మహిళా బిల్లు.. భారత రాజకీయాల్లో నవశకం!
ABN , Publish Date - Apr 16 , 2026 | 01:16 AM
భారత ప్రజాస్వామ్య చరిత్రలో దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ ఒక చరిత్రాత్మక మలుపు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ ఒక చరిత్రాత్మక మలుపు. ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, అబలలు సబలలుగా మారి, దేశ విధాన నిర్ణయాల్లో భాగస్వాములయ్యే సరికొత్త నవశకానికి నాంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే, జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో మాత్రం దశాబ్దాలుగా నామమాత్రంగానే ఉండిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రయాణం ఒక సుదీర్ఘ పోరాటం. దాదాపు 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారనున్నది. ఈ అసమానతను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న మహిళా రిజర్వేషన్ బిల్లు భారత రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుంది.
‘ఎక్కడ మహిళలు పూజించబడతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారు’ అన్న సూక్తిని అక్షరాలా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం. ఆనాడు ఎన్టీఆర్ అడుగడుగునా మహిళలకు ఆత్మగౌరవాన్ని పంచితే, చంద్రబాబు ఆధునిక సాంకేతికతను, ఆర్థిక వనరులను జోడించి మహిళలను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్ఫూర్తినిచ్చిన ఎన్నో విప్లవాత్మక మార్పులు దశాబ్దాల క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదలయ్యాయి. నేడు పార్లమెంట్‌లో మహిళా బిల్లు ఆమోదం పొందనున్న తరుణంలో, తెలుగు నేలపై మహిళల కోసం జరిగిన ఎన్నో విప్లవాత్మక మార్పులు దేశానికే దిశానిర్దేశం చేస్తున్నాయనడంలో సందేహం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఇంత చైతన్యవంతంగా ఉండటానికి ఆనాడు ఎన్టీఆర్ వేసిన పునాదే కారణం. మహిళలకు అనేక పథకాలు ప్రకటించి ఆయన మహిళల పక్షపాతిగా నిలిచారు. ఎన్టీఆర్ కేవలం మాటలతో సరిపెట్టకుండా, చేతల్లో మహిళా సాధికారతను చూపించారు. దేశం మొత్తం మహిళా హక్కుల గురించి చర్చించక ముందే, 1986లో హిందూ వారసత్వ చట్టానికి సవరణ చేసి, ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా కల్పించిన ఘనత ఎన్టీఆర్‌ది. సంపూర్ణ మద్యపాన నిషేధంతో కుటుంబ సంక్షేమం కోసం భద్రత కల్పించారు. దేశంలో మొదటిసారిగా రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మహిళల ఉన్నత విద్యాభ్యాసం కోసం తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి, విద్యారంగంలో విప్లవం తెచ్చారు. రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని భావించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు మొట్టమొదటిసారిగా తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పించి, వారిని శాసనకర్తలుగా మార్చిన దార్శనికత ఎన్టీఆర్‌ది. ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మహిళలకు రిజర్వేషన్ కల్పించడం, చేయదగిన ప్రభుత్వ ఉద్యోగాల్లో 30శాతం వారికే కేటాయించారు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థినులకు 33శాతం రిజర్వేషన్ కల్పించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మహిళలకు తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణాల ద్వారా వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించారు.
ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు హయాం వరకు మహిళాభివృద్ధి కోసం వారు చేసిన నిరంతర కృషి ఫలితమే నేడు జాతీయ స్థాయి మహిళా రిజర్వేషన్ బిల్లు రూపం దాల్చడం. మహిళల నేతృత్వంలో అభివృద్ధిని సాకారం చేసే ఈ చారిత్రక చట్టం ద్వారా దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత బలపడుతుంది. ఎన్టీఆర్ కల్పించిన చట్టబద్ధమైన హక్కులకు ఆర్థిక బలాన్ని జోడించిన వ్యక్తి చంద్రబాబు. మహిళలను ఓటు బ్యాంకుగా కాకుండా, ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ఆయన లక్ష్యం. గడప దాటని మహిళలను సంఘటితం చేసి పొదుపు మంత్రాన్ని నేర్పి, ప్రపంచంలోనే అతిపెద్ద స్వయం సహాయక బృందాల వ్యవస్థగా డ్వాక్రాను తీర్చిదిద్ది, ప్రతి మహిళను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చిన వ్యక్తి చంద్రబాబు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేసి, లక్షలాది మహిళలను సర్పంచులుగా, జడ్పీటీసీలుగా తీర్చిదిద్ది రాజకీయ ఓనమాలు నేర్పారు. బాలిక జననంపై రూ.5,000 ఫిక్స్‌డ్ డిపాజిట్, దేశంలోనే తొలి మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు, మహిళల అక్షరాస్యత 25.27శాతం నుంచి గణనీయంగా పెరిగేలా చర్యలు తీసుకున్నారు. మహిళా కమిషన్ ఏర్పాటు, దేశంలోనే తొలి మహిళా స్పీకర్ నియామకం, దేశంలోనే మొదటిసారిగా మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహణ, 93 లక్షల మంది మహిళలకు పసుపు–కుంకుమ పథకం తెచ్చారు. పొగచూరిన వంటిళ్ల నుంచి ఆడబిడ్డలకు విముక్తి కలిగించడానికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసి, వారి ఆరోగ్యాన్ని కాపాడారు. ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్, 1,20,000 మంది మహిళలు ప్రజాప్రతినిధులు, 15 లక్షల మంది విద్యార్థినులకు ఉచిత సైకిళ్లు, అన్న అమృత హస్తం కింద 10 లక్షల మంది మహిళలకు పోషకాహారం అందించారు. మహిళల పేరుమీద ఇళ్లపట్టాలు, కుట్టు మిషన్లు, రోజుకు 15–25 లక్షల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. ఒంటరి మహిళలకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్లను భారీగా పెంచి వారికి అండగా నిలిచారు. చంద్రన్న పెళ్లి కానుక ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక భరోసా కల్పించారు.
మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన దాదాపు 27 ఏళ్లుగా వాయిదా పడుతోంది. దేవెగౌడ ప్రభుత్వ హయాం (1996)లో మొదటిసారి 81వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఏకాభిప్రాయం లేక వీగిపోయింది. తర్వాత 1998, 1999, 2002, 2003లో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం ప్రయత్నించినా, విపక్షాల అభ్యంతరాల వల్ల బిల్లు ఆమోదం పొందలేదు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వ హయాంలో 2010లో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే లోక్‌సభలో పెండింగ్‌లో పడింది. 2014లో లోక్‌సభ రద్దు కావడంతో ఆ బిల్లు కూడా రద్దయింది. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 2023లో కొత్త పార్లమెంట్ భవనంలో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 20, 2023న లోక్‌సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో బిల్లు దాదాపు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ 33శాతం రిజర్వేషన్ల బిల్లును నేడు లోక్‌సభలో ఆమోదించి, 2029 సాధారణ ఎన్నికల నాటికి అమలు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తున్నది. మహిళా బిల్లు అమలుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు, ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఈ సవరణలకు పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం కాదని, దేశాభివృద్ధిలో అది ఒక భాగమని చంద్రబాబు తెలిపారు. మహిళా బిల్లు ఆమోదంతో భారతదేశం ప్రపంచ వేదికపై ఒక ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య దేశంగా నిలుస్తుంది.
- తొండపు దశరథ జనార్దన్
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు