Share News

జెన్‌జీని మోదీ జయించగలరా?

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:48 AM

‘నిలదొక్కుకోవాలంటే తడబడడం అవసరం’ అని ఒక కవి అన్నారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అదే దారిలో ఉన్నట్లు కనిపిస్తోంది. జూలై 20–25 తేదీల మధ్య దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై...

జెన్‌జీని మోదీ జయించగలరా?

‘నిలదొక్కుకోవాలంటే తడబడడం అవసరం’ అని ఒక కవి అన్నారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అదే దారిలో ఉన్నట్లు కనిపిస్తోంది. జూలై 20–25 తేదీల మధ్య దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను బుట్టదాఖలు చేయాలని, తదుపరి దర్యాప్తులు చేయరాదని ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో... దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో సెప్టెంబర్ 5న పెల్లుబుకాల్సిన మరో అల్లకల్లోలం సమసిపోయినట్లేనని భావించవచ్చు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగాల్సిన బ్రిక్స్ సమ్మిట్ నేపథ్యంలో మరోసారి శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చునని కేంద్రం భావించినందువల్లే సామరస్య వైఖరిని అవలంబించక తప్పలేదని స్పష్టమవుతోంది. ఎఫ్ఐఆర్‌లను రద్దు చేస్తామని, నీట్ పేపర్ లీక్‌లతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని సీజేపీ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకుని నెల రోజులు దాటింది. అయితే కేంద్రం ఎంతకూ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఉపాధ్యాయుల దినోత్సవం రోజున ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీసు హెడ్ క్వార్టర్స్ దాకా నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని సీజేపీ ప్రకటించింది. దీంతో న్యూఢిల్లీలో పోలీసులు భారతీయ నాగరిక్‌ సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద అనుమతిలేని అన్ని సమావేశాలను పూర్తిగా నిషేధించారు. ఈ నిరసన ప్రదర్శనపై నిషేధం విధించాలని ఒక రిటైర్డ్ పోలీసు అధికారి ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయించారు.

సాధారణంగా అయితే పెద్ద ఎత్తున బలగాలను తరలించి, న్యూఢిల్లీని యుద్ధ క్షేత్రంగా మార్చి, ఇంటర్నెట్ సదుపాయాలను నిలిపివేసి, విద్యార్థుల ప్రదర్శనను తొక్కివేయగల శక్తి మోదీ సర్కార్‌కు ఉన్నది. విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కూడా వారిని డిజిటల్ ఆధారాలతో గుర్తించి వేధించడం కేంద్రం సహజ వైఖరికి నిదర్శనం. ఆ సమయంలో పెల్లెట్ల ప్రయోగం, ఇతర దారుణాలపై అనేక సంస్థలు కోర్టుకు వెళ్లడంతో ఉన్నత స్థాయి కమిషన్‌ను నియమించాల్సి వచ్చింది. అయినప్పటికీ విద్యార్థులు ప్రభుత్వ నిజాయితీని శంకించవలసిన పరిస్థితులు తలెత్తాయి. అయితే ఒక అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు సమయంలో పోలీసులు స్వైర విహారం, హింసాకాండ మూలంగా విదేశీ ప్రతినిధులకు అసౌకర్యం కలిగించడమే కాక, అంతర్జాతీయ ప్రతిష్ఠ దెబ్బతింటుందన్న ఆందోళనతో ప్రభుత్వం పట్టువిడుపుల ధోరణిని ప్రదర్శించక తప్పలేదు. నిరసన ప్రదర్శనను తాము నిషేధించే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన మర్నాడే విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని కేంద్రం, ఢిల్లీ పోలీసులు దరఖాస్తులు పెట్టుకున్నారు. విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకుంటామని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు మూడు నెలలలోగా నష్టపరిహారం చెల్లిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద తన అసాధారణ ప్రత్యేకాధికారాలను ఉపయోగించుకుని విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌లను ఉపసంహరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం, తాము నిరసన ప్రదర్శనను ఉపసంహరించుకుంటున్నామని సీజేపీ ప్రతినిధులు ప్రకటించడంతో పరిస్థితులు సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఈ పరిణామాలతో జూన్–జూలై నెలల్లో జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనల ప్రకంపనలు దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని అర్థమవుతోంది. ఢిల్లీలో జరిపిన నిరసన ప్రదర్శనలతో ఆగకుండా సీజేపీ దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రజా సమస్యలపై ఆందోళనలకు ఉపక్రమించింది. ప్రభుత్వ విధానాల సమీక్ష, స్కూళ్లలో మౌలిక సదుపాయాల పరిస్థితులు, ప్రశ్నపత్రాల లీక్ సమస్యలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, టీచర్ల పోస్టుల ఖాళీలు, నిరుద్యోగం, పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వంటి సమస్యలపై మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, ఢిల్లీలలో ఆందోళనలు నిర్వహించారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్న స్కూళ్లకు వెళ్లి ‘స్కూల్ ఠీక్ కరో’ ఉద్యమాన్ని ప్రారంభించారు. జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసి ‘క్యాబోల్తీ హై పబ్లిక్’ పేరుతో దేశవ్యాప్త పర్యటనలు ప్రారంభించడంతో సీజేపీకి ఏదో బృహత్తర లక్ష్యం ఉన్నట్లు భావించక తప్పడం లేదు.

సీజేపీ లక్ష్యం ఏదైనా, దాని భవిష్యత్తు ఎలా ఉన్నప్పటికీ, తీవ్ర ఒత్తిడి వస్తే తప్ప తన వైఖరి మార్చుకునే ధోరణి కేంద్రంలో కనపడకపోవడం సాధారణంగా మారింది. విద్యార్థుల ఆందోళన తారస్థాయికి చేరుకున్న తర్వాతే విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారు. ఇప్పుడు ఇండియాగేట్ నుంచి ర్యాలీ చేస్తామని హెచ్చరించిన తర్వాతగానీ విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌లను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం దిగిరాలేదు. ఎందుకు ప్రతి సమస్యనూ తెగేదాకా లాగి ఆ తర్వాత వెనక్కి తగ్గడం? ప్రతిసారీ ప్రభుత్వ పరువును కాపాడేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముందుకురాలేదు కదా! దాని పరిమితులు దానికి ఉన్నాయి. ఎందుకో సమస్యలను పరిష్కరించడంలో, లేదా అంచనా వేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమవుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. సమస్యలను పరిష్కరించేందుకు ఒక మేధో యంత్రాంగాన్ని రూపొందించుకోలేకపోవడం, కేవలం బల ప్రయోగాన్నే నమ్ముకోవడమే ఇందుకు కారణం కావచ్చన్న అభిప్రాయం కలుగుతోంది.

పన్నెండు సంవత్సరాల పరిపాలన తర్వాత దేశంలో చెప్పుకోదగ్గ స్థాయిలో, అది కూడా విద్యార్థుల నుంచి మోదీ సర్కార్‌ ఎందుకు ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తోంది? కొత్త తరం ఇప్పుడు ప్రతి నిర్ణయాన్నీ ప్రశ్నిస్తోంది. వ్యవస్థల్లో లోపాల్ని ఎత్తిచూపుతోంది. వారికి మద్దతుగా కాంగ్రెస్‌తో పాటు ఇతరేతర శక్తులు కూడా తోడవుతున్నాయి. అంతమయ్యాయనుకున్న రకరకాల వామపక్షాలు కూడా ఇప్పుడు అత్యుత్సాహంతో తమ వంతు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. సోషల్ మీడియా ఉపయోగంలో ఈ అన్ని శక్తులూ కలిసికట్టుగా విజృంభిస్తున్నాయి. ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాల నేతలే కాదు, బిహార్‌లో తన ఉనికి కోసం పోరాడుతున్న సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) వంటి పార్టీ కూడా తమ విద్యార్థి సంఘం నాయకురాలు నేహా బోరా ద్వారా జరుగుతున్న పరిణామాలను, బీజేపీని ఎండగట్టేందుకు ఉపయోగించుకుంటున్నదంటే అన్ని వామపక్ష శక్తులూ ఎలా సంఘటితమవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ఈ శక్తులు ప్రయత్నించడంలో ఆశ్చర్యమేమీ లేదు. అవి విజయం సాధించగలవా అన్నది చెప్పలేము కానీ కమలనాథులు మాత్రం ఆత్మరక్షణలో పడ్డారనడంలో సందేహం లేదు.


రాజకీయ పార్టీల దృక్కోణాల్లోంచి కొత్త తరం దేశాన్ని చూడడం లేదు. కులం, మతం, ప్రాంతం, చివరకు లింగం వంటి సంప్రదాయ గుర్తింపులను కూడా ఈ తరం అధిగమించి ఒక ప్రత్యేక గుర్తింపుతో ముందుకు వచ్చిందనడంలో సందేహం లేదు. చాలా మంది సంప్రదాయ రాజకీయ నాయకులకు వారి ప్రవర్తన, భాష, జీవన శైలి, ఆందోళనలు అర్థం కావడం లేదు. ఆ నవ యువత గురించి తమ సొంత దృక్పథంలో ఆలోచించి, అవే కళ్లద్దాలతో వారిని చూడడం ప్రారంభించారు. వారిని ఆకర్షించేందుకు దయనీయ ప్రయత్నాలు చేస్తున్నారు. తమను తాము హాస్యాస్పదులుగా నిరూపించుకుంటున్నారు. ఈ ప్రయత్నాలు మానేసి నవ తరం లేవనెత్తుతున్న అంశాలను, ఆందోళనలను అర్థం చేసుకోవాల్సి ఉన్నది. విద్య, నిరుద్యోగం, జవాబుదారీ విధానం, వ్యవస్థలు తమ పనిని తాము చేయడం, అవినీతిని నిర్మూలించడం, పారదర్శకత, నిజాయితీని వారు ఆశిస్తున్నారు. ఆర్థిక సంస్కరణలు అమలు అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలకు వారు జన్మించారు. వివిధ ప్రపంచ దేశాల పరిస్థితుల గురించి తెలిసినవారు. ఎంతసేపూ మత రాజకీయాలు, కాంగ్రెస్ పాలనలో అమలు అయిన దుర్మార్గాల గురించి మాట్లాడడం వారికి నచ్చకపోవచ్చు. నెహ్రూ, ఇందిరలు కాదు కదా, రాజీవ్‌గాంధీని సైతం వారు చూడలేదు. నరేంద్ర మోదీ మాత్రమే వారికి సుపరిచిత దేశ పాలకుడు, జాతీయ నాయకుడు. అందువల్ల వారి భవిష్యత్తును మెరుగుపరిచేందుకు ఏమి చేయాలన్నదే ప్రస్తుత పాలకుల కర్తవ్యం.

కొత్త తరం యువతను ఆకర్షించేందుకు రాజీవ్‌గాంధీ 1988లో 18 ఏళ్ల వయస్సు వారికి ఓటు హక్కు కల్పించారు. 40 ఏళ్ల వయస్సులోనే ప్రధాని అయిన రాజీవ్ తనను తాను నవయువకుడుగా భావించుకున్నప్పటికీ 1989 ఎన్నికల్లో నాటి యువతరం ఆయన ప్రభుత్వాన్ని గద్దె దించింది. బోఫోర్స్ కుంభకోణం, పెచ్చరిల్లిన ద్రవ్యోల్బణం, పెరిగిన నిరుద్యోగం, పత్రికా స్వేచ్ఛను నియంత్రించే ప్రయత్నాలు. షాబానో కేసు ద్వారా ప్రజలను మతపరంగా విడదీసేందుకు అనుసరించిన విధానాలే అందుకు కారణాలు. రాజీవ్‌గాంధీ విఫలమైన చోట మోదీ విజయం సాధించాలంటే యువతరం మనసును ఆకట్టుకోవాలి. అందుకు మారుతున్న దేశ కాలమాన పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఎంతసేపూ కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఆ పార్టీ దుర్లక్షణాలన్నీ అలవరుచుకుని, ఆ కాలంలో జరిగిన పాపాలన్నిటినీ రెట్టింపు తీవ్రతతో పునరావృతం చేస్తుంటే జనం ప్రశ్నించకుండా ఉంటారా?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 02 , 2026 | 12:48 AM