Share News

పాక్‌ పాలకుల నిర్దయ

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:19 AM

జైలులో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మానవతాదృక్పథంతో చికిత్స అందించాలంటూ భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ సోమవారం మళ్ళీ విజ్ఞప్తి చేశారు. తనకు పాకిస్థాన్‌ చట్టాలమీద అవగాహనలేదని..

పాక్‌ పాలకుల నిర్దయ

జైలులో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మానవతాదృక్పథంతో చికిత్స అందించాలంటూ భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ సోమవారం మళ్ళీ విజ్ఞప్తి చేశారు. తనకు పాకిస్థాన్‌ చట్టాలమీద అవగాహనలేదని, అయినా కూడా ఒక అగ్రశ్రేణి క్రికెటర్‌కు ఉత్తమ చికిత్స అందాలని తనతో సహా అంతా కోరుకుంటున్నారని కపిల్‌ వ్యాఖ్యానించారు. వివిధ దేశాలకు చెందిన 21మంది అంతర్జాతీయ మాజీ కెప్టెన్లు ఇటీవల‍ పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో, కపిల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ లేఖ మీద భారత్‌ నుంచి కపిల్‌దేవ్‌తో పాటు, సునీల్‌ గవాస్కర్‌, వెంగ్‌సర్కార్‌ సంతకాలు చేస్తే, వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌ మినహా మరే ఇతర పాకిస్థానీ క్రికెటర్లు సంతకాలు చేయలేదు. ఆరు నెలల క్రితం ఇమ్రాన్‌ ఆరోగ్యపరిస్థితి మీద ఆందోళన వెలిబుచ్చుతూ, పద్నాలుగుమంది కెప్టెన్లు లేఖ రాసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, ఇప్పుడు అదనంగా మరో ఏడుగురు జతకూడామని, ఇది రాజకీయ కోణంలో చేస్తున్న విజ్ఞప్తి కాదని ఈ లేఖలో పేర్కొన్నారు. ఇమ్రాన్‌ ఆరోగ్యస్థితిపై పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తామంతా స్వాగతిస్తున్నట్టు కూడా అందులో ప్రస్తావించారు.

అంతర్జాతీయంగా ఎంత అప్రదిష్టపాలైనా ఇమ్రాన్‌ విషయంలో ఏ మాత్రం రాజీపడకూడదని పాక్‌ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇమ్రాన్‌కు ఒక ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందివ్వాలని, అక్కడే వైద్యుల సంరక్షణలో ఉంచాలనీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా, కొద్దిగంటలపాటు పాకిస్థాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (పిమ్స్‌)లో ఏవో కొన్ని పరీక్షలు చేయించి ఆయనను వెంటనే జైల్లో పడేసింది ఆ ప్రభుత్వం. ఈ వైద్యపరీక్షల్లో ఆయన సుబ్బరంగా ఉన్నట్టు తేలిందని కూడా ఓ ప్రకటన చేసింది. సుప్రీంకోర్టు ఎంతో ధైర్యంగా, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన ఆదేశాలను ఆ విధంగా పాక్‌ ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఇమ్రాన్‌కు ప్రైవేటు వైద్యం అందించాలన్న ఆదేశాలు ఇతర ఖైదీల విషయంలోనూ వర్తిస్తాయా? అని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వేసిన ఎదురు ప్రశ్న దాని వైఖరికి నిదర్శనం. కుటుంబీకులను కలుసుకోనివ్వాలని కోర్టు విస్పష్టంగా చెప్పడంతో, ఏడాది తర్వాత ఇమ్రాన్‌ సోదరి జైల్లో ఆయనను కలుసుకోగలిగారు అంతే.


సదరు ప్రభుత్వాసుపత్రిలో కూడా ఇమ్రాన్‌ హృద్రోగ సమస్యల మీద వైద్యులు అనుమానాలు వ్యక్తం చేసి, ఏంజియోగ్రఫీ సూచించారని, అక్కడి సిటి స్కానర్‌ చక్కగా పనిచేస్తున్నప్పటికీ, సరైన పరికరాలు లేవంటూ ప్రభుత్వం ఇమ్రాన్‌ను మళ్ళీ జైలుకు నెట్టేసిందని ఆయన పార్టీ నాయకుల వాదన. ఇమ్రాన్‌కు గుండెపరీక్ష విధిగా చేయించాలంటూ ఆగస్టు ఒకటిన కూడా ప్రభుత్వ వైద్యుల బృందం సూచించిందట. మెడికల్‌ రిపోర్టులు కనీసం కుటుంబ సభ్యులకైనా అందించాలని ఆ పార్టీ కోరుతోంది. ఇమ్రాన్‌ ఆరోగ్యస్థితిని రాజకీయం చేస్తున్నారంటూ అధికారపక్షం విమర్శలు చేయవచ్చును గానీ, కోర్టు ఆదేశాలకు, వైద్యబృందం సూచనలకు భిన్నంగా ఈ వ్యవహారం ముగియడంతో అనుమానాలు నివృత్తి కాకపోగా మరింత పెరిగాయి. ఒకదశలో కోర్టు ఆదేశాలను సవాలు చేసి ప్రభుత్వం భంగపడింది కూడా. అయినా, రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్‌ ఆస్పత్రికి తరలించి, అక్కడ సెప్టెంబర్ 16వరకూ ఉంచాలన్న ఆదేశాలకు భిన్నంగా అర్ధరాత్రి పన్నెండు నుంచి కేవలం ఐదు గంటల్లో ఈ వైద్యపరీక్షల తతంగం మొత్తాన్ని ముగించడం పాక్‌ ప్రజలను ఆశ్చర్యానికీ, ఆగ్రహానికీ గురిచేశాయి. ఆయనను తరలిస్తున్న దారి అంతటా వేలాదిమంది ప్రజలు గుమిగూడి గులాబీరేకులు వెదజల్లారని, సోషల్‌ మీడియాలో లక్షలాది పోస్టుల్లో పాకిస్థానీలు నిరసన వ్యక్తంచేశారని వార్తలు వచ్చాయి. వరుస కేసులతో ఇమ్రాన్‌కు పద్నాలుగేళ్ళ జైలుశిక్ష పడేట్టు చేసిన వ్యక్తులు, వ్యవస్థలూ ఇప్పటికీ ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయో ఈ పరిణామం తెలియచెబుతోంది. ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ సర్వాధికారిగా ఉన్న పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ జైలుగోడల నుంచి బయటకు రావడమన్నది దాదాపు అసాధ్యం. డెబ్బైమూడేళ్ళ ఈ మాజీ ప్రధానికి కనీస వైద్యచికిత్సలు అందించాలని ఆదేశించడం ద్వారా అక్కడి న్యాయవ్యవస్థ తన ప్రాథమిక రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను నిలబెట్టుకొనే ప్రయత్నం చేసినందుకు మాత్రం మెచ్చుకోవాలి.

Updated Date - Aug 25 , 2026 | 12:22 AM