Share News

నాలుగో స్తంభానికి ‘నగుబాటు పెన్షన్‌’

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:45 AM

దశాబ్దాల పాటు మీడియా రంగంలో సేవలందించిన అనేకమంది సీనియర్‌ జర్నలిస్టులు నేడు ఆర్థిక భరోసా లేక అనిశ్చిత జీవన సమరంలో పోరాడుతున్నారు. 20–30 ఏళ్లు పనిచేసిన వారికి నెలకు వచ్చే పెన్షన్‌ వెయ్యి–రెండు...

నాలుగో స్తంభానికి ‘నగుబాటు పెన్షన్‌’

దశాబ్దాల పాటు మీడియా రంగంలో సేవలందించిన అనేకమంది సీనియర్‌ జర్నలిస్టులు నేడు ఆర్థిక భరోసా లేక అనిశ్చిత జీవన సమరంలో పోరాడుతున్నారు. 20–30 ఏళ్లు పనిచేసిన వారికి నెలకు వచ్చే పెన్షన్‌ వెయ్యి–రెండు వేల రూపాయల స్థాయిలో ఉండడం అవమానకరం. అనేక మంది జర్నలిస్టులకు వచ్చే పెన్షన్‌ మొత్తం.. రాష్ట్ర ప్రభుత్వాలు వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు, సంప్రదాయ వృత్తిదారులకు అందించే సామాజిక పెన్షన్‌ కంటే కూడా తక్కువ.

దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సామాజిక భద్రతను గుర్తించి ప్రత్యేక పెన్షన్‌ పథకాలు అమలు చేస్తున్నాయి. బిహార్‌ ప్రభుత్వం నెలకు ఆరు వేలతో మొదలుపెట్టి దశలవారీగా రూ.15,000కు పెంచింది. హర్యానా కూడా రూ.15 వేలకు పెంచింది. ఆరోగ్యభద్రత, వెల్ఫేర్‌ ఫండ్‌, ఇన్సూరెన్స్‌ వంటి సదుపాయాలు అమలు చేస్తోంది. కేరళ ప్రభుత్వం రూ.13 వేలు, జార్ఖండ్‌ ప్రభుత్వం రూ.ఏడువేలు అందిస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌ రూ.7,500తో పాటు అత్యవసర ఆర్థిక సహాయం, వైద్య సహాయం అందిస్తోంది. తమిళనాడులో జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్‌ పథకం సేవా కాలం, వయస్సు ప్రమాణాల ఆధారంగా ఇస్తున్నారు. అసోం రూ.8,000 ఇస్తుంటే, చిన్న ప్రాంతమైన పుదుచ్చేరి సైతం రూ.ఆరు వేలతో పాటు కుటుంబ పెన్షన్‌ సదుపాయం కల్పించింది.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల సంక్షేమం గురించి తరచూ ప్రకటనలు వినిపించినా, గౌరవప్రదమైన పెన్షన్‌ వ్యవస్థ రూపుదిద్దుకోలేదు. పెన్షన్‌ కేవలం జర్నలిస్టుల ఆర్థిక సమస్య కాదు, ఒక వృత్తి గౌరవానికి సంబంధించిన అంశం. వారికి ఇచ్చే పెన్షన్‌ ‘దాతృత్వం’గా కాకుండా ‘గౌరవభృతి’గా పరిగణించాలి. రూ.10వేలకు తక్కువ కాకుండా జర్నలిస్టులకు పెన్షన్‌ పథకం అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అలాగే పథకం అమలు తరువాత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్‌ సవరింపు, జీవిత భాగస్వామికి కుటుంబ పెన్షన్‌, ఆరోగ్య బీమా, అత్యవసర వైద్య సహాయం అందించాలి.

చెన్ను పెద్దిరాజు, సీనియర్‌ జర్నలిస్టు

ఇవి కూడా చదవండి

వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!

Updated Date - Jun 24 , 2026 | 04:45 AM