బీజేపీని జయించగల భావజాలమేదీ?
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:51 AM
‘కాంగ్రెస్ పరాన్నజీవి, ఇతర పార్టీలపై ఆధారపడి అది మనుగడ సాగిస్తోంది. అవసరం తీరిపోగానే వాటిని వదుల్చుకుంటుంది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. తమిళనాడులో డీఎంకేను వదిలిపెట్టి...
‘కాంగ్రెస్ పరాన్నజీవి, ఇతర పార్టీలపై ఆధారపడి అది మనుగడ సాగిస్తోంది. అవసరం తీరిపోగానే వాటిని వదుల్చుకుంటుంది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. తమిళనాడులో డీఎంకేను వదిలిపెట్టి సినీనటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కాంగ్రెస్ చేతులు కలపడాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు. అయితే గత కొద్ది రోజులుగా సంభవిస్తోన్న పరిణామాలను చూసిన తర్వాత 2029 ఎన్నికల నాటికి ఇండియా కూటమిలో ఎన్ని పార్టీలు ఉంటాయో, మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్‌లో ఎన్ని పార్టీలు ఉంటాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతీయ పార్టీలు అస్తిత్వ పరీక్షలో పడ్డాయి. అవి తమ దారి ఏదో తేల్చుకోవల్సివుంది. అయితే అందుకు వాటికి ఎక్కువ సమయం లేదు.
ఈ నేపథ్యంలో.. వచ్చే సార్వత్రక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ముఖాముఖి పోటీ ఉంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రాంతీయ పార్టీలు చీలిపోవడం, బీజేపీతో అవి చేతులు కలపడం గురించి కాంగ్రెస్ పెద్దగా కలవరపడుతున్నట్లు కనిపించడం లేదు. నిజానికి చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ రాజకీయ స్థలాన్ని ఆక్రమించినవే. పార్లమెంటు ఉభయ సభల్లో తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ యుద్ధ ప్రాతిపదికన అమలు పరుస్తున్న వ్యూహాలను కూడా కాంగ్రెస్ అంత తీవ్రంగా పరిగణించడం లేదు. 2029 నాటికి బీజేపీతో ముఖాముఖి తలపడాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లు కనపడుతోంది. ముఖ్యంగా దేశంలో యువతను తమవైపు ఎలా సమీకరించాలా అన్న ఆలోచనే కాంగ్రెస్‌లో కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నిశ్చితంగా ఒక అజెండా ప్రకారం పనిచేస్తున్నట్లు కనపడదు. కులగణన, సామాజిక న్యాయం, రిజర్వేషన్లపై నిన్నటి వరకూ దృష్టి సారించిన కాంగ్రెస్ ఇప్పుడు యువతలో పెరుగుతున్న ఆందోళనను గమనించి వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజస్థాన్‌లోని కోటలో ‘ఛాత్రోంకీ గూంజ్’ పేరిట భారీ ర్యాలీని ఏర్పాటు చేసింది. ఆ ర్యాలీలో వేలాది యువతీ యువకులను ఉద్దేశించి రాహుల్‌గాంధీ ప్రసంగించారు. కాక్రోచ్ జనతా పార్టీకి పెరుగుతున్న ప్రాబల్యం కూడా యువతను ఆకట్టుకునేందుకై రాహుల్‌గాంధీ దృఢసంకల్పంతో పూనుకోవడానికి కారణం కావచ్చు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో మహిళలు, యువత, ముఖ్యంగా తొలిసారి నమోదు చేసుకున్న ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారని అనేక అధ్యయనాలు తెలిపాయి. 2029 నాటికి ఈ పరిస్థితి మారుతుందా? యువతలో, మహిళల్లో కాంగ్రెస్ కోల్పోయిన పట్టు తిరిగి సాధించగలుగుతుందా? ఇది ఆ పార్టీ భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైనది.
అయితే లోక్‌సభలో, రాజ్యసభలో సీట్లు పెంచుకోవడానికి, అనేక పార్టీలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ చేస్తోన్న తీవ్ర ప్రయత్నాలను తేలికగా కొట్టి పారేయడానికి వీలులేదు. ఆరెస్సెస్ నేత ఒకరు చెప్పినదాని ప్రకారం, బీజేపీకి హిందూత్వ అజెండా అత్యంత ప్రధానమైనది. 2029లో మళ్లీ గెలవడమే కాకుండా మరికొన్ని దశాబ్దాలపాటు అధికారంలో ఉన్నప్పుడే ఆ అజెండాను నెరవేర్చుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ అజెండాలో భాగంగానే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీలపై బీజేపీ దృష్టి సారించింది. జనతాదళ్(యు), తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలను పూర్తిగా కైవసం చేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. తమిళనాడులో డీఎంకే, జార్ఖండ్‌లో జేఎంఎం, తెలంగాణలో బీఆర్‌ఎస్, ఢిల్లీలో ఆప్ ఇప్పుడు తమ దారి ఎటువైపో నిర్ణయించుకోవాల్సిన విషమ పరీక్షలో ఉన్నాయి. తమ అజెండా పూర్తి కావాలంటే అనేక పార్టీలను నయానో, భయానో తమవైపు తిప్పుకోవడమే బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం.
2029లో 2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమై, తాము మెజారిటీ కోల్పోయే ప్రమాదం మళ్లీ వాటిల్లకుండా ఉండేందుకు బీజేపీ వేగంగా చర్యలు తీసుకుంటోంది. వీటిలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అత్యంత కీలకమైనవి. మోదీ సర్కార్ నిర్వహించే నియోజకవర్గాల పునర్విభజన జరిగే తీరు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉంటుందని మరి చెప్పనవసరం లేదు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల కాంగ్రెస్, ఎన్డీఏలో లేని ప్రాంతీయ పార్టీలు అధిక ప్రయోజనం పొందకుండా ఉండేందుకు బీజేపీ సంకల్పించింది. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక సీట్లు సాధించేందుకు; బిహార్, జార్ఖండ్, హరియాణా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో భౌగోళిక, జనాభా నిర్మాణాల్లో మార్పుల ద్వారా అదనపు స్థానాలు సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
అసోం, జమ్మూకశ్మీర్‌లో డీలిమిటేషన్ తర్వాత ఏమి జరిగిందో తెలిసిందే. అసోంలో దిగువ అసోం, బరాక్ వ్యాలీలో ముస్లిం మెజారిటీ నియోజకవర్గాలను చీల్చారు. స్థానికులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో చీల్చిన ప్రాంతాలను చేర్చారు. దీనివల్ల కాంగ్రెస్‌కు, ఏఐయూడీఎఫ్‌కూ తీవ్ర నష్టం జరిగింది. ఎస్టీ, ఎస్సీలకు సీట్లు పెరగడం వల్ల బీజేపీ ప్రాంతీయ మిత్రపక్షాలు లబ్ధి పొందాయి. జమ్మూకశ్మీర్‌లో కూడా కశ్మీర్ లోయలోని ముస్లిం మెజారిటీ సీట్ల కంటే జమ్మూలోని హిందూ మెజారిటీ సీట్లు పెరిగాయి. అంతేకాదు, చాలా మంది సిట్టింగ్ ఎంపీల పట్ల ప్రజలకు ఉండే వ్యతిరేకతను అరికట్టేందుకు సీట్ల పెంపు ఎంతో ఉపయోగపడుతుంది. పెరిగిన సీట్లలో యువత, మహిళలకు, అనేకమంది కొత్త వారికి అవకాశాలు కల్పించి సాధ్యమైనన్ని మెజారిటీ సీట్లను సాధించుకోవడమే బీజేపీ లక్ష్యం.
రకరకాల సమస్యలను చేపట్టి ప్రజల్లోకి వెళ్లడం ద్వారా తన ఉనికిని పటిష్ఠం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు బీజేపీ సమగ్ర వ్యూహాలపై ఎంతవరకు అవగాహన ఉన్నదో చెప్పడం కష్టం. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం పూర్తిగా మోదీ కేంద్రీకృతంగా ఉంటోంది. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న ఆరెస్సెస్ ప్రభావాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కొనేందుకు సమాయత్తం కావడానికి బదులు ఆ సంస్థకు రిజిస్ట్రేషన్ ఉన్నదా, లేదా అన్న నిరుపయోగ చర్చల్ని లేవనెత్తుతున్నది. ఈ కారణంగానే బీజేపీ వ్యూహాల గుట్టుమట్టులు కాంగ్రెస్‌కు అర్థమవుతున్నాయా లేదా అన్న అనుమానం కలుగుతోంది. దేశంలోని మొత్తం 4,123 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌కు 662 సీట్లు మాత్రమే ఉన్నాయి. అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాలేదు. యూపీ, బిహార్, గుజరాత్, ఒడిషా వంటి రాష్ట్రాల్లో పది శాతం సీట్లు కూడా ఆ పార్టీ గెలుచుకోలేదు. 2024 సార్వత్రక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కూ మధ్య 286 నియోజకవర్గాల్లో ముఖాముఖి పోరు జరిగితే, బీజేపీ 180 సీట్లు, కాంగ్రెస్ 83 సీట్లు గెలుచుకుంది. లోక్‌సభలో డిప్యూటీ నాయకుడు, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గౌరవ్ గొగోయ్ ఇటీవల అసోం అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. మరో లోక్‌సభ సభ్యుడు, రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న పుదుచ్చేరి పీసీసీ అధ్యక్షుడు వైద్యలింగం సైతం గత అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు. ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ తనకు అనుకూలంగా ఎందుకు ఉపయోగించుకోలేకపోతోంది? ఈ ప్రశ్నకు జవాబు సాధించనంతవరకూ ఎన్ని ర్యాలీలు నిర్వహించినా, ఎన్ని నాటకీయ ప్రదర్శనలు చేసినా, కాంగ్రెస్ బలోపేతం అయ్యే అవకాశాలు లేవు. కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యనే ప్రాంతీయ పార్టీలూ ఎదుర్కొంటున్నాయి. పైగా అవి చీలిపోతున్నాయి. ఇందుకు బీజేపీని నిందించడం కన్నా ఈ చీలికలు ఎందుకు సంభవిస్తున్నాయో, ప్రజలు తమను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రాంతీయ పార్టీల అధినాయకులు నిష్పాక్షికంగా ఆత్మశోధన చేసుకుంటున్నారా? ఒకప్పుడు బలమైన సైద్ధాంతిక శక్తులుగా ఉన్న వామపక్షాల ప్రస్తుత గమ్యం ఏమిటి?
వాస్తవం ఏమిటంటే, ఒకే నాయకుడి ఆకర్షణ, కుల సమీకరణాలపై ఆధారపడ్డ ప్రాంతీయ కోటలు వేగంగా కుప్పకూలిపోతున్నాయి. సిద్ధాంతాలేవీ లేకుండా కేవలం అధికార ఆకాంక్షలు ఎల్లకాలమూ నెరవేరవని స్పష్టమవుతోంది. మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్, నవీన్ పట్నాయక్, జగన్‌ల భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడానికి కారణం అదే. ప్రాంతీయ దిగ్గజాలు ఎవరూ ఇప్పుడు ప్రాబల్యంలో లేరు. కొన్ని పార్టీల వారసుల పోకడలు ఆశాజనకంగా లేవు. జరుగుతున్నవి సాధారణ పరిణామాలు కాదు, భారత రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న లోతైన నిర్మాణాత్మక మార్పులకు అవి సంకేతాలని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు.
బీజేపీ మోదీ చుట్టూ తిరుగుతున్నప్పటికీ అది మోదీ ఆధారిత పార్టీ కాదు. దాని ఎత్తుగడలు, వ్యూహాలు, విస్తరణ, చర్యలు ఒక దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా సాగేందుకు బీజేపీ వెనుక ఉన్న ప్రబల శక్తులు ఎన్నో. ఈ లక్ష్య సాధనలో మోదీ ఒక ప్రధాన ఉపకరణం మాత్రమే అని ఆరెస్సెస్‌కూ, బీజేపీకీ తెలుసు. కాంగ్రెస్ విషయంలో అలా చెప్పడానికి వీలు లేదు. వారసత్వ నాయకత్వం ఆధారితంగా సాగుతున్న కాంగ్రెస్ సంస్థాగతంగా, సైద్ధాంతికంగా పటిష్ఠమై, గ్రామగ్రామాల్లో విస్తరించి, తిరుగులేని జనప్రియ పార్టీగా మారేందుకు రాహుల్‌గాంధీ చేస్తున్న ప్రయత్నాలు ఏవీ కనపడడం లేదు. ప్రత్యర్థి బలహీనత, తప్పుడు చర్యలు, ప్రభుత్వ వ్యతిరేకత మూలంగా యాదృచ్ఛికంగా అధికారం లభించే అవకాశాలు లేవని ఇప్పటికి ఎన్నోసార్లు రుజువైంది.
భారత రాజకీయ వ్యవస్థ కుప్పకూలిపోతుందని కొందరు ఆందోళనపడడంలో అర్థం లేదు. నిజానికి అది పునర్వ్యవస్థీకరణ దశలో ఉన్నది. ప్రాంతీయ స్వరాలు సన్నగిల్లడం మూలాన వచ్చే ఎన్నికల్లో రెండు జాతీయ ధ్రువాల మధ్య ప్రధాన పోటీ ఏర్పడే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఆత్మరక్షణలో ఉన్న ప్రాంతీయ శక్తులు ఏదో ఒక ధ్రువం వైపు మొగ్గు చూపడం అనివార్య పరిణామంగా కనపడుతోంది. డీలిమిటేషన్, ప్రాంతీయ శక్తులు చేరడం మూలంగా కాంగ్రెస్‌కు సహజంగా కొన్ని సీట్లు పెరగవచ్చు. కానీ ప్రభంజనం రేకెత్తించి అధికారం సాధించాలంటే, వ్యక్తుల కన్నా జాతీయ స్థాయి ప్రభావశీల భావజాలాలు రాజకీయాలను నిర్ణయించడం ప్రధానం.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి
వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!