Share News

పాపం ఒకరిది... ప్రాయశ్చిత్తం మరొకరిది!

ABN , Publish Date - Feb 27 , 2026 | 01:26 AM

చేదు అనుభవాలు నేర్పిన గుణపాఠాలు భవిష్యత్తులో మంచి అడుగులు వేయటానికి తోడ్పడాలని అనుకుంటాం. ఆ అవసరం లేనట్లుగా ఒక వ్యక్తి వ్యవహరిస్తే జరిగే నష్టం పరిమితంగానే ఉంటుంది.

పాపం ఒకరిది... ప్రాయశ్చిత్తం మరొకరిది!

చేదు అనుభవాలు నేర్పిన గుణపాఠాలు భవిష్యత్తులో మంచి అడుగులు వేయటానికి తోడ్పడాలని అనుకుంటాం. ఆ అవసరం లేనట్లుగా ఒక వ్యక్తి వ్యవహరిస్తే జరిగే నష్టం పరిమితంగానే ఉంటుంది. కానీ ఒక దేశం అలా వ్యవహరిస్తే జరిగే నష్టం ఇంతాఅంతా అని చెప్పలేం. అందులోనూ అమెరికాలాంటి అగ్రరాజ్యమే అలా ప్రవర్తిస్తే చెల్లించే మూల్యం భారీగా ఉంటుంది. ఇరాన్‌పై దాడిచేయటానికి, బాంబులు కురిపించటానికి ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చితే జరిగేది అదే! ఏదో ఒక నెపంతో, ఆధిపత్య దాహంతో యుద్ధాలు చేయటం తన హక్కుగా భావిస్తూ జననష్టం, వనరుల విధ్వంసం, సౌకర్యాల విచ్ఛిన్నం... అనేవి తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరించటం అమెరికాకు కొత్తకాదు. వియత్నాం, అఫ్ఘానిస్థాన్‌, ఇరాక్‌ల్లో ఒకనాడు జరిగింది అదే! ఇప్పుడు ఇరాన్‌ వంతువచ్చింది అంతే!

మధ్యప్రాచ్యంలో 1979 నుంచీ ఇరాన్‌ అమెరికాకు కొరుకరాని కొయ్యగానే ఉంది. అప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా తిరుగుబాట్లను ఉసిగొల్పటానికి చేయాల్సినదంతా చేసింది. ఇరాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం వచ్చిందంటూ అగ్రరాజ్యం ఇప్పుడు మళ్లీ బహిరంగంగా ప్రకటించటమే గాక అందుకు పూర్తిగా సహాయసహకారాలు అందిస్తామని అక్కడి ఆందోళనకారులకు భరోసానూ ఇచ్చింది. ఇజ్రాయెల్‌తో కలిసి బహిరంగంగా, రహస్యంగా పావులన్నీ కదిపినా ఆశించిన ఫలితం కనపడలేదు. ఇరానీయుల అసంతృప్తి, ఆగ్రహం అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసే స్థాయిలో సంఘటితం కాలేదు. అందుకే అణురాగంలో మాటలు తీవ్రమయ్యాయి. తమతో, తమకు నచ్చిన రీతిలో అణు ఒప్పందం చేసుకోకపోతే విధ్వంసం తప్పదనే హెచ్చరికలు ముమ్మరమయ్యాయి. అసలు ఎలాంటి ఒప్పందం కావాలో, దాంట్లో ఏం ఉండాలో ఇంతవరకూ అమెరికా స్పష్టం చేయలేదు. గతంలో చేసుకున్న ఒప్పందంలో లోపాలేమిటో నిర్దిష్టంగా చెప్పనూలేదు. అమెరికాతో సహా చైనా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీలకు ఆమోదయోగ్యమైన 2015 నాటి ఒప్పందం పనికిరాదంటూ దాన్నుంచి ఏకపక్షంగా వైదొలగుతూ ఆదేశాలు జారీచేసిన డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇప్పుడు కొత్తదానికి ఇరాన్‌ ముందుకు రావటం లేదంటూ సైనికదాడికి సర్వసన్నాహాలు చేస్తున్నారు.


2003లో ఇరాక్‌పై దాడి చేసినట్టే ఇప్పుడు ఇరాన్‌పైనా చేస్తే ఫలితాలు ఇంకా దారుణంగా ఉండే అవకాశమే ఎక్కువ. ఒకవేళ సైన్యాన్ని ఇరాన్‌లోకి ప్రత్యక్షంగా నడిపించకుండా అక్కడి మతనాయకత్వాన్ని హతమార్చితే అది ఎటు దారితీస్తుందో ఊహించలేం. షియా ముస్లింల ప్రతిస్పందన ఎట్లా ఉంటుందో, అది ఏ మలుపులు తిరుగుతుందో కచ్చితంగా ఇప్పుడే చెప్పనూలేం. ఇరాక్‌లో సున్నీలు అధిక సంఖ్యాకులు కారు. కానీ దశాబ్దాలు అధికారంలో వాళ్లే ఉన్నారు. అమెరికా దాడితో ప్రభుత్వ, సైనిక పదవులను కోల్పోయిన సున్నీలను మతప్రాతిపదికమీద సంఘటితం చేసి ఇస్లామిక్‌ స్టేట్‌ పేరుతో కొనసాగిన ప్రతిఘటన ఎన్నో జీవితాలను బలితీసుకుంది. ఒకవేళ ఇరాన్‌లో అలాంటి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా షియాలనే అందులో కూర్చోపెట్టాలి. ఇరాక్‌లోలాగా అధికార పీఠాలపైకి సున్నీల స్థానంలో షియాలు వచ్చినట్లు ఇరాన్‌లో మరోవర్గం వచ్చే అవకాశం లేదు. ఇక ఇరాన్‌లో అత్యున్నత పదవిలో ఉన్న అలీ ఖమేనేయిని భౌతికంగా లేకుండా చేయటానికి అమెరికా చేసే ఏ ప్రయత్నమైనా మతపరమైన అజెండాతో హింసాత్మక ప్రతిఘటనకు దారితీసే అవకాశం ఉంది. అది ఇరాన్‌కే పరిమితం కాదు. షియాలు గణనీయసంఖ్యలో ఉన్న అన్ని ప్రాంతాలకూ వ్యాపించే ప్రమాదం ఉంది. ఇరాక్‌లోనూ, అజర్‌బైజాన్‌లోనూ అలజడులు చెలరేగుతాయి. భారత్‌, పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌లో కూడా షియాలు గణనీయసంఖ్యలోనే ఉన్నారు. ఇతర దేశాలను కూడా కలుపుకొంటే షియాలు 20 నుంచి 25 కోట్ల వరకూ ఉంటారు. బలమైన షియా ఆధిక్య దేశంగా ఇరాన్‌కు ఎప్పటి నుంచో గుర్తింపు ఉంది. అందుకే ఇరాన్‌లో ఏం జరిగినా దాని ప్రభావం షియా ప్రజలందరిపైనా ప్రగాఢంగానే ఉండొచ్చు.


అగ్రరాజ్యం చేసే యుద్ధానికి కనీసంగానైనా ఏదో ఒక సమర్థనను తయారుచేసుకోవటం గతంలో ఎంతో కొంత ఉండేది. బిన్‌లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చారని అఫ్ఘానిస్థాన్‌పై యుద్ధం మొదలుపెట్టింది. భారీ జనవిధ్వంసక ఆయుధాలను కలిగి ఉన్నదంటూ ఇరాక్‌పై సేనలను నడిపించారు. ట్రంప్‌ వచ్చిన తర్వాత సైనిక యుద్ధాలకూ, వాణిజ్య యుద్ధాలకూ ఎటువంటి సమర్థనల అవసరం ఉండటం లేదు. 2015 నాటి అణు ఒప్పందానికి (జాయింట్‌ కాంప్రిహెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌) అంగీకరించి దానిలోని షరతులను కచ్చితంగా అమలుచేస్తామని ఇరాన్‌ హామీ ఇచ్చింది. హామీని ఉల్లంఘిస్తే చర్యలు ఎంత కఠినంగా ఉంటాయో ఇరాన్‌కూ తెలుసు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని అయిదు దేశాలతో పాటు జర్మనీ కూడా ఒప్పందంలో భాగస్వామిగా ఉంది. ‘అణ్వాయుధాలను తయారుచేయటానికి, సంపాదించటానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రయత్నించబోనని ఇరాన్‌ పునరుద్ఘాటిస్తోంది’ అన్న హామీ ఒప్పందం మొదటి పేరాలోనే స్పష్టంగా ఉంది. 15 ఏళ్ల కాలంలో యురేనియం నిల్వలను 98శాతం తగ్గించాలని కూడా ఒప్పందంలో విపులంగా పేర్కొన్నారు. అందులో భాగంగా కొన్ని నిల్వలను ఇరాన్‌ రష్యాకు తరలించింది. యురేనియం శుద్ధి స్థాయిని 3.67శాతానికి అంగీకరించింది. వైద్య అవసరాలకు ఉపయోగించటానికి కూడా ఈ శాతానికి కొంత మించే యురేనియాన్ని శుద్ధి చేయాలి. యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని ఈ స్థాయికి తగ్గించుకున్నాక మళ్లీ మనసు మార్చుకుని అణ్వస్త్రాలు తయారుచేసే మేరకు దాన్ని తీసుకెళ్లాలంటే ఎక్కువ సమయమే పడుతుంది. ఆ లోగానే వ్యవహారాలను పసిగట్టి ఇరాన్‌ను దారిలోకి తీసుకువచ్చే సామర్థ్యం అగ్రరాజ్యాలకు ఉందని కూడా అప్పట్లో భావించారు. అనుకున్న విధంగా ఒప్పందం అమలుకు వేగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేసే క్రమం మొదలైంది. ఆంక్షలతో అన్ని విధాలుగా ఇరాన్‌ అప్పటికే విపరీతంగా కుంగిపోయింది. వందల బిలియన్‌ డాలర్ల ఆదాయాన్నీ కోల్పోయింది. 2012–2015 మధ్యలో ఒక్క చమురుపైనే 160 బిలియన్‌ డాలర్ల రెవెన్యూనీ పోగొట్టుకుంది. ఖాతాలను స్తంభింపచేయటంతో 100 బిలియన్‌ డాలర్లు విదేశాల్లోనే ఉండిపోయాయి.


ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకోవటం ఇజ్రాయెల్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆ ఒప్పందాన్ని చరిత్రాత్మక తప్పిదంగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతాన్యాహు అప్పట్లోనే వ్యాఖ్యానించారు. 2016లో ట్రంప్‌ మొదటిసారి అధికారంలోకి రావటంతో ఒప్పందం నుంచి వైదొలగటానికి సన్నాహాలు మొదలుపెట్టారు. మధ్యప్రాచ్య వ్యవహారాల్లో ఇజ్రాయెల్‌ చెప్పినదానికి తలాడించటమే ట్రంప్‌ సారథ్యంలోని అమెరికాకు అలవాటుగా మారిపోయింది. 2018 మే 9న ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. చైనా, రష్యా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ జర్మనీలతో పాటు మొత్తం యూరోపియన్‌ యూనియన్‌, టర్కీ కూడా ఇది సరైన పనికాదని విమర్శించాయి. అయినా అమెరికా లెక్కచేయలేదు. ఏడాదిపాటు ఇరాన్‌ వేచిచూసింది. ఒప్పందాన్ని కాపాడటానికి యూరోపియన్‌ యూనియన్‌ ప్రయత్నాలు ఫలిస్తాయేమోనని ఆశపడింది. అది ఫలించకపోగా అమెరికా ఆంక్షలను మళ్లీ విధించింది. యురేనియం శుద్ధిస్థాయిని 20శాతానికి పెంచుతామని 2019 జూన్‌లో ఇరాన్‌ ప్రకటించటంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆ తర్వాత దాన్ని క్రమేపీ ఇంకా పెంచుతున్నట్లుగా ప్రకటనలు వచ్చాయి. అణ్వస్త్రాలను తయారుచేసే స్థాయికి ఇరాన్‌ యురేనియం శుద్ధి కార్యక్రమం చేరుకుందనే నెపంతో కిందటి ఏడాది జూన్‌లో అమెరికా భారీ బాంబులను ప్రయోగించింది. ఇరాన్‌ యురేనియం శుద్ధి కర్మాగారాలన్నిటినీ దారుణంగా దెబ్బతీశామని ఘనంగానూ ప్రకటించుకుంది. అంతకుముందుగా ఇరాన్‌ కీలకనేతలనూ, అధికారులనూ, శాస్త్రవేత్తలనూ డ్రోన్లను ఉపయోగించీ ఇతరత్రానూ మట్టుబెట్టారు.


ఒకప్పుడు మధ్యప్రాచ్యంలోనే అమెరికాకు చాలా ఇష్టమైన దేశం ఇరాన్‌. మహమ్మదు రెజాషా ఇరాన్‌ పాలకుడిగా ఉండగా అణుకర్మాగారాల స్థాపనకు అమెరికా తోడ్పడింది. అత్యాధునిక ఆయుధాలనూ, విమానాలనూ అమ్మి మధ్యప్రాచ్యంలోనే ఇరాన్‌ను సైనికంగా బలపడేటట్టు చేసింది. అమెరికా అనుకూల విధానాలతో పాటే అణచివేతను కూడా రెజాషా అమలుచేశారు. రాజకీయ స్వేచ్ఛను లేకుండా చేశారు. పౌరహక్కులను అణచివేశారు. 10 శాతం జనాభాకు మాత్రమే లాభం చేసే విధానాలను అమలుచేయటంతో అసంతృప్తులు పెరిగిపోయాయి. అసలు 1950ల మొదట్లోనే ఇరాన్‌లో అమెరికా వ్యతిరేక బీజాలు బలపడ్డాయి. అప్పట్లో రెజాషా అధికారాలు పరిమితంగా ఉండేవి. పార్లమెంట్‌ (మజ్లిస్‌) సర్వోన్నతంగా ఉండేది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకోసం ఎక్కువ నిధులను అందించటానికి ఆంగ్లో–ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీ నిరాకరించటంతో మొత్తం చమురు పరిశ్రమను జాతీయం చేశారు. ఆ చర్యతో రగిలిపోయిన బ్రిటన్‌, అమెరికాలు ఏకమై ఇరాన్‌లోని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోశాయి. అప్పటి నుంచి అమెరికా వ్యతిరేకత ఇరాన్‌లో పాతుకుపోయింది. అమెరికా అండతో ఆ తర్వాత చెలరేగిపోయిన రెజాషాకు వ్యతిరేకంగా ఇరాన్‌లో అన్ని రాజకీయపక్షాలు ఏకమయ్యాయి. అయతుల్లా ఖోమైనీ నాయకత్వంలో సాగిన ఉద్యమం వల్ల 1979లో రెజాషా ప్రభుత్వం కూలిపోయింది.


యురేనియం శుద్ధి కార్యక్రమాలను ఆపినంత మాత్రాన ఇరాన్‌ను తనమానాన తనని ఉండనిస్తారా? అన్నది ఇప్పటికీ సందేహమే. అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రాబల్యానికి ఎదురీది నిలబడి మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని పెంచుకోటానికి ఇరాన్‌ ప్రయత్నించింది. అంతటితో ఆగలేదు. వీలైనప్పుడల్లా ఆ రెండు దేశాల ప్రయోజనాలను దెబ్బతీయటానికి పావులనూ కదిపింది. చర్యకు ప్రతిచర్యగా దాన్ని ఇరాన్‌ పాలకులు సమర్థించుకున్నా అంతిమంగా నష్టపోయింది మాత్రం ప్రజలే. బాహ్య శత్రువులను చూపి అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని లేకుండా ఇరాన్‌ పాలకులు చేయగలిగారు. ఆర్థిక సమస్యల ఆధారంగా రాజకీయాలు బలపడకుండా ఉండటానికి మతోన్మాదాన్ని అంతకంతకూ పెంచటానికే ప్రయత్నించారు తప్ప నిజమైన ప్రజాస్వామ్యం వైపు మొగ్గలేదు. అవసరమైన ఆర్థిక, రాజకీయ సంస్కరణలనూ చేపట్టలేదు. అన్ని నిరసనలనూ అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రేరితాలుగా ఆరోపిస్తూ కాలం గడిపారు. అమెరికా జోక్యం పెరిగినప్పుడూ, బెదిరింపులకు పాల్పడినప్పుడూ, ఇజ్రాయెల్‌తో బాంబుదాడులు చేయించినప్పుడూ ఇరాన్‌ ప్రజలు ప్రదర్శించే సంఘటిత శక్తి మతనాయకులకే అనుకూలిస్తోంది.

పాలకులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ తమ దేశ అస్తిత్వం ప్రమాదంలో పడిందన్న భావనను ఇరాన్‌ ప్రజలు భరించలేరు. సుదీర్ఘచరిత్రనూ, గతంలోని సామ్రాజ్య ఘనతనూ, పర్షియన్‌ నాగరికత దేశదేశాల్లో ప్రసరించిన వెలుగునూ నిరంతరం గుర్తుచేసుకునే ఆలోచనాపరులూ, ప్రజలనూ కలిగిన దేశాన్ని లొంగదీయటం అంత తేలికకాదు. ఇరాక్‌తో సహా అనేక మధ్యప్రాచ్యదేశాలు వందేళ్లకు ముందు ఉనికిలోనే లేవు. బ్రిటిషు సామ్రాజ్యవాదులు తమకు ఇష్టం వచ్చినట్లు గీసిన పటాల (మ్యాప్‌లు) ప్రకారం అవి ఏర్పడ్డాయి. ఇరాన్‌ ఆ కోవలోది కాదు. పర్షియాగా దాని అస్తిత్వం అవిచ్ఛిన్నమైనది. పదికోట్లకు చేరుతున్న జనాభాతో, విస్తృత భూభాగంతో, పోరాటాల చరిత్రతో.. శతాబ్దాల ఉనికి ఉన్న దేశాన్ని బాంబులతో కాకుండా బంధాలతో గెలవగలిగితే మధ్యప్రాచ్యంలో శాంతిదీపం వెలుగుతుంది. 2015 నాటి అణు ఒప్పందాన్ని పునరుద్ధరిస్తే అందరూ ఆశించే బంధాలు కొంతైనా బలపడతాయి. ఒకనాడు అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి తొలిపాపానికి పాల్పడింది అమెరికానే. అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలగి మలిపాపానికి పాల్పడిందీ అమెరికానే. కానీ ప్రాయశ్చిత్తాన్ని ఇరాన్‌ భరించాలనటమే అమెరికా అతినేర్పరితనం!

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

Updated Date - Feb 27 , 2026 | 01:29 AM