Share News

కర్పూరి స్ఫూర్తితో కొత్తతరం కదలాలి

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:34 AM

‘దేశానికి స్వాతంత్య్రం వస్తే మా బడుగుజీవుల బతుకుల మార్పునకు ఏం చేస్తారో చెప్పండ’ని స్వాతంత్రోద్యమ కాలంలోనే తన దార్శనిక ఆలోచనలతో ప్రశ్నించారు జ్యోతిరావు ఫూలే...

కర్పూరి స్ఫూర్తితో కొత్తతరం కదలాలి

‘దేశానికి స్వాతంత్య్రం వస్తే మా బడుగుజీవుల బతుకుల మార్పునకు ఏం చేస్తారో చెప్పండ’ని స్వాతంత్రోద్యమ కాలంలోనే తన దార్శనిక ఆలోచనలతో ప్రశ్నించారు జ్యోతిరావు ఫూలే. ఆ ఆలోచనల కొనసాగింపుగానే కర్పూరి ఠాకూర్ ఓబీసీల హక్కుల సాధనకు, సామాజిక న్యాయం కోసం నిలిచి పోరాడారు. ఓబీసీల సామాజిక ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక నినాదమై మారుమోగుతున్న సందర్భంలో దేశంలో బీసీ రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టిన మహోన్నతుడిగా ఆయనను బీసీలోకం మననం చేసుకుంటుంది. కర్పూరి ఠాకూర్‌కున్న దార్శనికతే సామాజిక దృక్పథంగా నిలిచి మండల్ కమిషన్ అమలుకు దోహదకారి అయ్యింది.

భూస్వామ్యం, ధనస్వామ్యం, ఫ్యూడల్ వ్యవస్థ యథేచ్ఛగా రాజ్యమేలుతున్న కాలాన్ని ఒక నిరాడంబరుడిగా, ఒక సత్యాగ్రహిగా ఆత్మస్థైర్యంతో నిలిచి గెలవటం చరిత్రలో నూతన అధ్యాయం. కర్పూరి ఠాకూర్ నిరుపేద మంగలి కుటుంబం నుంచి వచ్చినా, కింది కులాల హక్కుల కోసం నిలిచి, ఓబీసీలకు దేశంలోనే తొలిసారిగా రిజర్వేషన్లు ఇచ్చారు. బుద్ధుడు జన్మించిన నేలలో పుట్టిన ఆయన సామాజిక ఉద్యమకారుడుగా బడుగుల పక్షాన పోరాడారు. రెండుసార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన నివాసం మాత్రం పూరిపాకే. చితికిపోయిన బతుకుల కోసం, ఛిద్రమైన పేదల భవిత కోసం నిరంతరం తపించారు. మారుమూల గ్రామాలలో బడులు, కాలేజీలు కట్టించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రి ఫూలేల దారిలో నడుస్తూ బడుగుల భవితను మార్చేది జ్ఞానమేనని నమ్మి సేవలందించారు. వెనుకబడిన కులాలకు, అత్యంత వెనుకబడిన బీసీలు, సంచార, అర్ధసంచార జాతుల విముక్తికై 1997లో ముంగేరిలాల్ కమిషన్‌ను నియమించి, అదే ఏడాది బీసీలకు 26శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అగ్రవర్ణాల నుంచి తీవ్ర నిరసనలు వచ్చినా జంకలేదు, వెనుకడుగు వేయలేదు. అయితే ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినందువల్ల కలిగిన రాజకీయ సంక్షోభంలో ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకుని, బడుగుల పక్షమే నిలిచారు. ఆయన ఇచ్చిన రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఓబీసీలకు రిజర్వేషన్లు పొందటానికి పునాది అయ్యింది.


కర్పూరి ఠాకూర్‌లాగా నేడు నిరాడంబరంగా జీవించే నాయకులు దేశమంతా వెతికినా కనిపించరు. నిజాయితీతో పనిచేయటమే గీటురాయి అన్నది చెరిగిపోయి, కోట్లాది రూపాయలు గుమ్మరిస్తే తప్ప ఎన్నికల్లో నిలిచే పరిస్థితి లేదు. దేశంలో ప్రజాస్వామ్యాన్నే వేలం వేసి కొనుక్కునే దశలో నిరాశవాదంలోకి వెళ్ళిన సమాజం మళ్లీ ఆశావాదం వైపునకు మళ్లటానికి కర్పూరి ఠాకూర్‌ లాంటి నాయకుడు చీకటిలో దీపంగా వెలుగునిస్తున్నారు. ఈ నేపథ్యం నుంచి కర్పూరి ఠాకూర్‌ను నేటి యువతరం అధ్యయనం చేయాలి. ఆయన నుంచి నిరాడంబరతను, నిజాయితీని, ధైర్యాన్ని నేర్చుకోవాలి. కింది కులాల నుంచి ఎదుగుతున్న నేతలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. బహుజన తాత్త్వికతను, సోషలిస్టు భావజాలాన్ని గుండెనిండా నింపుకున్న కొత్త తరం రాజకీయ వేదిక మీదకు వచ్చినప్ప్పుడే దేశానికి అన్ని రకాల ఆధిపత్యాల నుంచి విముక్తి లభిస్తుంది.

దేశంలో 788 పార్లమెంట్ సభ్యుల్లో 306 మందిపై క్రిమినల్ కేసులు, 194మంది మీద సీరియస్ కేసులు ఉన్నాయి. దేశం మొత్తమ్మీద 4,131 మంది ఎమ్మెల్యేలలో 1,746 మందిపై (2023లో) క్రిమినల్ కేసులున్నాయి. 2024 నాటికి పాతవి, కొత్తవి కలిపి 4,474 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి– అంటే 44శాతం మందిపై క్రిమినల్ కేసులన్నమాట.

ఏ పని మీద పోయినా ఎంత లంచమిస్తావనేది సర్వనామంగా మారింది. అవినీతి నుంచి దేశాన్ని కాపాడాలంటే కర్పూరి ఠాకూర్‌లు కావాలి. ఆయన 50 ఏళ్ల క్రితం మారుమూల ప్రాంతాలలో స్కూళ్లు, కాలేజీలు కట్టించారు. ఇప్పుడు ఆ ప్రభుత్వ బడులను, విద్యార్థుల సంఖ్య లేదని మూసేస్తున్నారు. నిరుద్యోగం పెచ్చరిల్లిపోయింది. ప్రజల ప్రయోజనాలను, అణగారిన వర్గాలను కాపాడేందుకు కర్పూరి లాంటి నేతలు రావాలి. ప్రభుత్వ రంగాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. ప్రజల జీవన విధానం చిన్నాభిన్నమైంది. హింస పెరుగుతోంది. ద్వేషభావాలు పేట్రేగుతున్నాయి. ప్రజల పక్షాన నిలవాల్సిన నేతలు ఏం చేస్తున్నారని కర్పూరి ఠాకూర్ స్ఫూర్తిగా కొత్తతరం ప్రశ్నించేందుకు ముందుకు రావాలి.

భూస్వాముల వద్ద భూములు, ప్రభుత్వం వద్ద భూములు పేదలకు పంచితేనే ఆర్థిక, సామాజిక సమానత్వం వస్తుందని నమ్మి, కర్పూరి ఠాకూర్‌ అందుకు శ్రీకారం చుట్టారు. గౌతమబుద్ధుడు పుట్టిన నేల నుంచి సామాజిక ఉద్యమ సూర్యుడిగా కర్పూరి ప్రభవించారు. ఆయనకు ‘భారతరత్న’ ఇవ్వడం బడుగు జీవులందరినీ గౌరవించడమే.

-జూలూరు గౌరీశంకర్

Updated Date - Jan 24 , 2026 | 05:34 AM