‘బుద్ధిస్ట్ సర్క్యూట్’లో కడప జిల్లానూ చేర్చండి
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:38 AM
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామాత్యులు కందుల దుర్గేశ్ ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరంలో రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన బుద్ధ విహార ప్రారంభోత్సవంలో..
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామాత్యులు కందుల దుర్గేశ్ ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరంలో రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన బుద్ధ విహార ప్రారంభోత్సవంలో.. బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కృషి చేస్తున్నామని ప్రకటించడం ఆంధ్రులకు ఆనందం కలిగించింది. ఆంధ్రప్రదేశ్‌ను బౌద్ధ పర్యాటకానికి ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొట్లకొండ, బావికొండ, ఆదుర్రు, ఉండ్రాజవరం, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ బౌద్ధ పర్యాటక వలయం ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కృషి చేస్తున్నట్టు చెప్పారు.
దేశంలో బౌద్ధులు నిర్మించిన రెండు రకాల స్థూపాలున్నాయి. అవి– శారీరక స్థూపాలు, ఉద్దేశిక స్థూపాలు. బుద్ధుని మహానిర్యాణం తరువాత శారీరక అవశేషాలపై నిర్మించినవి శారీరక స్థూపాలు కాగా, ప్రత్యేక సందర్భాలలో నిర్మించినవి ఉద్దేశిక స్థూపాలుగా ప్రసిద్ధి గాంచాయి. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో నందలూరు మండలం అడపూరు గుట్టలపై ఘనకీర్తి గాంచిన బహు పెద్దవైన ఉద్దేశిక స్థూపాలున్నాయి. క్రీస్తుశకం 7వ శతాబ్దంలో దక్షిణ భారత పర్యటన జరిపిన చైనా యాత్రికుడు హుయన్‌త్సాంగ్ ప్రపంచానికి వీటి గురించి తెలియజేశారు. రేనాటి చోళులు ఈ స్థూపాలను నిర్మించినట్టు ఆయన విశదీకరించారు. అంతేగాక కుందూ నది ఒడ్డున ఉన్న పెద్దముడియంలోనూ, పెన్నా పక్కన వెలసిన పుష్పగిరిలోనూ, ఖాజీపేట మండలంలోని ఓ కొండపైన గల నేలమాళిగలోనూ బౌద్ధ అవశేషాలు ఉన్నాయి.
క్రీ.శ. 1905–06లో జమ్మలమడుగు దగ్గరలోని పెద్దముడియంలో భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ జరిపిన తవ్వకాలలో క్రీ.శ. 1 లేదా 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపం కనుగొన్నారు. అక్కడ లభించిన మట్టి పాత్రలు, మట్టి బొమ్మలు, పూసలు, శాతవాహనుల సీసపు నాణేలు చెన్నై ప్రభుత్వ ప్రదర్శనశాలకు తరలించారు. ఈనాటికీ పెద్దముడియం మండల కేంద్రంలో దక్షిణ దిక్కున అర కిలోమీటరు పరిధిలో శిథిల స్థూపాలున్నాయి. కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి సామంత రాజైన అంబదేవుడు పాలించిన అలనాటి వల్లభాపురం అనే నేటి వల్లూరు మండలంలో పెన్నా నదీ తీరాన ఉన్న పుష్పగిరిలో క్రీ.శ. 1వ శతాబ్ది కాలం నాటి బౌద్ధ స్థూపం వెలుగుచూసింది. పంచకోణాకృతితో నక్షత్రాకారంలోని వేదికపై నిర్మించినదీ స్థూపం. ఇలా అయిదు కోణాల ఆకృతిలో చేపట్టిన నిర్మాణాలు కాలగమనాన్ని గణించే సాధనంగా వినియోగంలో ఉండివుంటాయి. మాసాలు, చంద్ర గమనాన్ని, ఉత్తరాయణాన్ని, దక్షిణాయణాన్ని లెక్కించడం ఆనాటి బౌద్ధ పండితుల ఆనవాయితీ. బౌద్ధుల కాలమాన గణన గణనీయమైనది.
కడప–కర్నూలు జాతీయ రహదారిపై ఉన్న ఖాజీపేట మండలంలోని ఒక కొండపై గల నాగ నాదేశ్వర కోనకు కుడివైపున ఉన్న నేలమాళిగ క్రీ.శ. 2–3 శతాబ్దాల వారసత్వ నెలవు. ఈ నేలమాళిగ వద్దనే బుద్ధుని పాద ముద్రలున్నాయి. ఇటువంటి బౌద్ధ ప్రాశస్త్యమున్న ప్రదేశాలు అన్ని జిల్లాల్లో ఉండి ఉండవచ్చు. రాయలసీమలో బాహుదా నది ఒడ్డున నందలూరు–అడపూరు బౌద్ధ స్థూపాలను బౌద్ధ పర్యాటక వలయంలో చేర్చాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ను కోరాము. అలాగే పెద్దముడియం, పుష్పగిరి, ఖాజీపేట నాగ నాదేశ్వర కోనను కూడా బౌద్ధ పర్యాటక వలయంలో భాగస్వామ్యం చేసి, కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకానికి పట్టం కట్టవలసిందిగా మనవి చేస్తున్నాం.
- మొగిలిచెండు సురేశ్ (కడప)