పేదరికం తగ్గినా...
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:04 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుస విజయాలకు కారణం ఇదే అంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల విడుదలైన ప్రపంచబ్యాంకు నివేదిక ‘ఇండియా పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్’ను ఉటంకించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుస విజయాలకు కారణం ఇదే అంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల విడుదలైన ప్రపంచబ్యాంకు నివేదిక ‘ఇండియా పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్’ను ఉటంకించారు. 2011–23 మధ్యకాలంలో దాదాపు యాభైకోట్లమంది ప్రజలు దారిద్ర్యరేఖకు ఎగువకు రావడంతో పేదరికం రేటు 57.7శాతం నుంచి 16.1శాతానికి తగ్గిందని, తీవ్రపేదరికం 27.౧ నుండి 2.6శాతానికి తగ్గిందని, 2017–23 మధ్యకాలంలో 13.4కోట్ల ఉద్యోగాలు పెరిగాయని, ఉపాధిలో గ్రామీణ మహిళల వాటా గణనీయంగా హెచ్చిందని ఈ నివేదికలోని అంశాలను ఆమె ప్రస్తావించారు. బలమైన వినియోగ వృద్ధి, ఆహార సబ్సిడీలు, మోదీ హయాంలో విస్తరించిన నగదు బదిలీలు ఇత్యాదివి ఈ మార్పుకు కారణమని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పేదరికం తగ్గుతున్న దేశాల్లో ఒకటిగా ప్రపంచబ్యాంకు నివేదిక గుర్తించడం పాలకులకూ, ఈ దేశపౌరులకు కచ్చితంగా సంతోషం కలిగించే అంశం.
పేదరికం తగ్గుతున్నప్పటికీ, దేశంలో ఆర్థిక అసమానతలు హెచ్చుగానే ఉన్నాయన్న నివేదిక హెచ్చరికను ఆర్థికమంత్రి ప్రస్తావించకపోవడం సహజం. దాదాపు ఇదేకాలంలో పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ సైతం తీవ్ర పేదరికాన్ని ఇంచుమించుగా ఇదేస్థాయిలో తగ్గించుకోగలడం వేరే విషయం. ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారతదేశాన్ని చూపుతున్నప్పుడు పేదరికంలోనూ ఈ మార్పు సాధించడం, ఏకంగా 49.6కోట్లమంది ఆ కోరలనుంచి విముక్తిపొందడం అసాధారణమైంది. చైనా మినహా మరేదేశంలోనూ ఇంత స్వల్పకాలంలో ఈ స్థాయిలో పేదరిక నిర్మూలన జరగలేదని కొందరి ప్రశంస. తగ్గిన పేదరికం దేశమంతటా సమానంగా లేకపోవడాన్ని నివేదిక ఎత్తిచూపింది. మిగిలిన పేదరికంలో సగానికి పైగా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ, పశ్చిమబెంగాల్లోనూ కేంద్రీకృతమైన విషయాన్ని అది గుర్తుచేసింది. అయితే, బహుముఖ పేదరికంలో గణనీయమైన తగ్గుదల, నిత్యావసర సేవలు, ప్రాథమిక సౌకర్యాలు విస్తరించడం వంటివి రాజకీయాలతో సంబంధం లేకుండా మెచ్చదగిన విజయాలు. దుర్భరదారిద్ర్యం తగ్గడం నిస్సందేహంగా ఒక మైలురాయి.
అయితే, దుర్భరదారిద్ర్యం నిర్మూలనకు దేశం చేరువలో ఉందన్న రీతిలో ప్రపంచబ్యాంకు నివేదిక అంచనాలు కట్టడం కొందరు ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. 2011–-12 డేటాతో 2023–-24 డేటాను పోల్చడం, రెండు భిన్నవిధానాలు, ప్రాతిపదికలతో జరిగిన అప్పటి ఇప్పటి సర్వేలు, డేటాలను ప్రపంచబ్యాంకు వాడుకోవడంపై వారికి చాలా అభ్యంతరాలున్నాయి. పేదరికం తగ్గినప్పటికీ, వాస్తవవేతనాల్లో మెరుగుదల లేకపోవడం, వేతన అసమానతలు అధికంగా ఉండటం కూడా ఈ సందర్భంగా ఆర్థికవేత్తలు గుర్తుచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు అంతగా మెరుగుపడకపోవడం అసమానతలకు మరో కారణం. దేశవ్యాప్తంగా పేదరికం ఒకేలా తగ్గలేదని, సగానికి పైగా పేదలు కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నారన్నది బలమైన హెచ్చరిక. 2047 నాటికి వికసిత భారత్ అవతరించాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే, కృత్రిమ మేధ సవాళ్లను తట్టుకుంటూ యువతకు నాణ్యమైన, ఉత్పాదకత కలిగిన ఉద్యోగాలను సృష్టించడం కీలకం. ప్రభుత్వాల ఉచిత సంక్షేమ బదిలీల ద్వారా ప్రజలను దారిద్య్ర రేఖకు ఎగువన నిలబెట్టడం తాత్కాలిక ఉపశమనమే. ఆదాయాలు స్థిరంగా పెరగాలంటే పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయాలి, నైపుణ్యాలను విస్తరించాలి. పేదరికాన్ని గణాంకాల పరిధిలో కాకుండా, క్షేత్రస్థాయిలో చూడాలి. సంక్షేమ పథకాల కోసం నిలబడే వ్యక్తి జీవననాణ్యతే పేదరికాన్ని అంచనా వేయడానికి నిజమైన కొలమానం. 2026 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 122 దేశాలలో భారతదేశానికి 100వ ర్యాంకు ఇస్తూ, ఆకలిని తీవ్రమైనదిగా గుర్తిస్తూ, జనాభాలో 9.8శాతం పోషకాహార లోపంతో బాధపడుతున్నారని స్పష్టంచేసింది. పేదరిక నిర్మూలన గణాంకాలకు అతీతమైనది. చుట్టూ ఉన్న పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నప్పుడు జనం కూడా ఇటువంటి నివేదికలను విశ్వసించలేరు. గణాంకాల ప్రకారం మన ఆర్థిక వ్యవస్థ 7.8శాతం వృద్ధిరేటుతో పురోగమిస్తోంది. కానీ అత్యధిక ప్రజలకు ఇది అనుభవంలో కనిపించడం లేదు. పాలకులు, నివేదికలు ఏమి చెబుతున్నప్పటికీ, ఎదుగుతున్న ఆర్థికవ్యవస్థతో తమకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం కలగడం, జీవన ప్రమాణాలు మెరుగుపడటం వారికి ముఖ్యం.