కత్తిదించు ట్రంప్.. ఎత్తు శాంతి పతాక!
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:59 AM
ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్‌లు నిర్హేతుకంగా ప్రారంభించిన యుద్ధం బాధిత దేశాన్ని ధ్వంసం చేస్తోంది. పశ్చిమాసియా అంతటా అల్ల కల్లోలం సృష్టిస్తోంది.
ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్‌లు నిర్హేతుకంగా ప్రారంభించిన యుద్ధం బాధిత దేశాన్ని ధ్వంసం చేస్తోంది. పశ్చిమాసియా అంతటా అల్ల కల్లోలం సృష్టిస్తోంది. ఆ యుద్ధ ప్రభావాలు ఇరాన్‌కు, పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కావడం లేదు. దాని పర్యవసానాలు సమస్త దేశాలనూ సమస్యల సుడిలోకి నెట్టివేస్తున్నాయి.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా–ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’తో ఇరాన్‌లో అపార ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించింది. అయితే ఆ దేశం ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు, శత్రువుకు లొంగలేదు. యుద్ధ విషమ పరీక్షలో ఇరాన్ ఓడిపోలేదు. అయతొల్లా ఖమేనీతో సహా దేశ అగ్ర నాయకులు అందరూ యుద్ధం మొదటి రోజునే హతమయ్యారు. కొంత పెనుగులాటతోనే ఇరాన్ కొత్త అధినేతను ఎన్నుకున్నది.. సైనిక శ్రేణులకు కొత్త నాయకులను నియమించింది. కొత్త అధినేతను, సైనికాధికారులనూ తుదముట్టిస్తామని అమెరికా– ఇజ్రాయెల్ ప్రకటించాయి. టెహ్రాన్, సనాందాజ్, ఇస్ఫహాన్ తదితర ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇంతవరకు దాదాపు 1300మంది ఇరానియన్లు హతమయ్యారు, పదివేల మంది గాయపడ్డారు. అమెరికన్ క్షిపణి ఒకటి ఒక పాఠశాలను భస్మీపటలం చేసింది. ఈ భయానక ఘటనలో 168 మంది బాలలు, 14 మంది ఉపాధ్యాయులు మాడి మసైపోయారు. ఆ చిన్నారులు చేసిన నేరమేమిటి? వారి గురువులు పాల్పడిన పాపమేమిటి?
ఇరాన్‌లో సంభవించిన విధ్వంసాన్ని రేఖామాత్రంగా పేర్కొంటాను: క్షిపణి ప్రయోగ వేదికలు, సైనిక దళాల స్థావరాలు, నౌకాదళ ఆస్తులు, వాయుతల రక్షణ కేంద్రాలు, ఉత్పత్తి సదుపాయాలు; గృహాలు, పాఠశాలలు, ఆస్పత్రులు; చమురు నిల్వ కేంద్రాలు (ఇవి ఇంకా భగభగ మండుతూనే ఉన్నాయి); నీటి సరఫరా కేంద్రాలు మొదలైన ప్రాథమిక పౌర సదుపాయాలు; ముప్పులో పడిన ప్రజారోగ్యం; కనీవినీ ఎరుగనిరీతిలో పర్యావరణ విధ్వంసం.
ఇరాన్‌లో పాలనా వ్యవస్థ స్వభావాన్ని పక్కన పెట్టి ఇరానియన్ల యోగక్షేమాలపై మన దృష్టిని కేంద్రీకరిద్దాం. ఇంత భయంకర విధ్వంసానికి లోను చేసేందుకు వారు చేసిందేమిటి? ఇజ్రాయెల్ ప్రోత్సాహంతో యుద్ధానికి దిగిన అమెరికా.. ఇరాన్‌పై చేసిన ఆరోపణల్లో నిజమెంత? ఇరాన్ పెద్ద ఎత్తున శుద్ధిచేసిన యురేనియంను నిల్వచేసుకుందని, అణ్వస్త్రాల అభివృద్ధిని దాదాపుగా పూర్తి చేసిందని అమెరికా ఆక్రోశించింది. ఖతార్ మధ్యవర్తిత్వంలో ఇరాన్‌తో చర్చలకు అమెరికా పూనుకున్నది. అయినా యుద్ధం ప్రారంభమయ్యే సూచనలను పసిగట్టిన ఒమన్ విదేశాంగమంత్రి వాషింగ్టన్‌కు వాయువేగాన వెళ్లి ‘శుద్ధి చేసిన యురేనియంను నిల్వ చేసుకోకుండా ఉండేందుకు’ ఇరాన్ అంగీకరించిందని, అలాగే ఎట్టి పరిస్థితులలోనూ ‘అణ్వస్త్రాల తయారీకి పూనుకోబోమని’ కూడా ఇరాన్ హామీ ఇచ్చిందని సవివరంగా నివేదించారు. అయినా ఒమన్ మాటను ట్రంప్ ఖాతరు చేయలేదు. ఇరాన్ హామీలను తోసిపుచ్చారు.. ఖతార్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న చర్చలను నిలిపివేసి, ఇరాన్‌పై యుద్ధదాడులకు ఆదేశించారు.
ఇజ్రాయెల్ విస్తరణవాదానికి ఇరాన్ ఒక పెద్ద అవరోధం కావచ్చు కానీ, అమెరికాకు ఇరాన్ ఏ విధంగానూ ముప్పు కాదు. 2025 జూన్‌లో ఇరాన్‌కు వ్యతిరేకంగా ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్’ పేరిట అమెరికా న్యాయ విరుద్ధమైన దాడులు నిర్వహించింది. ఆ దాడుల అనంతరం ‘ఇరాన్‌లో యురేనియం శుద్ధి సదుపాయాలను పూర్తిగా నిర్మూలించినట్టు’ అమెరికా ప్రకటించింది. మరి మిడ్‌నైట్ హ్యామర్‌లో ఆ విధంగా నష్టపోయిన తరువాత కూడా ఇరాన్ ఎలా అణ్వస్త్రాలను అభివృద్ధి చేసుకున్నది? అవి ఎక్కడ ఉన్నాయి? వాటి విషయమై ఐక్యరాజ్యసమితికి ఒక నివేదిక సమర్పించాలని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు అమెరికా విజ్ఞప్తి చేసిందా? అలా విజ్ఞప్తి చేయడం అమెరికా నైతిక బాధ్యత కాదా? అయినా.. ఏ దేశం అణ్వస్త్రాలను కలిగి ఉండాలి, ఏ దేశం ఆ మారణాయుధాలను కలిగి ఉండకూడదని నిర్ణయించే, నిర్దేశించే అధికారం అమెరికాకు ఎక్కడుంది? భారత్, పాకిస్థాన్, ఉత్తర కొరియాలలో కూడా జోక్యం చేసుకుని ఆయా దేశాల అణ్వస్త్రాల తయారీ సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కూడా అమెరికా నిర్ణయం తీసుకుంటుందా?
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌కు శత్రువులు ఉన్నారు. పాలస్తీనియన్ల భూ భాగాలలో 1948లో ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసినప్పుడే ఆ శత్రుత్వం ప్రజ్వరిల్లింది. అయినప్పటికీ కాలక్రమంలో ఇస్లామిక్ దేశాలతో సహా సమస్త ప్రపంచమూ ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించింది. పాలస్తీనా విభజన ప్రణాళిక (1947)కు వ్యతిరేకంగా భారత్ ఓటు వేసినప్పటికీ 1950 సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించింది. 1992లో ఆ దేశంతో పూర్తిస్థాయి దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నది. వాణిజ్యం, సైనిక సహకారం, గూఢచర్య సమాచారం పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం తదితర విషయాలలో ఉభయ దేశాల మధ్య సంబంధాలు సుస్థిరంగా వర్ధిల్లుతున్నాయి. పశ్చిమాసియా వివాదాలు, సంఘర్షణల్లో భారత్ ఇప్పటివరకు సంయమన వైఖరితో వ్యవహరిస్తూ వస్తోంది. అయితే ఇటీవల భారత్ ఇజ్రాయెల్ పక్షపాతిగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది మార్చి 12న ఇరాన్‌ను మాత్రమే ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రతిపాదించిన తీర్మానానికి భారత్ మద్దతునిచ్చింది. షియా దేశాల కూటమికి, ప్రభవిస్తోన్న సున్నీ దేశాల కూటమికి వ్యతిరేకంగా భారత్, గ్రీస్, సైప్రస్, అరబ్, ఆఫ్రికన్, మధ్యధర సముద్ర తీరస్థ దేశాలు ఒక కూటమిగా ఏర్పడాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రతిపాదించినప్పుడు దానిపై భారత్ మాటమాత్రంగానైనా నిరసన తెలుపలేదు!
ఇరాన్‌పై యుద్ధానికి పోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యాలు ఏమిటి? తొలుత ‘ఇరాన్‌ను అణ్వస్త్ర రహితం చేయడం’ అని ప్రకటించారు. ఆ తరువాత ‘ఇరాన్ సైనిక సామర్థ్యాల సంపూర్ణ నిర్మూలన’ అని నిర్దేశించుకున్నారు. పిదప, పాలనా వ్యవస్థ మార్పుగా ప్రకటించారు. ఇప్పుడు ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ గర్జిస్తున్నారు. ‘మీ ప్రభుత్వాన్ని కూలదోయండి, దేశ పాలనను మీ చేతుల్లోకి తీసుకోండి, మీకు ఇదొక అవకాశం’ అని ట్రంప్ చేసిన విజ్ఞప్తిని ఇరానియన్లు ఏ మాత్రం పట్టించుకోనేలేదు.
ట్రంప్ దుస్సాహసం ఫలితంగా చమురు ధరలు మిన్నంటాయి. బ్యారెల్ చమురు ధర 100 డాలర్లకు పైగా పెరిగింది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతోంది. అంతేనా? ట్రంప్ పాలన పట్ల అసంతృప్తి తీవ్రమవుతోంది. ఇరాన్ నియంత్రణలో ఉన్న హోర్మూజ్ జలసంధి ద్వారా ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోయాయి. మన దేశంలో ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. ధరలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. యుద్ధ వ్యయాలు రోజుకు 200 కోట్ల డాలర్లు అని నిపుణులు అంచనా వేశారు. ఇరానియన్లు, ప్రపంచ ప్రజలు చెల్లిస్తున్న మూల్యం అగణితమైనది కాదూ?
‘యుద్ధం క్రూరమైనది, నిరర్థకమైనది, మూర్ఖమైనది’ అని జనరల్ ఐసెన్ హోవర్ (రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల సేనలకు నేతృత్వం వహించిన సైనికాధికారి, 1950వ దశకంలో అమెరికా అధ్యక్షుడు) అన్నారు. ఆయన అనుభవపూర్వకంగా చెప్పిన సత్యమది. నాలుగు సంవత్సరాల క్రితం పొరుగు దేశం ఉక్రెయిన్‌ను రష్యా దురాక్రమించింది. అంతిమ విజయం రష్యాకు ఇంకా యోజనాల దూరంలో ఉన్నది. ఒక పక్క గెలుపు అసాధ్యంగా ఉండగా మరో పక్క రష్యా రుణ భారం పెరిగిపోయింది. చమురు ఎగుమతుల ఆదాయం తగ్గిపోతోంది. ఒకనాడు హిట్లర్ సేనను మట్టి కరిపించిన రష్యా సైన్యం ఇప్పుడు కిరాయి సైనికులను ఉపయోగించుకుంటోంది! ఇరాన్‌పై నిష్కారణంగా ఎత్తిన కత్తిని దించివేసే యోచన అమెరికాకు ఉన్నట్టు కనిపించడం లేదు. పశ్చిమాసియాలో యుద్ధం పిచ్చికుక్కలా పరుగెడుతూనే ఉంటుంది, సందేహం లేదు. ఇరాన్‌కు వ్యతిరేకంగా చేస్తోన్న ఈ యుద్ధాన్ని నవ నవీన యంత్రాలతో పోరాడుతున్నందున అవి నిరాటంకంగా సరఫరా అవుతున్నంత వరకు అమెరికా ఈ యుద్ధాన్ని విరమించదు. విజయం అనే మృగతృష్ణకు చేరేదాకా కొనసాగిస్తుంది!
యుద్ధాన్ని ప్రారంభించే దేశానికి ఆ యుద్ధాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిలిపివేయాలో కూడా బాగా తెలిసి ఉండాలి. అటువంటి అవగాహనతోనే యుద్ధానికి దిగాలి. యుద్ధం తాకిడి ప్రతి దేశానికి తప్పక ఉంటుంది. ప్రతి ఒక్కరూ దాని దుష్ప్రభావ పరిధిలోనే ఉంటారు. ఉక్రెయిన్‌ను రష్యా దురాక్రమించినప్పుడు భారత్ ఆ దురాగతాన్ని ఖండించలేదు. సరికదా, ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని వ్యాఖ్యానించింది! వెనెజువెలా అధినేత నికోలస్ మదురోను అమెరికా కిడ్నాప్ చేసి తీసుకెళ్లినప్పుడు ఆ దుశ్చర్యను భారత్ ఖండించలేదు. రష్యాకు చేసినట్లుగా అమెరికాకు ఎటువంటి ధర్మోపదేశాలు చేయలేదు. పశ్చిమాసియాలో ప్రస్తుత నిర్హేతుక యుద్ధాన్ని ఖండిస్తూ మన దేశం బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
అమెరికా/ఇజ్రాయెల్– ఇరాన్ యుద్ధంలో జాతిపరమైన, మతపరమైన వైషమ్యాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఒక సామ్రాజ్యవాద దేశంగా ప్రవర్తిస్తోంది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్ పైకి యుద్ధానికి వెళ్లడం ద్వారా అమెరికా తన సంస్థాపక సూత్రాలకు సమాధి కడుతోంది! జాతి పితామహుల ఆదర్శాలను అలక్ష్యం చేసే దేశం నైతికంగా వ్యవహరిస్తుందా? అయ్యో, మన భారత్ అయినా న్యాయ నిష్ఠ చూపడం లేదే?! బలవంతుడి మాటే వేదవాక్కు అని విశ్వసించేవారి ఎదుట వణుకుతూ, విధేయ వైఖరితో వ్యవహరించడమేమిటి? భారత్ స్వీయలక్ష్యాలే మననీ బలహీన స్థితికి తగ్గించివేశాయి!
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)