వివేచన మేల్కొంది.. నిరసన రగుల్కొంది
ABN , Publish Date - Oct 24 , 2026 | 02:16 AM
స్వేచ్ఛ కోల్పోయినా, తగ్గిపోయినా మనిషి మనుగడ వర్ధిల్లుతుందా? అసాధ్యం. ఆహార ఇంధనాలు కొరవడినప్పుడు మనిషి జీవితంలో సుఖ సంతోషాలు కొరవడుతాయి.
స్వేచ్ఛ కోల్పోయినా, తగ్గిపోయినా మనిషి మనుగడ వర్ధిల్లుతుందా? అసాధ్యం. ఆహార ఇంధనాలు కొరవడినప్పుడు మనిషి జీవితంలో సుఖ సంతోషాలు కొరవడుతాయి. ఇటువంటి దుర్భర పరిస్థితులలో ఏం చేస్తారు? నిరసన తెలుపుతారు. తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు పలుదేశాలలో ప్రజలు ముఖ్యంగా యువజనులు పెద్దఎత్తున అదే చేస్తున్నారు. ఫ్రాన్స్, అల్బేనియా, బెల్జియం, బ్రెజిల్, చిలీ, ఇటలీ, మొరాకో, పోర్చుగల్.. అన్నట్టు మన భారత్‌లోనూ యువత ఉగ్రతాండవం చేస్తోంది. ఈ పరిస్థితులకు ప్రభుత్వాలదే బాధ్యత అని నిందిస్తున్నారు. సంక్షోభాన్ని ఉపశమింపజేసేందుకు గానీ, అపసవ్య పరిస్థితులను సరిదిద్దేందుకు గానీ ప్రభుత్వాలు చేయవలసినది చేయడం లేదని దేశ దేశాల జనులు భావిస్తున్నారు. కొన్ని యూరోపియన్ దేశాలలో అయితే నిరసనలు హింసాత్మకంగా పరిణమించాయి.
ఆహార ధరలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని హరించివేస్తున్నాయని, ఇంధన వ్యయాలు భరించలేని విధంగా ఉన్నాయని అమెరికాలో ప్రజాకోటి అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలే ఇందుకు కారణమని అమెరికన్లు నిందిస్తున్నారు. ఫ్రాన్స్‌లో విద్యార్థులు వీధుల్లో చెలరేగిపోతున్నారు. పాఠశాలల్లో సదుపాయాలు లోపించడం, ఉపాధ్యాయుల కొరతతో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయన్న ఆందోళనతోనే ఫ్రెంచ్ విద్యార్థి లోకం అట్టుడికిపోతోంది. ఈ పరిస్థితికి కారకుడు అధ్యక్షుడు మేక్రాన్ అన్నదే ప్రతి ఫ్రెంచ్ పౌరుడి మాట. వెలకట్టలేని బంగారు మాగాణాలను అమెరికా పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారు అన్నది అల్బేనియాలో ప్రజాఫిర్యాదు. ప్రధానమంత్రి ఎడి రామ ఇందుకు బాధ్యుడని అల్బేనియన్ల ఆరోపణ. ‘ఆహారాన్ని సమకూర్చుకోగలిగినప్పుడే, నాణ్యమైన విద్యను పొందగలిగినప్పుడే, నా పరిసరాల పచ్చదనాన్ని కాపాడుకోగలిగినప్పుడే నేను స్వేచ్ఛాయుత జీవిని’ అన్న ప్రజల వివేకశీల వివేచనలో భాగమే ప్రస్తుతం దేశదేశాలను కుదిపేస్తున్న నిరసన పోరాటాలు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం గుర్తుందా? ఉప్పుపై పన్నుకు వ్యతిరేకంగా ఆయన నిర్వహించిన నిరసన లాంటివే ప్రస్తుత నిరసనోద్యమాలు. నిజమే, ఉప్పుపై పన్ను ఒక వ్యక్తి స్వేచ్ఛను తగ్గించదు. అయితే వలస పాలకులు విధించిన ఉప్పు పన్ను మహాత్మాగాంధీ స్వేచ్ఛా దార్శనికతకు అసంగతమైనది. ఆ పన్ను విధించడంలో వలస పాలకుల ఆలోచనను ఆయన అసహ్యించుకున్నారు, ప్రజలను చైతన్యపరిచారు.
సార్వభౌమిక ప్రజాస్వామ్య దేశంలో ఓటు ప్రతి పౌరుడి అమూల్యమైన హక్కు. అది ప్రజాస్వామిక నైతికత. మనది ప్రజాస్వామ్య దేశం. మరి ఓటర్ జాబితాల నుంచి 13,30,00,000 (26 రాష్ట్రాలలోని మొత్తం వయోజనులలో 14శాతం) పేర్లను తొలగిస్తే నిరసన ప్రజ్వరిల్లదని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎలా విశ్వసించింది? ఈ సర్కారు అంత మందబుద్ధిగలదని నేను నమ్మలేకపోతున్నాను. ఒక ‘ప్రక్రియ’ను అనుసరించి ఓటర్ జాబితాల నుంచి ఆ పేర్లను తొలగించినట్టు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది. ఆ ‘ఒక ప్రక్రియ’ న్యాయవిహిత ప్రక్రియ కాదు. చట్టబద్ధంకాని చర్యకు పాల్పడినట్లు ఈసీఐ అంగీకరించింది. తొలగించిన ఓటర్ల పేర్లను జాబితాలలో తిరిగి చేర్చేందుకు ఎన్నికల సంఘం ఇప్పుడు ‘ప్రత్యేక శిబిరాల’ను నిర్వహిస్తోంది.
26 రాష్ట్రాలలో మూడు దశలుగా సర్ ప్రక్రియను అమలుపరిచారు. మొదటి దశలో ఒక రాష్ట్రంలోను, రెండో దశలో 9 రాష్ట్రాలలోను, మూడో దశలో 16 రాష్ట్రాలలోను అమలుపరిచారు. ఆయా రాష్ట్రాలలో వయోజన జనాభా– మొదటి దశ ఏకైక రాష్ట్రంలో 8.21 కోట్లు, రెండో దశ 9 రాష్ట్రాలలో 51.60 కోట్లు, మూడోదశ 16 రాష్ట్రాలలో 35.50 కోట్లు. ఓటర్ జాబితాల నుంచి తొలగించిన పేర్లు– మొదటి దశలో 0.65 కోట్లు, రెండో దశలో 6.50 కోట్లు, మూడో దశలో 6.15 కోట్లు. మొత్తం తొలగింపులు (మృతులతో సహా) 13.30 కోట్లు. మొత్తం వయోజన జనాభాలో తొలగింపుల శాతం– మొదటి దశలో 7.92శాతం, రెండో దశలో 12.6 శాతం, మూడో దశలో 17.18శాతం. మూడు దశలలో తొలగింపుల సగటు 14 శాతం.
ఓటర్ జాబితాలను రూపొందించడం వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అమలుకు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు? ఓటర్ల నమోదును మళ్లీ చేపట్టేందుకు చేస్తున్న వ్యయమెంత? ఆ వ్యయభారాన్ని ఎవరిపై మోపుతారు? పన్నుల రూపేణా ప్రజలపైనే కదా. అనేక సహేతుక కారణాలతో సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈసీఐకి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. నోటీసు అందిన మరుసటి రోజే ఈసీఐ తన విధానాన్ని మార్చుకున్నది. రివాజు అయిన స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్)కు మళ్లింది. ఇదే నేను పైన ప్రస్తావించిన ఈసీఐ ‘ఒప్పుకోలు’. పశ్చిమబెంగాల్లో మాత్రమే జాబితాల నుంచి పేర్ల తొలగింపునకు బాధితులయిన ఓటర్లు అప్పీల్ చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఆ మేరకు దాఖలయిన 22,00,000 అప్పీళ్లలో దాదాపు 1,26,000ను ఆరునెలల్లో పరిష్కరించారు. 91–93శాతం అప్పీళ్లను అనుమతించారు. ఆ అప్పీలుదారుల పేర్లను ఓటర్ జాబితాలలో చేర్చాలని ఆదేశించారు. అయితే ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో వారు ఓటు వేయలేకపోయారు. ఇతర రాష్ట్రాలలో పేర్ల తొలగింపునకు గురైన ఓటర్లకు అప్పీల్ చేసుకునేందుకు అనుమతి లేదు. వారి పేర్లు ఓటర్ జాబితాలలో తిరిగి చేర్చేంతవరకు ఏ ఎన్నికల్లోను ఓటు వేసేందుకు అర్హులుకారు. సర్ బాధిత ఓటర్ల పునఃనమోదు అనేది ఈసీఐ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది. సర్‌పై నిరసన సాధారణ నిరసన కాదు. స్వేచ్ఛ కోసం, ఓటుహక్కు కోసం పోరాటమది.
ఇప్పుడు ప్రజలు చేస్తున్న మరో పోరాటాన్ని చూద్దాం. అది ఆహారం కోసం ప్రజ్వరిల్లుతున్న పోరు. ఆహార ధరలు మిన్నంటుతున్నాయి. సామాన్య కుటుంబాలు భరించలేని ధరలవి. 80 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వం నెలనెలా ఐదు కిలోల ఆహారధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. అయితే అంతర్గత వలసదారులు అయిన కోట్లాది శ్రామికులకు ఆ సదుపాయం లభించడం లేదు. ఆహార ధరలు పెరిగిపోతుండగా అనియత/ దినసరి శ్రామికుల నిజవేతనాలు స్తంభించిపోయాయి లేదా తగ్గిపోతున్నాయి. దేశ శ్రామికశక్తిలో వీరు 20శాతంగా ఉన్నారన్నది వాస్తవం. ఇంతమంది కష్ట జీవుల జీవనయాతనలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనవసరం లేదు.
రగులుతున్న మరో పోరు చౌక ఇంధనం కోసం. పెట్రోలు, డీజిల్, విద్యుత్, గ్యాస్, కిరోసిన్, వంట చెరకు ధరలు పెరిగిపోతున్నాయి. బస్సు, రైలు, విమాన ప్రయాణాలు ప్రియమైపోతున్నాయి. టోకు ధరల సూచీ 11.39శాతంగాను, వినియోగవస్తువుల ధరల సూచీ 5.54శాతంగాను ఉన్నది. ఆహార ద్రవ్యోల్బణం 7.74 శాతం. యుద్ధాలు, ట్రంప్ సుంకాలు మొదలైన బాహ్య కారణాలు ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 2009–11లో, ఆ తరువాత 2013–14లో ధరల పెరుగుదలకు యూపీఏ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని భారతీయ జనతా పార్టీ గొంతుచించుకున్నది.
ఈ నిరసన పోరాటాలు అణచివేతకు గురైన లేదా లేకుండా పోయిన హక్కుల కోసం కూడా కొనసాగుతాయి. పాలనా వ్యవస్థ మార్పు (రెజీమ్ చేంజ్) అనేది ఒక అవమానకరమైన అర్థాన్ని సంతరించుకున్నది. ‘ప్రభుత్వం మార్పు’గా దానిని అర్థం చేసుకోవాలి. ఒక ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేసేందుకు శాంతియుతంగా నిరసనలు నిర్వహించడంలో ప్రతిపక్షాలు, పౌర సమాజ సంఘాలకు హక్కు ఉంది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, దాని అవినీతిని బహిర్గతం చేయడం, అధికారం నుంచి దించేయడం అనేవి ప్రతిపక్షాల విధ్యుక్త ధర్మమని లోక్‌సభలో హరివిష్ణు కామత్ 1964 డిసెంబర్ 1న, ప్రణబ్ ముఖర్జీ 2016 నవంబర్ 19న ఉద్ఘాటించారు. ఇండియా కూటమికి, కాక్రోచ్ జనతా పార్టీకి, విద్యార్థి సంఘం ఏఐఎస్ఏకు, ఇతరులకు ఇప్పుడు ఈ హక్కును ఎందుకు నిరాకరిస్తున్నారు?
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)