Share News

కొండా సురేఖ... స్వయంకృతం!

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:17 AM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయిందని ఒక దశలో చాలామంది భావించారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీ నిస్తేజంగా మారిందన్నారు. ఆ కష్టకాలంలో 2017లో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి రాష్ట్రమంతటా తిరిగి కార్యకర్తలను సమీకరించారు..

కొండా సురేఖ... స్వయంకృతం!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయిందని ఒక దశలో చాలామంది భావించారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీ నిస్తేజంగా మారిందన్నారు. ఆ కష్టకాలంలో 2017లో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి రాష్ట్రమంతటా తిరిగి కార్యకర్తలను సమీకరించారు, పార్టీకి రాజకీయంగా ఊపిరి పోశారు. అనేక నియోజకవర్గాలలో అభ్యర్థులను గెలిపించి, పార్టీ ఉనికిని తిరిగి నిలబెట్టిన ఘనత ఆయనది. రేవంత్‌ కృషి ఫలితంగానే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తనను నిలబెట్టిన పార్టీ నాయకత్వాన్ని బహిరంగంగా కించపరచడం సమంజసమేనా? కొండా సురేఖ ఆలోచించుకోవాలి.

మంత్రి పదవి వ్యక్తిగత హక్కు కాదు, పార్టీ టికెట్ కుటుంబ ఆస్తి కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బలపరచడం, పార్టీ నిర్ణయాలను గౌరవించడం, ప్రజా జీవితంలో మాట విలువను కాపాడడం ఇవే బాధ్యతాయుత నాయకత్వానికి ప్రమాణాలు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు మంత్రిగా అవకాశం పొందిన కొండా సురేఖకు పార్టీ సంస్థాగత నియమాలు ఏమిటో, అధిష్ఠానం ప్రాధాన్యం ఏమిటో తెలియనిది కాదు. టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీలలో పనిచేసిన ఆమెను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఐదుసార్లు పదవులు కట్టబెట్టింది. అంత రాజకీయ అనుభవం ఉన్నా, ఆమె బహిరంగ ప్రసంగాలలో సంయమనం పాటించడంలో పదేపదే విఫలమవుతూనే ఉన్నారు.


సినీనటుడు నాగచైతన్య మాజీ సతీమణిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రజల మనోభావాలను గాయపరిచాయి. కేటీఆర్‌పై విమర్శల సందర్భంగా ఒక సినీనటి పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు కోర్టు వరకు వెళ్లి, చివరకు ఆమె క్షమాపణ చెప్పే స్థాయికి దారితీశాయి. ఒక మహిళా నాయకురాలిగా, తోటి మహిళల పట్ల వాడాల్సిన భాషను మరచిపోవడం ద్వారా సమాజానికి ఆమె ఇచ్చే సందేశం ఏమిటన్నది ఆలోచించాల్సిన విషయం. మంత్రి పదవిలో ఉన్నామన్న విషయాన్ని విస్మరించి నోటికివచ్చినది మాట్లాడటం ప్రజాజీవితంలో ఆమోదయోగ్యం కాదు.

దక్కన్ సిమెంట్ వ్యవహారంలో తన ప్రత్యేక అధికారిపై వచ్చిన ఆరోపణల సందర్భంలో సైతం విధివిధానాల ప్రకారం నిబద్ధతతో వ్యవహరించడం మంత్రి పదవికి ఉండాల్సిన కనీస ప్రమాణం. ఈ విషయంలో ఎంత నిజాయితీగా వ్యవహరించారన్నది ఆమె అంతరాత్మకే తెలుసు. పరకాల నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఆమె శైలికి అద్దం పడుతోంది. ఎమ్మెల్యే స్థానంతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలనూ గెలిపించుకోలేని స్థితిలో ఆమె ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆమెకు మద్దతు ప్రకటించే ఎమ్మెల్యే ఒక్కరూ లేకపోవడం యాదృచ్ఛికం కాదు. నోటి మాటపై నియంత్రణ లేక, తోటి నాయకులతో సత్సంబంధాలు నిర్మించుకోలేకపోవడం ఈ ఒంటరితనానికి కారణం.


ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గంలో ‘కాంగ్రెస్‌ను గెలిపించాలి’ అని చెప్పడం, అక్కడి అభ్యర్థిని ముందుగానే నిర్ణయించడం ఒకటి కాదు. పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి చెందినదని, పార్టీ దానిని గెలవాలని ముఖ్యమంత్రి చెప్పడం సహజమైన రాజకీయ పిలుపు. ఎవరిని అభ్యర్థిని చేయాలన్నది పార్టీ అధిష్ఠానం నిర్ణయించే విషయం. ఒక నియోజకవర్గం పార్టీ సొత్తు; అది ఎవరి వ్యక్తిగత రాజకీయ ఆస్తీ కాదు. ఈ నేపథ్యంలోనే, ఆమె తనకు, తన భర్తకు, తన కూతురికి ఒకేసారి మూడు టికెట్లు కావాలని కోరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పార్టీ టికెట్ కుటుంబ వారసత్వ హక్కు కాదు, అది సంస్థాగత నిర్ణయం. కానీ, పార్టీపైనే బహిరంగంగా విమర్శలు గుప్పించడం అనేది నమ్ముకున్న చెట్టునీ, నీడనిచ్చిన కొమ్మనీ నరుక్కోవడమే. ఓడ ఎక్కేముందు ఓడ మల్లయ్య, ఓడ దిగాక బోడ మల్లయ్య అన్న సామెత ఆమె వ్యవహారశైలికి సరిగ్గా సరిపోతుంది. ఆమె కుమార్తె కొండా సుస్మిత పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత అనుచితమైనవి.

రాష్ట్ర ముఖ్యమంత్రి శక్తిని కించపరుస్తూ మాట్లాడటం సంస్కారం అనిపించుకోదు. ఒక మంత్రిగా, సీనియర్ నాయకురాలిగా ఉంటూ, కూతురి వ్యాఖ్యలను ఖండించకుండా మౌనం వహించడం, పైగా పరోక్షంగా ప్రభుత్వంపై, పార్టీపై బురద చల్లే ధోరణిని కొనసాగించడం మంత్రివర్గ సామూహిక బాధ్యతకు విరుద్ధం.

ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకత్వంపైనే విమర్శలు చేసే పద్ధతిని ఏమనాలి? ఏ రాజకీయ పార్టీకైనా క్రమశిక్షణ ఉంటుంది. పార్టీ వేదికల్లో చర్చించడం, నాయకత్వం ముందు చెప్పడం, నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యం కావడం అనుసరించవలసిన మార్గాలు. ఈ తేడాను పాటించకుండా ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా విమర్శలు చేయడం ఏ పార్టీకైనా సంస్థాగతంగా నష్టదాయకమే. ఒక మంత్రి తనను తాను నియంత్రించుకోలేకపోతే, కుటుంబీకుల వ్యాఖ్యలపట్ల బాధ్యతను చూపలేకపోతే, కుటుంబ రాజకీయ ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇస్తే ప్రజలు ప్రశ్నించడం సహజం. అధిష్ఠానం ఆగ్రహానికి గురై, పదవిని కోల్పోయిన కొండా సురేఖ ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి.

- చనగాని దయాకర్ (టీపీసీసీ జనరల్ సెక్రటరీ)

Updated Date - Sep 05 , 2026 | 12:20 AM