సింహాసనం వణికింది!
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:33 AM
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నియంతను ఒక హాస్యాస్పదమైన కేతిగాడిగా చూపించడం ద్వారా నియంతల గురించి ప్రజల్లో పేరుకుపోయిన భయాన్ని తొలగించడానికే తాను ‘ది గ్రేట్ డిక్టేటర్’ సినిమా తీశానన్నాడు...
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నియంతను ఒక హాస్యాస్పదమైన కేతిగాడిగా చూపించడం ద్వారా నియంతల గురించి ప్రజల్లో పేరుకుపోయిన భయాన్ని తొలగించడానికే తాను ‘ది గ్రేట్ డిక్టేటర్’ సినిమా తీశానన్నాడు చార్లీ చాప్లిన్. ఢిల్లీలో బొద్దింకలూ అదే పని చేశాయి. నియంతలు కూడా భయపడతారు. దిగివస్తారు. వెనక్కి తగ్గుతారు. అవసరమైతే తమ మంత్రులను కూడా బలి ఇస్తారు.
ఇంతకాలం ఒక నారటివ్‌ను మన చేత నమ్మించారు: భారత ప్రధాని సర్వశక్తిమంతులు, సర్వజ్ఞులు. వారు అనుకున్నదే జరుగుతుంది. ఎంతటివారైనా వారి పాదాక్రాంతం కావాల్సిందే. వారు హిమాలయాలంత ఎత్తులో ఉంటే, దేశంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తూర్పు కనుమల్లోని చిన్న గుట్ట మాత్రమే. ప్రజాస్వామ్యానికి మూడు మూలస్తంభాలైన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు, అనధికారికంగా నాలుగో స్తంభంగా భావించే మీడియా– అన్నీ వారి కనుసన్నల్లోనే కదులుతున్నాయనే భావనను ప్రజల్లోకి నెట్టారు. ఈ భావన ఎంత బలంగా మారిందంటే... ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న ప్రశ్న కంటే, అధికారాన్ని ఎదిరించడం సాధ్యమా కాదా అన్నదే అసలు ప్రశ్నగా మారిపోయింది.
షాహీన్ బాగ్ వచ్చింది, వాళ్లను పాకిస్థానీయులన్నారు. రైతులు ఉద్యమించారు, వాళ్లను ఖలిస్థానీయులన్నారు. మహిళా రెజ్లర్లు న్యాయం అడిగితే, వారి మీదే నిందల దాడులు చేశారు. ఈ ఉద్యమాలన్నీ ప్రజాస్వామ్యానికి అవసరమైన ప్రశ్నలనే లేవనెత్తాయి. కానీ వాటికి ఒక పరిమితి ఉంది. కాబట్టి వాటి మీద ఒక నిర్దిష్ట ప్రయోజనాలున్న సామాజికవర్గాల ఉద్యమాలంటూ ముద్ర వేయగలిగారు. ఆ విధంగా ఈ ఉద్యమాలను మిగతా సమాజం నుంచి వేరు చేయడం అధికారానికి సులభమైంది.
కానీ బొద్దింకల ఉద్యమం ఆ వ్యూహాన్ని తలకిందులు చేసింది. ఇది ఒక సామాజిక వర్గం ఉద్యమం కాదు. ఒక మత ఉద్యమం కాదు. కుల ఉద్యమం కాదు. ఇది పిల్లల ఉద్యమంగా మొదలై క్రమంగా తల్లిదండ్రుల ఉద్యమంగా విస్తరించింది. చివరికి, దేశం మొత్తం తన పిల్లల భవిష్యత్తు గురించి ప్రశ్నించే ఉద్యమంగా మారింది.
బొద్దింక అన్న అవమానాన్ని వాళ్లు ఆత్మగౌరవంగా మార్చుకున్నారు. ‘‘పిల్లలు ఏం చేస్తారు?’’ అన్న చిన్నచూపును ‘‘పిల్లలు ఏదైనా చేయగలరు’’ అనే సత్యంగా మార్చారు. అమ్మాయిలు ఢిల్లీ వీధుల్లో నిలబడి గోదీ మీడియాను ప్రశ్నిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ‘‘మమ్మల్ని పాకిస్థానీయులంటున్నారు. పాకిస్థాన్ వెళ్లి బిర్యానీలు తిన్నవాళ్లు ఎవరు?’’ అని వాళ్లు అడిగారు. ఆ ఒక్క ప్రశ్నలోనే ఎన్నో సంవత్సరాల రాజకీయ ప్రచారానికి సమాధానం ఉంది. ‘‘మేము నమ్మే దేవుని ఆలయాలను మూసివేశారు. కానీ అల్లా ఇంటినీ, గురుద్వారాలనూ మా కోసం తెరిచి ఉంచారు’’ అని హిందూ సమూహం చెబుతుందని ఎవరూ ఊహించి ఉండరు. మతాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించే వారికి అది చాలా అసౌకర్యకరమైన వ్యాఖ్య.
ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి దళితుడా కాదా అని ప్రజలు చూడలేదు. అతను తమ సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళుతున్నాడా లేదా? అన్నదే చూశారు. ఇది చిన్న విషయం కాదు.
నీట్ ప్రశ్న పత్రాల లీక్ నుంచి మొదలైన డిమాండ్ మరింత పెద్దదైంది. ‘‘కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ప్రభుత్వం ఇంకా బెట్టుచేస్తే, ప్రధానమంత్రి రాజీనామా చేయాలని కూడా అడగగలం’’ అన్న స్థాయికి ఉద్యమం చేరింది. అదే కీలక మలుపు. గత పన్నెండు సంవత్సరాల్లో ఏ పార్టీ అయినా, ఏ సంఘమైనా, ఏ ఉద్యమమైనా సింహాసనాన్ని ఈ స్థాయిలో భయపెట్టిందా? బహుశా లేదు. ఇప్పుడు సింహాసనం బెదిరింది. ముప్పు తన వైపుకే వస్తున్నప్పుడు, ఒక మంత్రిని వదిలించుకోవడం మంచిదని సింహాసనం భావించింది.
ఢిల్లీలో విద్యార్థినులు ఫైజ్ అహ్మద్ ఫైజ్ గీతాన్ని పాడుతూ తిరిగారు. ‘‘కిరీటాలు గాల్లో ఎగురుతాయి. సింహాసనాలు పక్కకు ఒరుగుతాయి’’. ఆ గీతం తన ప్రభావాన్ని కోల్పోలేదు. ఎందుకంటే చరిత్రలో ఏ సింహాసనమూ శాశ్వతం కాదు.
మాయల ఫకీరు ప్రాణం ఎక్కడుందో ప్రజలకు ఇప్పుడు తెలిసిపోయింది. అది ఒక మంత్రిలో లేదు. అది ఒక పార్టీ కార్యాలయంలో లేదు. అది ప్రజల భయంలో ఉంది. ఆ భయం పోయిన రోజు... మాయల ఫకీరు శక్తులన్నింటినీ కోల్పోతాడు.
ఈ ఉద్యమం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా నిరూపించింది. నాయకుడు అన్నీ తాను కాకూడదు. ప్రజలు ఉద్యమించేలా చేయాలి. ఇది సీట్ల కోసం, పదవుల కోసం, కూటముల కోసం పరస్పరం తగువులాడుకుంటూ రోజురోజుకూ బలహీనపడుతున్న విప క్షాలకు ఒక గుణపాఠం. ప్రజల సమస్యలను ముందుకు పెట్టండి. ప్రజలను వీధుల్లోకి తీసుకురండి. ప్రజలకు నాయకత్వం అప్పజెప్పండి. అదే ప్రజాస్వామ్యం.
ఒక మంత్రిని తప్పించినంత మాత్రాన నీట్ పరీక్షా వ్యవస్థ మారలేదు. కార్పొరేట్ విద్యా సామ్రాజ్యం కూలిపోలేదు. ప్రశ్న పత్రాల లీకేజీలకు శాశ్వత పరిష్కారం రాలేదు. అయినప్పటికీ ఇది ఒక మహత్తరమైన విజయమే! ఎందుకంటే, నిరాశతో నిండిన వాతావరణంలో, అధికారాన్ని ప్రశ్నించడం సాధ్యమేనని ఇది నిరూపించింది.
ఈ విజయం ఒక్కరోజులో రాలేదు. సర్ ప్రక్రియతో ఓ జ్ఞాని దేశంలో బోలెడంత అభాసుపాలయ్యారు. ప్రజా సమస్యల్ని లేవనెత్తేవారిని బొద్దింకలంటూ ఇంకో న్యాయమూర్తి సూర్యకాంతులు వెదజల్లారు. అలా తిట్టు నుంచి బొద్దింకల పార్టీ పుట్టింది. జనం నవ్వారు. ‘‘ఇదో పిల్లల వ్యవహారం’’ అన్నారు. అప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ల చేతికి నీట్ ప్రశ్న పత్రాల లీక్ అనే ఆయుధాన్ని అందించారు.
అభిజిత్ దీప్కే దాన్ని వరంగా చూశాడు. కళ్లకు అద్దుకున్నాడు. విద్యార్థుల ఆగ్రహాన్ని ఉద్యమంగా మార్చాడు. ఆ తరువాత లద్దాఖ్ ఉద్యమ నాయకుడు, ప్రజా శాస్త్రవేత్తగా పేరుగాంచిన సోనమ్ వాంగ్‌చుక్ రంగంలోకి వచ్చాడు. ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులూ జంతర్ మంతర్ వైపు చూడటం మొదలుపెట్టారు. పిల్లల ప్రశ్న తల్లిదండ్రుల ప్రశ్నగా మారింది. తల్లిదండ్రుల ప్రశ్న దేశ ప్రశ్నగా మారింది. మధ్య ఆసియాలో అరబ్ స్ప్రింగ్. శ్రీలంకలో ప్రజా తిరుగుబాటు. నేపాల్‌లో జెన్–జీ. మన దేశంలో కాక్రోచెస్. పేరేదైనా కావచ్చు. కొత్త తరం భయపడదు. భయపెడుతుంది. భయపెట్టింది.
కార్పొరేట్ విద్యా సామ్రాజ్యం చాలా పెద్దది. చాలా శక్తిమంతమైనది. ప్రశ్న పత్రాల లీకేజీలు కేవలం వ్యక్తిగత అవినీతి కాదు. అవి వ్యవస్థాగత అవినీతి. అందుకే ఈ ఉద్యమం ఒక మంత్రిని తప్పించడంతో ముగిసిపోకూడదు. ఇది విద్యా వ్యవస్థను ప్రశ్నించాలి. కోచింగ్ పరిశ్రమను ప్రశ్నించాలి. ప్రభుత్వ విద్యను బలహీనపరిచే విధానాలను ప్రశ్నించాలి. విద్యను వ్యాపారంగా మార్చిన వ్యవస్థను ప్రశ్నించాలి. ఇప్పటికి సింహాసనం వణికింది. అది మళ్లీ స్థిరపడుతుందా? లేక ప్రజలు దాన్ని మరింతగా కదిలిస్తారా?
డానీ
సమాజ విశ్లేషకులు
Also Read:
వర్షాకాలంలో ప్రయాణం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఇంట్లో గులాబీ మొక్క పెంచుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి