Share News

స్వప్నాలకూ ఆదర్శాలకూ అక్షరవంతెన!

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:21 AM

మొఘల్ చక్రవర్తులు ‘జీవితాలు శాశ్వతం కాదు, కట్టడాలే శాశ్వతం’ అని భావించి అనేక అద్భుతమైన కట్టడాలను నిర్మించారు.

స్వప్నాలకూ ఆదర్శాలకూ అక్షరవంతెన!

మొఘల్ చక్రవర్తులు ‘జీవితాలు శాశ్వతం కాదు, కట్టడాలే శాశ్వతం’ అని భావించి అనేక అద్భుతమైన కట్టడాలను నిర్మించారు. నెహ్రూ కూడా అట్లనే భారతదేశ ప్రజల కోసం తన తొమ్మిది సంవత్సరాల జైలు జీవితంలో మూడు ప్రభావశీలమైన, ప్రపంచ ప్రఖ్యాత ఉద్గ్రంథాలను రచించాడు. అవి: 1) గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ 2) ఆటోబయోగ్రఫీ 3) డిస్కవరీ ఆఫ్ ఇండియా.

ఇంట్లో ఒంటరితనంతో బాధపడుతున్న పదిహేడు సంవత్సరాల ఏకైక కూతురుకు, ఆమె పుట్టినరోజు సందర్భంగా జైలులో ఉన్న తండ్రి ఆరంభించిన లేఖల పరంపర, తర్వాత కాలంలో ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’గా ప్రచురితమయింది. అందులోని భావుకత చదువరులను పరవశుల్ని చేస్తుంది. ‘నీ పుట్టినరోజు సందర్భంగా ఎందరో ఎన్నో అపురూపమైన కానుకలను ఇస్తుండవచ్చు, కానీ నేను మాత్రం నీకు ఈ కానుకలు ఇవ్వలేను, ప్రపంచ చరిత్రను పరిచయం చేసే ఈ లేఖలను తప్ప! ఇవి కూడా నీకు అందుతాయో లేదో నాకు తెలియదు’ అని ఆవేదనతో తన మొదటి లేఖను ప్రారంభిస్తారు. మరో లేఖలో నువ్వు ఫ్రెంచ్ వీరనారి ‘జోన్ ఆఫ్ ఆర్క్’లా రూపొందాలి అని ఉత్తేజపరుస్తారు. ఆమెను ఆదర్శమూర్తిగా భావించిన ఆ కూతురు ఇందిర కూడా ఆమె లాగానే భారత ప్రజల కోసం తదనంతరం తన ప్రాణాలను అర్పించింది. ‘దూరాలను కలిపే దారాలే ఉత్తరాలు’ అన్న మాటను నెహ్రూ తన లేఖల ద్వారా నిజం చేశారు. తన స్వప్నాలను, తన ఆదర్శాలను అక్షరాల వంతెన సహాయంతో కూతురితో పంచుకుంటారు. ‘ఒకవేళ నేను ఈ రాజకీయాలలోకి రాకపోతే ఈ సమయానికి కశ్మీరు హిమపర్వత ప్రాంతాల్లోనో, ఆ పచ్చిక బయళ్ల మైదానాల్లోనో, సెలయేరుల పక్కన ఒంటరి సంచారిలా తిరుగాడేవాడిని’ అని తన సంచార ప్రియత్వాన్ని తన కూతురు ‘ఇందిర ప్రియదర్శిని’తో కలలు కంటారు.


1936లో స్పెయిన్‌లో జనరల్ ఫ్రాంకో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు అంతర్యుద్ధం చేస్తున్నదానికి ప్రతిస్పందనగా కూతురుకు లేఖ రాస్తూ, ‘నేను ఈ జైలు గోడల మధ్య బందీగా లేకపోతే ఈ క్షణంలో తుపాకీ చేతబూని ప్రజలతో పాటు ఆ వీధి పోరాటాలలో పాల్గొనేవాడిని’ అంటూ తన ఆవేశాన్ని ప్రకటించారు.

ఈ మూడు ‘బృహత్తర గ్రంథాలు’ ఆయన ‘మేధా విరాట్ స్వరూపానికి’ కొండ గుర్తులు. తన రచనలు, ఉద్రేకపూరిత ఉపన్యాసాలు, ఉన్నత లక్ష్యాలతో ఆనాటి యువతరాన్ని స్వాతంత్ర్యోదయ కాలంలోనే కాక, 1960ల మధ్యదాకా ప్రభావితం చేశారు. చివరి క్షణం వరకూ ఆయన శారీరక చురుకుదనం అందరినీ అబ్బురపరిచేది. ఆయన నడక నడకలా కాక పరుగులా కనబడేది. ఆ వారసత్వం ఆయన కూతురికి కూడా సంక్రమించింది. ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ ప్రేరణతో ప్రఖ్యాత సినీ దర్శకుడు శ్యాం బెనెగల్‌ 1980లలో ‘భారత్ ఏక్ ఖోజ్’ దూరదర్శన్ టీవీ సీరియల్ నిర్మించటం మనందరికీ తెలిసిన సంగతే. యువతీయువకులు ఎవరైనా ఆటోగ్రాఫ్ అడిగితే నీషే కొటేషన్ ‘Live Dangerously’ అని రాసిచ్చేవారు. ‘సాహసోపేతంగా జీవించండి’ అని దానర్థం. తనను ఎవరైనా ‘పండిట్ జీ’ అని సంబోధిస్తే చిరాకుపడేవారు. ఆ పదంలో ఛాందసత్వం, మతవాసన దాగివుందని ఆయన అభిప్రాయం. జీవితాంతం శాస్త్రీయ విజ్ఞానాన్ని సంపూర్ణంగా నమ్మి ఆచరించిన ఆయన తన అంత్యక్రియలను మతాచారాలతో ఛాందస పద్ధతులలో నిర్వహించరాదని, చితాభస్మాన్ని మాత్రం హిమాలయ పర్వత సానువులపై ఉన్న జీవనదుల ప్రవాహాలలోనూ, రైతులు శ్రమించే పంటపొలాల పైనా వెదజల్లాలని తన వీలునామాలో లిఖించి, ఈ దేశంపై తనకున్న ప్రేమను లోకవిదితం చేసిన ‘దేశభక్తుడు’ ఆయన. ప్రధానమంత్రి అన్న అహంకారం, గర్వం, భేషజం ఆయనకు ఉండేది కాదు. ‘I am the First Public Servant of India’ అని అనేక సభలలో ప్రకటించేవారు. జవహర్‌లాల్ నెహ్రూ గతించి ఆరు దశాబ్దాలు గడిచినా ఆయన ఆదర్శాలు, ఆశయాలు ప్రజలందరిలో సజీవంగానే ఉన్నాయి.

- పరవస్తు లోకేశ్వర్

(నేడు నెహ్రూ జయంతి)

Updated Date - Nov 14 , 2026 | 01:22 AM