మత జాతీయవాదం భారత్‌కు మేలు చేసేనా?
ABN , Publish Date - Feb 07 , 2026 | 02:44 AM
పాకిస్థాన్ తన ముస్లిమేతర పౌరులను ఎంతగా దురవస్థలకు గురి చేసినా మనం మన మైనారిటీ మతస్థులపట్ల నాగరీక రీతిలో వ్యవహరించాలి. మన అల్పసంఖ్యాక వర్గాలకు పూర్తి భద్రత కల్పించి, ఒక ప్రజాస్వామిక రాజ్యంలో..
‘పాకిస్థాన్ తన ముస్లిమేతర పౌరులను ఎంతగా దురవస్థలకు గురి చేసినా మనం మన మైనారిటీ మతస్థులపట్ల నాగరీక రీతిలో వ్యవహరించాలి. మన అల్పసంఖ్యాక వర్గాలకు పూర్తి భద్రత కల్పించి, ఒక ప్రజాస్వామిక రాజ్యంలో పౌరులకు ఉండే హక్కులు అన్నిటినీ మన ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలి’– 1947 అక్టోబర్ 15న ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఉద్ఘాటించిన మాటలవి. లౌకికవాదం, మైనారిటీలకు సమానహక్కుల విషయంలో నెహ్రూ నిబద్ధతకు కాంగ్రెస్ పార్టీలోనే సంపూర్ణ ఆమోదం లేదు. స్వతంత్ర భారతదేశ తొలి సంవత్సరాలలోనూ, ఆ తరువాత తన జీవిత పర్యంతం కాంగ్రెస్‌లోనూ, విశాల భారతీయ సమాజంలోనూ మితవాద హిందూ శక్తుల ప్రభావాన్ని సమర్థంగా ప్రతిఘటించేందుకు ప్రధాని నెహ్రూ నిరంతరం కృషి చేశారు. ఆయన మరణానంతర దశాబ్దాలలో మాత్రమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, భారతీయ జనసంఘ్, ఈ పార్టీ ప్రస్తుత అవతారమైన భారతీయ జనతా పార్టీ తమ ప్రభావ ప్రాబల్యాలను పెంచుకున్నాయి. దేశ విభజన అనంతరం భారత్ లౌకికవాద రాజ్యాంగాన్ని రూపొందించుకుని బహుళత్వ, సమ్మిళిత భారతదేశ నిర్మాణాన్ని లక్ష్యంగా ఔదలదాల్చింది. దేశ పాలనా వ్యవహారాలు మత ప్రమేయం లేకుండా జరిగేందుకు తొలి ప్రధాని నెహ్రూ సుస్థిర పునాదులు వేశారు. అయితే మతాన్ని రాజ్య వ్యవహారాలతో మిళితం చేసిన మార్గాన్ని అనుసరించిన పాకిస్థాన్‌కు భారత్ ఇప్పుడు ఆ విషయంలో చేరువవుతోంది!
ఈ మెజారిటీవాద ధోరణి ప్రస్తుత పాలకపక్షం వ్యవహారాలలో స్పష్టంగా కనిపిస్తోంది. గత మూడు సార్వత్రక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన 800 మందికి పైగా ప్రజా ప్రతినిధులలో ముస్లిం మతస్థులు ఒక్కరూ లేరు! నరేంద్ర మోదీ, అమిత్ షాల నాయకత్వంలో బీజేపీ హిందూ ఓటు బ్యాంకును సృష్టించుకోవడంలో చాలావరకు సఫలమయింది. హిందూ ఓటర్ల మద్దతు ఆధారంగా తరచూ ఎన్నికలలో విజయాలు సాధిస్తోంది. హిందువులకే ప్రథమ ప్రాధాన్యమిచ్చే రాజకీయాల అజెండా కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ పదే పదే అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తోడ్పడుతుండడంతో సంఘ్ పరివార్ భారతీయ సమాజంలో తన ప్రభావ ప్రాబల్యాలనూ ఇతోధికంగా పెంపొందించుకుంటోంది. ఈ క్రమంలో భారతీయ ముస్లింలను (అప్పుడప్పుడూ భారతీయ క్రైస్తవులను కూడా) పలు విధాలా వేధింపులకు గురిచేస్తోంది. ఆ మైనారిటీ మతస్థుల పట్ల విద్వేషాన్ని ప్రోత్సహిస్తోంది.
ముస్లింలు ఒకప్పుడు కేంద్ర కేబినెట్‌లో ప్రధాన మంత్రిత్వశాఖలకు సారథ్యం వహించారు. దౌత్య శ్రేణులకు, గూఢచార వర్గాలకు నాయకత్వం వహించారు. భారత ప్రధాన న్యాయమూర్తులుగా దేశ న్యాయపాలనను నిర్దేశించారు. భారత వాయుసేనకు అధినేతలుగా ఉన్నారు. ఇటీవలి కాలంలో అంటే 2014కు పూర్వం నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో రెండు నగరాలు పార్లమెంటులో తమ ప్రతినిధులుగా ముస్లింలను ఎన్నుకున్నాయి. మరి ఇప్పుడో? మన ప్రజా జీవితంలో ప్రముఖ స్థానాలలో ఉన్నవారిలో ఒక్క ముస్లిం కూడా లేడు. కాయ కష్టంతో బతికే ముస్లింలను నిత్యం అనేక విధాలుగా అవమానిస్తున్నారు. ముస్లింల భారతీయ పౌరసత్వాన్ని ప్రశ్నిస్తున్నారు వారి దేశభక్తిని శంకిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని హింసాకాండకు పాల్పడుతున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని మూకదాడులు చేస్తున్నారు. న్యాయవిరుద్ధంగా ముస్లింల గృహాలను కూల్చివేస్తున్నారు.
లౌకికవాద, బహుళత్వ, సమ్మిళిత ప్రజాస్వామ్యమే భారత్ భావన హృదయం. అయితే పాకిస్థాన్‌కు పునాది అయిన మత జాతీయవాదం ప్రాతిపదికను ప్రాథమికంగా ప్రతిబింబించే ఆధిపత్యవాద రాజ్యంగా భారత్‌ను రూపొందించేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. జాతి జీవనంలోని వివిధ రంగాలలో ఇది ప్రతీకాత్మకంగాను, ఆచరణాత్మకంగాను కనిపిస్తోంది. పాలకపక్షం మాటలు, చేతలు ఆ లక్ష్య పరిపూర్తిని మరింత త్వరితం చేసేవిగా ఉన్నాయి.
హిందూ మెజారిటీవాదం మే 2014 నుంచే ప్రారంభం కాలేదు. దానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. 19వ శతాబ్దిలో హిందూ మిషనరీ సొసైటీల కార్యకలాపాలు, 20వ శతాబ్దిలో హిందూ మహాసభ రాజకీయాలు, 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భావం ఆ చరిత్రలో భాగాలే. రాజ్య వ్యవహారాలలో మత ప్రమేయం లేకుండా ఉండేందుకు నెహ్రూ నిరంతరం అప్రమత్తంగా ఉండేవారు. అయితే ఆయన మనవడు రాజీవ్‌గాంధీ షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా ఉత్పన్నమైన సంక్లిష్ట రాజకీయ పరిస్థితులలో అనుసరించిన విధానాలు హిందూత్వ శక్తుల ప్రభావశీలత పెరుగుదలకు ఆలంబన అయ్యాయి. పాలనా వ్యవహారాలను మత ప్రాతిపదికన నడపడంతో ముస్లిం మత తీవ్రవాదుల కంటే హిందూ మత తీవ్రవాదులు ఎక్కువగా లబ్ధి పొందారు. రాజీవ్ ప్రభుత్వం అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు తాళాలు తెరవడంతో ఆ మసీదును కూల్చివేసి దాని స్థానంలో రామాలయాన్ని నిర్మించేందుకు సంఘ్ పరివార్ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించింది. 1984 సార్వత్రక ఎన్నికలలో కేవలం రెండే రెండు స్థానాలలో గెలిచిన బీజేపీ దశాబ్దంన్నర కాలంలో దేశంలో అగ్రగామి జాతీయ రాజకీయ పక్షంగా ఆవిర్భవించింది.
బీజేపీ ప్రథమ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి పాలనా శైలిలో మెజారిటీవాద ప్రేరణలు ఉండేవి కావు. ఆయన పార్టీ అనేక సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేయవలసి ఉండడంతో ఆయన సంయమనంతో వ్యవహరించేవారు. సార్వత్రక ఎన్నికలలో వరుసగా రెండుసార్లు మంచి మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ రెండో ప్రధానమంత్రి, మూడోసారి సాధారణ మెజారిటీని సాధించుకోలేకపోయినప్పటికీ పాలనా వ్యవహారాలలో ‘హిందువులకే ప్రథమ ప్రాధాన్యం అజెండా’ను అమలుపరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రథమ కుటుంబంలోని ప్రస్తుత తరం నాయకుల కంటే బీజేపీ అగ్రనాయక ద్వయం నరేంద్రమోదీ, అమిత్ షాలే మరింతగా సైద్ధాంతిక నిబద్ధులు. అంతేకాదు, అధికారాన్ని గెలుచుకోవడం పైన, గెలుచుకున్న అధికారాన్ని నిలబెట్టుకోవడం పైన కాంగ్రెస్ నేతల కంటే వీరే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. మోదీ–షా ద్వయంతో పోలిస్తే రాజకీయాలలో రాహుల్, ప్రియాంకల ఆసక్తి, నిమగ్నత అస్థిరమైనది, అవ్యవస్థితమైనది. కాంగ్రెస్ కృశించి, క్షీణించిపోతుండగా, సంఘ్ పరివార్ ప్రభావ ప్రాబల్యాలు క్రమంగా పెరిగాయి, మరింతగా బలీయమవుతూ విస్తరిస్తున్నాయి. భారతదేశ నడుస్తున్న చరిత్రలో సువ్యక్తమవుతున్నది ‘నాగరికతా పునరుజ్జీవనమే’నని హిందూ మితవాద సైద్ధాంతికులు తరచూ పెద్ద పెట్టున వాదిస్తున్నారు. ఈ వాదనలో ఇసుమంత సత్యం కూడా లేదు. భారతీయ కళలు, సంగీతం లేదా తాత్త్విక చింతనా ధోరణులు మహోన్నతమైనవి. వాటిని సమకాలీన ప్రపంచ సమస్యల పరిష్కారానికి వాటిని మరింత ఉపయుక్తంగా చేసే విషయంలో సంఘ్ పరివార్‌కు ఎటువంటి శ్రద్ధ లేదు. వారి శ్రద్ధాసక్తులు వేరే విషయాలలో ఉన్నాయి. హిందువులు కాని ఇతర భారతీయులు, ముఖ్యంగా ముస్లింల కంటే హిందువులే సమస్త జీవన రంగాలలోను అన్ని విధాల ఆధిక్యులు అన్న విషయాన్ని పదే పదే ప్రకటించడంపైన మాత్రమే శ్రద్ధ చూపుతున్నారు. నిజానికి మనం ఇప్పుడు చూస్తున్నది నాగరికతా పునరుజ్జీవనం కాదు. హిందూత్వ అజెండా ప్రేరేపిత కార్యాచరణే.
నడుస్తున్న కాలంలో, మరింత స్పష్టంగా చెప్పాలంటే ఈ 2026లో భారత్ ఒక హిందూ పాకిస్థాన్‌గా ప్రభవించే సూచనలు సర్వత్రా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాన్ని నివారించడం సాధ్యమవుతుందా? లౌకిక, మతపరమైనది కాని రాజ్యవ్యవస్థ భవిష్యత్తులో భద్రంగా వర్ధిల్లుతుందా? సమాధానాలు చెప్పడం అసాధ్యమైన ప్రశ్నలివి. అయితే ఇతర దేశాల అనుభవాలను పరిశీలించినప్పుడు మత విశ్వాసాలను రాజ్య వ్యవహారాలతో మిళితం చేయడమనేది ఎక్కడా సత్ఫలితాలనివ్వలేదని స్పష్టమవుతుంది. పాకిస్థాన్ తన అస్తిత్వానికి ఇస్లాంను కేంద్రంగా చేసుకున్నది. ఇది ఆ దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజాస్వామ్య పాలనా పురోగతికి తీవ్ర విఘాతం కలిగిస్తోంది. లౌకికవాద ఆదర్శాలు పునాదిగా ప్రభవించిన బంగ్లాదేశ్ ఆ ఆదర్శాలను త్యజించింది. ఫలితంగా సంక్షోభంపాలై పలు విధాలా నష్టపోతోంది. ఒక అభివృద్ధి చెందిన దేశంగా వర్ధిల్లేందుకు ఆవశ్యకమైన ఆర్థిక, సాంస్కృతిక వనరులు ఇరాన్‌కు ఉన్నాయి. అయితే 1979లో మత ఛాందసవాద అయతొల్లాలు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు వమ్మయిపోయాయి.
మెజారిటీవాద పాలనతో నష్టపోయింది ఇస్లామిక్ దేశాలు మాత్రమే కాదు. 1970ల్లో శ్రీలంక వివిధ రంగాలలో భారత్ కంటే ముందంజలో ఉండేది. బౌద్ధ మతస్థులు అయిన సింహళ ప్రజల జాత్యహంకారం పెచ్చరిల్లి అంతర్యుద్ధానికి దారితీయకుండా ఉన్నట్టయితే కొలంబో, క్యాండీ ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ వలే అధునాతన ఐటీ విప్లవానికి కేంద్రాలుగా వర్ధిల్లుతుండేవి. హిందూత్వవాదులు అమితంగా అభిమానించే ఇజ్రాయెల్ తన యుద్ధ నేరాలతో ప్రపంచ వ్యవస్థలో ఒక అంటరానిదేశంగా అయిపోతోంది. ఆధునిక జుడాయిజంలోని ప్రగతి నిరోధక ధోరణుల వల్లే ఇజ్రాయెల్ పెడదోవ పట్టి ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోంది. ఒక జాతి అస్తిత్వానికి అధికసంఖ్యాకుల మతాన్ని కేంద్రంగా చేయడం; ముల్లాలు, పూజారులు, సాధువులు, రబ్బీల అభిమతాలకు అనుగుణంగా చట్టాలు, విధానాల రూపకల్పన; రాజ్యాంగ వ్యవస్థల, సంస్థల నిర్మాణం మహా ప్రమాదకరమైన ఫలితాలకు మాత్రమే దారితీస్తాయి. సున్నీ ముస్లింలు, షియా మహమ్మదీయులు, బౌద్ధ మతస్థులు, చివరకు యూదు ధర్మ అనుయాయులు అధికసంఖ్యాకులుగా ఉన్న దేశాలు ఆ దుష్ఫలితాలను చవి చూశాయి. హిందువులు కూడా అటువంటి మతజాతీయ బాటలో నడిస్తే వారికి ఈ నియమం నుంచి మినహాయింపు ఉండదు.
(వ్యాసకర్త చరిత్రకారుడు)