సమరీతిలో లేని ఇచ్చిపుచ్చుకోవడాలు!
ABN , Publish Date - Feb 14 , 2026 | 01:10 AM
అమెరికా, భారత్‌ల మధ్య వాణిజ్య చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. ఉభయ దేశాల ప్రభుత్వాలు 2026 ఫిబ్రవరి 6న ఒక సంయుక్త ప్రకటన జారీ చేశాయి. ‘అది ఏమిటి?’. ఇది ఆ సంయుక్త ప్రకటనకు యోగ్యమైన ప్రశ్న.
అమెరికా, భారత్‌ల మధ్య వాణిజ్య చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. ఉభయ దేశాల ప్రభుత్వాలు 2026 ఫిబ్రవరి 6న ఒక సంయుక్త ప్రకటన జారీ చేశాయి. ‘అది ఏమిటి?’. ఇది ఆ సంయుక్త ప్రకటనకు యోగ్యమైన ప్రశ్న. ఆ సంయుక్త ప్రకటన అంతులేని ఊహాగానాలను పురిగొల్పింది. దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం వాణిజ్య ఒప్పందం వివరాలను విపులంగా వెల్లడించకపోవడం వల్ల ఆ అనుమానాలు పెరిగాయేగానీ తొలగిపోలేదు, తగ్గలేదు. ఉభయ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఎలా ఉండాలనే విషయాన్ని ప్రభావదాయకంగా నిర్ణయించిందీ, నిర్దేశించిందీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నది నిరాకరించలేని వాస్తవం. కనుక ఆ సంయుక్త ప్రకటనలోని అంశాలు అమెరికాకు ఆందోళన కలిగించకపోవచ్చు గానీ భారత్‌కు తప్పకుండా కలవరం కలిగిస్తున్నాయి.
ఉభయ దేశాల మధ్య వాణిజ్య చర్చలలో పాల్గొన్న భారత్ ప్రతినిధులు గత ఏడాది తాము అమెరికాతో ఒక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే విషయమై సంప్రదింపులు జరుపుతున్నామని పదే పదే ప్రకటించారు. సమీప భవిష్యత్తులోనే అమెరికాతో ఒక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరనున్నదని భారత వాణిజ్య మంత్రి స్వయంగా అనేక మార్లు చెప్పారు. 2025 సంవత్సరాంతంలోగానే ఇండో–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తప్పక ఖరారు అవుతుందని కూడా ఆయన ప్రకటించారు. తీరా కొద్దిరోజుల క్రితం సంయుక్త ప్రకటన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కాదు. అది ఒక మధ్యంతర ఒప్పందం కూడా కాదు; అది ఒక మధ్యంతర ఒప్పందానికి ఒక చట్రం మాత్రమే. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నాం సుమా!
సంయుక్త ప్రకటన జారీ అయిన తరువాత అమెరికా –భారత్ వాణిజ్య ఒప్పందం పరస్పర ప్రయోజనకరమని ఇరు పక్షాలూ ప్రకటించాయి. ఈ వాదన పాఠకుని ఇంగితాన్ని అవమానపరచడమే. సంయుక్త ప్రకటనను పైపైన పరిశీలించినా సదరు ఒప్పందం పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన లేనే లేదని స్పష్టమవుతుంది. ఇప్పుడు ఆ సంయుక్త ప్రకటనను నిశితంగా చూద్దాం: అమెరికా పారిశ్రామిక సరుకులు, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులలో చాలా వాటిపై భారత్ సుంకాలను పూర్తిగా తొలగిస్తుంది లేదా గణనీయంగా తగ్గిస్తుంది. ఇందుకు అనుగుణంగా భారత్ ఎగుమతులపై విధించే సుంకాలను అమెరికా (2025 ఏప్రిల్ 2న విధించిన 25 శాతం నుంచి) 18 శాతానికి తగ్గిస్తుంది. జౌళి ఉత్పత్తులు, వస్త్రోత్పత్తులు, చర్మ ఉత్పత్తులు, పాదరక్షలు, ప్లాస్టిక్స్, రబ్బర్, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ సామగ్రి, చేతి వృత్తుల ఉత్పత్తులు, నిర్దిష్ట యంత్రాలు మొదలైన భారతీయ సరుకులపై అమెరికా సుంకాలు 18 శాతానికి తగ్గనున్నాయి. మధ్యంతర ఒప్పందాన్ని విజయవంతంగా అమలుపరచిన తరువాత జెనరిక్ ఫార్మాస్యూటికల్స్, ముత్యాలు, వజ్రాలు, విమానాల విడిభాగాలు మొదలైన వాటిపై సుంకాలను అమెరికా తొలగిస్తుంది. భారత్ సుంకాలు పూర్తిగా తొలగించవలసి ఉండగా అమెరికా 18 శాతం సుంకాలు విధిస్తుంది– ఇందులో సుంకాలు పరస్పర ప్రయోజనకరంగా ఉండేందుకు దోహదం చేసేది ఏమైనా ఉన్నదా?!
అమెరికా వైద్య పరికరాల వాణిజ్యంలోను, అమెరికా ఐసీటీ సరుకుల విషయంలో పరిమితులతో కూడిన లైసెన్సింగ్ విధానం రద్దు చేసేందుకు సుదీర్ఘకాలంగా ఉన్న అవరోధాలను తొలగించేందుకు భారత్ అంగీకరించింది. అమెరికా ఆహార, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపై సుంకాలేతర అవరోధాలను తొలగించేందుకు కూడా భారత్ అంగీకరించింది. అయితే ఇందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవల్సిన బాధ్యత అమెరికాకు లేదు. సుంకాలేతర అవరోధాలను తొలగించడం భారత్ తప్పనిసరి బాధ్యత కాగా అటువంటి బాధ్యత అమెరికాకు లేదు! ఇది ఎలా పరస్పర ప్రయోజనానికి తోడ్పడుతుంది?; రాబోయే అయిదు సంవత్సరాలలో భారత్ 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఇంధన ఉత్పత్తులు, విమానాలు, విమాన విడిభాగాలు, విలువైన లోహాలు, టెక్నాలజీ ఉత్పత్తులు, కోకింగ్ కోల్ (ఉక్కు తయారీలో ఉపయోగించే బొగ్గు)ను కొనుగోలు చేస్తుంది. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు, డేటా సెంటర్స్‌లో ఉపయోగించే ఇతర ఉపకరణాలు మొదలైన టెక్నాలజీ ఉత్పత్తుల వాణిజ్యాన్ని ఉభయ దేశాలు గణనీయంగా పెంపొందించుకున్నాయి. ప్రస్తావిత సరుకులు అన్నీ అమెరికా ఎగుమతులేకానీ, అమెరికా కొనదలుచుకున్న భారత్ ఉత్పత్తులు కావు. ఇటువంటి ఏకపక్ష వాణిజ్యం పరస్పర లబ్ధినిస్తుందా?
సంయుక్త ప్రకటనతో పాటు జారీ చేసిన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో భారత్ చేపట్టనున్న ‘ప్రధాన చర్యల’ గురించి అమెరికా అధ్యక్షుడు ప్రస్తావించారు. రష్యా నుంచి చమురు ప్రత్యక్ష, పరోక్ష కొనుగోళ్లను నిలిపివేసేందుకు, అమెరికా ఇంధన ఉత్పత్తుల కొనుగోళ్లకు, అమెరికాతో మధ్యంతర ఒప్పంద చట్రాన్ని రక్షణ రంగంలో సహకారానికి కూడా విస్తరింపజేసేందుకు భారత్ కట్టుబడి ఉన్నది. ఈ కారణంగా 2025 ఆగస్టు 6న భారత్ తనపై విధించిన 25శాతం అదనపు సుంకాన్ని ఉపసంహరించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. మూడు కీలక అంశాలలో భారత్ నుంచి హామీ పొంది, అందుకు ప్రత్యుపకారంగా అమెరికా ఎటువంటి సానుకూల నిర్ణయాలు తీసుకోపోవడం పరస్పర ప్రయోజనకర సూత్రానికి అనుగుణంగా ఉన్నదా?
రష్యా నుంచి చమురు ప్రత్యక్ష లేదా పరోక్ష కొనుగోలును భారత్ పునఃప్రారంభిస్తే భారతీయ సరుకులపై 25శాతం దండనాత్మక సుంకం విధింపుతో సహా అదనపు కఠిన చర్యలు చేపట్టే విషయాన్ని అమెరికా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది: ఇది బెదిరింపు కాదా? 2026 ఫిబ్రవరి 6న ఉభయదేశాలు అంగీకరించిన వాణిజ్య ఒప్పందం రష్యా చమురు అనే నిర్దిష్ట అంశంపై ఆధారపడి ఉన్నది. భారత్ ఎట్టి పరిస్థితులలోను రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదు. అని అమెరికా నిర్దేశించింది. దాన్ని భారత్ అంగీకరించింది. అమెరికా బెదిరింపు, భారత్ విధేయత మధ్య పరస్పర ప్రయోజనాలకు తోడ్పడేది ఏమైనా ఉన్నదా?
2025 ఏప్రిల్ 2న భారతీయ సరుకులపై అమెరికా సుంకాలు 3శాతంగా మాత్రమే ఉన్నాయి. భారత్‌కు ద్వైపాక్షిక వాణిజ్య మిగులు సమకూరుతున్నందున డోనాల్డ్ ట్రంప్ తన ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించి భారత్ ఎగుమతులపై సుంకాలను 25శాతానికి పెంచారు. ఇప్పుడు వాటిని 18శాతానికి తగ్గించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత భారత్ సహా వివిధ దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల చట్టబద్ధత అంశం ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు విచారణలో ఉన్నది. సుంకాల పెంపుదల రాజ్యాంగ విరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే భారత్‌కు ఎనలేని మేలు జరుగుతుంది. సుంకాల విషయంలో పూర్వ స్థితిని ఉభయ దేశాలు పునరుద్ధరించవలసి ఉంటుంది. భారత్‌కు ఎటువంటి ప్రయోజనకర రాయితీలు ఇవ్వకుండానే అమెరికా మన నుంచి అనేక రాయితీలను సాధించుకున్నది. ఇదేమి ఇచ్చి పుచ్చుకోవడం? ఆదాన ప్రదానాలు అసమ రీతిలో ఉండడం న్యాయబద్ధమేనా?
ఉక్కు, అల్యూమినియంలపై సుంకాలు 50శాతం నిలిచిపోతాయి, ఆటోమొబైల్స్ విడిభాగాలపై సుంకాలు 25శాతంగా ఉండిపోతాయి. అయితే అమెరికా పారిశ్రామిక వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఎర్ర జొన్నలు, సోయాబీన్ ఆయిల్, వైన్స్, ఇంకా ఆటోమొబైల్స్, ఎర్ర జొన్నలు, హై–ఎండ్ మోటార్ సైకిల్స్ మొదలైన వాటిపై ఆ దేశం బాగా ప్రయోజనకరమైన రాయితీలను ఇస్తుందని అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల నిపుణుడు అజయ్ శ్రీవాస్తవ ఎత్తి చూపడం గమనార్హం.
రాబోయే అయిదేళ్ల కాలంలో భారత్ 500 బిలియన్ డాలర్లు వెచ్చించి అమెరికా నుంచి కొనుగోలు చేసేది ఏమిటి? ఇదొక పెద్ద ప్రశ్న. అంతేకాదు, చిక్కు ప్రశ్న కూడా, సందేహం లేదు. ఈ 500 బిలియన్ డాలర్ల కొనుగోళ్లతో ప్రస్తుతం అమెరికాతో భారత్‌కు సమకూరుతున్న స్వల్ప వాణిజ్య మిగులు సైతం హరించుకుపోగలదు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఆసరా అయ్యే అమెరికన్ సరుకులు తక్కువే కనుక అమెరికా నుంచి మనం పెద్ద ఎత్తున విమానాలు, సైనిక సామగ్రి, అమెరికా చమురు మొదలైనవాటిని హైయర్ ల్యాండెడ్ కాస్ట్ (ఒక వస్తువు తయారైన ప్రదేశం నుంచి మీ వినియోగానికి వచ్చే దాకా అయ్యే మొత్తం ఖర్చు ఎక్కువగా ఉండడం. ఈ కారణంగా ఆ వస్తువు ధర సాధారణంగా అత్యధికంగా ఉంటుంది)తో కొనుగోలు చేయడం మనకు అనివార్యమవుతుంది. కొన్న తరువాత వాటిని ఏమి చేయాలో ఎవరైనా చెప్పగలరా?!
-పి. చిదంబరం