రాయడం ఉద్యోగం కాదు, అదొక మిషన్!
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:06 AM
‘నెమ్మినీలం’ అనువాద కథా సంపుటితో తమిళ రచయిత జయమోహన్ తెలుగు సాహితీ లోకానికి పరిచయం అయ్యారు. 64 ఏళ్ళ జయమోహన్ జన్మతః మలయాళి కానీ పుట్టిపెరిగిందంతా తమిళనాడులోని నాగర్కోయిల్.
‘నెమ్మినీలం’ అనువాద కథా సంపుటితో తమిళ రచయిత జయమోహన్ తెలుగు సాహితీ లోకానికి పరిచయం అయ్యారు. 64 ఏళ్ళ జయమోహన్ జన్మతః మలయాళి కానీ పుట్టిపెరిగిందంతా తమిళనాడులోని నాగర్కోయిల్. తమిళంలో ఎంతో పాపులర్ అయిన ఆయన సాహిత్యం, ఇప్పుడిప్పుడే ఇతర భారతీయ భాషల్లోకి, ఇంగ్లీషులోకి అనువాదం కావడం మొదలైంది. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బుక్ బ్రహ్మ లిట్ ఫెస్ట్‌లో ఆయనను కలిసే అవకాశం వచ్చింది. అప్పటిలాగే నాకు మళ్ళీ ఎన్నో ప్రశ్నలు. నా ప్రశ్నలన్నింటికీ ఆయన దగ్గర సమాధానాలు ఉంటాయన్న నమ్మకంతో మరలా ఈ సంభాషణ.
ఇంటర్వ్యూ - ప్రసాద్ సూరి
91336 08072
రచయితగా మీ ప్రయాణం ఎలా మొదలైంది?
చిన్నప్పటి నుంచే అమ్మ నన్ను సాహిత్యం చదవమని ప్రోత్సహించింది. ఆమె వల్లే చాలా చిన్నవయసులోనే రచనలు చెయ్యడం మొదలుపెట్టాను. మొదటి కథ నా పదకొండో ఏట రాశాను. నా కథలు ఆ రోజుల్లోనే తమిళంలో ప్రముఖ పత్రికల్లో అచ్చవుతూ ఉండేవి. స్కూలు చదువు పూర్తి చేసుకుని కాలేజ్‌కి వెళ్ళేసరికి నెలకి రెండువందల రూపాయలు నా రచనల మీద నాకు వచ్చేవి. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ, నేను చెప్తున్నది 1970ల చివర, ఎనభైల మొదట్లో. అయితే నా జీవితంలో ఒక ఐదేళ్లకాలం రచనలు చెయ్యలేదు. నా పంతొమ్మిదో ఏట అనొచ్చు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను. దేశదిమ్మరిగా బిచ్చగాడిగా ఆ కాలమంతా గడిపాను. మళ్ళీ తిరిగి 24 ఏట ఇంటికి తిరిగి వెళ్ళాను. అప్పుడు మళ్ళీ నా రచనా వ్యాసంగాన్ని తిరిగి ప్రారంభించాను.
చాలామంది సాహిత్యం, చిత్రలేఖనం లాంటి కళలు పుట్టుకతో రావాలి అంటారు. జన్మతః ఏదైనా రావడం గురించి మీరేమంటారు?
చిన్నప్పుడు పిల్లల్లో మూడు రకాల సెన్సిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, visual sensibility, వీళ్లలో బొమ్మలు బాగా వేసే లక్షణం ఉంటుంది. రెండోది, audio sensibility, వాళ్ళు విన్న స్వరాలను అలాగే పలకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్లలో ఎక్కువమంది సంగీతం వైపు వెళ్తారు. మూడోది, symbolic sensibility, లేదా narrative sensibility. ఇది ఉన్నవాళ్ళు చూసే ప్రతి దృశ్యాన్నీ అక్షరాలుగా మార్చి చెప్పడానికి ప్రయత్నిస్తారు. కథలు చెప్పడానికి, రాయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళు రచయితలుగా పరిణామం చెందే అవకాశం ఉంటుంది.
అయితే బొమ్మలు వేసే వాళ్ళకి లెక్కలు లాంటి సబ్జెక్టుల మీద ఆసక్తి ఉండదు. కానీ సంగీత మీద ఆసక్తి ఉన్నవాళ్ళకి లెక్కలు బాగా వస్తాయి. ఎందుకంటే సంగీతానికి mathsకీ చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అయితే ఈ sensibilitiesని చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకోవడం చాలా ముఖ్యం. దురదృష్టం కొద్దీ మన దేశంలో అలాంటి అవకాశం లేదు. వెస్ట్రన్ దేశాల్లో ఇలాంటి sensibilities ఉన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచే ప్రోత్సహిస్తారు. మొత్తం వ్యవస్థ వాళ్ళు గొప్ప రచయితలుగా, కళాకారులుగా ఎదగడానికి సహాయపడుతుంది. మన దేశంలో ఎంతో ప్రతిభ ఉన్న ఒక కుర్రాడు, బతకడం కోసం వాడి జీవితంలో ఎంతో విలువైన కాలాన్ని ఎక్కడో, ఎవరి దగ్గరో ఉద్యోగం చేస్తూ పోగొట్టుకుంటున్నాడు. అలా ఎంతోమంది ప్రతిభ గల రచయితలని కళాకారులని మనం కోల్పోతున్నాం. నేను రచయితని అవడానికి మా అమ్మ ప్రోత్సాహం తోడైంది. కానీ చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించరు. ప్రసిద్ధ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళి కృష్ణ తొలి కచేరి తన పన్నెండవ ఏట చేశాడు. అంతకు ముందు ఐదేళ్ల వయసు నుంచీ సాధన చేస్తూ ఉన్నాడు. అతను అలాంటి వాతావరణంలో ఉన్నాడు కాబట్టే అది సాధ్యం అయింది.
చిన్నప్పటినుంచి గాకక జీవితంలో ఒక వయసుకి వచ్చాక ఈ కళల మీద ఆసక్తితో సాధన చేసి వాటిని సాధించొచ్చా?
కచ్చితంగా. కానీ అందుకు dedicated practice ఉండాలి. నేను రోజూ పొద్దున్న లేచి రాయడం మొదలుపెడతాను. కొన్ని గంటలపాటూ చదవడంలో గడుపుతాను. నిరంతరం నా మెదడులో కథలకి సంబంధించిన ధ్యానం నడుస్తుంది. నేను కొన్నేళ్లుగా ఒక వెబ్‌సైట్ నడుపుతున్నాను. అందులో కచ్చితంగా రోజూ కొన్ని విషయాలు పోస్ట్ చేస్తాను. ఒక వ్యాసం ఉంటుంది, రెండు తమిళ పదాల వికిపీడియా ఎంట్రీ ఉంటుంది. ఇంకా మరికొన్ని. ఈ వెబ్‌సైట్‌ను రోజూ లక్షా డెబ్బై వేలమంది చదువుతూ ఉంటారు.
మీరు ఔసెపచ్చన్ అనే పాత్రని సృష్టించి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథలు రాసారు. హారర్ కథలూ రాశారని విన్నాను. సీరియస్ రచయితలుగా పిలవబడేవాళ్ళు ఇలాంటి జానర్ ఫిక్షన్‌కు దూరంగా ఉంటారు కదా?
ఏదైనా ఒక రచన చెయ్యడానికి థీమ్, ప్లాట్, జానర్ కంటే ముందు original question ఉండాలి.కొన్ని ఊర్లలో చూస్తూ ఉంటాం– ఒక స్త్రీ, కొందరు వ్యక్తులు పెట్టిన బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయి, దేవత అయింది అంటారు. ఆవిడకి ఒక గుడికట్టి పూజిస్తూ ఉంటారు. ఈ పాయింట్ మీద నేను రాసిన కథలో ఒక కుటుంబాన్ని ఒక సమస్య పీడిస్తూ ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో, కొన్ని తరాల క్రితం జరిగిన ఒక పాపాన్ని వాళ్ళు మోస్తున్నట్టుగా, అది వాళ్ళని వెంటాడుతున్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇక్కడ original question ఏంటంటే, కొన్ని వందల ఏళ్ళ క్రితం జరిగిన ఆ సంఘటనలో మనుషులు ఎవరూ ఇప్పుడు బతికి లేరు, కానీ ఆ పాపం, దానికి జరగాల్సిన ప్రాయశ్చిత్తం ఇంకా ఎలా మిగిలి ఉంది. ఎందుకు అలా? ఒక రచయితగా నన్ను నడిపించే ప్రశ్న ఇది. సీరియస్ సాహిత్యం రాసే రచయితలు ఇలాంటి డిటెక్టివ్స్, క్రైమ్ లాంటి జానర్‌లలో ఫిక్షన్ రాయడానికి ఇష్టపడరు. కానీ రాసేది ఏ జాన్రా అయినా original question ఉండడం చాలా ముఖ్యం. అది దాన్ని కేవల వినోదాత్మక రచనగా కాకుండా ఒక భిన్నమైన రచనగా నిలబెడుతుంది.
ఇంత విస్తృతంగా, రెగ్యులర్‌గా రాస్తూ ఉండటం మీకు ఎలా సాధ్యం?
నేను ముందుగా కథ ఇలా ఉండాలి. ఇలా ఉంటుంది అనుకుని మొదలుపెట్టను. ఒక dream like state లో ఉండి రాస్తాను. రాస్తున్నప్పుడే నా కథ form అవుతుంది. అలా లేకపోతే నేను రాయలేను. కొన్నింటిని తిరిగి చదువుకోను కూడా. చాలాకాలం అయిన తర్వాత మొన్న నా రచన ఒకటి మళ్ళీ చదివి నేను ఆశ్చర్యపోయాను.
ఆ మధ్య, వైరముత్తుకి జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించిన తర్వాత, దాన్ని వ్యతిరేకిస్తూ ఒక లెటర్ రాసారు. అప్పుడు మిమ్మల్ని కౌంటర్ చేస్తూ కొందరు, మీరు కూడా అఖిలన్ అవార్డు తీసుకున్నారు కదా? అని ప్రశ్నించారు. పద్మశ్రీ, సాహిత్య అకాడమీ లాంటి ప్రభుత్వ పురస్కారాలు స్వీకరించని మీరు ఆ అవార్డును ఎలా తీసుకున్నారు?
నా వ్యక్తిత్వం, అభిప్రాయాలు నాకు పుట్టుకతో రాలేదు. ఆ అవార్డు నేను తీసుకున్నప్పుడు నాకు ఇరవై ఆరేళ్ళు, అప్పుడప్పుడే సాహిత్య లోకంలో పేరు తెచ్చుకుంటున్నాను. ఎవరూ చెప్పని విషయం ఏంటంటే, ఆ అవార్డు తీసుకున్న తర్వాత, అదే వేదిక మీద మాట్లాడుతూ తమిళంలో సుందర రామస్వామి, అశోక మిత్రన్‌లు ప్రథమ శ్రేణి రచయితలు అనీ, అఖిలన్ ద్వితీయ శ్రేణి రచయిత అని చెప్పాను. వైరముత్తు మీద కూడా నా అభిప్రాయం అదే.
సమాజంలో ఒక రచయితనని గర్వం చెప్పుకోవడానికి నాకు ధైర్యం చాలడం లేదు. అదేమీ ఉద్యోగం కాదు కదా, నేను చేస్తున్న రచన వల్ల ఈ సమాజానికి కలుగుతున్న మేలు ఏమిటి? లాంటి ప్రశ్నలు నాకు అప్పుడప్పుడు కలుగుతుంటాయి. దానికి మీరేం చెప్తారు?
రాయడం ఉద్యోగం కాదు, అదొక మిషన్. ఒకప్పుడు ఇటలీ, స్పెయిన్ దేశాల నుంచి కొందరు చర్చి ఫాదిరీలు వేల మైళ్ళ సముద్ర ప్రయాణం చేసి, ఇక్కడ మచిలీపట్నం లాంటి ఊళ్లకి వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేశారు. అంత దూరం నుంచి అన్ని కష్టాలు పడి ఇక్కడికి రావడం ఎందుకు? అది వాళ్ళ mission కాబట్టి. నేనూ అలాంటి missionery నే. నేను రచయితననే పొగరు నాకు ఉంది. ఎందుకంటే ఈ రోజు తమిళనాడులో ఉన్న గొప్పగొప్ప రాజకీయ నాయకులు, ధనవంతులు అందరికంటే నేను గొప్పవాడిని. వాళ్ళ దగ్గర ఎంతో డబ్బు ఉండొచ్చు, వాళ్ళు చాలా శక్తివంతులు అయ్యుండొచ్చు కానీ చరిత్రలో మిగిలేది నేను మాత్రమే. నేను ముప్పై ఏళ్ళ క్రితం రాసిన రచన మళ్ళీ రీప్రింట్ చేసినప్పుడు, దాంట్లో footnotes ఇచ్చారు. అది నేను రాసిన చారిత్రక నేపథ్యం గురించి చెప్పడానికి. రచయిత ఒక చారిత్రక పురుషుడు అవుతాడు. పుదుమైపిత్తన్ (ఓ ప్రముఖ తమిళ రచయిత) ఉన్న కాలంలోనే సత్యమూర్తి, (టంగుటూరి) ప్రకాశం లాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఈ రోజుకీ తమిళనాడులో పుదుమైపిత్తన్‌ను తలచుకుంటారు. భవిష్యత్తులో నన్ను కూడా అలాగే తలుచుకుంటారు. రచయిత, రాయడం ఒక mission గా పెట్టుకోవాలి. పాఠకుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం రచనలు చెయ్యకూడదు.