Share News

బీటలు వారిన అమెరికా ఆధిపత్యం!

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:37 AM

చరిత్రలో కొన్ని సందర్భాలు సాధారణంగానే అనిపిస్తాయిగానీ సంవత్సరాలు గడిచేకొద్దీ వాటి ప్రాధాన్యం అర్థమవుతుంది. అటువంటి ఒక గొప్ప సందర్భమే ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం. 40 రోజులపాటు కొనసాగి..

బీటలు వారిన అమెరికా ఆధిపత్యం!

చరిత్రలో కొన్ని సందర్భాలు సాధారణంగానే అనిపిస్తాయిగానీ సంవత్సరాలు గడిచేకొద్దీ వాటి ప్రాధాన్యం అర్థమవుతుంది. అటువంటి ఒక గొప్ప సందర్భమే ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం. 40 రోజులపాటు కొనసాగి.. ప్రస్తుతం రెండు వారాల కాల్పుల విరమణ, రెండు రోజుల విఫల చర్చల దశలో ఉన్న ఈ యుద్ధం రెండు కొత్త పరిణామాలను మన ముందుకు తీసుకొచ్చింది. ఒకటి, ప్రపంచశక్తిగా అమెరికా ఆధిపత్యం గణనీయంగా తగ్గిపోవటం. రెండు, పశ్చిమాసియాలో ఇరాన్‌ ఒక ప్రాంతీయశక్తిగా ఆవిర్భవించటం. ఈ రెండింటికి తోడు మరికొన్ని ఉప పరిణామాలు ఏమిటంటే.. ఇన్నాళ్లూ అమెరికా అండ చూసుకొని పశ్చిమాసియాలో లెక్కలేనన్ని దురాగతాలకు, గాజాలో ఏకంగా నరమేధానికి పాల్పడిన ఇజ్రాయెల్‌ ఇకపై తన హద్దుల్లో తాను ఉండాల్సిన పరిస్థితిలోకి నెట్టివేయబడటం, నాటో కూటమి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకోవటం, అంతర్జాతీయ రాజకీయాల్లో పాకిస్థాన్‌ ప్రాధాన్యం పెరగటం.


డొనాల్డ్‌ ట్రంప్‌ వంటి ఒక చంచల స్వభావి, అహంకారి, అజ్ఞాని రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టి ఆ దేశానికి ఏ అమెరికా ప్రెసిడెంటూ చేయనంత నష్టం చేశాడు. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా పెంచిపోషించుకున్న ‘ప్రపంచ సామ్రాజ్యవాద దేశం’, ‘ప్రపంచ పోలీసు’ హోదాలకు ట్రంప్‌ తూట్లు పొడిచాడు. ఇది అమెరికాకు నష్టంగానీ.. ప్రపంచ దేశాలకు మంచి పరిణామమే. 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం తర్వాత.. తన చమురు సంపదసహా అన్ని వనరుల్నీ జాతీయం చేసింది ఆ దేశ ప్రభుత్వం. మిగిలిన గల్ఫ్‌ దేశాలు అమెరికా కంపెనీలకు గణనీయమైన వాటాలు ఇచ్చి తమ నిరంకుశ రాచరికాల్ని కాపాడుకున్నాయి. దీంతో ఇరాన్‌ మీద కక్షగట్టిన అమెరికా.. గత 47 ఏళ్లుగా ఆ దేశం మీద ఆంక్షలు విధిస్తూ వస్తోంది. గల్ఫ్‌ దేశాల్లో సైనిక స్థావరాలను నెలకొల్పి, ఆ దేశాల చమురు విక్రయాలు తమ డాలర్లలో జరిగేలా చూస్తూ, మరోవైపు, ఇజ్రాయెల్‌ను ఆయుధాలతో, టెక్నాలజీతో పెంచి పోషిస్తూ.. మొత్తంగా, పశ్చిమాసియాను అమెరికా తన గుప్పిట నిలుపుకుంది. అమెరికా అధ్యక్షులందరూ ఇదే విధానాన్ని అనుసరిస్తూ వచ్చారు కానీ, ఏ అధ్యక్షుడూ ఈ ఐదు దశాబ్దాల్లో ఇరాన్‌ మీద యుద్ధానికి దిగలేదు. యుద్ధం చేసి దానిని లొందీసుకోలేమన్న స్పష్టత వారికి ఉంది.


కానీ, ట్రంప్‌ అమెరికా ప్రయోజనాలు పణంగా పెట్టి యుద్ధానికి దిగాడు. దీని వెనకాల కొన్ని కారణాలున్నాయి. ఒకటి, ఇన్నాళ్లూ ఏ అమెరికా అధ్యక్షుడికీ సాధ్యం కాని పని తాను చేశానని, ఇరాన్‌ను లొంగదీసుకున్నానని చెప్పుకోవాలనే దుగ్ధ. రెండు.. యూదుజాతి అహంకారి అయిన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రభావం. అమెరికాలో మీడియా సహా పలు కీలక రంగాలు యూదుల చేతుల్లో ఉన్నాయి. రాజకీయ పార్టీల మీద వారి ప్రభావం అపారం. అంతేగాక, తాజాగా బయటపడిన ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ ఈ యూదు లాబీ చేతుల్లో ఉన్నాయని, వీటితో బెదిరించి ట్రంప్‌ను ఇరాన్‌ మీద యుద్ధానికి నెతన్యాహు లాగాడన్న ఆరోపణలున్నాయి. పశ్చిమాసియాలో తన దురాగతాలకు అడ్డు నిలుస్తున్న ఏకైక దేశం ఇరాన్‌ను గాజాలాగా సర్వనాశనం చేయాలనేది నెతన్యాహు కోరిక. ఇజ్రాయెల్‌లో అవినీతికి సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న నెతన్యాహుకు నిరంతర యుద్ధం అవసరం.


వెనెజువెలా అధ్యక్షుడు మదురోను కిడ్నాప్‌ చేసి ఆ దేశాన్ని లొంగదీసుకున్నట్లుగా.. ఇరాన్‌ సర్వోన్నత నాయకుడు ఖమేనీని హత్య చేసి ఆ దేశాన్ని అదుపులోకి తీసుకోవాలని ట్రంప్‌ భావించారు. కానీ, ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఇరాన్‌.. దెబ్బకు దెబ్బ తీసింది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు ముచ్చెమటలు పట్టించింది. గల్ఫ్‌లో ఏళ్లుగా అమెరికా నిర్మించుకున్న సైనిక స్థావరాల్ని నేలమట్టం చేసింది. అనేక యుద్ధవిమానాల్ని నేలకూల్చింది. అమెరికా యుద్ధనౌకలు ఇరాన్‌ దాడులకు తోకముడిచాయి. డ్రోన్లతో, క్షిపణులతో ఇజ్రాయెల్‌ను దెబ్బతీసింది ఇరాన్‌. ఈ దాడుల తీవ్రత గురించి మిగతా ప్రపంచానికి తెలియనివ్వకుండా ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేశాలు మీడియా మీద ఆంక్షలు విధించి.. నష్టాలు బయటపడకుండా చూశాయి. 47 ఏళ్లుగా దుర్మార్గమైన ఆంక్షలను ఎదుర్కొంటూ కూడా రెండు అణ్వాయుధ దేశాలను ఇరాన్‌ ఎదుర్కొంటున్న తీరు, వికేంద్రీకరణ సూత్రంగా అమలుచేస్తున్న యుద్ధతంత్రం ప్రపంచ మిలిటరీ సైన్స్‌ నిపుణుల ప్రశంసలు అందుకుంది. ఇరాన్‌ను లొంగదీసుకోలేని నిస్పృహతో, అవమానంతో.. ఆ దేశంలోని స్కూళ్లను, యూనివర్సిటీలను, పరిశోధన సంస్థలను, ఆస్పత్రులను, మార్కెట్లను, బ్రిడ్జిలను, ఇళ్లను, అపార్ట్‌మెంట్లను సైతం ధ్వంసం చేసింది ట్రంప్‌, నెతన్యాహు ద్వయం. మొత్తానికి, ట్రంప్‌నకు విషయం అర్థమై.. ఎలాగోలా ఈ యుద్ధం నుంచి బయటపడుదామని భావించారు. సంధికి రావాలని పలుమార్లు ‘హెచ్చరికలు’ జారీ చేసినా కూడా ఇరాన్‌ ముందుకు రాలేదు. లెబనాన్‌కూ కాల్పుల విరమణ వర్తింపు అన్న డిమాండ్‌తో పాటు తన 10 షరతులు అంగీకరిస్తేనే వస్తామని స్పష్టం చేయటంతో.. ట్రంప్‌ వాటికి అంగీకరించి.. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన చేశారు. ఇస్లామాబాద్‌ వేదికగా చర్చలు జరుగుతున్న సమయంలో.. హొర్ముజ్‌ జలసంధి ద్వారా రెండు అమెరికా యుద్ధనౌకలను పంపించే ప్రయత్నం చేశారు. అది విజయవంతమై ఉంటే, మీడియా ప్రచారంతో దాన్నే పెద్ద విజయంగా (ఇంతకుముందు పైలట్‌ను రక్షించుకున్న ఆపరేషన్‌లాగా) చెప్పుకునేవారేమో. కానీ, అదీ సాధ్యపడలేదు. ఇరాన్‌ నౌకాదళం హెచ్చరికలతో ఆ యుద్ధనౌకలు పారిపోయాయి. యుద్ధానికి ముందులాగా.. ఇరాన్‌ మీద షరతులు పెట్టబోతే ఆ దేశం అంగీకరించలేదు. చర్చలు విఫలమయ్యాయి.


మరోసారి చర్చలు జరుగుతాయా? ట్రంప్‌ ఈ యుద్ధాన్ని విరమిస్తారా? కొనసాగిస్తారా? అన్నది ప్రస్తుతానికి తెలియదు. కానీ, ఇప్పటి వరకు జరిగిన ఈ యుద్ధం వల్ల తేలిందేమిటంటే.. పశ్చిమాసియాలో ఇకపై అమెరికా, ఇజ్రాయెల్‌ ఏకపక్ష ఆధిపత్యం నడవదు. తన సైనికశక్తి ద్వారా, హొర్ముజ్‌ జలసంధిపై పట్టు ద్వారా ఇరాన్‌ ఈ ప్రాంతంలో ఓ కొత్త శక్తిగా ఆవిర్భవించింది. గల్ఫ్‌ దేశాలు ఇక మీదట కూడా అమెరికా అడుగులకు మడుగులొత్తుతాయా? లేక.. ఇరాన్‌తో జతకట్టి తమ ప్రాంతాన్ని తామే తీర్చిదిద్దుకుంటాయా అన్నది వేచి చూడాల్సిన విషయం. ఇరాన్‌లాగా గల్ఫ్‌ దేశాలు కూడా చమురు విక్రయాలను డాలర్లలో కాకుండా ఇతర కరెన్సీల్లో నిర్వహిస్తే.. అమెరికా డాలర్‌ ఆధిపత్యం కొన్నేళ్లలోనే కూలిపోతుంది. ట్రంప్‌ పోకడలతో, దుర్భాషలతో నాటో ఇంతకుముందులా.. అమెరికా పెత్తనాన్ని అంగీకరిస్తుందా? అన్నది చూడాల్సి ఉంది. ప్రపంచాన్నే కలవరపరిచిన ఈ యుద్ధంలో మధ్యవర్తిగా ఉండి, కీలకమైన దశలో ఇరుపక్షాలనూ కాల్పుల విరమణకు అంగీకరింపజేసిన ఘనతను పాకిస్థాన్‌ సొంతం చేసుకుంది. వాస్తవానికి, ఇరాన్‌తో భారత్‌కు ఉన్న వేల ఏళ్ల అనుబంధం, కొన్ని దశాబ్దాల దౌత్య సంబంధాల నేపథ్యంలో.. మనం యుద్ధవిరమణకు చొరవ చూపి ఉండాల్సింది. కానీ, ప్రధాని మోదీ ఇటీవలి ఇజ్రాయెల్‌ పర్యటనతో.. మన దేశానికి ఏ మాత్రం సంబంధం లేని ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌, అమెరికా పక్షం తీసుకున్న సంకేతాలు వెళ్లాయి. పశ్చిమాసియాలో నూతన శక్తిగా ఆవిర్భవిస్తున్న ఇరాన్‌తో సంబంధాలను పునరుద్ధరించుకొని.. మళ్లీ భారత్‌ ప్రతిష్ఠను ఇనుమడింపజేసుకోవాలి.

- కె.వి.రవికుమార్‌

సీనియర్‌ జర్నలిస్ట్‌

Updated Date - Apr 14 , 2026 | 12:39 AM