విద్యాగంధమే ఇరాన్‌ను మండిస్తోంది!
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:44 AM
అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టి నెలరోజులు దాటుతోంది. ఇప్పటిదాకా ఇరాన్ యుద్ధరంగాన నిలబడటమే గొప్ప. మొదట్లో ఊదరగొట్టిన అంచనాల ప్రకారం, ఇరాన్ వారంరోజుల్లోనే అమెరికా పాదాక్రాంతం కావాలి.
గణనీయ ఆర్థిక, విద్యాభివృద్ధితో పాటు పోరాటశీలతను ప్రోత్సహించే సంప్రదాయం ఉన్న దేశాన్ని జయించటం అంత తేలికకాదు. అనేక భౌగోళిక సంక్లిష్టతలూ దుర్భేద్యమైన సహజరక్షణలూ ఉన్న ఇరాన్ విషయంలో అది మరింత కష్టం. ఆకాశం నుంచి బాంబులను, క్షిపణులను ప్రయోగించి విధ్వంసాన్ని సృష్టించొచ్చు. కానీ సైన్యాన్ని నడిపించి భూతల దాడులకు సిద్ధంకాకుండా ప్రభుత్వ వ్యవస్థను మార్చలేరు. దానికి అమెరికా సిద్ధపడితే వియత్నాం యుద్ధ చరిత్ర పునరావృతం అయ్యే అవకాశమే ఎక్కువ.
అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టి నెలరోజులు దాటుతోంది. ఇప్పటిదాకా ఇరాన్ యుద్ధరంగాన నిలబడటమే గొప్ప. మొదట్లో ఊదరగొట్టిన అంచనాల ప్రకారం, ఇరాన్ వారంరోజుల్లోనే అమెరికా పాదాక్రాంతం కావాలి. అగ్రనాయకులు మరణించిన తర్వాత, అగ్రశ్రేణి సైనికాధికారులు హతమైన తర్వాత ఒక దేశం గట్టిగా పోరాడటం చరిత్రలోనే అరుదైన ఘట్టం. ఇప్పటిదాకా సాగిస్తున్న పోరాటం ఇరాన్ ఇకముందు సాగిస్తుందో లేదో ఇప్పటికైతే చెప్పలేం. రానున్న రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ విధ్వంసకాండ ఎన్ని వికృతరూపాలు దాల్చుతుందో ఊహించనూలేము. వియత్నాం యుద్ధమప్పుడు అమెరికాపై ఎంత ఏహ్యత, ఆగ్రహం పెల్లుబికిందో ఇప్పుడూ ప్రపంచవ్యాప్తంగా అదే తరహా ఏహ్యత, ఆగ్రహం వ్యక్తమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. అమెరికాలో, యూరపులో ప్రజలు రోడ్లమీదకు వచ్చి నిరసనలు, ఆగ్రహాలు వ్యక్తంచేస్తున్నారు. ఇరాన్ అనుసరిస్తున్న యుద్ధవ్యూహంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థే తీవ్ర కుదుపులకు గురవుతోంది.
రానున్న రోజుల్లో యుద్ధం తీవ్రమైతే అన్ని దేశాలకంటే మనమే విపరీత భారాన్ని మోయాల్సి వస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో పరిధికి మించి అంటకాగటం వల్ల మనం చెల్లించాల్సిన మూల్యం ఇదే కావచ్చు. మన ఎగుమతులూ దిగుమతులూ తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. అన్ని రంగాల్లో ఒడుదుడుకులు కనపడుతున్నాయి. పెట్రో ఉత్పత్తుల కోసం ప్రజలు పరుగులు పెట్టటం ప్రారంభమైంది. వంటగ్యాస్ సరఫరాలో కష్టాలు మొదలయ్యాయి. ఎరువుల లభ్యతకు ఎన్నో ఇక్కట్లు ఎదురుకానున్నాయి. అమెరికా స్థావరాలున్న ఏ గల్ఫ్ దేశాన్నీ వదిలేదిలేదన్న ఇరాన్ ఇప్పటికే ఒక భయాన్నీ, అలజడినీ సృష్టించింది. అక్కడి ఆర్థికవ్యవస్థలకు ఆయువుపట్టుగా ఉన్న చమురు, సేవారంగాలకు దెబ్బలు ఇంకా గట్టిగా తగిలితే తొలి బాధితులూ, తుది బాధితులూ కూడా భారతీయులే అవుతారు. కోటిమంది గల్ఫ్ ప్రవాస భారతీయుల జీవితాల్లో ఇబ్బందులు వస్తే తిరుగు ప్రయాణాలు పెద్దఎత్తున మొదలవుతాయి. వారు పంపే విదేశీమారకద్రవ్యానికి గండిపడుతుంది. 1991 నాటి మొదటి గల్ఫ్ యుద్ధమప్పుడు కూడా ఇంతటి సంక్షోభాన్ని భారత్ ఎదుర్కోలేదు.
అప్పటికి భారత్‌కు ప్రపంచ ఆర్థికవ్యవస్థతో పరిమిత అనుసంధానమే ఉండేది. ఆనాటికి అంబాసిడర్, మారుతీ–800, పద్మినీ కార్లు తప్ప మిగతావేవి ఉండేవి కావు. మూడు రకాల స్కూటర్లు, మూడు రకాల బైకులతో పాటు సువేగా, టీవీఎస్ లాంటి మోపెడ్‌లు మాత్రమే రోడ్లపై కనపడేవి. ఇప్పుడు కార్లలోనే వందలాది మోడళ్లు ఉన్నాయి. మిగతా వాహనాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. 1991కి ముందు ఎక్కువ దిగుమతులు లేకుండా వీలైనంతమేరకు దేశంలో దొరికే, తయారయ్యే ఉత్పత్తుల మీదే ఆధారపడే వాళ్లం. దీన్నే దిగుమతులకు ప్రత్యామ్నాయంగా రూపొందిన ఆర్థిక వ్యవస్థగా పిలిచేవారు. ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన ఆర్థికవ్యవస్థల్లో లభ్యమయ్యే అన్నిరకాల వినియోగవస్తువులూ, ఎలక్ట్రానిక్స్, ఐటీ పరికరాలూ, సౌందర్యాన్ని పెంచే ఉత్పత్తులూ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అవిలేకుండా జీవించే పరిస్థితులూ లేవు. ఇంతగా ప్రపంచంతో అనుసంధానమైన జీవితానికి ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా సాగిస్తున్న యుద్ధంతో అనూహ్యమైన ప్రమాదం ముంచుకువస్తోంది. ఈ యుద్ధబీభత్సం తాకిడికి తాళలేక ఒకవేళ ఇరాన్ నాయకత్వం తలవొగ్గినా అది తెచ్చిపెట్టిన అపజయభారాన్ని, అవమానాన్ని ఇరాన్ ప్రజలు సహించలేరు. గణనీయస్థాయిలో విద్యాధికులను కలిగి, దేశ ఘనచరిత్రను ఏదో విధంగా మననం చేసుకునే పరిస్థితి ఉన్నచోట, త్యాగాలకు పెద్దపీటవేసే మతాభినివేశం బలంగా ఉన్నచోట ప్రతిఘటన తీవ్రంగానే ఉంటుంది. అందుకే అనుచిత, అసంబద్ధ షరతులకు అమెరికా స్వస్తిచెప్పి చర్చలకు సిద్ధపడి ఇరాన్‌తో ఒక అంగీకారానికి వస్తేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుంది.
ఇరాన్ ప్రతిఘటన ఎందుకు ఊహించిన దానికంటే తీవ్రంగా ఉందో మనలో చాలామందికి తెలియదు. 47 ఏళ్ల నుంచి అమెరికా విధిస్తున్న అనేకరకాల ఆంక్షలను తట్టుకుంటూ ఇరాన్ ఏం సాధించిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మతాధినేతదే ఇరాన్‌లో సర్వాధిపత్యం. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు ఉన్నా, ప్రత్యక్షంగా ఎన్నికైన అధ్యక్షుడు ఉన్నా ఏ చట్టాన్నైనా, ఏ నిబంధననైనా ఇస్లాం ధర్మానికి అనుగుణంగా లేదని మతాధినేత పక్కన పెట్టేయొచ్చు. ఎవరు ఎన్నికల్లో నిలబడాలో తేల్చే తుది అధికారం కూడా మతాధినేతదే. మతాధినేతలు పాలకులకు సలహదారు పాత్రకే పరిమితం కావటం ఇస్లాం రాజ్యాల్లో వందలేళ్లు కొనసాగింది. రాజకీయాధికారం ఎప్పుడూ మతాధినేతల చేతుల్లో కేంద్రీకృతం కాలేదు. సుల్తాన్‌లు, పాదుషాలు సర్వస్వతంత్రులుగానే వ్యవహరించారు. ఇస్లాంను ఆచరించే ఏ దేశ పాలకుల చరిత్రను చూసినా ఇదే కనపడుతుంది. 1200వ సంవత్సరం నుంచి 1857 వరకూ భారత చరిత్రను చూసినా మనకు తెలిసేది అదే! మతాధినేత సలహాదారు పాత్ర నుంచి అంతిమ, అత్యు న్నత అధికారాలున్న ప్రభుత్వాధినేతగా మారటం 1979 నాటి ఇరాన్ వివ్లవంతోనే మొదలైంది. ఇస్లాం చరిత్రలోనే అదొక కొత్తమలుపు! మతం ఆసరాతో మాత్రమే రాజకీయ పోరాటం ఉధృతమయ్యే పరిస్థితులు తలెత్తటానికీ, చివరికది మతాధినేత చేతుల్లో సర్వాధికారం పోగుపడేలా చేయటానికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా అమెరికానే కారణం. ఇరాన్‌లో 20వ శతాబ్దం తొలినాళ్ల నుంచీ ప్రజాస్వామ్య, లౌకిక రాజకీయాలు క్రమేపీ బలపడి 1950ల నాటికి ప్రబలశక్తిగా మారాయి. 1953లో ఇరాన్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి, రాచరికానికి సర్వాధికారాలు కట్టబెట్టి, నియంతృత్వ పాలన కొనసాగటానికి అమెరికా సహకారాన్ని అందించకపోతే అక్కడ మతం ఆధారిత రాజకీయ ప్రతిఘటన కేంద్రీకృతమే అయ్యేది కాదు.
మంచైనా చెడైనా మతం ఎప్పుడూ బలమైన సంఘటిత రాజకీయాలకు దోహదం చేసేదిగానే ఉంటుంది. మతం ఆధారంగా జనసమీకరణ సులువుగానే కుదురుతుంది. అందుకే దాన్ని రాజకీయ లక్ష్యాల సాధనకు బలంగా ఉపయోగించుకున్న తర్వాత వదిలించుకోవటం కష్టం. మతం ఆధారంగా నడిచే రాజకీయాలు విభిన్న దృక్పథాలకు తావివ్వవు. మతం పరిధిని దాటి మాట్లాడే వాళ్లనూ, లౌకిక లక్ష్యాల కోసం రాజకీయాలను ఉపయోగించే వాళ్లనూ జాతి వ్యతిరేకులుగా ముద్రవేయటం తేలికవుతుంది. ఇరాన్‌లోనూ ఇదంతా జరిగింది. ఆధునిక ప్రజాస్వామ్య దృక్పథంతో చూస్తే అక్కడి రాజకీయం చాలా సంకుచితంగా ఉన్నట్లు కనపడుతుంది. మనం ఆశిస్తున్న రాజకీయ విలువలేవీ అక్కడ దొరకవు. ఇవేమీ లేనంత మాత్రాన అక్కడ అంతా చీకట్లే నెలకొన్నాయని భావించనూ లేం. ఆర్థిక ఆంక్షలతో ఇరాన్‌ను కట్టడిచేసిన అమెరికా దానికి వ్యతిరేకంగా దశాబ్దాల నుంచీ హోరెత్తిస్తున్న ప్రచారంతో అక్కడేం జరుగుతుందో తెలియని పరిస్థితే నెలకొంది. ప్రధాన స్రవంతి మీడియాలో అమెరికా అనుకూల దృక్పథాలకే ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. అమెరికా ఆశించే చిత్రమే అక్కడ ఎక్కువగా ప్రదర్శితమవుతుంది. దాన్ని పక్కనబెట్టి చూస్తేనే ఇరాన్ బలాబలాలు అర్థమవుతాయి.
క్షిపణులతో, డ్రోన్లతో అమెరికానూ ఇజ్రాయెల్‌నూ తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఇరాన్‌కు ఆ శక్తి కేవలం వాటి దిగుమతులతో రాలేదు. స్వయంశక్తితో వాటిని తయారుచేసుకునే యుక్తిని సంపాదించుకుంది. రష్యాకు తన డ్రోన్లను పెద్దఎత్తున సరఫరా చేయగలిగే స్థాయికీ చేరుకుంది. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ డ్రోన్లపై రష్యా ఎక్కువగానే ఆధారపడింది. క్షిపణులనూ డ్రోన్లనూ తయారుచేయటానికి సైన్స్‌లో నిష్ణాతులైన మానవ వనరులు ఉండాలి. ఇరాన్‌లో అంతా ఇస్లాం మయమైపోయిందనీ, మూఢత్వం రాజ్యమేలుతోందనీ భావిస్తున్న మనం అక్కడి విద్యారంగం అలాంటి మానవవనరుల అభివృద్ధికి దోహదం చేయదనే అనుకుంటాం. కానీ అది నిజం కాదు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్ కోర్సులు) సబ్జెక్టుల్లో ఇరాన్ గణనీయ ప్రగతిని సాధించింది. పశ్చిమాసియాలో టర్కీ మినహా ఇరాన్‌కు స్టెమ్ కోర్సుల్లో సాటివచ్చే దేశమే లేదు. ప్రపంచంలోనే 15వ స్థానాన్ని సంపాదించింది. పరిశోధనల్లో 32వ స్థానంలో ఉంది. గ్రాడ్యుయేట్లలో 30 శాతానికి మించే స్టెమ్ కోర్సులు చేసినవారు అక్కడున్నారు. మనదేశంతో పోల్చితే కూడా ఇది ఎక్కువ. అమెరికా ఆంక్షలు లేకపోతే ఇరాన్ స్టెమ్ విద్యార్థుల సంఖ్య ఇంకా ఎక్కువగానే పెరిగేది. స్టెమ్ కోర్సుల్లో ఇరానీ యువకుల కంటే యువతులు ఎక్కువగా ఉన్నారు. వైద్యుల్లో ఆ పరిస్థితి మరీ ఎక్కువ. వైద్యుల్లో 50శాతం మహిళలు ఇరాన్‌లో ఉంటే మనకు ఇక్కడ 25శాతం కూడా దాటలేదు. టీచర్లలో కూడా 65శాతం దాకా మహిళలే ఉన్నారు. పశ్చిమాసియాలో ఒక్క యూఏఈలోనే 60–70శాతం మహిళా టీచర్లు ఉన్నా బయటి నుంచి వచ్చినవారే అక్కడ ఎక్కువ. ఇక భారత్‌లో మహిళా టీచర్ల సంఖ్య 53–54 శాతమే ఉంది. విద్యారంగంలో ఏ కొలమానం ప్రకారం చూసినా ఇరాన్ గణనీయ ప్రగతిని సాధించింది.
ఇరాన్ ఎగుమతులకు చమురు కీలకమే గానీ మొత్తం ఆర్థిక వ్యవస్థ దానిపైనే ఆధారపడి లేదు. చమురు, సహజవాయువు నుంచి వచ్చే ఆదాయం జీడీపీలో 20–25 శాతమే ఉంది. తయారీరంగంలో కూడా భారత్ కంటే ముందుంది. జీడీపీలో ఇక్కడది 13–15శాతం ఉంటే ఇరాన్‌లో 19–20 శాతం దాకా ఉంది. సేవల రంగం 50శాతం తోడ్పాటును అందిస్తుంటే వ్యవసాయం 10శాతం వరకూ దోహదం చేస్తోంది. ఆహారధాన్యాల్లో 60 నుంచి 80శాతం దేశంలోనే పండుతున్నాయి. టర్కీ ఒక్కటే పశ్చిమాసియాలో ఈ విషయంలో ఇరాన్ కంటే మెరుగ్గా ఉంది. మిగతా గల్ఫ్ దేశాలన్నీ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఏదో ఒకరంగంపైనే ఆర్థిక వ్యవస్థ ఆధారపడితే దాన్ని అపసవ్యంగానే చూస్తాం. ఇరాన్ ఆ అపసవ్యత నుంచి తప్పించుకోటానికి ప్రయత్నించి చాలావరకూ సఫలమైంది. 47 ఏళ్ల నుంచి అమలవుతున్న ఆర్థిక ఆంక్షల కోణం నుంచి చూస్తే ఇది ఎన్నదగిన విషయంగానే కనపడుతుంది. ఇక విస్తీర్ణంలో రష్యా మినహా ఏ యూరపు దేశమూ ఇరాన్ కంటే చిన్నదే. పర్వతాలు, కొండల పరంగా చూస్తే ఇరాన్ రక్షణకు అవి పెట్టనికోటలుగా ఉన్నాయి.
గణనీయ ఆర్థిక, విద్యాభివృద్ధితో పాటు పోరాటశీలతను ప్రోత్సహించే సంప్రదాయం ఉన్న దేశాన్ని జయించటం అంత తేలికకాదు. అనేక భౌగోళిక సంక్లిష్టతలూ దుర్భేద్యమైన సహజరక్షణలూ ఉన్న ఇరాన్ విషయంలో అది మరింత కష్టం. ఆకాశం నుంచి బాంబులను, క్షిపణులను ప్రయోగించి విధ్వంసాన్ని సృష్టించొచ్చు. కానీ సైన్యాన్ని నడిపించి భూతల దాడులకు సిద్ధంకాకుండా ప్రభుత్వ వ్యవస్థను మార్చలేరు. దానికి అమెరికా సిద్ధపడితే వియత్నాం యుద్ధ చరిత్ర పునరావృతం అయ్యే అవకాశమే ఎక్కువ. విద్యాగంధం సర్వవ్యాప్తమైన ఇరాన్‌లో చివరకు బహుముఖ ప్రతిఘటనే పదునుదేరుతుంది! అక్షరాయుధాలు అందించే శక్తి ఎప్పుడూ మహత్తరమైందే!
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)