Share News

నిరసనపై బలప్రయోగం సరికాదు

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:48 AM

ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతాపార్టీతో సహా వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తలపెట్టిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం బలప్రయోగంతో..

నిరసనపై బలప్రయోగం సరికాదు

ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతాపార్టీతో సహా వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తలపెట్టిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం బలప్రయోగంతో అణిచివేసింది. దేశవ్యాప్తంగా పలువురిని ముందుగానే అదుపులోకి తీసుకొని ధర్నా స్థలానికి చేరకుండా అడ్డుకుంది. వందలాది రైళ్లని, డజను మెట్రో రైళ్లను, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసి నిరసన కార్యక్రమంపై విరుచుకుపడింది. తమ నిరసనకు కారణం తెలిపి, అనుమతి తీసుకున్న తర్వాత, ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో బలప్రయోగం చేసి ధర్నాని విఫలం చెయ్యడం సబబు కాదు. నిరసన తెలియజేయడం పౌరుల హక్కు. ఇతరుల సౌకర్యానికి భంగం కలగనంత వరకూ ప్రభుత్వం అనుమతించాలి. ప్రజాజీవనానికి ఆటంకం ఏర్పడుతుంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసిన తర్వాతే కనీస స్థాయి బలప్రయోగంతో అదుపు చెయ్యాలి. అంతకన్నా ముందు నిరసన గళం ఆరోపణని శ్రద్ధగా ఆలకించి, సందేహ నివృత్తి చెయ్యడం. ఇది ప్రజాస్వామిక రీతి. ప్రజా ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించకూడదు. ఏ ప్రభుత్వమైనా ప్రజల ఆమోదం, ఆశీస్సులతోనే పాలనకు అర్హత పొందుతుంది. ప్రస్తుత పాలకులు కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తిన అవినీతి వ్యతిరేక నిరసనలకు మద్దతు ఇచ్చినవారే. ఓపిగ్గా విని, తప్పులుంటే దిద్దుకుంటామన్న భరోసా నిరసనకారులకే కాదు, ప్రజలకూ కల్పించాలి.

- డి.వి.జి. శంకరరావు

Updated Date - Oct 13 , 2026 | 12:50 AM