Share News

ఆ అక్టోబరు 31న రోదనలూ నినాదాలే..

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:42 AM

ఉదయం పది గంటల సమయం... నేను అబిడ్స్‌లో బస్సు కోసం నిలబడ్డాను. ట్రూప్‌ బజార్‌ నుంచి ఏదో కలకలం. దూరం నుంచి ఓ లారీ వస్తోంది.

ఆ అక్టోబరు 31న  రోదనలూ నినాదాలే..

ఉదయం పది గంటల సమయం... నేను అబిడ్స్‌లో బస్సు కోసం నిలబడ్డాను. ట్రూప్‌ బజార్‌ నుంచి ఏదో కలకలం. దూరం నుంచి ఓ లారీ వస్తోంది. అందులో నిలబడిన జనాలు తమ చేతులు ఊపుతూ గట్టిగా అరుస్తున్నారు. దుకాణాలు, హోటళ్లు, బ్యాంకులు అన్నీ మూసుకుంటున్నట్లు షట్టర్ల చప్పుళ్లు, లారీ నా ముందుకొచ్చింది. దాని ముందుభాగాన ప్రధాని ఇందిరాగాంధీ తైలవర్ణ చిత్రపటం. దానికి ఒక పెద్ద పూలదండ వేలాడుతోంది. లారీలో నిలుచున్న యువకుల నుంచి రోదనలు, నినాదాలు వినబడుతున్నాయి. ‘ఇందిరాగాంధీ అమర్‌ హై’. ‘జబ్‌ తక్‌ చాంద్‌ ఔర్‌ సూరజ్‌ రహేగా, ఇందిరమ్మా, తేరా నామ్‌ రహేగా’.

నా కాళ్ల కింద నేల కదులుతున్నట్లు అనిపించింది. నా వెనుక ఉన్న దుకాణంలోని రేడియో నుంచి బీబీసీ వార్తలు వస్తున్నాయి. ‘ఉదయం ఎనిమిదిన్నర– తొమ్మిది మధ్య ప్రధాని ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులిద్దరూ తుపాకీతో కాల్చారు. ఆస్పత్రికి చేర్చేలోగానే ఆమె విగత జీవురాలయింది’ అని. రోడ్డుమీద నిలుచున్న ప్రజలందరూ స్థాణువులైనారు. లిప్తకాలం తర్వాత ఆ దుర్వార్తను జీర్ణించుకున్న వారి మనసులు తమ ఇంట్లోనే ఎవరో సన్నిహితులు చనిపోయినట్లు కళ్ల నిండా నీళ్లు నింపుకుని విషాద వదనాలతో అచేతనంగా మారారు. స్త్రీలు దుఃఖం ఆపుకోలేక ‘అయ్యో! ఇక ఇందిరమ్మ లేదట’ అని ఒకళ్లనొకళ్లు కావలించుకుని రోదిస్తున్నారు. నాకు ఆమె మీద వున్న కోపం క్షణాల్లో కరిగిపోయింది. కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది. ఒక మతోన్మాది చేతిలో ఒక గాంధీ బలి కాగా, మరో మతోన్మాదుల చేతిలో ఇప్పుడు మరో గాంధీ బలి కావటం తట్టుకోలేకపోయాను.


ఆమె జీవితమే ఒక విషాదాంత కావ్యం. తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణకు సంపూర్ణంగా నోచుకోని పువ్వులాంటి ఆమె బాల్యం, కౌమార జీవితం... ధీర వనిత ‘జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌’ను తన ఆదర్శమూర్తిగా స్వీకరించిన ఆమె యవ్వన కాలం, భర్తతో పొసగక ఇద్దరు చిన్న కొడుకులతో తండ్రి చెంతకు చేరటం... తండ్రి గతించిన తర్వాత ‘గూంగీ గుడియా’ అని ప్రతిపక్షాల అపహాస్యాలను భరించటం... అన్నీ నా కళ్లముందు తిరిగాయి. రాణి రుద్రమదేవి, రజియా సుల్తానా, చాంద్‌బీబీ, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి మరోసారి ఈ ఉదయాన్నే ఒకేసారి చనిపోయినట్లు బాధపడ్డాను.

ఇంటికి వచ్చాను. అమ్మ బావి దగ్గర బట్టలు ఉతుకుతోంది. ఎదురుగా ఉన్న రాతి అరుగు మీద కూచుని ‘అమ్మా, ఇందిరాగాంధీ చనిపోయింది’ అన్నాను తలదించుకుని. తన నడినెత్తిన పిడుగుపడినట్లు ముఖం పెట్టింది అమ్మ. ఇందిరమ్మ అంటే మా అమ్మకు అభిమానం. కాసేపటికి, తలవొంచుకుని కూర్చున్న నా దగ్గరికి అమ్మ వచ్చి, భుజం మీద చేయివేసి ‘నానీ! ఆమె బతికున్నప్పుడు ఎమర్జెన్సీ పెట్టిందని విమర్శించేవాడివి. మరి ఇప్పుడు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు?’ అని ప్రశ్నించింది. దానికి సమాధానం నా వద్దనే కాదు, బహుశా దేశంలోని ఏ ప్రతిపక్షాల వద్దా ఉండదు.


ఇందిర తన మరణానికి ఒక రోజు ముందు భువనేశ్వర్‌ను సందర్శించారు. గతంలో నెహ్రూ ఈ పట్టణంలోనే జబ్బుపడి, దాంతోనే 1964లో ఢిల్లీలో మరణించారు. ఆమె కూడా తన మరణానికి ఒక రోజు ముందు భువనేశ్వర్‌ సభలో ప్రసంగిస్తూ ‘నేనీరోజు ఇక్కడ ఉన్నాను. బహుశా రేపు నేను ఉండకపోవచ్చు. నేను ఉంటానా ఉండనా అన్నదాని గురించి నాకేమీ చింతలేదు. జీవితాన్నంతా ప్రజల కోసమే గడిపినందుకు గర్విస్తున్నాను. నా ఆఖరి శ్వాస వరకూ ప్రజల కోసమే జీవిస్తాను. ఒకవేళ నేను చనిపోతే నా ప్రతి రక్తపు చుక్కా ఈ దేశాన్ని పటిష్ఠం చేయటానికే ఉపయోగపడుతుంది’ అన్నారు. ముంచుకొచ్చే మృత్యువే ఆమెతో అట్లా మాట్లాడించిందేమో? అమెరికాకు చెందిన గూఢచార సంస్థ సీఐఏ తనకు నచ్చని దేశాధినేతల్ని వరుసగా హత్య చేయిస్తోంది. వాటిని దృష్టిలో పెట్టుకునే ఆమె అట్లా ప్రసంగించారేమో? ఒడిశా పర్యటన నుంచి ఆమె ఇల్లు చేరుకుని, ఆ రాత్రంతా సరిగా నిద్ర లేకున్నా మర్నాడు ఉదయం త్వరగానే లేచారు. ఆ రోజు ఆమె నల్లటి అంచు ఉన్న కాషాయపు రంగు చీర కట్టుకున్నారు.


ఆపరేషన్‌ బ్లూస్టార్‌ ఉదంతం తర్వాత ఆమె రక్షణదళంలో సిక్కులు ఉండరాదని గూఢచార వర్గాలు హెచ్చరించినా, ఇందిర వినలేదు. వారిని తొలగిస్తే సిక్కు మతస్థుల దృష్టిలో తన మీద ఉన్న నమ్మకం దెబ్బతింటుందని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ చివరికి ‘రక్షకులే భక్షకులు’గా మారారు. తన తండ్రి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఇందిర తీన్‌మూర్తి భవనంలోనే నివసించేవారు. దేశ విదేశీ అతిథులకు చేసే ఏర్పాట్లన్నీ స్వయంగా పర్యవేక్షించేవారు! ఇంగ్లండ్‌ నుంచి వచ్చిన రాజకుమారి ‘అన్నే’కు ఆ సాయంత్రం ఇవ్వవలసిన విందు ఏర్పాట్ల గురించి తన ఆంతరంగిక కార్యదర్శికి సూచనలిచ్చారు. తన గురించి డాక్యుమెంటరీ ఫిల్మ్‌ తీయడానికి వచ్చిన రష్యా సిన్మా దర్శకుడు ‘ఉస్తినోవ్‌’కు చాయ్‌ ఇవ్వాల్సిందిగా సేవకుడిని ఆదేశిస్తూనే, ఆమె 9.10 నిమిషాలకు తన నివాసగృహం నుంచి ఇవతలికి వచ్చి చెట్ల నీడలో చకచకా నడుస్తుంటే... అకస్మాత్తుగా ఆమె అంగరక్షకులు బియాంత్‌సింగ్‌, సత్వంత్‌సింగ్‌లు మెషిన్‌గన్‌తో కాల్చడంతో ఆమె కుప్పకూలిపోయారు. అంబులెన్స్‌ అందుబాటులో లేనందున ఆమెను అంబాసిడర్‌ కారులోనే ఎయిమ్స్‌కు తీసుకుపోయారు. ఆమె కాలేయంలోని కుడిభాగం ఛిద్రమైంది. పెద్దపేగులో పన్నెండు రంధ్రాలైనాయి. ఊపిరితిత్తిలో ఒక బుల్లెట్‌ చిక్కుకుపోయింది. దాంతో ఇందిర తుదిశ్వాస విడిచారు.

ఆ సాయంత్రమే రాజీవ్‌గాంధీతో భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు రాష్ట్రపతి. రాజీవ్‌ కూడా 1991లో ఒక తమిళ ఉగ్రవాది కుట్రకు బలయ్యారు. అట్లా ముగ్గురు గాంధీలు భారతదేశం కోసం తమ రక్తం ధారపోసి ప్రాణాలను అర్పించారు.

- పరవస్తు లోకేశ్వర్‌

Updated Date - Oct 31 , 2026 | 12:43 AM