కాశీలో మాంసాహార నిషేధం హిందుత్వమా?
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:44 AM
సత్యం ఒక్కటే, జ్ఞానులు ఆ సత్యాన్ని బహువిధాలుగా వ్యాఖ్యానిస్తారని (ఏకం సత్ విప్రా బహుధా వదంతి) వేదం చెబుతోంది.
సత్యం ఒక్కటే, జ్ఞానులు ఆ సత్యాన్ని బహువిధాలుగా వ్యాఖ్యానిస్తారని (ఏకం సత్ విప్రా బహుధా వదంతి) వేదం చెబుతోంది. భగవద్గీత ప్రకారం– మనం దైవాన్ని ఏ రూపంలో, ఏ విధంగా, ఏ రీతిలో పూజించినా, దైవం ఆ రూపంలోనే, ఆ విధంగానే కరుణిస్తుంది. ఈ తత్వమే మన బహుదేవతారాధనకు మూలం. బహుళ దేవతలను పూజించడం అనేది ఒకే దేవుడు అనే సత్యానికి విరుద్ధం కాదు.
ఎప్పుడైతే దైవ బహుళత్వం సిద్ధించిందో, అప్పుడే ఆచార బహుళత్వం కూడా మొదలైంది. దేవతలను కూడా సాత్విక, రాజస, తామస దేవతలుగా విభజించారు. వారి వారి గుణాలను బట్టి, అలాగే వర్ణాన్ని బట్టి ఆచార వ్యవహార వైవిధ్యం మొదలైంది. దీనినుంచే ఆగమ, తంత్ర శాస్త్రాలు అనే భేదం వచ్చింది. ఆగమం కొంత వైదికాన్ని అనుసరిస్తే, తంత్ర శాస్త్రం అవైదికం. ఆగమశాస్త్రం ప్రకారం పూజించే దేవతలకు శాకాహారం, తంత్ర శాస్త్రం ప్రకారం పూజించే దేవతలకు మద్య మాంసాలు నైవేద్యంగా పెడతారు. వైదికం, ఆగమశాస్త్రాల ప్రకారం ఏవి నిషిద్ధములో, తాంత్రికులకు అవే పవిత్రమైనవి.
అస్సాంలోని కామాఖ్య దేవాలయంలో తాంత్రిక పూజా విధానం, జంతు బలులు కొనసాగుతున్నాయి. అలాగే కాశీ (వారణాసి)లో కాలభైరవ పూజ కూడా తాంత్రిక పద్ధతిలోనే కొనసాగుతూ వచ్చింది. ఇప్పటికీ కాలభైరవుడికి మద్యం నైవేద్యంగా పెట్టడం ప్రసిద్ధి. కాలక్రమంలో అక్కడ మాంస నైవేద్యం నిలిపివేశారని వినికిడి.
ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వారణాసి (కాశీ)లోని మాంసం, చేపల దుకాణాలను పూర్తిగా నగర శివార్లకు తరలించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెనుక కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా ఆర్థిక పర్యవసానాలు కూడా ఉన్నాయని, చిల్లర కొట్టు మాంసం వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, దీనివల్ల ఆన్‌లైన్ మాంసం డెలివరీ వ్యాపారాలు (Corporate Monopolies) పుంజుకుంటున్నాయని ఆర్థిక విశ్లేషకులు వాదిస్తున్నారు. సంప్రదాయం ఎప్పుడూ కేవలం సంప్రదాయంగానే మిగలదు, ఒక ఆర్థిక కోణం కూడా ఉంటుంది.
ఈ మాంసం నిషేధానికి అధికారులు చెబుతున్న ప్రధాన కారణం ‘పరిశుభ్రత’. అలాగైతే, దేశంలో ఎక్కువగా మాంసం వినియోగం, అమ్మకాలూ జరిగే దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది కంటే, కాశీ కంటే ఎంతో పరిశుభ్రంగా ఉంటున్నాయి కదా అని బీబీసీ (తెలుగు) ఎడిటర్ జి.ఎస్.రామ్మోహన్ ప్రశ్నించారు. కాబట్టి ఇక్కడ విషయం కేవలం పరిశుభ్రత మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న భావజాలం.
ముఖ్యంగా క్రైస్తవ, జైన, బౌద్ధాల ప్రభావం వల్ల శాకాహారవాదం తీవ్రంగా విజృంభించింది. అదే ఏకైక హిందూ మత ధర్మం అన్నట్లుగా నేడు ప్రచారంలోకి వచ్చింది. మరి ఆగమ శాస్త్రం హిందూమతంలో భాగమైతే, తంత్రశాస్త్రం హిందూ మతం కాదా? కామాఖ్య, కాలభైరవ హిందూమతంలోని వారు కారా?
భారతీయ పూజా విధానాలు, బహుళత్వం పట్ల, పాశ్చాత్యులు, క్రైస్తవ మిషనరీలు తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించాయి. విలియం కేరీ, ఎమ్మా రౌషెన్‌బుష్ క్లౌ, హెన్రీ వైట్ హెడ్, జోసెఫ్ ముల్లెన్స్, జాన్ మోరిసన్ వంటి పాశ్చాత్య క్రైస్తవ మిషనరీలు ఇక్కడి స్థానిక అమ్మదేవతల శక్తి పూజలను, జానపద జంతు బలులను ‘అనాగరికమైనవి’ అని ముద్ర వేస్తూ, ఇవి అసలైన ఉన్నతమైన ఆర్య–హిందూమతంలో భాగం కాదంటూ వాటి నిషేధం కోసం ప్రచారం చేశాయి. మన ఆలోచనలు విశ్వాసాలపై పాశ్చాత్య క్రైస్తవ వలసవాద ప్రభావాలు బలంగా ఉన్నాయి.
అలాగే బౌద్ధ, జైన ధర్మాలను పునరుద్ధరించడంలో భాగంగా అహింసావాదం తీవ్రస్థాయికి చేరింది. ఆర్యసమాజ్ ప్రభావం, అలాగే బౌద్ధ– జైన తత్వాల పట్ల ఆకర్షితులైన దళితవాది, ఆది హిందువు అని పేరు పెట్టుకున్న భాగ్యరెడ్డి వర్మ వంటి వారు కూడా అమ్మ దేవతల జంతు బలులను, (అలాగే గోవధ కూడా) నిషేధించాలని ఉద్యమించారు. ఒకే విధమైన ఆచారం– ఆహారం– ఒకే దేవుడు– గ్రంథం (వేదం) అనే ఆలోచనల ద్వారా క్రైస్తవాన్ని అనుకరిస్తూ ఆర్యసమాజం హిందుత్వకు మూలంగా మారింది. అంతేగాక వ్యాపార వర్గాలలో జైన మతస్థులు అధికంగా ఉండడం వల్ల కూడా హిందూ సమాజంపై, ఆహార నియమాలపై జైనం ప్రభావం చూపింది. కాశీలో మాంసాన్ని మాత్రమే నిషేధించి, మద్యం వ్యాపారానికి అవకాశం ఇవ్వడం కూడా బౌద్ధ జైన క్రైస్తవ ప్రభావం వల్లనే.
నిజానికి కాశీలో తాంత్రిక పద్ధతుల ప్రభావం ఎక్కువ. (అఘోరాలు, కాపాలికులు...) కానీ ఇప్పుడు ఈ జైన, క్రైస్తవ పద్ధతుల చట్రంలో కాశీని కూడా ఏకరూప ‘బ్రాహ్మణీకరణ’ చేయాలి అనే దృష్టి పెరిగింది. నిజానికి కాశీలో నివసించే బెంగాలీ, ఒరిస్సా, మైథిలి బ్రాహ్మణులు, కాశ్మీరి పండిట్లు శతాబ్దాలుగా మాంసాహారులు. వారి కర్మకాండలలో, పూజలలో మాంసం ఉంటుంది కాబట్టి ఇది కేవలం బ్రాహ్మణేతరుల సమస్య కాదు.
జర్నలిజం కథనాలు, స్థానిక బ్రాహ్మణ పండితుల ఇంటర్వ్యూలలో శాక్తేయ బెంగాలీ బ్రాహ్మణులు ఇలా స్పష్టం చేస్తున్నారు– దుర్గాపూజ, కాళీపూజల సమయంలో అమ్మవారికి ‘బలి’ ఇవ్వడం లేదా మాంసాన్ని / చేపలను భోగ్‌గా (నైవేద్యంగా) సమర్పించడం మా శాక్తేయ సంప్రదాయం. దీనిని నిషేధించడం మా మత స్వేచ్ఛను, సంప్రదాయాన్ని హరించడమే’. కొందరు పండితులు తాము నిత్యం చేపలు తింటామని, ఇది కాశీ విశ్వనాథుడి అంగీకారంతోనే సాగుతున్న సంస్కృతి అని పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే, ఇది హిందూ మతం పేరుతో జరుగుతున్న ఒక కొత్త నిర్వచనం, ఒక కార్పొరేట్ వ్యాపార ఆధిపత్యం చోటుచేసుకోవడానికి సూచనగా కనిపిస్తుంది.
ఆహారం అనేది కేవలం బతకడానికి, పుష్టికి, రుచి కోసం మాత్రమే మనిషి స్వీకరించేది కాదు. ఆహారం ఒక భావజాలం, ఒక మతం కూడా. ‘మనుషులు ఆహారం తినరు, భావాలను తింటారు’ అంటారు తత్వవేత్త యూజీ.
‘తదన్నాః తస్య దేవతాః’ అని రామాయణం. ఎవరు ఎటువంటి ఆహారం తింటారో, వారి దేవతలకు కూడా అదే ఆహారాన్ని పరమ ప్రసాదంగా పెడతారు. అందుకే మాంసాహారి తన దైవానికి మాంసాన్ని నైవేద్యం పెడతాడు. శివభక్తుడైన కన్నప్ప చేసింది అదే, అందుకే గుడులలో ఆగమ పూజావిధానంతో పాటు తాంత్రిక పూజా విధానం కూడా పక్కపక్కనే వర్ధిల్లింది.
అంతేకాదు, వైదిక యజ్ఞయాగాదులలో పశుబలి ప్రాచీన కాలం నుంచి ఉంది. వైష్ణవులు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తూ పిండితో చేసిన పశువును హోమం చేస్తారు. కానీ వైష్ణవ పద్ధతులకు భిన్నంగా, మాంసాన్ని హోమం చేసే ప్రాచీన బ్రాహ్మణ శ్రౌత ఆచారం మిగిలి ఉంది. ‘వైష్ణవం జైనాన్ని అనుకరిస్తుంది’ అని మాధవాచార్యులు (14వ శ.) ‘సర్వదర్శన సంగ్రహం’లో రాశారు. జైన, బౌద్ధ, క్రైస్తవాల అనుకరణతో కూడిన (అంటే వైవిధ్యాన్ని ఒప్పుకోని) ఒక సరికొత్త వైష్ణవ రూపం మాత్రమే అసలైన హైందవంగా నేడు ప్రచారంలోకి వస్తోంది.
రామాయణంలో సీతారాములు మాంసాహారం స్వీకరించినట్లు, అలాగే సీత గంగకు మద్యమాంసాలను సమర్పిస్తానని మొక్కుకున్నట్లు వాల్మీకి రాశారు. కానీ అది మాంసాహారం కాదని, శాకాహారమని అర్థాన్ని మార్చి చెప్తున్నారు గీతా ప్రెస్ వంటి ప్రచురణలలో. ఇలా సనాతన గ్రంథాలను కూడా హైందవీకరిస్తున్నారు. ఆహారానికి మత, కర్మకాండపరమైన హోదా ఉండడం అనేది సమాజంలో ఆ ఆహారం పట్ల గౌరవాన్ని, ఆమోదాన్ని పెంచుతుంది. నాన్–బ్రాహ్మిణ్స్‌లో మాత్రమే కాదు, కొన్ని బ్రాహ్మణ శాఖలలో కూడా ఉన్న ఈ మాంసాహార అలవాటుకు ఒక సామాజిక గౌరవం, ఆమోదం ఈ తాంత్రిక పూజల వల్లే లభించేది.
కాళిదాస ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకంలో, ఒక రాజకుటుంబీకుడు జాలరితో ‘నువ్వు జీవహింస చేసే నీచమైన బ్రతుకు బతుకుతున్నావు’ అని అవమానకరంగా మాట్లాడతాడు. దానికి జాలరి దీటుగా జవాబు చెప్తాడు... ‘యజ్ఞాలలో పశు హింస చేసే బ్రాహ్మణులు కూడా నా బోటి వారే’ అని.
ఈ సంభాషణ ఎప్పటినుంచో సాగుతున్న ఆహార, ఆచారపరమైన వైవిధ్యాల మధ్య ఘర్షణను సూచిస్తున్నది. ఈ ఘర్షణ ఎప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు, కానవసరమూ లేదు. ఎందుకంటే, ఇలాంటి అనేక వైరుధ్యాలు, వైవిధ్యాలు భారతదేశంలో ఒకదానినొకటి గౌరవించుకుంటూ పక్కపక్కనే జీవించాయి. భారతదేశపు సౌందర్యం ఈ బహుళత్వంలోనే ఉంది. నేటి ఆధునికత, రాజకీయ హిందూత్వల పేరిట జరుగుతున్న ఏకరూపత (Homogenization) వల్ల ఈ ప్రాచీన వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది.
- రాణి శివశంకరశర్మ
(ది లాస్ట్ బ్రాహ్మిన్)