలు చేసేవారు. ఇలాంటి ప్రతికూల స్పందనలకు వెరవకుండా ‘నారాజ్ హోతో చలే జావో’’ అని వారిని స్కూల్ నుంచి వెళ్లిపొమ్మనేవారు ఆయన. నాటి నిజాం పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి చర్యలు చేపడితే కఠిన శిక్షలు ఉండేవి. వెంటనే వెంకటేశ్వరరావును అరెస్టు చేసి గుల్బర్గా జైలులో నిర్బంధించారు. ఆ తర్వాత కోర్టులో వెంకటేశ్వరరావును హాజరుపరచగా, వారు మోపిన అభియోగాలేవీ నిరూపణ కాకపోవడంతో ఆయన్ను నిర్దోషిగా విడుదల చేశారు.


తర్వాత వనపర్తిలోనేగాక, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో విద్యావ్యాప్తికి వెంకటేశ్వరరావు కృషి చేశారు. ఆయన శిష్యులలో ఎంతోమంది ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అనారోగ్యంతో బాధపడుతూ 1974 నవంబర్ 13న హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయన కాలధర్మం చెందారు. ఏ కర్తవ్యం కోసమైతే ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారో ఆ కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వహించి, ఆ తర్వాత నిశ్శబ్దంగా వెళ్లిపోయిన మహనీయుడు వెంకటేశ్వరరావు.

- హెచ్. రమేశ్‌బాబు

(నేడు కోటంరాజు వెంకటేశ్వరరావు జయంతి)

Updated Date - Nov 24 , 2026 | 01:21 AM