మార్క్సిస్టునని ప్రకటించుకున్న ఏకైక న్యాయమూర్తి
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:34 AM
స్వతంత్ర భారత న్యాయవ్యవస్థలో అరుదైన న్యాయమూర్తులలో జస్టిస్ ఓ.చిన్నపరెడ్డి ఒకరు. 1970లో విప్లవ కవులు జ్వాలాముఖి, చెరబండరాజు, నిఖిలేశ్వర్‌లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ...
స్వతంత్ర భారత న్యాయవ్యవస్థలో అరుదైన న్యాయమూర్తులలో జస్టిస్ ఓ.చిన్నపరెడ్డి ఒకరు. 1970లో విప్లవ కవులు జ్వాలాముఖి, చెరబండరాజు, నిఖిలేశ్వర్‌లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వం నిర్బంధించినప్ప్పుడు, ‘‘విప్లవ భావాలు కలిగి ఉండటం నేరం కాదని, భావాలకు సంకెళ్లు వేయలేర’’ని, వారి విడుదలకు ఆదేశించారు. నక్సలైట్లు కోర్టుల్ని బహిష్కరిస్తున్నందున వారికి తగు న్యాయ సహాయం అందటం లేదని, అసాధారణంగా హైకోర్టులో కేసు విచారణ జరిపి ఇంతా రమణారెడ్డికి విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చారు. భూమయ్య, కృష్ణాగౌడ్‌లను ఉరితీస్తున్నప్పుడు తెల్లవారుఝామున కేసు విచారించి ఇంటి నుంచే స్టే విధించారు.
ప్రభుత్వ ఉద్యోగంలో చేరటానికి ముందు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో పాల్గొన్నాడనే కారణంతో ఒక ఉద్యోగిని తొలగించగా, రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటం నేరం కాదని, అతణ్ణి తిరిగి నియమించాలని జస్టిస్ చిన్నపరెడ్డి చెప్పిన తీర్పు స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ రామశంకర్ రఘువంశి 1983 కేసుగా ఈ నాటికీ న్యాయవ్యవస్థలో ఒక మైలురాయి వంటి తీర్పుగా నిలిచింది. పార్లమెంటు, శాసనసభల్లో ఆ భావాలున్న వ్యక్తులు సభ్యులుగా ఉండి గౌరవం పొందుతుంటే ఉద్యోగాల్లో ఉండకూడదనటం ఏమిటని ఆయన ఆ తీర్పులో ప్రశ్నించారు. జాతీయ గీతాన్ని ఆలపించకపోయినా లేచి నిల్చుని గౌరవిస్తే చాలని, పి.డి యాక్ట్ చెల్లదని, నిర్బంధంలో ఉన్న వ్యక్తిపై హత్యానేరం వస్తే ఖచ్చితంగా మరణశిక్ష విధించాలనే ఐ.పి.సి 303ని రద్దు చేసింది కూడా చిన్నపరెడ్డే. బాబ్రీ మసీదు కూల్చివేతపై జస్టిస్ డి.ఏ దేశాయ్, జస్టిస్ డి.యన్ తివారిలతో ఏర్పరచిన సిటిజన్స్ ట్రిబ్యునల్‌కి నేతృత్వం వహించి, సమగ్ర విచారణ అనంతరం 1993లోనే సిఫార్సులతో కూడిన తీర్పు వెలువరించారు. ఆదేశిక సూత్రాల్ని ప్రాథమిక హక్కులుగా మార్చాలని ఆయన అభిప్రాయం. ఆనాడు ప్రభుత్వ పాలసీగా ప్రకటించిన HIRE and FIRE అంటే అవసరమైనప్పుడు నియమించటం, అవసరం తీరగానే తొలగించటం అనే విధానాన్ని రద్దుపరిచారు. సమాన పనికి సమాన వేతనం అనే విషయానికి చట్టబద్ధత కల్గించిన తీర్పు ఈయనదే.
జస్టిస్ చిన్నపరెడ్డి రాసిన ‘‘భారతదేశ న్యాయస్థానాలు–రాజ్యాంగం–నిమ్నోన్నతాలు’’ అనే పుస్తకాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రచురించగా, అనేక సందర్భాలలో ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన రాసిన వ్యాసాలు తరిమెల నాగిరెడ్డి స్మారక ట్రస్టు ప్రచురించింది. ఇవి న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై ఆసక్తిగల ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకాలు. మన దేశంలో చట్టాలన్నీ న్యాయశాస్త్రాన్ని రూపొందించేవారికి, అభ్యసించే వారికే అర్థమవుతాయని సామాన్య ప్రజలకు అర్థమయ్యేట్లుగా చట్టాలుండాలని దానికి చట్టాలలోని భాష క్లుప్తంగా, సులభతరంగా ఉండాలని ఆయన అభిప్రాయం. ఉన్న చట్టాలు పేదవారికి న్యాయం చేయలేకపోతున్నాయని తమ హక్కులు తమకి తెలియకపోవటం ఒక కారణమైతే, తెలిసినా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని అజ్ఞానం మరో కారణం. న్యాయవాదికి ఫీజు చెల్లించుకునే స్థోమత లేకపోవటం మరో కారణం అని ఆయనన్నారు. అర్హులకు, బలహీనవర్గాలకు న్యాయం అందించలేనప్పుడు చట్టాలు చేసి లాభం లేదని అభిప్రాయపడ్డారు.
ప్రజల పక్షపాతిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వందలమందిలో తనను తాను మార్క్సిస్టుగా ప్రకటించుకున్న ఏకైక న్యాయమూర్తి జస్టిస్ చిన్నపరెడ్డి. ఈ గొప్ప మానవతామూర్తి 1922 సెప్టెంబర్ 25న కర్నూలు జిల్లా జంబులదిన్నె గ్రామంలో జన్మించారు. గుత్తి మిషన్ స్కూలు, మద్రాసు లయోలా, మద్రాసు లా కాలేజీల్లో చదివి మొదట మద్రాసులోనూ, హైకోర్టు గుంటూరుకు మారినప్పుడు అక్కడా ప్రాక్టీసు చేసి 1967లో హైకోర్టు జడ్జిగా (హైదరాబాద్‌లో) నియమితులయ్యారు. అంతకుముందు హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కూడా ఆయన పనిచేశారు. తన తీర్పుల ద్వారా ప్రభుత్వ కన్నెర్రకు కారణమై పంజాబ్ హర్యానా హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడే ప్రధాన న్యాయమూర్తిగా ఉండి 1978లో సుప్రీం న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2013 ఏప్రిల్ 14న హైదరాబాద్‌లో చనిపోయారు. ఇంత గొప్ప న్యాయకోవిదుడు, న్యాయాన్ని, చట్టాన్ని ప్రజల పక్షాన పరిశీలించిన వ్యక్తి మన తెలుగువాడైనందుకు గర్విద్దాం.
- చెరుకూరి సత్యనారాయణ
(నేడు చిన్నపరెడ్డి వర్ధంతి)