మీడియా ఈవెంట్‌గా ఆధునిక యుద్ధం
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:38 AM
జాన్ బోద్రియా (Jean Baudrillard, 1929–2007) అనే ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త, తత్వవేత్త ఆధునిక సమాజంపై అత్యంత ఆలోచింపజేసే విమర్శలు చేసిన వాళ్లలో ప్రముఖుడు.
‘‘All of this is a sign that we have entered a deceptive world in which an entire culture labours assiduously at its counterfeit.’’
– Jean Baudrillard
జాన్ బోద్రియా (Jean Baudrillard, 1929–2007) అనే ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త, తత్వవేత్త ఆధునిక సమాజంపై అత్యంత ఆలోచింపజేసే విమర్శలు చేసిన వాళ్లలో ప్రముఖుడు. 1991లో ఆయన రాసిన ‘ది గల్ఫ్ వార్ డిడ్ నాట్ టేక్ ప్లేస్’ (‘గల్ఫ్ యుద్ధం జరగలేదు’) అనే వ్యాసాల సంపుటి సమకాలీన యుద్ధాల తీరును విశ్లేషించడానికి ఒక బలమైన సిద్ధాంతాన్ని అందిస్తున్నది. దీని ప్రకారం, ఆధునిక యుద్ధం అనేది పరస్పర ప్రాణనష్టం, భూభాగాల ఆక్రమణతో కూడిన సంప్రదాయ ఘర్షణ కాదు. అది మీడియా, సాంకేతికత ద్వారా నియంత్రించబడే ఒక హైపర్ రియల్ సంఘటన. ఇక్కడ భౌతిక వాస్తవికత స్థానాన్ని సిమ్యులేషన్ ఆక్రమిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణల నేపథ్యంలో బోద్రియా ఆలోచనలు భవిష్యత్తును ముందే ఊహించినట్టుగా కనిపిస్తాయి.
ఈ పుస్తకంలో అమెరికా–ఇరాక్ మధ్య 1990ల్లో జరిగిన యుద్ధం అసలు సంప్రదాయ అర్థంలో ఒక యుద్ధమే కాదు అని బోద్రియా విప్లవాత్మక వాదన చేశారు. అది కేవలం ముందే ప్రోగ్రామ్ చేయబడిన, ఒక పక్షానికి మాత్రమే పూర్తి లాభం చేకూర్చే సాంకేతిక, మీడియా ప్రదర్శన. అమెరికా నేతృత్వంలోని కూటమికి ఉన్న అత్యాధునిక సాంకేతికత, ప్రెసిషన్ బాంబులు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామగ్రి, శాటిలైట్ నెట్‌వర్క్, సీఎన్‌ఎస్ చానల్ చూపించిన నియంత్రిత వార్తల వల్ల ఇరాక్ శక్తులు యుద్ధం మొదలు కాకముందే నిర్వీర్యమైపోయాయి. పాశ్చాత్య ప్రేక్షకులు టీవీల్లో కేవలం వీడియోగేమ్స్ లాంటి స్మార్ట్ బాంబుల దృశ్యాలను చూశారు తప్ప, ఇరాక్ ప్రజల మరణాలు, బాధలు మీడియాలో ఎక్కడా కనిపించలేదు. ఈ యుద్ధం ముందే గెలిచిన పందెం. ఇది కేవలం ప్రచ్ఛన్న యుద్ధం తర్వాతి కాలంలో అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, ప్రదర్శించడానికి మాత్రమే ఉపయోగపడింది.
బోద్రియా ఉద్దేశంలో నేడు మీడియా, సోషల్ మీడియాలో కృత్రిమ ప్రతిరూపాలు లేదా భ్రమలు ఎటువంటి మూలాధారం లేకుండానే స్వతంత్రంగా పుట్టుకొస్తున్నాయి. ఈ నకళ్లు ఎంత శక్తిమంతంగా మారాయంటే, అసలైన వాస్తవం కంటే ముందు ఇవే సమాజంలో ప్రచారంలోకి వస్తున్నాయి. కాలక్రమేణా అసలు వాస్తవాన్ని పూర్తిగా రూపుమాపి తామే నిజమైన వాస్తవంగా చలామణి అవుతున్నాయి. దీనినే బోద్రియా హైపర్ రియాలిటీ (నిజం కంటే ఎక్కువ నిజంలా అనిపించడం) అన్నాడు. ఎంపిక చేసిన దృశ్యాల ద్వారా ప్రపంచ ప్రేక్షకులు ఒక వర్చువల్ థియేటర్‌లో భాగస్వాములవుతున్నారని, దీనివల్ల యుద్ధం కలిగించే నిజమైన మానవతా విధ్వంసాన్ని వాళ్లు గుర్తించలేకపోతున్నారని బోద్రియా అంటాడు.
బోద్రియా సిద్ధాంతం వర్తమాన అంతర్జాతీయ సంక్షోభానికి, యుద్ధానికి స్పష్టంగా వర్తిస్తుంది. 1991 నాటి గల్ఫ్ యుద్ధం లాగే, ఈ యుద్ధం కూడా ఒక హైటెక్ మీడియా ప్రదర్శన. మీడియా, సోషల్ మీడియాల ద్వారా డ్రోన్ ఫుటేజ్, లైవ్ స్ట్రయిక్ వీడియోలు, క్షిపణి నిరోధక యానిమేషన్లు, అల్గారిథమిక్ న్యూస్ ఫీడ్స్, బ్రీఫింగ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ముంచెత్తాయి. ఆయుధ సంపత్తిలో అమెరికా–ఇజ్రాయెల్ దేశాలకూ, ఇరాన్‌కూ మధ్య సాంకేతిక అసమతుల్యత బోద్రియా చెప్పిన ‘ముందే గెలిచిన యుద్ధం’ భావనను గుర్తుకు తెచ్చింది. గెలుపు లేదా ప్రతిఘటన లేదా పాలనా నిర్మూలన అనే మీడియా కథనాల వెనుక క్షేత్రస్థాయిలో జరిగిన నిజమైన ప్రాణనష్టం, విధ్వంసం (ముఖ్యంగా ఇరాన్, లెబనాన్‌లో) మరుగునపడిపోయాయి.
‘‘గల్ఫ్ యుద్ధం జరగలేదు’’ అని బోద్రియా అన్నప్పుడు అక్కడ బాంబులు పడలేదనో లేదా ప్రాణనష్టం జరగలేదనో ఆయన ఉద్దేశం కాదు. ఆయన చెప్పేదల్లా క్షేత్రస్థాయిలో జరిగే యుద్ధానికీ, మీడియా మనకు టీవీలు, ఇంటర్నెట్ స్క్రీన్ల మీద చూపే యుద్ధానికీ అస్సలు సంబంధం ఉండదనే. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలనే తీసుకుంటే– అత్యాధునిక క్షిపణి దాడులు, హైటెక్ సైనిక ప్రదర్శనలు, ప్రతీకార చర్యలన్నీ మనకు మీడియా/సోషల్ మీడియాల్లో ఒక హాలీవుడ్ సినిమా లాగానో లేదా ఒక వీడియో గేమ్ లాగానో కనిపిస్తాయి. మీడియా సృష్టించే ఈ దృశ్యరూపమే అసలైన యుద్ధంగా ప్రజల ముందుకు వస్తుంది.
ఆధునిక యుగంలో సైనిక బలాల కంటే సమాచార దాడి, ప్రచారాల మాయాజాలమే యుద్ధాల గమనాన్ని శాసిస్తున్నది. యుద్ధ రంగంలో ఎవరు గెలిచారు, ఎంత నష్టం జరిగిందన్న నిజానిజాల కంటే, ఏ దేశం మీడియాను సమర్థంగా వాడుకుని ప్రపంచాన్ని తమవైపు తిప్పుకోగలిగింది అన్నదే ముఖ్యం అవుతున్నది. ఒకవైపు అత్యంత దారుణమైన దాడులు జరుగుతున్నట్లు దృశ్య రూపంలో వార్తలు వస్తుండగానే, మరోవైపు అంతే వేగంగా అంతర్జాతీయ ఒప్పందాలు, చర్చలు తెరవెనుక జరిగిపోతుంటాయి. ఈ గందరగోళంలో ఏది నిజమైన వ్యూహమో, ఏది కేవలం ప్రపంచాన్ని భ్రమల్లో ఉంచడానికి ఆడుతున్న నాటకమో గుర్తించడం సామాన్యుడికి అసాధ్యంగా మారుతోంది.
2018–2020 మధ్య కాలంలో ట్రంప్ ప్రసంగాలు, ఇరాన్ పట్ల ఆయన అవలంబించిన విధానాలను బోద్రియా సిద్ధాంతాల కోణంలో పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వ్యక్తమవుతాయి. అణ్వాయుధ ఒప్పందం (JCPOA) నుంచి అమెరికా వైదొలగడం, ఇరాన్‌పై గరిష్ఠ స్థాయి ఆంక్షలు విధించడం, 2020లో ఖాసిం సులేమానీని హతమార్చడం వంటి కీలక ఘటనావళిని బోద్రియా చెప్పిన మీడియా తంతు, భ్రమల (సిమ్యులేషన్) కోణంలో చూడవచ్చు. సులేమానీ వల్ల ముంచుకొస్తున్న ముప్పును అడ్డుకున్నామనో లేదా దేశానికి లభించిన ఘన విజయాలనో ట్రంప్ తన ట్వీట్లు, బ్రీఫింగ్‌ల ద్వారా నాటకీయంగా ప్రచారం చేసేవాడు. బోద్రియా దృష్టిలో ఇవన్నీ క్షేత్రస్థాయి నిజాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా చలామణి అయ్యే ఒక కృత్రిమ వాస్తవికత సృష్టి మాత్రమే.
ట్రంప్ శైలి, తప్పుడు వార్తల చుట్టూ సాగిన ఆయన ప్రవర్తన వాస్తవాల కంటే మీడియా సృష్టించిన ప్రతిబింబాలకు ఎక్కువ దగ్గరగా ఉంటాయి. బోద్రియా పరిభాషలో చెప్పాలంటే, యుద్ధం లేదా దానిని నివారించడం అనేది క్షేత్రస్థాయి వాస్తవికతగా కంటే కేవలం ఒక మీడియా ఈవెంట్‌గా మారిపోయింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమైందనో లేదా కొత్త యుద్ధాలు రాకుండా ఆపగలిగామనో బైటకు వినపడే వాదనలన్నీ ఈ కృత్రిమ ప్రపంచంలో తమకు తామే నిజాలుగా చలామణి అయ్యే ప్రయత్నం చేస్తుంటాయి. ఇక్కడ అబద్ధాలు అంటే ఏవో కొన్ని తప్పుడు మాటలు కావు, సమాజాన్ని భ్రమల్లో ఉంచే ఒక వ్యవస్థీకృత రాజకీయ విధానం లక్షణాలు.
- ప్రొ. బి.తిరుపతిరావు