Share News

అల్గారిథమ్‌ సాలెగూడులో ‘గిగ్‌’ కార్మికుడు!

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:11 AM

పెరిగిన ఆన్‌లైన్‌ లావాదేవీలతో మన దేశంలో పుంజుకున్న గిగ్‌ ఎకానమీ యువతకు అందమైన అబద్ధాన్ని అమ్ముతోంది. ‘‘ఇక్కడ ఏ బాస్ కేకలు లేవు, ఏ ఆఫీసు టైమింగులూ లేవు..

అల్గారిథమ్‌ సాలెగూడులో ‘గిగ్‌’ కార్మికుడు!

పెరిగిన ఆన్‌లైన్‌ లావాదేవీలతో మన దేశంలో పుంజుకున్న గిగ్‌ ఎకానమీ యువతకు అందమైన అబద్ధాన్ని అమ్ముతోంది. ‘‘ఇక్కడ ఏ బాస్ కేకలు లేవు, ఏ ఆఫీసు టైమింగులూ లేవు, మీకు నచ్చినప్పుడు లాగిన్ అవ్వొచ్చు, మీరే మీ స్వంత బాస్’’ అనే స్వేచ్ఛా ప్రపంచ భ్రమలను కల్పించి నిరుద్యోగులను ఆహ్వానిస్తోంది. కానీ పైకి కనిపించే ఈ స్వేచ్ఛ ఒక భ్రమ మాత్రమే. మనం ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టగానే ఫోన్‌ స్క్రీన్‌ మీద మాప్స్‌లో కదిలే మోటార్‌ సైకిల్‌/ కారు బొమ్మల వెనుక ఒక శ్రామికుడు ఉన్నాడని మనం తరచూ మరచిపోతాం. అతను కఠినమైన వాతావరణంలో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, ట్రాఫిక్‌ను నమ్ముకుని పని చేస్తున్నాడు. అతని శ్రమను, అతని భావోద్వేగాలను, అతని ఆత్మగౌరవాన్ని – ఒక రూపం లేని కంప్యూటర్ కోడ్ లేదా అల్గారిథమ్ ద్వారా నడిచే అదృశ్య బాస్ నిరంతరం నియంత్రిస్తున్నాడు.

సంప్రదాయ ఉద్యోగాలలో ఉద్యోగి పనిని ఒక మేనేజర్ లేదా సూపర్‌వైజర్ పర్యవేక్షిస్తారు. తప్పులు జరిగితే మాట్లాడటానికి, వివరణ ఇచ్చుకోవడానికి అక్కడ ఒక మనిషి ఉంటాడు. కానీ నేటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్ రంగంలో మనుషులు ఉండరు. అంతా కంప్యూటర్ అల్గారిథమ్‌ల ద్వారానే సాగుతుంది. ఒక డెలివరీ బాయ్ లేదా క్యాబ్ డ్రైవర్ ఫోన్ ఆన్ చేయగానే అతనిపై ఈ అదృశ్య నిఘా మొదలవుతుంది. జీపీఎస్ ద్వారా అతను ఏ సెకనులో ఎక్కడున్నాడు, ఏ వేగంతో వెళ్తున్నాడు, ఏ రూట్‌లో వెళ్తున్నాడు– ఇలా ప్రతి చిన్న విషయాన్ని సదరు యాప్ నిరంతరం రికార్డ్ చేస్తుంది. శ్రామికుడి ప్రతి కదలికను డేటాగా మార్చి కొలుస్తుంది.


ఈ అల్గారిథమిక్ సిస్టమ్స్ అత్యంత రహస్యంగా పనిచేస్తాయి. ఒక డెలివరీ బాయ్ తన అలసట వల్ల ఒకటి రెండు ఆర్డర్లను తిరస్కరిస్తే, అల్గారిథమ్ అతనికి పని కల్పించటం ఆటోమేటిక్‌గా తగ్గించేస్తుంది. అతనికి వచ్చే ఆర్డర్లు ఒక్కసారిగా తగ్గిపోతాయి. అలాగే, రోడ్డుపై ట్రాఫిక్ లేదా వాతావరణం వల్ల డెలివరీ ఆలస్యమైతే, కస్టమర్ ఇచ్చే తక్కువ రేటింగుల కారణంగా కూడా అతనికి ఆర్డర్ల కేటాయింపు తగ్గిపోతుంది. కస్టమర్‌ ఫుడ్డో, క్యాబో బుక్‌ చేసాక ఫోన్‌లో మాప్స్‌ తెరవగానే ఒక చిన్న మోటార్‌ సైకిల్‌ లేదా కారు గుర్తు కదులుతూ కనిపిస్తుంది. కస్టమర్లు ఎంతసేపూ తమ అవసరం తీరాలన్న తొందరలో ఉంటారే తప్ప, మొబైల్‌ స్క్రీన్‌పై కదిలే ఆ అనామక చుక్క వెనుక సజీవమై, స్పందించే గుండె ఉందన్న విషయాన్ని అలవోకగా మర్చిపోతారు. కస్టమర్లు ఇచ్చే రేటింగులు కేవలం ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ కాదు – అవి ఒక శిక్షల లాంటివి. ప్లాట్‌ఫామ్‌లో కొనసాగాలంటే ఒక కనీస రేటింగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. టార్గెట్లు అందుకోలేకపోతే ఇన్సెంటివ్‌లు తగ్గిపోతాయి. ఆర్డర్లు ఎందుకు తగ్గాయో, ప్రాధాన్యం ఎందుకు పడిపోయిందో వివరించే మనిషి ఎవరూ ఉండడు. దీనిని ప్రశ్నించడానికి ఏ మానవ వనరుల (హెచ్‌.ఆర్‌) శాఖా ఉండదు. ఒక మేనేజర్ గానీ, సూపర్‌వైజర్ గానీ కనిపించడు. కేవలం ఒక రోబోటిక్ చాట్‌బాట్ మాత్రమే సమాధానం ఇస్తుంది. కస్టమర్లు ఎంతగా అవమానించినా సరే, యాప్‌లో తమ రేటింగులు తగ్గిపోతాయన్న భయంతో నవ్వుతూ ప్రవర్తించేందుకు యువత తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నది. వారి బలవంతపు నవ్వుల వెనుక ఉన్న మానసిక క్షోభ చాలా భయంకరమైనది.


భారతదేశంలో ప్రస్తుతం దాదాపు 77 లక్షల మంది గిగ్ కార్మికులు ఉండగా, 2030 నాటికి వీరి సంఖ్య 2.35 కోట్లకు చేరబోతోందని అంచనా. ఇది దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో అత్యంత కీలకమైన భాగం. ఈ భారీ యువ శ్రామికశక్తి నిరంతరం అస్థిరమైన ఆదాయంతో, రేపటి ఉపాధిపై నమ్మకం లేని పరిస్థితుల మధ్య తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతోంది. ఒకరోజు పనిచేస్తే ఎంత సంపాదిస్తారో తెలీదు, రేపు కూడా అంతే వస్తుందన్న భరోసా లేదు. ఈ స్థితి వారి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. సంప్రదాయ ఉద్యోగాలలో తోటి ఉద్యోగులతో మాట్లాడటానికి, కష్టసుఖాలు పంచుకోవడానికి యూనియన్లు, లేదా కనీసం లంచ్ రూములు ఉంటాయి. కానీ గిగ్ వర్క్‌లో అటువంటి సంస్థాగత మద్దతు గానీ, తోటి ఉద్యోగుల సహకారం గానీ లభించదు. గదిలో ఒంటరిగా ఉంటూ, బయటకు రాగానే ఒంటరిగా రోడ్లపై తిరిగే ఈ తరం యువత తీవ్రమైన సామాజిక ఒంటరితనానికి లోనవుతోంది. ఈ ఒంటరితనం వల్ల ట్రాఫిక్ జాప్యం లేదా డెలివరీ ఆలస్యమైతే తమను తామే నిందించుకునే మానసిక స్థితిలోకి జారుకుంటున్నారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తోంది.


కేవలం డెలివరీ వేగం మీదే గాక, మానవ సంక్షేమంపై దృష్టి సారించేలా అల్గారిథమ్స్‌లో పారదర్శకతను పెంచడం – గిగ్ కార్మికుల కోసం ఒక స్వతంత్ర మానవ మధ్యవర్తిత్వ ఫిర్యాదుల వ్యవస్థ (అంబూడ్సమన్) ఏర్పాటు చేయడం – ఈ రెండు చర్యల ద్వారా మాత్రమే ఈ అదృశ్య సాంకేతిక బానిసత్వాన్ని అడ్డుకోగలం. ఈ వ్యవస్థ కార్మికులకు వచ్చే ఆర్డర్లను అల్గారిథమ్ తగ్గించడం, రేటింగ్ అన్యాయంగా తగ్గడం, లేదా డీయాక్టివేషన్ వంటి నిర్ణయాలను సవాల్ చేసేందుకు 24x7 టోల్–ఫ్రీ హెల్ప్‌లైన్, మొబైల్ యాప్ ఆధారిత అప్పీల్ విధానాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఫిర్యాదుకు 48 గంటల్లో మానవ ప్రతినిధి నుండి స్పందన, నిరూపితమైతే నష్టపరిహారం తప్పనిసరి చేయాలి.

గిగ్ ఎకానమీ కల్పించే ‘స్వేచ్ఛ’ అనే భ్రమను పక్కన పెట్టి, ఈ అదృశ్య నిఘా వెనుక నలిగిపోతున్న యువత ఆవేదనను పాలకులు గుర్తించాలి. గిగ్ కార్మికులను గుర్తించే చట్టపరమైన చర్యలు ప్రారంభమైనప్పటికీ, మానసిక ఆరోగ్య పరిరక్షణతో కూడిన విధానాలు నేడు అత్యవసరం. మొబైల్ స్క్రీన్‌పై కదిలే ఆ చిన్న జీపీఎస్ చుక్కలు కేవలం డేటా పాయింట్లు కావు. అవి కలలు, ఆత్మగౌరవం, భావోద్వేగాలు కలిగిన మనుషుల జీవితాలు. వారిని డేటాగా కాకుండా మనుషులుగా చూసినప్పుడే ఈ అదృశ్య డిజిటల్ బానిసత్వానికి ముగింపు పలకగలం.

- వంగవోలు రవి

Updated Date - Jun 30 , 2026 | 12:14 AM