బోర్డు ఏదైనా.. సమగ్ర మేధో వికాసం కావాలి
ABN , Publish Date - Apr 04 , 2026 | 02:54 AM
మన దేశంలో పాఠశాల విద్య గత దశాబ్ద కాలంగా అత్యంత వేగంగా మార్పులకు లోనవుతోంది. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కువగా స్థానిక రాష్ట్ర బోర్డు పాఠశాలల్లో చదివించేవారు. కానీ నేడు జాతీయ, అంతర్జాతీయ బోర్డు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించేందుకే అధిక ఆసక్తి చూపుతున్నారు.
మన దేశంలో పాఠశాల విద్య గత దశాబ్ద కాలంగా అత్యంత వేగంగా మార్పులకు లోనవుతోంది. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కువగా స్థానిక రాష్ట్ర బోర్డు పాఠశాలల్లో చదివించేవారు. కానీ నేడు జాతీయ, అంతర్జాతీయ బోర్డు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించేందుకే అధిక ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ), ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్‌ఈ) వంటి జాతీయ బోర్డులతో పాటు, ఇంటర్నేషనల్ బ్యాకలారియేట్ (ఐబీ), కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (సీఏఐఈ) వంటి అంతర్జాతీయ పాఠ్యప్రణాళికలు భారతీయ పాఠశాల విద్యా ముఖచిత్రాన్ని వేగంగా మారుస్తున్నాయి. గ్లోబల్ పోటీ, మారుతున్న ఉద్యోగ అవకాశాలు, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యపై తల్లిదండ్రుల ఆకాంక్ష వంటివి ఈ పరిణామాలకు ప్రధాన ప్రేరణగా నిలుస్తున్నాయి.
దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థను సమగ్రంగా పరిశీలిస్తే, ఇప్పటికీ సుమారు అరవై శాతానికి పైగా విద్యార్థులు రాష్ట్రాల విద్యా బోర్డుల పరిధిలోనే విద్యనభ్యసిస్తున్నారు. మాతృభాషలో బోధన, స్థానిక సంస్కృతికి ప్రాధాన్యం, తక్కువ ఖర్చుతో విద్య అందుబాటులో ఉండటం వీటి ప్రధాన బలాలు. అదే సమయంలో, జాతీయ స్థాయి పోటీని ఎదుర్కొనే క్రమంలో రాష్ట్ర బోర్డులు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP–2020)కు అనుగుణంగా తమ పాఠ్య ప్రణాళికలను ఆధునికీకరిస్తూ ముందడుగు వేస్తున్నాయి.
సీబీఎస్‌ఈ బోర్డు దేశవ్యాప్తంగా దాదాపు 27వేలకు పైగా పాఠశాలలతో తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సిలబస్ బలమైన పునాదిగా మారుతోంది. విదేశాల్లో నివసించే భారతీయ విద్యార్థుల కోసం ‘గ్లోబల్ కరిక్యులం’ను ప్రవేశపెట్టే దిశగా సీబీఎస్‌ఈ అడుగులు వేస్తోంది. నాణ్యతకు ప్రతీకగా నిలిచే మరో బోర్డు ఐసీఎస్‌ఈ. కేవలం మార్కుల కోసమే కాకుండా, సమగ్ర మేధో వికాసానికి ప్రాధాన్యం ఇస్తోంది.
అంతర్జాతీయ కరిక్యులం కలిగిన ఐబీ, కేంబ్రిడ్జ్ పాఠశాలల సంఖ్య భారత్‌లో వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అంతర్జాతీయ పాఠశాలల కేంద్రంగా అవతరించింది. 2025 ప్రారంభం నాటికే దేశంలో వెయ్యికి పైగా అంతర్జాతీయ పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ విద్యార్థులకు పుస్తకాల జ్ఞానం మాత్రమే కాకుండా, పరిశోధన, తార్కిక ఆలోచన, సామాజిక అవగాహన... తదితర అంశాలపై విస్తృత శిక్షణ ఇస్తారు. ఈ విధానాలు విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయి. అలాగే సీబీఎస్‌ఈ + కేంబ్రిడ్జ్, సీబీఎస్‌ఈ + ఐబీ వంటి డ్యూయల్ అఫిలియేషన్ పాఠశాలల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే అధిక ఫీజులు ఈ విద్యను కొన్ని ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితం చేస్తున్నాయన్న వాస్తవాన్ని విస్మరించలేం. అయినప్పటికీ, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇవి మెరుగైన పునాదిని వేస్తున్నాయి.
భవిష్యత్ విద్య కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాదన్నది స్పష్టమవుతోంది. 2025 నాటి విద్యా పోకడలను పరిశీలిస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కోడింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, డిజైన్ థింకింగ్ వంటి ఆధునిక అంశాలు ప్రాథమిక స్థాయి నుంచే పాఠ్యాంశాల్లో భాగమవుతున్నాయి. విద్యార్థుల ప్రతిభను కేవలం మార్కుల ఆధారంగా కాకుండా, వారి సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాల ఆధారంగా మదింపుచేసే ‘హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్’ విధానం విస్తరిస్తోంది. డిజిటల్ లెర్నింగ్ టూల్స్ వినియోగం తరగతి గదులను మరింత ఇంటరాక్టివ్‌గా, చైతన్యవంతంగా మారుస్తోంది. ఏ బోర్డు గొప్పది అన్న చర్చ కంటే, విద్యార్థి ఆసక్తులు, కుటుంబ ఆర్థిక స్థితి, కెరీర్ లక్ష్యాలకు ఏ విద్యా విధానం సరిపోతుందో నిర్ణయించుకోవడమే నేటి అవసరం.
రాష్ట్ర బోర్డులు విద్యా వ్యవస్థకు బలమైన పునాదిగా నిలుస్తుంటే, జాతీయ, అంతర్జాతీయ బోర్డులు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందిస్తున్నాయి. సిలబస్ ఏదైనా సరే, అది విద్యార్థిని స్వతంత్రంగా ఆలోచించేలా చేసి, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దినప్పుడే ఆ విద్యకు సార్థకత లభిస్తుంది. సాంకేతికత, నైపుణ్యాధారిత విద్య మేళవింపుతో సాగే ఈ ప్రయాణం మన భావి భారత పౌరులను ప్రపంచంతో పోటీ పడేలా సిద్ధం చేస్తోంది. విద్యా వ్యవస్థలో వస్తున్న ఈ సానుకూల మార్పులు దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
తల్లిదండ్రులు కేవలం బ్రాండ్ నేమ్స్ వెనుక పడకుండా పాఠశాల నాణ్యత, ఉపాధ్యాయుల నైపుణ్యం, కుటుంబ ఆర్థిక స్థితిగతులతో పాటు తమ పిల్లల మానసిక వికాసానికి ఏది సరైనదో గుర్తించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మనం ప్రతిభావంతమైన తరాన్ని ప్రపంచానికి అందించగలం.
-ఆచార్య దారపురెడ్డి సూర్యచంద్రరావు
కృష్ణా విశ్వవిద్యాలయం