Share News

‘జంతర్‌ మంతర్‌’ చిరుగాలికి పేలపిండేనా?

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:31 AM

యువ చైతన్యం కెరటాలై ఎగసిపడి మోదీ ప్రభుత్వం మెడలు వంచింది. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలన్న తమ ముఖ్య డిమాండ్‌ను...

‘జంతర్‌ మంతర్‌’ చిరుగాలికి పేలపిండేనా?

యువ చైతన్యం కెరటాలై ఎగసిపడి మోదీ ప్రభుత్వం మెడలు వంచింది. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలన్న తమ ముఖ్య డిమాండ్‌ను సాధించుకుని ‘జెన్‌ జీ’ చరిత్ర సృష్టించింది. ఈ పరిణామాన్ని చూసి దేశం అబ్బురపడిపోయింది. అంతవరకూ మిన్నకుండిన ప్రతిపక్షం కూడా ఈ యువతకు అండగా నిలిచి పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. పేపర్ లీక్‌పై చర్చకు ప్రభుత్వాన్ని ఒప్పించింది.

పుట్టి మూడు నెలలు కూడా నిండని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అతి తక్కువ సమయంలో సృష్టిస్తున్న ప్రకంపనల తీవ్రత ఎంత, అది రిక్టర్ స్కేల్ పైన ఏ మేరకు రికార్డు అవుతుందీ అన్నది నేటి కీలక ప్రశ్న. ఇటీవల సీజేపీ తమ శాశ్వత లక్ష్యాలతో ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది: ఉన్నత న్యాయమూర్తులను ప్రభుత్వ ప్రలోభాలకు అతీతం చేయడం, ఎన్నికల కమిషన్‌ను కఠిన జవాబుదారీతనం పరిధిలోకి తేవడం, తమ ఓటును తొలగించారని పౌరుల నుంచి ఫిర్యాదు అందిన తక్షణమే స్పందించి తగిన న్యాయం చేయడం, పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు రాజ్యాంగంపై, రాజకీయాలపై నిష్పక్షపాత అవగాహన కలిగేలా చూడడం, మహిళలకు చట్టసభల్లో 55 శాతం రిజర్వేషన్లు కల్పించడం... ఇవన్నీ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు.

దేశంలో పేరుకుపోయిన నిరుద్యోగంపై దృష్టి పెట్టి కాక్రోచ్‌ జనతా పార్టీ అవతరించింది. నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోలుస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్య అందుకు ఆలంబన అయింది. అలాగే నీట్ పరీక్ష లీక్ కూడా యువతను, విద్యార్థులను సమీకరించడానికి కేంద్ర బిందువుగా ఉపయోగపడింది. అయితే విద్యావ్యవస్థను బాగు చేయాలని కోరిన ఉద్యమకారులు ఎలా బాగు చేయాలో చెప్పే ప్రత్యామ్నాయ ప్రణాళికను సూచించడం లేదు. వారి దృష్టిలో విద్యావంతులైన నిరుద్యోగులు మాత్రమే అసలు నిరుద్యోగులు అని కూడా స్పష్టపడుతున్నది. అసంఖ్యాకంగా ఉన్న చదువులేని గ్రామీణ నిరుద్యోగ యువత వీరిని ఆకర్షించటం లేదు. అలాగే బీజేపీ పాలన బలిపీఠంపైన ఆహుతి అవుతున్న మతసామరస్యం, సెక్యులరిజాల వైపు వీరు కన్నెత్తి కూడా చూడటం లేదు. దేశ రాజ్యాంగ జీవనం, సామరస్య మనుగడ మూలాలను పిప్పి చేస్తున్న హిందూత్వను గురించి ఈ ఉద్యమ నిర్మాతలు బొత్తిగా పట్టించుకోవడం లేదు. కుంగి కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థ, జారుడు బండ మీది రూపాయి విలువ వగైరాలేవీ వీరి జాబితాలో లేవు. అసలు రైతు సమస్యల జోలికే పోవడం లేదు. సునిశితంగా పరిశీలిస్తే ప్రస్తుత కేంద్ర పాలకులకు ఎటువంటి పేచీ లేని డిమాండ్లతో ఈ ఉద్యమం రూపుదిద్దుకున్న దృశ్యం కళ్లకు కడుతున్నది. దేశం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై దృష్టి సారించకుండా ఈ ఉద్యమ నిర్మాణం జరిగిందని అనుకోడానికి ఆస్కారం కలుగుతున్నది.


జంతర్ మంతర్ ఆందోళనకు శిఖరోన్నతమైన మద్దతు తెలుపుతున్న మధ్యతరగతికి కూడా దేశ మౌలిక సమస్యల పట్ల ఏ మాత్రం ఫికరు లేదనిపిస్తున్నది. ఇప్పటివరకు తలెత్తిన రకరకాల బాధిత వర్గాల ఆందోళనల పట్ల సహానుభూతితో స్పందించని మధ్యతరగతి వర్గం కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమాన్ని మాత్రం ప్రాణప్రదంగా చూసి, దాని ఉద్యమాన్ని నెత్తినపెట్టుకుని మోయడం గమనించవలసిన విషయం. సరిగ్గా నాడు అన్నా హజారే ఉద్యమానికి అండగా నిలిచిన చందంగానే ఈ కాక్రోచ్‌ జనతా పార్టీ ఉద్యమానికి కూడా మధ్యతరగతి నుంచి మద్దతు వస్తున్నది. ఆయన ఆందోళన లక్ష్యంగా చేసుకున్న లోక్‌పాల్ లేదా జన లోక్‌పాల్ తదనంతర కాలంలో ఎందుకూ ఉపయోగం లేనివిగా ఎలా తెల్లారిపోయాయో చూశాం. ఇప్పుడు ఈ ఉద్యమ లక్ష్యాలూ అలాగే నీరుగారిపోతాయా? ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించగానే ఈ యువత కూడా హుర్రే! అంటూ గాలిలో తేలిపోయి ఇంటి దారి పట్టిపోయిందా? ఇంత సంఘటిత యువశక్తి అలా చిరుగాలికి పేలపిండిలా చెదిరిపోతే మళ్లీ ఇటువంటి మహత్తర ప్రతిఘటన గూడుకట్టుకునేదెప్పుడు? పౌరసత్వ సవరణ చట్టం పైన ఢిల్లీ వీధులు భగ్గుమన్నప్పుడు దేశంలోని మధ్య తరగతి కానీ, ఆ వర్గపు మేధావి బృందం కానీ ఇలా స్పందించలేదు. అత్యంత ఆవేదనాభరిత స్థితిలోని ఆదివాసీల పాదాల కింది కొండలను ఆక్రమించుకోడానికి పారించిన రక్తాన్ని చూసి ఈ మధ్యతరగతి వర్గీయులు కంటతడి పెట్టుకోలేదు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు అత్యంత ప్రగతి నిరోధక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో 2020–21లో ఏడాది పొడుగునా సాగిన మహోధృత రైతు ఉద్యమం గతి ఏమైంది? వారి డిమాండ్‌ను అంగీకరించి ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకున్న ప్రభుత్వం ఆ తర్వాత మద్దతు ధరలు మున్నగు కీలక అంశాలపై చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పి మాట తప్పలేదా? అదే రైతులు ఇప్పుడు తమ కాళ్లకింది నేలను కదిలిస్తున్న అమెరికాతో వాణిజ్య ఒప్పందం వంక నిశ్చేష్టులై చూడడం లేదా? అప్పటి స్థాయి ఉద్యమాన్ని వీరు మళ్లీ నిర్మించగల స్థితి కనిపిస్తున్నదా? అప్పుడు ఆ రైతు ఉద్యమం ఆ తదుపరి ఎన్నికల్లో బీజేపీని మట్టిగరిపించలేకపోయింది. ఇప్పుడు అతి పరిమిత లక్ష్యంతో జరుగుతున్న సీజేపీ ఉద్యమం దానిని ఏమి చేయగలుగుతుంది?


ఎన్నికలింకా దూరంలో ఉన్నాయి. ఉన్నట్టుండి ఎగసిన ఈ ఉద్యమ కెరటం పడిపోకుండా ఎంతకాలం నిలబడుతుంది? అనేది కొట్టిపారేయడానికి వీలు లేని ప్రశ్న. రాజకీయ కోణంలో మరో అనుమానం కూడా వ్యక్తమవుతున్నది. ప్రాంతీయ పార్టీలను ఒక్కొక్కటిగా స్వాహా చేస్తున్న బీజేపీ ప్రతిపక్ష రహిత భారతాన్ని సాధించాలనుకుంటున్నది. అందుకు అడ్డంకిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా నమిలి మింగేసింది. కాంగ్రెస్‌ను సైతం తొక్కేయడానికి, సమాజ్‌వాదీ వంటి పార్టీలనూ అటకెక్కించడానికి కంకణం కట్టుకుని తానే ఈ ‘జెన్‌ జీ’ను తన ప్రయోగశాలలో సృష్టించిందనే వారి మాట నమ్మదగినది కాదు. అదే నిజమయితే దీనిని లాలూచీ కుస్తీ అనుకోవలసి వస్తుంది. అలా కాకూడదని కోరుకోవడం మినహా చేయగలిగేదేముంది?

గార శ్రీరామమూర్తి

సీనియర్‌ జర్నలిస్ట్‌

Also Read:

వర్షాకాలంలో ప్రయాణం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఇంట్లో గులాబీ మొక్క పెంచుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Updated Date - Jul 31 , 2026 | 12:31 AM