Share News

మేల్కొన్న స్వప్నమే అమరావతి!

ABN , Publish Date - Apr 08 , 2026 | 02:15 AM

‘ఒక రాష్ట్రానికి ఏ ప్రాంతం రాజధానిగా ఉండాలో నిర్ణయించే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది’ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ 2020 ఫిబ్రవరి 5న లోక్‌సభలో...

మేల్కొన్న స్వప్నమే అమరావతి!

‘ఒక రాష్ట్రానికి ఏ ప్రాంతం రాజధానిగా ఉండాలో నిర్ణయించే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది’ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ 2020 ఫిబ్రవరి 5న లోక్‌సభలో తెలుగుదేశం సభ్యుడు ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘రాజధాని నిర్ణయంలో మా పాత్ర ఏమీ లేదు’ అని కేంద్ర హోంశాఖ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోనూ వివరించింది. సరిగ్గా ఆరేళ్ల తర్వాత చరిత్ర తనను తాను పునర్లిఖించుకున్నది. ఏ మంత్రి అయితే రాజధాని విషయంలో తమకు సంబంధం లేదని పార్లమెంటులో చెప్పారో, అదే మంత్రి (నిత్యానందరాయ్) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లును గత గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

రాజధాని విషయంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని ఒకప్పుడు అంటీముట్టనట్లుగా వ్యవహరించిన కేంద్రం, ఇప్పుడు అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించేందుకు ఎందుకు అంగీకరించిందో అందరికీ తెలుసు. పన్నెండేళ్లుగా ఒక రాష్ట్రానికి రాజధాని అంటూ లేని దుస్థితి ఎందుకు ఏర్పడిందో కూడా అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ 12 ఏళ్ల క్రితం పార్లమెంటు నిర్ణయం తీసుకున్నప్పుడు లోక్‌సభ, రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొన్న దృశ్యాలు ఇంకా ప్రజల మనఃఫలకం నుంచి చెరిగిపోలేదు. నాటి వాతావరణానికి పూర్తి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు దాదాపు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. ఒక్క వైసీపీ సభ్యులే ఉభయసభల నుంచి వాకౌట్ చేశారు. ఎందుకంటే తమ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి అవలంబించిన వైఖరి వల్లే పార్లమెంటులో అమరావతి విషయమై బిల్లు ప్రవేశపెట్టాల్సిన అగత్యం ఏర్పడిందని వారికి తెలియనిది కాదు.

2024లో జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలోకి దిగినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అవసరం ఉన్నదా అని పలువురు ప్రశ్నించారు. అయితే ఈ పొత్తు వల్ల ప్రయోజనం ఏమిటో అమరావతి బిల్లు ఆమోదం పొందిన రోజున వారికి అర్థమయ్యే ఉంటుంది. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైసీపీ పాలనలో ఆగిపోయిన అమరావతి పనులను పునరుద్ధరించేందుకు పూనుకున్నారు. కేంద్రం సహకారంతో ఏడీబీ, ప్రపంచ బ్యాంకు రుణం సాధించారు. ఇంకా అనేక బ్యాంకులు మౌలిక సదుపాయాలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అయితే భవిష్యత్తులో అమరావతి రాజధానిగా కొనసాగుతుందన్న నమ్మకం ఏమిటి? అని కొందరు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు సందేహాలు వ్యక్తం చేశారు. ఆ సందేహాలను తొలగించేందుకే కేంద్రం సహాయ సహకారాలను చంద్రబాబు అర్థించారు. తెలుగుదేశం పార్టీ కీలక మిత్రపక్షంగా ఉన్న కారణంగా బీజేపీ అగ్రనేతలు ఈసారి ఆయనకు పూర్తి అండగా నిలిచారు.


అమరావతికి చట్టబద్ధత కల్పించాల్సిందిగా చంద్రబాబు గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్రమోదీని స్వయంగా అభ్యర్థించిన తర్వాత కేంద్రం అనేక ప్రశ్నలు సంధించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయవిభాగంతో సహా అనేక మంత్రిత్వ శాఖలకు ఒక నోట్ పంపి, వాటి అభిప్రాయాన్ని స్వీకరించింది. చివరకు అటార్నీ జనరల్‌నూ సంప్రదించింది. కొత్త రాజధానిలో ప్రజలు సుఖవంతంగా జీవించేందుకు నిర్ణయించిన ప్రాతిపదిక ఏమిటి, వ్యాపారం సులభతరం అయ్యేందుకు చేపట్టిన చర్యలు ఏమిటి, అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ ప్రమాణాలు, పద్ధతులు ఏమిటి, శాంతి భద్రతల పరిస్థితి ఏమిటి... మొదలైన అంశాలపై ఆరా తీసింది. ఎన్నో తర్జనభర్జనలు, చర్చల తర్వాతే అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు మరో వారంరోజుల్లో ముగుస్తాయనగా ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం చేసి పంపిస్తే వెంటనే నిర్ణయం తీసుకుంటామని ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారం పంపింది. రాష్ట్రంలో బీజేపీ తరఫున మంత్రిగా ఉన్న సత్యకుమార్ యాదవ్ ద్వారా ఈ సమాచారం పంపడం గమనార్హం.

మోదీ తలుచుకుంటే కానిదేముంది? అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లును రాత్రికి రాత్రి నిర్ణయించి బడ్జెట్ సమావేశాల చివరి రెండు రోజుల్లో దానికి చట్ట రూపం కల్పించారు. చంద్రబాబు లాంటి దార్శనిక నేత ఇస్తున్న కీలక మద్దతు మూలంగానే ఇవాళ పార్లమెంటులో అసాధారణ రీతిలో అమరావతికి చట్టబద్ధత లభిస్తోందని జేడీ(యూ) నేత సంజయ్‌కుమార్ ఝాతో పాటు అనేక పార్టీల నాయకులూ ప్రకటించారు. ఏమైనా ఒక రాష్ట్ర రాజధానికి, అసాధారణ రీతిలో పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం తర్వాత భారత ప్రభుత్వ గెజిట్‌లో స్థానం లభించడం ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యసాధకత్వానికి నిదర్శనం. ఇక రాజధానిగా అమరావతి ఉండాలా లేదా అన్న అంశంపై చర్చ లేవనెత్తడం, దాన్ని రాజకీయం చేయాలని చూడడం పూర్తిగా అనవసరం. నిజానికి గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత కేసీఆర్ కొనసాగించినట్లుగా జగన్ ప్రభుత్వం కూడా కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ చర్చ ఉండేదే కాదు. రాజధాని ఎలా ఉంటుంది, వేలాది ఎకరాల్లో ఎలా నిర్మిస్తారు, ఈ నిర్మాణం ఎంతకాలంలో పూర్తవుతుంది... అన్న ప్రశ్నలపై సందేహాలు ఉండడం సహజం. ఎన్నో యుద్ధాల్లో గాయపడి తేరుకుని మళ్లీ పోరాడి గెలిచిన వ్యక్తి చంద్రబాబు. ఆయనలో ఆత్మవిశ్వాసం, అనుభవం మెండుగా ఉన్నది. తనకు దీర్ఘకాలిక దృష్టి కూడా ఉన్నదని ఆయన చాలాసార్లు రుజువు చేశారు. కనుక హ్రస్వ దృష్టితోనో, ప్రతి అడుగునూ తప్పు పట్టే ఆలోచనతోనో చంద్రబాబు నిర్ణయాలను అంచనా వేయలేం. దురదృష్టవశాత్తు మన దేశంలో ప్రతిపక్షాలు మాత్రమే కాదు, విమర్శకులు కూడా నిర్మాణాత్మక వైఖరి వీడి చాలా కాలమైంది.


1995–2004 సంవత్సరాల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూసిన వారికి ఆయన సమర్థత పట్ల అనుమానాలు రావు. అప్పటి వరకూ ముఖ్యమంత్రులు ఉపయోగించిన భాష వేరు, ఆయన ఉపయోగించిన భాష వేరు. దేశ రాజధాని ఢిల్లీలో ఒకే రోజు మంత్రులు, వ్యాపారవేత్తలు, విదేశీ ప్రతినిధులు, ప్రపంచ బ్యాంకు అధికారులను కలుస్తూ సుడిగాలిలా ఆయన చేసిన పర్యటనలు, పవర్ పాయింట్ ప్రజంటేషన్లను ఒక విలేఖరిగా ప్రత్యక్షంగా తిలకించాను. రాళ్లు రప్పల మధ్య హైటెక్ సిటీ భవనం ప్రారంభోత్సవానికి తీసుకువెళ్లినప్పుడు, బిల్‌గేట్స్‌ను పరిచయం చేసినప్పుడు, మొబైల్స్ లేని కాలంలో ఆప్టికల్ ఫైబర్, బ్రాడ్ బ్యాండ్ గురించి ఆయన మాట్లాడినప్పుడు, డేటాను ఆయుధంగా ఉపయోగించినప్పుడు అంతా అయోమయంగా ఉండేది. చూస్తూ చూస్తూ ఉండగానే హైదరాబాద్‌లో ఒక ప్రాంతం సైబరాబాద్‌గా, ఐటీ సంస్థలు, ఐఎస్‌బీ వంటి సంస్థలతో అధునాతన భారత స్వరూపంగా మారింది. పారిశ్రామికవేత్తల కోసం రాత్రికి రాత్రి జీవోలు, 15 రోజులలోనే అనుమతులు జారీ చేసిన కాలమది. ఇటీవల నేను ఐర్లాండ్‌కు వెళ్ళినప్పుడు డబ్లిన్ డాక్ యార్డ్‌ను ఆ కాలంలోనే చంద్రబాబు సందర్శించి అక్కడి పీపీపీ నమూనాను హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఉపయోగించారని గుర్తుకు వచ్చింది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ప్రపంచ బ్యాంకు ఆహ్వానం మేరకు నాటి సంస్కరణలు, నూతన ఆర్థిక విధానాల పరిభాషను నేర్చుకునేందుకు దాదాపు నెల రోజుల పాటు ఆర్థిక జర్నలిస్టుగా శిక్షణ పొందిన తర్వాత కానీ ఆ పదజాలం గురించి అవగాహన ఏర్పడలేదు. ప్రపంచ బ్యాంకుతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రగాఢ అనుబంధం ఉన్న కాలమది. అప్పట్లో నేను పనిచేసిన పత్రిక మూతపడడంతో ఒక తెలుగు వెబ్‌సైట్‌ను చూసేవాడిని. ఒక రోజున హైదరాబాద్‌లో గ్రాండ్ కాకతీయ హోటల్‌లో ఆ సంస్థ తరఫున ఈ–సేవల గురించి ప్రజెంటేషన్ ఇస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేనున్న స్టాల్‌కు వచ్చి, నన్ను చూసి ఆశ్చర్యపోయారు. ‘ఇక్కడేం చేస్తున్నావు?’ అని అడిగారు. ‘పేపర్ ఉద్యోగం లేదు కదా’ అని చెప్పాను. మారుతున్న పరిస్థితుల్లో అవకాశాలు కూడా పెరుగుతాయనడంలో సందేహం లేదు. మార్పు ఎప్పటికైనా మంచిదే.

‘స్వర్గం అనేది లేదని ఊహించుకో... ప్రయత్నిస్తే అది సులభం. మన కింద నరకం లేదు, పైన ఆకాశం మాత్రమే ఉన్నది’ (Imagine there's no heaven / It's easy if you try/ No hell below us / Above us only sky) అంటూ గానం చేసిన బ్రిటిష్ గాయకుడు జాన్ లెన్నన్ అన్నట్లు ప్రయత్నిస్తే సాధించలేనిది లేదు. అయితే 1995– 2004 నాటి పరిస్థితులకూ, ఇప్పటి పరిస్థితులకూ తేడా లేదా? అని కొందరు ప్రశ్నించవచ్చు. మారిన పరిస్థితులతో పాటు తన చుట్టూ ఉన్న వ్యక్తులు, జరుగుతున్న పరిణామాల గురించి చంద్రబాబుకు తెలియనిది కాదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

Updated Date - Apr 08 , 2026 | 02:15 AM