నెతన్యాహూ కుట్రలు
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:07 AM
ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన అరబ్ పార్టీలు పాల్గొనకుండా ఇజ్రాయెల్ సెంట్రల్ ఎలక్షన్స్ కమిటీ (సీఈసీ) నిషేధం విధించింది.
ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన అరబ్ పార్టీలు పాల్గొనకుండా ఇజ్రాయెల్ సెంట్రల్ ఎలక్షన్స్ కమిటీ (సీఈసీ) నిషేధం విధించింది. అక్టోబర్ 27ఎన్నికల అనంతరం ఏర్పడబోయే ప్రభుత్వం ఏర్పాటులో ఈ పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయన్న అంచనాలు బలంగా ఉండటంతో, ముందుగానే వీటిని ఎన్నికల బరినుంచి వెలివేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నెతన్యాహూ నాయకత్వంలోని కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేయగలస్థాయిలో సీట్లు రావని, ప్రతిపక్ష జియోనిస్టు కూటమి పరిస్థితి కూడా ఆశావహంగా లేదని సర్వేలు అనేకం తేల్చిచెబుతున్నాయి. 120మంది సభ్యులున్న నెసెట్‌లో ఈ రెండు కూటముల్లో ఏదీ కూడా 61స్థానాల కనీస మెజారిటీ సాధించి అధికారంలోకి రావడం అసాధ్యమన్నది వాటి సారాంశం. దీనితో, కనీసం పన్నెండు స్థానాలు సాధిస్తాయన్న అంచనాలున్న ప్రధాన అరబ్‌పార్టీల మీద రేపటి ప్రభుత్వం ఏర్పాటు చేయదల్చుకున్నవారు ఆధారపడక తప్పదు. భవిష్యత్తులో అవి చక్రం తిప్పగల ప్రమాదమూ, దుస్థితీ రాకుండా ఇప్పుడే వాటిని బరినుంచి తప్పించేశారు.
ఇజ్రాయెల్ జనాభాలో ఐదోవంతు ఉన్న అరబ్‌లకు ఈ నిర్ణయంతో పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం లేకుండా పోతుంది. ప్రస్తుతం నెసెట్‌లో ఐదుస్థానాలున్న ‘యునైటెడ్ అరబ్ లిస్ట్’, మూడుపార్టీల ‘జాయింట్ లిస్ట్’ ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఈ కూటమిలో ఒకటైన బలాద్‌కు పార్లమెంట్‌లో సభ్యులెవరూ లేరు కానీ, హదాష్, తాల్ అనే మిగతా రెండు పార్టీలకు ఇప్పటికే ఐదుస్థానాలు ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులను కూడా సీఈసీ నిషేధించింది. బలాద్ చైర్మన్, పాలస్తీనియన్ అయిన అబూ షహదేహ్ ఈ మారు ఎన్నికల్లో నెగ్గే సూచనలు గట్టిగా ఉండటంతో ఆయన మీదా వేటుపడింది. హదాష్ నుంచి ఎంపీగా ఉన్న మరొకరు కూడా రాబోయే ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హుడైనారు. వచ్చేనెలలో గడువు తీరబోతున్న పార్లమెంట్ ప్రతినిధులే సీఈసీలో ఉంటారు కనుక, ఈ నిర్ణయంలో అధికార లికుడ్ పార్టీ చక్రం తిప్పిందని అర్థం. నిషేధానికి అనుకూలంగా 18 ఓట్లు, వ్యతిరేకంగా ఐదుఓట్లు పడ్డాయట. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు చెందిన లికుడ్ పార్టీ, దేశ రక్షణమంత్రి ఇతామర్ బెన్‌గ్విర్ నాయకత్వంలోని యెహుదిత్ పార్టీ చేసిన ఫిర్యాదులు, వేసిన పిటిషన్ల ఆధారంగా ఈ నిర్ణయం జరిగింది.
ఒక యూదు రాజ్యంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించకపోవడం లేదా తిరస్కరించడం, జాతివివక్షను ప్రేరేపించడం, ఇజ్రాయెల్ రాజ్యానికి వ్యతిరేకంగా సాగే ఉగ్రవాద కుట్రలకు, సాయుధపోరాటాలకు మద్దతు ఇవ్వడం వంటి లక్షణాలు కనబరిచినవారు పార్లమెంట్‌లో ప్రవేశించేందుకు అనర్హులని నెసెట్ చట్టంలోని నిబంధన ఒకటి చెబుతున్నది కనుక, ఈ అరబ్‌పార్టీలు నిషేధానికి సంపూర్ణంగా అర్హమైనవని ప్రస్తుత మితవాద కూటమిలోని ఈ రెండు పార్టీలు వాదించాయి. నిషేధానికి గురైన ఈ పార్టీలు, వ్యక్తులు గాజా యుద్ధకాలంలో చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలను ఉటంకిస్తూ, ఇవన్నీ ఒక యూదురాజ్యంగా ఇజ్రాయెల్ ఉనికిని దెబ్బతీసే వైఖరులకు మద్దతు ఇవ్వడమేనని ఆరోపించాయి. అక్టోబర్ ఏడు దాడులు, గాజామీద చర్యలు, హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెలీ బందీలను విడిపించడం ఇత్యాది వరుస పరిణామాల సందర్భంలో, దేశ ప్రయోజనాలకోసం తాము చేసిన వాదనలనూ, వ్యాఖ్యలను ఆయా సందర్భాలనుంచి వేరుచేసి, వాటిని వక్రీకరించి, హమాస్‌తో తాము రాజీపడినట్టుగా చిత్రీకరించి, కుట్రపూరితంగా ఎన్నికల బరి నుంచి తప్పించారని అరబ్ పార్టీలు వాదిస్తున్నాయి.
దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో ఓటమిపాలైతే, అవినీతి కేసుల్లో జైలుకు పోవాల్సివస్తుందన్న భయం నెతన్యాహూను వెంటాడుతోంది. గాజాను స్మశానంగా మార్చినా, అమెరికాతో కలిసి ఇరాన్‌తో కయ్యానికి దిగినా, లెబనాన్‌లోకి దూసుకుపోయినా ఇజ్రాయెలీలు ఆయనను ఆదరించలేదనీ, ప్రతిష్ఠ ఇంకా దిగజారిందని ఈ సర్వేల అర్థం. ఇజ్రాయెల్ చరిత్రలో అత్యధికకాలం ప్రధానిగా పనిచేసి, పాతికేళ్ళుగా లికుడ్‌పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి తన ఉనికికోసం తాపత్రయపడుతున్నారు. యుద్ధక్షేత్రంలో ఊచకోతలు కోసినా ఫలితం లేకపోవడంతో, ఎన్నికలక్షేత్రంలో రాజకీయ శత్రువులను అడ్డుతోవలో సంహరించి మళ్ళీ అధికారంలోకి రావడానికి కుట్రపన్నుతున్నాడు. సీఈసీ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు రద్దుచేయనిపక్షంలో, ఆ నామమాత్రపు ప్రజాస్వామ్యానికి కూడా అర్థంలేకుండా పోతుంది.