Share News

ధర్మపరీక్ష

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:36 AM

కేరళంలోని కొచ్చిలో ఒక మైనర్‌ తన మెర్సిడెస్‌ బెంజ్‌ కారుతో చేసిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అతడి తండ్రి, అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి అరెస్టును హైకోర్టు అడ్డుకుంది.

ధర్మపరీక్ష

కేరళంలోని కొచ్చిలో ఒక మైనర్‌ తన మెర్సిడెస్‌ బెంజ్‌ కారుతో చేసిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అతడి తండ్రి, అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి అరెస్టును హైకోర్టు అడ్డుకుంది. మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం మైనర్‌ చేసిన తప్పుకు వాహన యజమాని లేదా సంరక్షకుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది కనుక జడ్జిపై కూడా పోలీసులు కేసుపెట్టారు. కొచ్చిలోని చెరనల్లూరులో నూటపది కిలోమీటర్ల వేగంతో ఈ జడ్జిగారి కుమారుడు ఆ భారీ కారును నడుపుతూ స్కూటర్‌ మీద వెడుతున్న ఓ యాభైఐదేళ్ళ చిరువ్యాపారిని వెనక నుంచి ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. మొదట్లో పోలీసులు ఆ మైనర్‌ మీద నామమాత్రపు సెక్షన్లతో కేసు నమోదుచేసి, వెంటనే స్టేషన్‌ బెయిల్‌ మీద వదిలేయడం, ఆ తరువాత వివాదం రేగడంతో మళ్ళీ అరెస్టు చేసినా జువనైల్‌ జస్టిస్‌ బోర్డు బెయిల్‌ ఇచ్చేయడంతో ఈ కేసు కేరళంలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జడ్జి కుమారుడు కనుకనే, ఈ కేసులో తమకు అన్యాయం జరుగుతోందని బాధితుడి కుటుంబీకుల ఆరోపణ.


అత్యంత గోప్యంగా ఈ కేసులో వ్యవహరించాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ పౌరసమాజం నుంచి వచ్చిన వత్తిడివల్ల జడ్జి వరకూ పోకతప్పలేదు. రినోఫ్రాన్సిస్‌ ఒక జుడిషియల్‌ అధికారి కనుక, ఇప్పటికే క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు ఆయనను నాలుగుగంటలపాటు విచారించినందున ఆయన ఎక్కడికీ పోరనీ, చట్టానికి సహకరిస్తారని హైకోర్టు ప్రకటిస్తూ ఆయనకు అరెస్టునుంచి ముందస్తు రక్షణ కల్పించింది. అసలు, ఈ కేసులో నాలుగుగంటలపాటు ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది, మరింత ఇంటరాగేషన్‌, అరెస్టు ఎందుకు? అని హైకోర్టు ప్రశ్నించింది. తన ప్రమేయం లేకుండా ఈ ఘోరం జరిగిపోయిందన్న తండ్రి వాదన హైకోర్టుకు సముచితంగా అనిపించివుంటుంది. తాను అర్ధరాత్రి ఒంటిగంటన్నర వరకూ చదువుకొని పడుకున్నాక, తన మైనర్‌ కుమారుడు వెనకమెట్ల గుండా వెళ్ళి కారు తాళాలు తీసుకొని పోయాడని, రెండున్నర ప్రాంతంలో ఫోన్‌ వచ్చేవరకూ ఈ ప్రమాదం గురించి తనకు తెలియనందున ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని జడ్జి వాదన. ఒక తండ్రిగా ఆయన బాధ అర్థంచేసుకోగలిగిందే. అయితే, విషయం తెలిసిన తరువాత ఈ జడ్జి కొచ్చి పోలీసు కమిషనర్‌కు ఫోన్‌ చేశారు, ఆయన సంఘటన జరిగిన ప్రదేశానికి సంబంధించిన పోలీసులకు ఫోన్లు చేసి జడ్జికి సహకరించాల్సిందిగా ఆదేశించారు. కాల్‌డేటా ఆధారంగా ఈ వ్యవహారం అంతా బయటపడిన తరువాతే, ప్రభుత్వం కమిషనర్‌ను బదిలీచేసి, నలుగురు పోలీసులను సస్పెండ్‌ చేసింది. జువనైల్‌ జస్టిస్‌ బోర్డు రెండుగంటల్లో ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయమని కూడా కోర్టును కేరళం ప్రభుత్వం ఇప్పుడు కోరుతోంది.


మైనర్‌ డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదానికి కారకుడైతే, వాహన యజమాని బాధ్యత వహించాలని, మూడేళ్ళ జైలు, పాతికవేల రూపాయల జరిమానా ఇత్యాది శిక్షలు అనుభవించాలని మోటారు వాహనాల చట్టం చెబుతుంది. అయితే, తనకు తెలియకుండా కుమారుడు వాహనం పట్టుకుపోయాడని నిరూపించగలిగితే శిక్ష తప్పించుకోవచ్చును కనుక, జడ్జి కోర్టులో ఈ వాదన వాడుతున్నారు. ఆలస్యంగా జడ్జి ఇంట్లో తనిఖీలు చేసి, అపార్ట్‌మెంట్‌ సీసీటీవీ ఫుటేజ్‌, మొబైల్‌ ఫోన్ల వంటివి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందని రుజువుచేయగలరా లేదా అన్నది వేరే ప్రశ్న. అయితే, కేసు నీరుగార్చడానికి వీలుగా తన కుమారుడు గతంలో ఈ కారుతో పాటు ఉన్న రీల్స్‌ డిలీట్‌ చేశారని బాధిత కుటుంబం తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. గతంలో పలుమార్లు ఆ మైనర్‌ కుమారుడు ఇదే కారు నడిపాడన్నది కూడా రుజువైంది. తనకు తెలియకుండా ఇదంతా జరిగిపోయిందన్న వాదనను నిజం చేయడానికి సదరు జడ్జి సాక్ష్యాలను తారుమారుచేస్తున్నారని, ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు వెళ్ళిన ఆయన గంటసేపు అక్కడే ఉండి, వ్యవహారాలు చక్కబెట్టుకున్నారని బాధిత కుటుంబీకుల ఆరోపణ. అందువల్ల ఈ కేసు సవ్యంగా సాగడానికి కనుక అతడి అరెస్టు అతిముఖ్యమన్నది వారివాదన. ఒక తండ్రిగా, జడ్జిగా ఈ కేసులో ఫ్రాన్సిస్‌ ప్రవర్తనమీద విచారణ జరిపించాలంటూ జయబాలకృష్ణన్‌ కుటుంబీకులు చీఫ్‌ జస్టిస్‌ను కోరుతున్నారు. మద్యం తాగి, లైసెన్సు లేకుండా విలాసవంతమైన కార్లతో సామాన్యులను ఢీకొట్టి చంపేస్తున్న సంఘటనలు మనదేశంలో సర్వసాధారణమైపోయాయి. సంపద, పలుకుబడి ఉన్నవారు సాక్ష్యాలను తారుమారుచేసి, వ్యవస్థలను ప్రభావితం చేసి, సంఘటన జరిగిన ఎంతోకాలానికి నాలుగు హెచ్చరికలతోనో, నామమాత్రపు జరిమానాలతోనో బయటపడగలుగుతున్నారు. మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ జడ్జిగా ఉన్న ఫ్రాన్సిస్‌, అతని మైనర్‌ కుమారుడి విషయంలో న్యాయస్థానాలు, ఇతర వ్యవస్థలు ఎంత ధర్మబద్ధంగా వ్యవహరిస్తాయో చూడాలి.

Updated Date - Oct 31 , 2026 | 12:38 AM