Share News

అభివృద్ధి అంకెల వెనుక అసలు నిజం!

ABN , Publish Date - Sep 18 , 2026 | 01:20 AM

ఆగస్టు 31న, కేంద్ర ప్రభుత్వం, దేశంలో సంపద పెరుగుదలకి సంబంధించి, కొన్ని గణాంకాలు విడుదల చేసింది. వాటి సారాంశం ఏమిటంటే: ‘కిందటి సంవత్సరం (2025లో), ఏప్రిల్ నెలకీ–జూన్ నెలకీ మధ్య, దేశంలో (డొమెస్టిక్)..

అభివృద్ధి అంకెల వెనుక అసలు నిజం!

ఆగస్టు 31న, కేంద్ర ప్రభుత్వం, దేశంలో సంపద పెరుగుదలకి సంబంధించి, కొన్ని గణాంకాలు విడుదల చేసింది. వాటి సారాంశం ఏమిటంటే: ‘కిందటి సంవత్సరం (2025లో), ఏప్రిల్ నెలకీ–జూన్ నెలకీ మధ్య, దేశంలో (డొమెస్టిక్).. వస్తువుల రూపంలో గానీ, ‘సేవల’ రూపంలో గానీ, తయారైన ఉత్పత్తి (‘ప్రోడక్ట్’)కి వచ్చిన మొత్తం డబ్బు (‘గ్రాస్’) విలువ కన్నా, ఈ 2026వ సంవత్సరంలో, అవే 3 నెలల్లో వచ్చిన మొత్తం డబ్బు విలువ (జి.డి.పి.) ఎక్కువ’ అని ఆ లెక్కలు చెప్పాయి. అసలు డబ్బు లెక్కలుకట్టే పనికి ప్రభుత్వంలో ఒక డిపార్టుమెంటు ఉంటుంది; గణాంకాలశాఖ అనో, ఆర్థికశాఖ అనో, ఏదో ఒక పేరుతో! ఆ శాఖలో వున్న ఆర్థికశాస్త్రవేత్తలు ప్రతి ఏటా, దేశం మొత్తంలో 3 నెలల్లో జరిగిన మొత్తం ఉత్పత్తికి సంబంధించిన వివరాలు సేకరించి, వాటిని తాము సరైనది అనుకున్న పద్ధతి (‘మెథడాలజీ’) ప్రకారం అర్థం చేసుకుని, ఆ లెక్కల్ని పత్రికలకీ, టీవీ చానళ్లకీ విడుదల చేస్తారు. అలా, ఇటీవల బైటికి వచ్చిన లెక్కల్ని చూసి, దేశ ప్రధాని తెగ మురిసిపోతూ చెప్పిన మాటల్లో కొన్ని: ‘‘నా ప్రభుత్వ పాలనలో, ఎంత ఆర్థికాభివృద్ధి జరిగిందో చూశారా? కానీ, ప్రతిపక్షం వాళ్లు ఉన్నారు చూశారూ? వాళ్లు నిరాశావాదులు! వినాశనం జరుగుతుందని జోస్యం చెప్పేవాళ్లు! వాళ్లకు ఈ అభివృద్ధి మింగుడుపడడం లేదు. వినాశనాన్ని కోరే ప్రతిపక్షాలు నశించాయి లెండి! భారతదేశం మాత్రం వికసించింది.’’ (‘డూమ్ సేయర్స్ ఆర్ డూమ్డ్! ఇండియా బ్లూమ్డ్!’)– ఇలా సాగింది ప్రధానమంత్రి ఆత్మస్తుతీ, పరనిందా!


ప్రధాని ఇలా అంటే, ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? వారికీ వారి పడికట్టు పదాలు ఉంటాయిగదా? వారేం అన్నారంటే.. ‘‘ప్రభుత్వం చెప్పే జి.డి.పి.కి అర్థం: ‘జి’ అంటే ‘గ్రేట్లీ’, ‘డి’ అంటే ‘డిస్టార్టెడ్’, ‘పి’ అంటే ‘పిక్చర్’! (‘గొప్పగా వక్రీకరించిన చిత్రం’) అనీ; ప్రభుత్వం చెప్పే లెక్కలన్నీ, గణాంక క్రీడా విన్యాసాలు అనీ; అంకెల్ని తారుమారు చేయడం అనీ; కావాలని తయారుచేసిన సమాచారం అనీ– ఇలా సాగాయి ప్రతిపక్ష పార్టీల పదాల విన్యాసాలు. ప్రభుత్వంతో విభేదించే వాళ్లు ఇంకా ఇలా ఆశ్చర్యపోతున్నారు: ‘గత కొన్ని సంవత్సరాలుగా, ప్రపంచంలో రెండుచోట్ల పెద్ద యుద్ధాలు జరుగుతూవుంటే, అనేక దేశాలలో వృద్ధిరేటుకి ఆటంకాలు ఎదురవుతూవుంటే, ఇక్కడ వృద్ధి రేటు గతం కంటే కూడా పెరిగిపోవడం ఎలా సాధ్యం?’ అని!

అయితే, అటు అధికార పక్షం అయినా, ఇటు ప్రతిపక్షం అయినా, ప్రతిసారీ ఇలాగే, చెప్పిందే చెబుతారనుకోండి. అధికారంలో వున్నప్పుడేమో, ‘చూశారా, మా పాలనలో ఎంత ఆర్థికాభివృద్ధిని సాధించామో?’ అంటారు. అధికారంలో లేనప్పుడేమో, ‘ఏడిసింది మీ అభివృద్ధి. నిరుద్యోగాన్నీ, దారిద్ర్యాన్నీ, ధరల పెరుగుదలనీ తగ్గించని అభివృద్ధి ఏమి అభివృద్ధి?’ అంటారు. అలాగే, ఆ పక్షాల ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా, జి.డి.పి. లెక్కల విషయంలో, పరస్పరం వ్యతిరేకమైన వాదనలు చేస్తారు. ఒక పక్షం ఆర్థికవేత్తలేమో, ‘‘ఫ్యాక్టరీలో తయారవడానికి ఎంత డబ్బు అయిందో, దాన్నిబట్టి మీరు లెక్కపెట్టలేదు. ఆ ఉత్పత్తికే, చివరికి అమ్మకాలు అయ్యాక ఎంత డబ్బు వచ్చిందో, ఆ పద్ధతిలో లెక్క పెట్టారు. అందుకే, ఎక్కువ ఉత్పత్తి జరిగినట్టు కనిపిస్తున్నది’’ అని వాదన.


దానికి అధికారపక్షం వాళ్లేమో, ‘‘తేడా ఏమీ లేదు. ఉదాహరణకి, ఒక మనిషి బరువుని 150 పౌండ్లు అన్నా, 70 కిలోలు అన్నా పెద్ద తేడా అవుతుందా? ఒక రకం కొలతలో అంకెలు ఎక్కువగానూ, ఇంకో రకం కొలతలో అంకెలు తక్కువగానూ ఉండడం వల్ల మీకు అలా అనిపిస్తుంది’’ అని వాళ్లకి మాత్రమే అర్థమయ్యే పోలిక తెస్తారు. కానీ, రెండు రాజకీయ పక్షాలూ, వారి ఆర్థికవేత్తలూ కూడా, శ్రామిక ప్రజలకు అసలు రహస్యం చెప్పరు. అసలు రహస్యం తెలుసుకోవాలంటే, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని, శ్రామికవర్గ ప్రయోజనాల దృష్టితో, పరిశోధించిన మార్క్సు వైపు కళ్లు తిప్పవలిసిందే! పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు చెప్పే జి.డి.పి. (‘స్థూల దేశీయ ఉత్పత్తి’) అనే మాట మార్క్సు కాలంలో లేదు. మార్క్సు పోయిన తర్వాత ఎప్పుడో 50 ఏళ్లకి, ఒక పెట్టుబడిదారీ ఆర్థికవేత్త ఆ మాటని ప్రవేశపెట్టాడు. అయితే, ఆ మాట, ‘శ్రమ దోపిడీ’ అనే అసలు రహస్యాన్ని మరుగుపరిచి, పెట్టుబడిదారులకి లాభాల రూపంలో ప్రతి 3 నెలలకీ, లేదా సంవత్సరానికి, కొత్తగా సమకూరిన సంపద ఎంతా?– అనే డబ్బులెక్కల మీదే దృష్టి పెడుతుంది. ‘ఆ తయారైన ఉత్పత్తి శ్రామిక జనాలకు ఎంత వరకు అందిందీ, ఆ ఉత్పత్తుల గుట్టల్లో ఆరోగ్యానికి హాని చేసే సిగిరెట్లూ, బ్రాందీ విస్కీలూ వంటి వస్తువులు ఎన్ని ఉన్నాయో; తుపాకులూ బాంబులూ, యుద్ధ ట్యాంకులూ, ఖండాంతర క్షిపణులూ లాంటి మారణాయుధాలు ఎన్ని వున్నాయో– ఇలాంటి సంగతులు ఏవీ పట్టవు వృద్ధి రేటును లెక్కపెట్టేవారికి. ‘ఎన్ని లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థో మనది!’– అని గప్పాలు కొట్టుకోవడానికి పనికి వచ్చే మాటలే మాట్లాడతారు ప్రభుత్వాధినేతలూ, వారి ఆర్థికవేత్తలూ!


పెట్టుబడిదారుల ఉమ్మడి వ్యవహారాల్ని చూసే కమిటీగా పనిచేసే ప్రభుత్వం, ఉత్పత్తి విలువలో పెరుగుదలను చూపించి, జబ్బలు చరుచుకుంటోంది. ఆ పెరుగుదల ఎవరి శ్రమల విలువ వల్ల జరిగిందో మాత్రం ఆర్థికవేత్తలూ చెప్పరూ, ప్రభుత్వమూ చెప్పదు. అది మనం తెలుసుకోవాలి. ‘ఆ ఆర్థిక విషయాల గోల మనకెందుకు?’ అని ఊరుకోకూడదు. ఎందుకంటే, ఆ ఆర్థిక విషయాలే మన నిత్యజీవితాల్ని శాసిస్తాయి, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ!

మార్క్సు సిద్ధాంతం ప్రకారం చూసినప్పుడు, ఏ కాలంలోని ఉత్పత్తి (జి.డి.పి) విలువ అయినా, 3 భాగాలుగా వుంటుంది. (1) ఉత్పత్తి సాధనాల మీద పెట్టిన డబ్బు. ఇది, పెట్టినంతే వెనక్కి తిరిగి వస్తుంది కాబట్టి, ఇది ‘స్థిర’ పెట్టుబడి. (2) సాధనాల్ని ఉపయోగించి, ఉత్పత్తి చేసే శ్రామికులు పొందే జీతాల మీద పెట్టే డబ్బు. (3) ఈ డబ్బుని జీతాలుగా తీసుకునే కార్మికులు, జీతాల విలువకన్నా అదనంగా విలువని (డబ్బుని) ఇస్తారు కాబట్టి, జీతాల మీద పెట్టే డబ్బుని ‘అస్థిర’ పెట్టుబడి అంటారు.

అంటే, జి.డి.పి. అనే దానిలో స్థిర పెట్టుబడి+అస్థిర పెట్టుబడి+అదనపు విలువ ఉంటాయి. ఇదీ, జి.డి.పి. అసలు రహస్యం. మరి, ఆర్థికవేత్తలు ఈ రహస్యం గురించి ఎందుకు చెప్పరు? ఎందుకంటే, వాళ్లు పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు కాబట్టి! వాళ్లు చెప్పేదే గొప్ప ఆర్థిక శాస్త్రంగా ఎందుకు చలామణీ అవుతున్నది? దీనికి జవాబు తన ‘పెట్టుబడి’ పుస్తకంలో, ఒక ముందుమాటలో, మార్క్సు ఇలా చెప్పాడు: ‘‘వర్గ పోరాటం, ఇంకా తగినంతగా పైకి కనిపించనంత కాలమూ, లేదా, అది అక్కడక్కడా, అప్పుడప్పుడూ మాత్రమే బయట పడుతున్నంత కాలమూ, రాజకీయ ఆర్థికశాస్త్రం ఒక శాస్త్రంగా చలామణీ అవుతుంది.’’

ఈ సంగతి అసలు ఉత్పత్తిదారులైన శ్రామిక ప్రజలు తెలుసుకోగలిగినప్పుడు, ఇప్పుడున్న అధికార–ప్రతిపక్ష రాజకీయ పార్టీలూ, వారి ఆర్థిక శాస్త్రవేత్తలూ చెప్పే దాని వెనక ఉన్న అసలు సత్యం బోధపడుతుంది.

- రంగనాయకమ్మ

Updated Date - Sep 18 , 2026 | 01:24 AM