కొ.కు. ‘దిబ్బదేశం’లోనే ఉన్నామా!
ABN , Publish Date - Oct 26 , 2026 | 02:28 AM
కొడవటిగంటి కుటుంబరావు (కొకు) రాసిన ‘దిబ్బ కథలు’ అన్నీ నడుస్తున్న పాలక రాజ్య వ్యవస్థ స్వభావంపై రాజకీయ వ్యంగ్యాస్త్రాలే. మన స్వాతంత్ర స్వభావం ఏమిటి? మనదేశంలో ఎంత ప్రజాస్వామ్యం...
కొడవటిగంటి కుటుంబరావు (కొకు) రాసిన ‘దిబ్బ కథలు’ అన్నీ నడుస్తున్న పాలక రాజ్య వ్యవస్థ స్వభావంపై రాజకీయ వ్యంగ్యాస్త్రాలే. మన స్వాతంత్ర స్వభావం ఏమిటి? మనదేశంలో ఎంత ప్రజాస్వామ్యం ఉంది? మన రాజ్యాంగం మతశక్తులకు ఏ మేరకు తోడ్పడుతోంది? వెరసి మన లౌకిక, ప్రజాస్వామ్య స్వతంత్ర, రాజ్య వ్యవస్థకు ఉండిన కుహనా స్వభావ అంతఃస్సారం ఏమిటన్నది ఈ కథలు సున్నితంగా బట్టబయలు చేస్తాయి. మొత్తం 12 దిబ్బ కథలను కొకు 1950 నుండి 79 వరకు అంటే సుమారు 30 ఏళ్ళ కాలవ్యవధి మధ్య రాసారు. నాటికి తెలుగు సాహిత్యంలో ఇలాంటి ప్రక్రియలో రచన చేసినవారెవరూ లేరు.
కథను బట్టి ‘దిబ్బ’ సరిహద్దులు మారుతూ ఉంటాయి. అది ఒక్కొక్కసారి భారతదేశమయితే ఎక్కువసార్లు ఆంధ్రదేశమై ఉంటుంది. ప్రస్తుతం ‘దిబ్బమతం’ అనే కథకు పరిమితమై మాట్లాడుకుందాం! 74ఏళ్ళ క్రితం 1952లో రాసిన నాలుగు పేజీల ఈ కథ మతవాద రాజకీయ శక్తుల లౌకిక వ్యతిరేక ఆలోచనలను స్పష్టంగా బహిర్గత పరచటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
దిబ్బ కథలన్నిటిలోనూ రచయిత పత్రికా విలేఖరి రూపంలో రకరకాల పాత్రలతో సంభాషించడం ద్వారా పాలక రాజ్య వ్యవస్థ స్వభావాన్నీ, ఆర్థిక -రాజకీయ, సామాజిక - సాంస్కృతిక ధోరణులను బట్టబయలు చేస్తారు. ‘దిబ్బమతం’ కథలో మన రచయితకు ఒక మత ప్రవీణుడు తటస్థపడతాడు. వారిరువురి నడుమ జరిగే సంభాషణగా కథ ఉంటుంది. రచయిత పాత్ర ‘‘కొత్త రాజ్యాంగంలో మతానికి ప్రాముఖ్యం పోయింది గదా’’ అనగానే మత ప్రవీణులు, ‘‘మతానికి ప్రాముఖ్యం హెచ్చింది’’ అంటాడు. అందుకు చాలా రుజువులు చూపిస్తాడు. ‘‘దిబ్బ రాజ్యాంగాన్ని ఈనాడు ఎవరూ మాట్లాడని దేవుడి భాషలోకి తర్జుమా చేశారు. దిబ్బ రాజకీయ తతంగాలన్నిటికీ దిబ్బ మత సంబంధమైన మంత్రాలు చదువుతారు. అధ్యక్షుడు దిబ్బ మత చిహ్నాలను ధరించి గాని పదవీ స్వీకారం చేయడు. ఎవరైనా పౌర ప్రముఖులు చస్తే దిబ్బ రేడియోలో దిబ్బ మత గ్రంథ పఠనం జరుగుతుంది. దీనికేమంటారు?’’ అని, ఇంకా కొనసాగిస్తూ, ‘‘దిబ్బ పరిపాలనలో మత ప్రసక్తి లేదనుకోకండి. అది మతవిరహితం ఎన్నటికీ కాదు. దిబ్బ శాసనాలలో దిబ్బ మతం ఉంది. దిబ్బ జాతీయ భాషలోనూ, జాతీయ పతాకాలలోనూ దిబ్బ మతం ఉంది,’’ అంటాడు.
మన రచయిత చాలామంది మేధావుల్లాగానే, ‘‘ప్రజాస్వామికంలో మతాతీత లౌకిక రాజకీయాలకు తప్ప తావు లేదు. ఏ పాశ్చాత్య రాజ్యమైనా తీసుకోండి,’’ అంటాడు. దానికి జవాబుగా ప్రవీణుడు, ‘‘దిబ్బ రాజ్యంలో మతం అనుక్షణం ఆచరణీయం. దీన్నుంచి పుట్టనివాళ్లు, చచ్చినవాళ్ళు, నిద్రితులు సయితం తప్పించుకోలేరు. ఆచరణలో అదే వ్యక్తమవుతున్నది,’’ అంటాడు. అంతకుముందే అతను మన రచయితకు ఒక ప్రశ్న వేస్తాడు: ‘‘ఈ రాజ్యాంగం కింద అన్ని మతాలకు సమాన గౌరవం ఉండేటట్లా? దేనికి తగిన గౌరవం దానికి ఉండేటట్లా? చెప్పండి చూతాం?’’ అని. ఈ ప్రశ్నపై తాను ఎప్పుడూ ఆలోచించలేదంటాడు రచయిత.
ఆ పూటకు ఆఖరి ప్రశ్నగా, ‘‘పోనీ దిబ్బ రాజ్యాంగంలో సర్వమత సమానత్వమైనా ఉన్నదని ఒప్పుకుంటారా?’’ అని రచయిత అనగానే, ‘‘అది కల్లే. ఏ ఇతర మతం కూడా దిబ్బ మతంతో సమం కాలేదు. ఎట్లా అవుతుంది దిబ్బ మతం, దిబ్బ సంస్కృతి ఆద్యంతాలు లేనివి. ఎన్నో మతాలు ఈ మతంపై దాడి చేసి నిర్మూలనమైపోయాయి. దిబ్బ మతం ఎప్పటిలాగే నిలిచి ఉంది.’’
ఆనాటి సంభాషణ తర్వాత ప్రవీణుడి ఆహ్వానం మేరకు రచయిత ఆయన ఇంటికి వెళతాడు. అక్కడ రెండు రోజులూ మాంసాహారం వడ్డిస్తారు. ‘‘మీరు అగ్రవర్ణులని విన్నాను. శాకాహారులు కారా?’’ అనగానే, మన పూర్వ ఋషులు ఎవరూ శాకాహారులు కారనీ, మేకలు, ఆవు దూడలు, ఒక్కొక్కసారి మానవులను కూడా ఆహారంగా తీసుకున్నట్లు దిబ్బమత గ్రంథాలలో సాక్ష్యాలు ఉన్నాయనీ చెబుతూ, ‘‘మన యువకులు ఈ జైన ఆచారమైన శాకాహారాన్ని మాని, ఇతర మతాలకు చెందిన మ్లేచ్ఛులను అవసరమైతే నిర్మూలించగల శరీరదార్ఢ్యం కలిగి ఉండాలి’’ అని ప్రవీణులు చెప్తారు. ‘‘మీకు అన్యమత విద్వేషం ఉందని ఊహించలేదు’’ అని రచయిత అంటే, ప్రవీణుడి కళ్ళు ఎర్రబడి ద్రావకం లాంటి పానీయం తెప్పిస్తాడు. అది సేవిస్తూ, ‘‘మ్లేచ్ఛ మతాలను విధ్వంసం చేయటానికిగాను వాటిని ద్వేషించవలసిన అగత్యం లేదు. దిబ్బ మతానికి అటువంటి దుర్దశ లేదు’’ అంటాడు.
దిబ్బ మత ప్రవీణులతో సంభాషణ ద్వారా దిబ్బమత ప్రాశస్త్యాన్ని గురించి చాలా తెలుసుకున్నాను అంటాడు రచయిత. అప్పటికే రచయితకు దిబ్బమతం అనేక ఇతర మతాల ప్రభావానికి గురైందని తెలుసు. ప్రవీణులు చాలా భ్రమలపాలై మాట్లాడుతున్నట్లు అర్థం చేసుకుంటాడు. ఇంకొంత విశ్లేషించుకోగా ప్రవీణుని ప్రకారం ప్రాచీన గ్రంథాలలో ఉన్న దిబ్బమతమూ, ఇప్పుడు దిబ్బమతం కింద చలామణి అవుతున్నదీ ఒకటి కాదని కూడా తెలుసుకుంటాడు. రచయిత ప్రకటించిన ఈ ఒక్క అభిప్రాయాన్ని ప్రవీణులు కూడా అంగీకరిస్తారు.
తమ సంభాషణల నడుమ ప్రవీణులు ప్రాచీన కాలపు గ్రంథాల్లో నాలుగు రంగులు మాత్రమే ఉన్నాయని చెబుతాడు. ఐదవ రంగు లేనే లేదంటాడు. అంటే పంచమవర్ణం అన్నమాట! కానీ ప్రస్తుతం దిబ్బ రాజ్యంలో ఉన్న 26, 79, 38 కులాలను రద్దు చేయడం అంత తేలిక పని కాదనీ, రంగులు కులాలు ఒకటి కానే కాదనీ ప్రాచీన గ్రంథాలలో ఎక్కడా చెప్పబడని ఈ కులాలను ఉంచడమా మానిపించడమా అనేది ఇంకా తనకే తెలియదని ప్రవీణులు అంటాడు. పై అంకెల గురించి ప్రవీణులకు లేని స్పష్టత రచయిత కూడా మనకు ఇవ్వలేదు. కానీ ఆ అంకెలు అగ్రవర్ణ కులాలు, శూద్ర వర్ణ కులాలు, ఎస్సీ ఎస్టీ కుల తెగలూ అనుకోవచ్చు.
అయితే వీరిరువురి సంభాషణ ఒకే ఒక ప్రశ్నతో ముగుస్తుంది. ప్రాచీన మతోద్ధరణ జరగాలని ప్రవీణులు ప్రకటించిన తర్వాత రచయిత, ‘‘దిబ్బ మతం మనిషిని ఉద్ధరిస్తుందా? లేక మనిషే మతాన్ని ఉద్ధరిస్తాడా?’’ అని ప్రశ్నించడంతో అదే ఆఖరి మాటయి ఇక సంభాషణ కొనసాగలేక తెగిపోయింది. మన అనుభవంలో కూడా చూస్తాం– సాధారణ మానవులు దేవుడిని నమ్ముకుంటారు. ఆయనే తమను ఈతి బాధల నుండి రక్షిస్తాడు అని ప్రార్థిస్తుంటారు. కానీ మతవాదులు తామే దేవుడిని రక్షిస్తున్నామని, మతాన్ని కాపాడుతున్నామని ఒక తరహా ఉన్మాదపూరిత ఆత్మవంచనలో ఉంటారు. అందుకే ఇక సంభాషణ కొనసాగలేకపోయింది.
కేవలం ఒక నాలుగు పేజీల కథలో మతవాదుల తత్వాన్ని మాత్రమే కాక వారి దీర్ఘకాలిక లక్ష్యాలను కూడా బట్టబయలు చేశారు కొడవటిగంటి. అదే సమయంలో భారత రాజ్యాంగం పట్ల మేధావులలో ఉన్న భ్రమలను కూడా పటాపంచలు చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ రెండు ధోరణులు నేటికీ కొనసాగుతూనే ఉండటం.
(అక్టోబర్ 28 కొడవటిగంటి జయంతి)
దివి కుమార్
ఈ వార్తలూ చదవండి
అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..
గ్రీకు రెస్టారెంట్లో తొలి పరిచయం.. రాజీవ్ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..