మోదీ తనకు తాను వేసుకోవాల్సిన ప్రశ్న
ABN , Publish Date - Nov 25 , 2026 | 02:51 AM
కేరళ ముఖ్యమంత్రి సతీశన్ వారం రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకుని రూ. లక్ష కోట్లతో చేపట్టిన ‘మిషన్ సముద్ర’ ప్రాజెక్టుకు కేంద్రం తోడ్పాటు...
కేరళ ముఖ్యమంత్రి సతీశన్ వారం రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకుని రూ. లక్ష కోట్లతో చేపట్టిన ‘మిషన్ సముద్ర’ ప్రాజెక్టుకు కేంద్రం తోడ్పాటు నందించాలని కోరారు. విజింజం రేవు చుట్టూ రింగు రోడ్డు, రైలు కారిడార్లు, పారిశ్రామిక సముదాయాలు, కొచ్చి రేవుతో పాటు చిన్నరేవులు, మౌలిక సదుపాయాల పార్కులు, ఓడల మరమ్మతు సౌకర్యాలు, జాతీయ రహదారులు, అంతర్జాతీయ విమానాశ్రయాలతో అనుసంధానించడం ఈ ‘మిషన్ సముద్ర’ లక్ష్యం. కేరళ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రాజెక్టే అయినా అది అదానీ గ్రూప్‌కు ప్రయోజనం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి సమావేశమైన నాడే అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయ విద్యార్థులతో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ, అదానీ కంపెనీలకు మోదీ సర్కార్ సంపూర్ణంగా అండదండలనందిస్తున్నదని ఆక్షేపించారు.
నరేంద్రమోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ గ్రూప్ ఈ దేశంలో ఒక బడా వ్యాపార సామ్రాజ్యంగా విస్తరిల్లేందుకు సహాయ సహకారాలు అన్ని విధాలా సమకూరుతున్న విషయాన్ని రాహుల్ గాంధీ ఒక రాజకీయ అంశంగా ఇంటా బయటా తరచూ లేవనెత్తుతున్నారు. అయితే అదానీ గ్రూపు నుంచి ప్రయోజనాలను పొందేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ వెనుకాడడం లేదన్న వాస్తవం కూడా సామాన్య ప్రజలకూ తెలుసు. తాను ఏ వ్యాపార సంస్థకూ వ్యతిరేకం కానని, గుత్త వ్యాపార సంస్థలను మాత్రమే వ్యతిరేకిస్తానని ఇదే రాహుల్ చెప్పిన విషయం తెలిసిందే.
నిజానికి 2015లో అదానీ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకున్నది ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే. అదానీకి అనుకూలంగా నిబంధనలు మార్చి, ఆ ఒప్పందాన్ని చాందీ ప్రభుత్వం కుదుర్చుకున్నదని అందులో దాదాపు రూ. 6000 కోట్ల అవినీతి జరిగిందని నాటి సీపీఐ(ఎం) నేతలు విమర్శించారు. అయితేనేం, 2016 ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన పినరయి విజయన్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ‘మిషన్ సముద్ర’ వల్ల తీర ప్రాంతాలు మరింతగా కోతకు గురై మత్స్యకారులకు తీరని నష్టం వాటిల్లుతుందని రగిలిన ఆందోళనకు నాటి ప్రతిపక్ష నేత సతీశన్ మద్దతునిచ్చారు. ఇప్పుడు అదే సతీశన్ తాను అధికారంలోకి వచ్చీ రాగానే రూ. 400 కోట్లు మంజూరు చేయడమే గాక, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి ఈ ప్రాజెక్టును మరింత భారీ స్థాయిలో చేపట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించారు. దీనితో మళ్లీ సీపీఐ(ఎం) పార్టీ పాత విమర్శలకు పదును పెట్టి కొత్త బాణాలను ఎక్కుపెడుతోంది. ‘మిషన్ సముద్ర’ను అదానీ లాభాలను పెంచే బ్లూప్రింట్‌గా అభివర్ణించింది.
మోదీని సతీశన్ కలిసిన రోజు ఢిల్లీలోని ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియాలో వామపక్ష, కాంగ్రెస్ అనుకూల విలేఖరుల మధ్య ఆసక్తికరమైన వాగ్వివాదం చోటు చేసుకున్నది. ‘అదానీ కోసమే కదా.. మీ ముఖ్యమంత్రి మోదీని కలిశారు’ అని వామపక్ష విలేఖరి అంటే ‘మీరు మాత్రం అదానీని పెంచి పోషించలేదా’ అని కాంగ్రెస్ అనుకూల విలేఖరి అన్నారు. ‘మేము అదానీని మా నిబంధనల ప్రకారం పనిచేయనిచ్చాం.. మీరు అదానీ నిబంధనల ప్రకారం పనిచేస్తున్నారు’ అని వామపక్ష విలేఖరి జవాబిచ్చారు. ఈ సంభాషణ వింటూ నవ్విన మరో విలేఖరి వారికి సర్దిచెబుతూ ‘అందరం గొంగట్లో తింటున్నాం.. వెంట్రుకలు ఏరడం దేనికి?’ అని వ్యాఖ్యానించారు.
స్పష్టంగా చెప్పాలంటే ఎవరి ప్రోత్సాహంతో ఒక వ్యాపార సంస్థ బలోపేతం అయిందన్న విషయాన్ని విస్మరించి ఆ సంస్థకు ఎర్రతివాచీ పరిచేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ వెనుకాడదని, వెనుకాడడం లేదన్న వాస్తవమే ప్రధానం. తమిళనాడులో కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయిన జోసెఫ్ విజయ్ను కొద్ది రోజుల క్రితం ఒక వివాహ వేడుకలో గౌతమ్ అదానీ కలుసుకున్నారు. రేవులు, సౌరశక్తి, డేటా సెంటర్, సిమెంట్ ఉత్పత్తి, సీఎన్జీ పంపిణీ, విమానాశ్రయాల ప్రైవేటీకరణతోపాటు కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను అదానీ గ్రూపు తమిళనాడులో అమలుపరుస్తోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా అనేక పట్టణ రవాణా, మెగా మౌలిక సదుపాయాలు, విమానయానం, పునరుత్పాదక ఇంధనం, సిమెంట్ ఉత్పత్తి, థర్మల్ ప్లాంట్, సొరంగ మార్గ నిర్మాణం వంటి ప్రాజెక్టులకు అదానీ గ్రూప్ లక్ష కోట్లను ఖర్చు పెడుతోంది. తెలంగాణలో ఇప్పటికే ఏరోస్పేస్ డిఫెన్స్ పార్కును నిర్మించిన అదానీ గ్రూప్... రేవంత్ ప్రభుత్వం బృహత్తర స్థాయిలో తలపెట్టిన డిఫెన్స్–ఏరోస్పేస్ కారిడార్‌లో కీలకపాత్ర పోషించనున్నది. వచ్చే నెలలో జరుగనున్న డిఫెన్స్ ఎక్స్‌పోకు కేంద్రం ఇప్పటికే అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో సైతం ఏఐ గ్రీన్ డేటా సెంటర్, పునరుత్పాదక ఇంధనం, సిమెంట్ ఉత్పత్తి, హైవేల నిర్మాణంలో అదానీ గ్రూప్ చేయూతనిస్తోంది. గతంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కూడా అదానీ గ్రూప్ బొగ్గు మైనింగ్‌తో పాటు పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది.
అదానీ గ్రూప్ కంటే ఎంతో ముందు అంబానీ గ్రూపు, ఇతర పారిశ్రామిక సంస్థలు దేశ రాజకీయాలను, ఆయా పార్టీలను ప్రభావితం చేసిన సందర్భాలు లేకపోలేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ రెండు రాజ్యసభ సీట్లలో ఒక దాన్ని రిలయన్స్ గ్రూప్‌కు ఉత్పాదక విభాగాన్ని పర్యవేక్షించే ధన్‌రాజ్ నత్వానీకి కేటాయించారు. ఆయన తండ్రి, అదే గ్రూప్‌లో మరో అగ్రస్థానంలో ఉన్న పరిమళ్ నత్వానీ జార్ఖండ్‌లో బీజేపీ తరఫున ఎన్నికయ్యేందుకు అవసరమైన ఓట్లు లేకపోయినా జార్ఖండ్ ముక్తి మోర్చా ఓట్లను చీల్చి ఇప్పటికే రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆయన వైసీపీ తరఫున ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన విషయం తెలిసిందే. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ధన్‌రాజ్ నత్వానీకి ఎందుకు సీటు కేటాయించారని అడిగినప్పుడు రామ్మనోహర్ లోహియా సోషలిస్టు సూత్రాల ప్రకారం యువతకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలు అవసరమని అఖిలేశ్ సమాధానమిచ్చారు. బీజేపీ అగ్రనేతలే అఖిలేశ్‌కు ఫోన్ చేసి నత్వానీకి సీటు ఇప్పించారన్న విషయంపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమాజ్‌వాదీ పార్టీ ములాయంసింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమర్‌సింగ్ సలహాతో అనిల్ అంబానీని రాజ్యసభకు ఎంపిక చేసింది. సాధారణంగా ఇలాంటి టిక్కెట్ల కేటాయింపులు పారిశ్రామికవేత్తలు ఇచ్చే నిధులకు అనుగుణంగా జరుగుతాయనడంలో సందేహం లేదు. సమాజ్‌వాదీ పార్టీ మాత్రమే కాదు, బహుజన సమాజ్‌పార్టీ, అనేక ప్రాంతీయ పార్టీలు బడా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే సీట్ల వెనుక మతలబు ఇదే.
అంబానీ గ్రూప్ ప్రభావం కాంగ్రెస్ పైనే అధికంగా ఉన్నదన్న విషయంలో సందేహం లేదు. ఈ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూబాయ్ అంబానీకి ఇందిరాగాంధీ నుంచి సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండేవి. ఈ విషయం సోనియాగాంధీకి బాగా తెలుసు. ఆమె తన ఆత్మకథలో అదానీ, అంబానీల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. రాజీవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి ఒక కార్పొరేట్ సంస్థ మద్దతునిచ్చిందని మాత్రం ఆమె ఆరోపించారు. ఇందిర హయాంలో 1982 నుంచి 84 వరకు, యూపీఏ హయాంలో 2009 నుంచి 2012 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుగుణంగా తీసుకున్న అనేక నిర్ణయాలపై తీవ్ర విమర్శలు ఉండేవి. ఒక దశలో సోషలిస్టు పార్లమెంటేరియన్ మధు దండావతే అయితే ప్రణబ్‌ను ‘రిలయన్స్ మంత్రి’గా అభివర్ణించారు. ఇదే ప్రణబ్ యూపీఏ హయాంలో ఏడేళ్ల పన్ను మినహాయింపును సహజవాయు ఉత్పత్తికి విస్తరించడంతో అంబానీ గ్రూప్ భారీ ప్రయోజనం పొందింది. అయితే ఈ నిర్ణయాలకు ప్రణబ్ ఒక్కరే కారకుడని చెప్పలేము. జైపాల్‌రెడ్డిని పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు బదిలీ చేయడం వెనుక ఈ అంశమే ఉన్నట్లు వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. రిలయన్స్ ప్రతినిధి అనూ టాండన్‌కు యూపీఏ హయాంలోనే కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో నీరా రాడియా టేపులు విన్నవారికి కార్పొరేట్–రాజకీయ పార్టీల కుమ్మక్కు స్పష్టంగా అర్థమవుతుంది. పదేళ్లు కాంగ్రెస్ ఎంపీగా, ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న నవీన్ జిందాల్ లాంటి వ్యాపారస్థులకు పార్టీలు ఉండవని బాగా తెలుసు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో వ్యాపారం చేయడానికి అదానీ గ్రూప్‌ను అనుమతించాలా వద్దా లేక ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులను ప్రధానమంత్రి కలవాలా వద్దా అనేది ఇక్కడ అసలు సమస్య కాదు. ప్రతి ప్రభుత్వానికి, ప్రతి కార్పొరేట్ సంస్థకు ఒకే విధమైన పారదర్శకత, జవాబుదారీ ప్రమాణాలు వర్తిస్తున్నాయా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఒక ప్రభుత్వం వేల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడి ఒప్పందాలపై సంతకం చేసినప్పుడు, భూమిని, మౌలిక సదుపాయాల మద్దతును ఇష్టారాజ్యంగా అందించినప్పుడు ఎంత మందికి ఉపాధి లభించింది, సమాజానికి ఎన్ని ప్రయోజనాలు చేకూరాయి, దేశంలో 40శాతం సంపద 1శాతం వ్యక్తుల గుప్పిట్లోకి ఎలా చేరింది అన్న విషయాలు ప్రజలకు తెలియాలి. ఈ నెల 19న వ్యాపార పారిశ్రామిక మండలి (ఫిక్కీ) సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కార్పొరేట్ పన్నును భారీగా తగ్గించినప్పటికీ, వ్యాపారాన్ని సులభతరం చేసే అనేక చర్యలు చేపట్టినప్పటికీ, ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు, కార్మికుల వేతనాలు ఎందుకు పెరగడం లేదని, ఎగుమతులపై ఇంకా ఎందుకు ఆధారపడుతున్నామని ఆయన ప్రశ్నించారు. 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మోదీ ఇది తనకు తాను వేసుకోవాల్సిన ప్రశ్న.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)